31, మే 2009, ఆదివారం

చాణుక్యుని "నీతి దర్పణము"











చాణుక్యుని "నీతి దర్పణము" ;;;;;;;;;;;;;
''''''''''''''''''''''

క్రీ//పూ//300సంవత్సరములలో నీతి దర్పణము"అనే ఉద్గ్రంధము వెలసినది.సర్వ కాలములలోనూ,సర్వావస్థలలోనూ సర్వ దేశములకూ ఆదర్శ ప్రాయమైన సిద్ధాంతాలను వచిస్తూ,నిర్వచిస్తూ ఈ మహోన్నత ప్రమాణాలు కలిగిన గ్రంధ రాజమును నిర్మించిన వ్యక్తి"విష్ణు గుప్తుడు".అతని తండ్రి పేరు "చణకుడు" అగుటచే "చాణుక్యునిగా" లోక ప్రసిద్ధి గాంచాడు."ద్రమిశుడూ,"కౌటిల్యుడు"అనే నామ ధేయములతో కూడా వ్యవహరించ బడే వాడు.
చంద్ర గుప్త మౌర్యునికి కుడి భుజముగా నిలిచి,ప్రజా శ్రేయస్సును కాంక్షిస్తూ,అలనాడే"శ్రేయో రాజ్యమును"నెలకొల్పిన ధీశాలి.

నాటి మగధ రాజైన ధనక నందునితో విభేదించి,విరోధించి,చంద్ర గుప్త మౌర్యుని రాజుగా చేసి,పాటలీ పుత్రము రాజధానిగా ,సామ్రాజ్యము తీరు తెన్నులను రూప కల్పన చేసి,రాజ్య వ్యవహారాలను నిర్వహించేవాడు.
చంద్ర గుప్తునికి మహా మంత్రిగా,సలహా దారునిగా,సైనిక దళముల పర్య వేక్షకునిగా,పదవులను,బాధ్యతలను,చేపట్టి,బహు చాతుర్యంగా నిర్వహిస్తూ,తన ఆ అనుభవ సారముతో "రామ రాజ్యము"ను ఎలాగ రూపొందించ గలము?"అని అహో రాత్రులూ మధన పడి,అహర్నిశలూ శ్రమించి,రూపొందించిన ఉద్గ్రంధమే"నీతి దర్పణము".

క్రీస్తు పూర్వము 324 నుండి 299 వరకూ తాను నెరిపిన రాజ్య పాలనా విధానములతో జగద్విఖ్యాతిని పొందాడు కౌటిల్యుడు.
కౌటిల్య విరచితమైన అర్ధ శాస్త్రములోమొత్తము 15 అధికరణములు ఉన్నాయి.ఒక్కో అధికరణములో కొన్ని అధ్యాయాలు కలవు.అలాంటి 150 అధ్యాయముల సంకలనమే"అర్ధ శాస్త్రము"(నీతి దర్పణము).

విద్యార్ధి,విద్యా బోధన,కుటుంబ బంధాలు,సుభాషితములు,రాజు,ప్రభు పరి పాలన,ఇలాగ సకల కోణాల ప్రిజంలో కౌటిల్యుని అభిప్రాయములు,స్పష్టముగా,వ్యక్తీకరించబడి వన్నె లీనుతున్నాయి.

"లాలయేత్ పంచ వర్షాణి;
దశ వర్షాణి తాడయేత్;
ప్రాప్యేతు షోడశే వర్షే ;
పుత్రం మిత్ర్ వదాచరేత్."

కుమారుని 5సంవత్సరముల వరకూ లాలిస్తూ ముద్దు చేయాలి.10 స//ల వయసున దండించాలి.16 వత్సరముల ప్రాయమున,తనయుని ఆతని జననీ జనకులు "మిత్రుని వలె"భావించి,వ్యవహరించాలి.
ఇలాటివే ఎన్నో చాటువులుగా,సుభాషితములుగా నేల నాలుగు చెరగులా వ్యాపించి, భారత దేశములో వ్యాప్తి చెంది,జన వాక్యములుగా పరిధవిల్లుతున్నాయి.
శ్రీరామ చంద్రుని వలె,చక్రవర్తి ప్రజలను ఆదర్శ ప్రాయముగా పాలించుటకై చాణుక్యుడు అనేక సూత్రాలను,సిద్ధాంతాలను ప్రతిపాదించాడు.

"కు రాజ రాజ్యేన ;
కుతః ప్రజా సుఖం."

దుష్టుడైన ప్రభువు పాలనలో,ప్రజలకు సుఖము ఎక్కడుంటుంది?"
ప్రజల సుఖ సంతోషాల కోసము రాజ్య పరి పాలన కొన సాగాలనే దృక్కోణములో ,నిర్మితమైన రచన ఇది.
ఈ కోణములో ప్రపంచములోనే బహు అరుదుగా గ్రంధములు వచ్చాయి అనడంలో సందేహము లేదు.

"భ్రమన్ సంపూజ్యతే రాజా!"
నిరంతరము సీమలలో సంచారము చేయుట చే,ప్రభువు పూజించ బడును.

"రాజా రాష్ట్ర కృతం పాపం ;
రాజ్ఞః పాపం పురోహితః."

రాజు చేసిన పాపము పురోహితుడు లేక మంత్రిది ఔతుంది.అమాత్యుడు సరైన మంచి సలహాలను ఇస్తూ,చక్రవర్తిని సన్మార్గములో పెడుతూండలి.అలాగే రాజు దుర్మార్గుడు ఐతే ప్రజలు,ఆతనిని దండించ వచ్చును"అని ఈ శ్లోక భావము.

"బలం విద్యా చ విప్రాణాం;
రాజ్ఞాం సైన్యం బలం తథా;"

బ్రాహ్మణులకు విద్య బలము.అలాగే రాజుకు సైన్యమే బలము."సైన్య బలగాలు దృధముగా,సమర్ధనీయంగా,శౌర్య ప్రతాప పాటవాలకై,వ్యాయామ,సాధనలతో పటిష్ఠముగా ఉండాలని.ఘంటా పధముగా చెప్పాడు చాణుక్యుడు.

"నదీ తీరే చ యే వృక్షాః ;
పర గేహేషు భామినీ;
మంత్రి హీనాశ్చ రాజానః;;
శీఘ్రం నశ్యంతి.న సంశయః."

రాజుకు అసమర్ధుడైన మంత్రి ఉండి తీరాలని"ఖచ్చితముగా నొక్కి వక్కాణించాడు,విష్ణు గుప్తుడు.

"అసంతుష్టా ద్విజా నష్టః ;
సంతుష్టాశ్చ మహీ భృతః."

మహి పాలురు తమకు కలిగిన రాజ్య సంపదతో"ఇంతే చాలును!"అని సంతుష్ఠి చెందరాదు.(నేటి ఆధునిక ప్రాజా స్వామిక ప్రభుత్వ వ్యవస్థలకూ,నేటి చారిత్రక,సామాజిక పరిణామ జనితమైన రాజ్య నిర్వహణా క్రమములో ఈ సూక్తి వర్తించదు.)
"చక్రవర్తి,సామ్రాట్టు" అనే పదాలను చాణక్యుడు వాడ లేదు,అతను అనేక సందర్భాలలో "రాజు"అనే పదమునే ప్రయోగించాడు.

రాజులతో అతి సమీపములోకి చేర రాదనీ,కొంత దూరములో ఉండి,వారి సేవ చేయాలనిన్నీ ప్రభువులతో అతి చనువు కూడదనీ "కౌటిల్యునీ అభిప్రాయాన్ని ప్రతిబింబిస్తూన్నది ఈ క్రింది సూక్తి,

"అత్యాసన్నా వినాశాయ ;
దూర స్థాన ఫల ప్రదాః ;
సేవ్యతాం మధ్య భాగేన ;
రాజా వహ్ని ర్గురుః స్త్రియః."

రాజును,అగ్నినీ,గురువునూ,స్త్రీలను మధ్యే మార్గంగా సేవించాలి."

(ఎల్లలు చెరగి,ప్రపంచమే కుగ్రామముగా మారుతూన్న ఆధునిక ,వైజ్ఞానిక యుగములో ఈ సూక్తి ఆక్షేపణీయమే! ఔతున్నది.)

ఆరు అంశాలను ఉదహరిస్తూ,ఇలాగసూక్తీకరించాడు,నీతి దర్పణ కర్త.

"అగ్ని,ఆపః స్త్రియోః,మూర్ఖః ;
సర్పఃఅ,రాజ కులాని చ;
నిత్యం యత్నేన సేవ్యాని ;
సద్యః ప్రాణ హరాణి షట్."

ఈతడు "స్త్రీల పట్ల కొంత వైముఖ్యమును,కలిగి ఉండడము,చేదుగా ఉన్నది,ప్చ్!!!

శ్రేయో రాజ్య నిర్మాణములో
"అర్ధ శాస్త్రము"యొక్క సృష్టి కర్త ఐన చాణక్యుని మేధా సంపత్తికీ,కృషికీ అద్దము పట్టిన వాక్యాలు ఎన్నో ఉన్నాయి.


"విత్తేన రక్ష్యతే ధర్మః ;
విద్యా యోగేన రక్ష్యతే;
మృదునా రక్ష్యతే భూప@ ;
సత్ స్త్రియా రక్ష్యతే గృహం ."


ధనము చేత "ధర్మము" రక్షించ బడును.యోగము చేత విద్య రక్షించ బడును.సత్ స్త్రీల చేత గృహము సురక్షితమగును.మృదుత్వముచే భూపాలురు రక్షితులు అగుదురు.

సకల సద్గుణములచే సర్వ జన మనోభి రాముడుగా ,యుగ యుగాలుగా పూజ్యనీయుడుగా ఐనాడు గదా మన శ్రీరామ చంద్రుడు,జగద్విదితమే గదా ,ఈ విశేషము.



నీతి దర్పణము,అర్ధ శాస్త్రము ,ఆ నాటి సమాజాన్ని,రాజ్య నిర్వహణా పద్ధతులను మన కళ్ళెదుట నిలుప గలిగిన అద్భుత చారిత్రక ఆధారములు.
చాణుక్యుడు అనేక లోక సామాన్య విశేషాలను అక్షర బద్ధము చేసాడు.
విద్య,పిల్లల పెంపకము,వ్యక్తి ప్రవర్తన,సత్పౌరునిగా మనిషి ఎదగడానికి అవసరమైన నియమావళి,స్నేహము,వ్యక్తిత్వముల రూప కల్పన.ప్రభువులు ప్రజల పట్ల అనుసరించ వలసిన బాధ్యతలు.ఇలా సంఘ జీవనానికీ,దేశ భక్తితో మెలగ వలసిన మార్గాలనూ సమగ్రంగా చిత్రీకరిస్తూ ,శ్లోక బద్ధము చేస్తూ
ఈ సేకరణలను మనకు అందించాడు చాణుక్యుడు.

భోజన కాలములో పాటించ వలసిన నియమాలనూ,ఆరోగ్య సంరక్షణకు దోహద పడే అలాంటి అనేక అంశాలను ప్రస్తావించడమును చూస్తే,ఆతని గమనికకూ,పరిశీలనా శక్తికీ ఆశ్చర్యము కలుగక మానదు.
అంతకు పూర్వమునుండీ.జన శ్రుతిలో ఉన్న విశేషాలనూ,సూక్తులనూ,చాణుక్యుడు సుభాషితములుగా అక్షర రూపములను కలిగించాడు అని చెప్ప వచ్చును.
ఈ సూక్తి ముక్తావళులు ఈ నాతికీ ప్రజలకు చిర పరిచితముల వోలె తోచుచున్నాయీ,అంటే నిస్సందేహముగా ఆ భావాలకు గల "సార్వ కాలీనతయే" కారణము.
ఈ శ్లోకాన్ని నెమరు వేస్తూ,అమాత్య చాణుక్యునికి జేజేలు పలుకుదాము.

"రాజ్ఞి ధర్మిణి ధర్మిష్ఠాః ;
పాపే పాపా,సమే సమాః;
రాజాన మను వర్తంతే ;
యథా రాజా తథా ప్రజా."

రాజు ధర్మ వర్తనుడైతే ప్రజలు కూడా,ధర్మ ఆచరణ శీలురు ఔతారు. రాజు పాపములు చేస్తే ప్రజలు కూడా పాప వర్తనులౌతారు.అలాగే ఆతడు మధ్యే మార్గానుయాయి ఔతే,ప్రజలు కూడా అంతే!
రాజును ప్రజలు అనుసరిస్తారు.
(రాజు /నాయకుని శీల సంపద ప్రజలపై అమిత ప్రభావాన్ని చూపుతుంది.)
రాజు ఎలాగో ప్రజలూ అలాగే!"యథా రాజా తథా ప్రజా!"
కోటి యుగాలకైనా కూడా శత కోటి సువర్ణ నాణెములతో తుల తూగే నాణెమైన
పలుకులే కదా ఇవి!




;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;

2 కామెంట్‌లు:

Aruna చెప్పారు...

Wav.

Anil Piduri చెప్పారు...

Thank you!sister!

ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు

"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...