25, నవంబర్ 2011, శుక్రవారం

సన్యాసుల పైన “సంచార కప్పము”

Bodhisattva Gautama 
;
మగధ రాజ్యంలో జనాలందరూ వింతగా మాట్లాడుకోసాగారు
“బింబిసార చక్రవర్తి, ఇన్నాళ్ళుగా మనపై వేసి,
వసూలు చేస్తూన్న అన్యాయమైన పన్నులను రద్దు చేసారు”అని.
 “అసలు ఇంత అకస్మాత్తుగా 
ఆయనలో ఇంత మంచి పరిణామం ఎలా కలిగింది?”


**********************************************


అది ఒక పుష్ప, ఫల, లతా తరువులతో శోభిల్లుతూన్న చిట్టడవి.
అక్కడ జింకలు చెంగు చెంగున గంతులు వేస్తున్నాయి.
అనేక హరిణములు ఆడుకునే ఆ చోటును
అందరూ “ మృగదవ, మిగదాయ,రిషిపట్టణ, ఇస్పితాన “
అని పిలుస్తున్నారు.


వారణాసి నగరమునకు ఈశాన్య దిక్కున-
(౨.౫ మైళ్ళు, ౪.౦ కిలోమీటర్లు) ఉసీ పట్టణము ఉన్నది.
ఋషులు ఉద్భవించిన సీమ కాబట్టి- ఉసి నగరము ఐనది.


సారంగములు, మృగములు- అనగా “జింకలు” తిరుగాడే చోటు,
కనుక “మృగవనము” అని పేరు వచ్చినది.


అక్కడ “యాసుడు” అనే అనాథ బాలుడు ఉన్నాడు.
"యాసుని ధనము, ఆస్తి అంతా నాదే!” అంటూ
వాని బంధువు “మారుడు” క్రూరంగా
యాసుని సొమ్మును హక్కుభుక్తం చేసుకుని, వెళ్ళగొట్టాడు.
యాసునికి ఎక్కడా ఆశ్రయం లభించలేదు.


కడకు ఈ ఉసీ నగరానికి వచ్చి చేరాడు.
జింకలు, సాధుజంతువుల నడుమ నిర్భయంగానే ఉండసాగాడు.
ఐతే ఋషీశ్వరుల ఆశ్రమాల నడుమ ఉన్నప్పటికీ,
యాసునికి విద్య అబ్బలేదు.
అతనికి చదువు ఒంటబట్టకపోవడంతో-
గురువులు కూడా ఆతనిపై ప్రత్యేక శ్రద్ధ వహించినప్పటికీ,
ఉపయోగం లేకుండా పోయినది.


యాసునికి “ఎవరో బోధిసత్వుడు అనే మహనీయుడు
మన బాధలను తొలగించడానికి వస్తున్నాడుట!” అని
తోటి వారు చెప్పగా తెలిసినది.


****************************************************
;
;
;
ఆషాఢ మాసంలో చెట్లు చిగురించి,
ఆ ఉపవనము కళకళలాడుతూన్నది.
ఆ చుట్టుపక్కల జనులందరికీ ఒక మంచి వార్త అందినది.
ఆ వార్త వ్యాప్తితో ప్రజలు కూడా ఆనందంతో కళకళలాడ్తూన్నారు.
మరి అది ఏమి వార్త? అది ఎలాటి కబురు? ……….


శాక్య ముని ఇల్లు వదలి, బయటి ప్రపంచంలోనికి అడుగుపెట్టాడు.
గయ అనే సీమలో ఒక రావి చెట్టు కింద తీవ్ర తపస్సు చేసాడు.
సిద్ధార్ధుడు గయలో .............
అశ్వత్థ వృక్షం(రావి చెట్టు/ peepal tree) కింద 
సిద్ధార్ధుడు చేసిన తపము ఫలించిన శుభవేళ అది.
బోధిసత్వునిగా ఎదిగి, జ్ఞానమూర్తిగా అవతరించాడు.
ఆ రావి చెట్టుకు –
అప్పటి నుండి"మహా బోధి వృక్షము” అనే పేరు వచ్చినది.
బుద్ధుడు జ్ఞానోదయాన్ని పొందిన తర్వాత,
లోక సంచారం చేయసాగాడు.


*****************************************************


క్రీ.పూ.558–491 హిందూ దేశములో
ప్రభువులకు రాజ్య కాంక్షతో 
అంతః కలహములు చెలరేగుతూన్నవి.
వారికి రాజ్య విస్తరణ ఒక దురలవాటుగా మారింది.
అనేక యుద్ధాలు చెలరేగుతున్నాయి.


సంఘము యొక్క బాగోగులనూ,
మనుష్యుల సుఖ జీవనమునకై ఏర్పాట్లు అనేవి,
రాజుల ఆలోచనలలో చోటు లేదు.
ఋషులు, వృత్తి పనివాళ్ళు, సామాన్యులూ,
అందరూ నిత్యజీవితాలూ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నవి.


అప్పుడు ఉత్తరభారతావని మౌర్యుల ఏలుబడిలో ఉన్నది.
రాజ్య పాలన చేస్తూన్న మౌర్య చక్రవర్తి పేరు “బింబిసారుడు”.
ఆతడు – తానూ చేస్తూన్న నిరంతర సమరముల,
జైత్రయాత్రల ఖర్చులకై ప్రజలపై అనేక పన్నులను వేసాడు.
అడవిలో ముక్కు మూసుకు కూర్చునే తాపసులపై కూడా
బింబిసారుడు- పన్నులను విధించాడు.                       
వారు “సంచార కప్పము”ను కట్టవలసి వచ్చినది.
గౌతమ బుద్ధుడు జ్ఞానోదయము కలిగిన పిమ్మట,
లోక సంచారమునారంభించాడు.
అలాగ ఆయన ఉసీ నగరమునకు చేరడానికి 5 వారాలు పట్టింది.


(ఉసీ నగరమునకు:- తర్వాతి పేరు =“సారనాథ్”)
ఉసీ పట్టణంలో నివసిస్తూన్న 
ఆతని శిష్యులు ఐదుగురినీ కలుసుకుని,
తన వాక్కులను అనుగ్రహించే యత్నంలో 
గౌతమ బుద్ధుడు ప్రయాణాన్ని కొనసాగించాడు.
మార్గ మధ్యంలో గంగా నదిని దాటవలసి వచ్చినది.
నా పడవ ఎక్కిన ప్రతి ప్రయాణీకుని తరఫున 
నేనులెక్క ప్రకారం సుంకము కట్టవసివస్తూన్నది.
అలా కట్టకపోతే చక్రవర్తి తీవ్రంగా శిక్షిస్తారు” అన్నాడు పడవ వాడు.


అప్పుడే వచ్చిన గౌతమ బుద్ధుని
“అయ్యా! పడవ సుంకమును ఇవ్వండి” 
అని అడిగాడు ఆ పడవ నడిపే మనిషి.
పడవ సరంగుకు ఇవ్వడానికి 
గౌతమ బుద్ధుని చేతిలో చిల్లి గవ్వ ఐనా లేదు.


“నా వద్ద రూకలు, వరహాలు లేవు, నాయనా!” 
బదులు చెప్పాడు గౌతమ బుద్ధుడు.
తీరాన్ని వదలి, పడవెళ్ళి పోయింది.


మార్గాంతరం లేని గౌతమ బుద్ధుడు,
దివిజ గంగానదీ కెరటాలను పరికించి చూసాడు.
నెమ్మదిగా ఆ జాహ్నవీ జలాలలోనికి అడుగు వేసి,
ముందుకు నడిచాడు. 


అత్యంత అద్భుతంగా
అతనిని అదృష్ట దేవత కాపాడిందనే చెప్పాలి.
గౌతమ బుద్ధుడు దేవ గంగ
ఆవలి ఒడ్డు నుండి, 
ఈవలి గట్టుకు క్షేమంగా చేరాడు.


************************************************


ప్రపంచ చరిత్ర- ఉసీ పట్టణంలో 
గొప్ప ఆవిష్కారమునకు శ్రీకారమును చుట్టినది. 
జింకల ఉద్యానవనములలో 
బుద్ధుని వచనములు వెన్నెల వానలా కురుస్తూ 
అందరిలోనూ సంతోషమునూ, శాంతినీ నింపాయి.


యాసుడు సైతం ఆ శ్రోతలలో ఉన్నాడు. 
భక్తితో బుద్ధునికి శిష్యునిగా మారాడు. 
ఇది తెలిసిన “మారుడు” పగతో అక్కడికి వచ్చాడు. 
యాసునికి ఆశ్రయము ఇచ్చిన బుద్ధునిపై ప్రతీకారము తీర్చుకోబోయాడు. 
కానీ, శాంతమూర్తి ఐన బోధిసత్వుని తేజస్సు ముందర 
అతడు కూడా మోకరిల్లాడు.


“ధర్మోపదేశం ” పొందిన భాగ్యశాలురైన 
ఐదుగురు శిష్యులు– “సంఘము” గా ఆవిర్భవించారు. 
అక్కడ ప్రప్రధమ బుద్ధ బోధనయే “ధర్మ చక్ర పరివర్తన సూత్రము”
ఆ ఉపన్యాసమును ప్రజల వాడుక భాషలో చేసాడు బుద్ధుడు. 
అందుచేత అసలు పేరు 
“ధమ్మ చక్క పరివత్తన సుత్తము” . 


సాధారణ జనుల వ్యావహారిక భాషకు 
అలాగ గౌరవ ప్రతిపత్తులను కలిగించిన 
మహనీయుడు గౌతమ బుద్ధుడు. 


బుద్ధ దేవుని మొదటి సుభాషిత బోధన జరిగినట్టి 
పవిత్రమైన ఆ రోజు ఆషాఢ పౌర్ణమి.


సార నాధ్ లో గౌతమ బుద్ధునికి అందరూ భక్తులు అవసాగారు. 
శిష్యులు అరవై మంది బోధిసత్వునితో 
“స్వామీ! మీ బోధనలు మూఢాచారాలతో కుళ్ళిపోతూన్న 
ఈ నేటి సమాజ ప్రక్షాళనకు ఎంతేని అవసరము, 
మీ బోధనలను ప్రపంచవ్యాపితం గావాలి” 
అని తమ అభిప్రాయాలను వెలిబుచ్చారు.


గౌతమ బుద్ధుడు “సరే!” అని అన్నాడు. 
“ఏ యే మార్గాల గుండా ఎవరెవరు ఎలాగ వెళ్ళాలి, 
ఏ పద్ధతిలో ప్రజలను సన్మార్గంలో నడిపించాలి” 
ఇలాగ శిష్య వర్గాన్ని, సుశిక్షితులను జేసి, 
ప్రణాళికాబద్ద, నియమ, నిర్దేశిత గమ్య సాధనలో 
అందరినీ అప్రమత్తులను గా తయారుచేసాడు గౌతమ బుద్ధుడు. 


సారనాథ్ సీమ గౌతమ బుద్ధుని స్పర్శతో 
అయిదు సంవత్సరములు పునీతమైనది. 
గౌతమ బుద్ధుని ఆగమనంతో- 
ఆ సామ్రాజ్యంలో మునుల పైన విధించిన పన్నులను తీసేసారు
బింబిసారునికి అనోటా ఆ నోటా 
“గౌతమ బుద్ధుడు కాలి నడకతో, 
ప్రమాదభరితమైన ప్రవాహంలో నదిని దాటాడు” 
అని తెలిసింది. 
బింబిసార సామ్రాట్టు 
“తాను స్వార్ధంతో 
ఎలాటి అనుచితమైన సుంకములను విధించాడు, 
రాజ్య లాలస ప్రజలను ఎన్నో ఇక్కట్ల పాలు ఔతున్నారు ” 
అని అర్ధమై, పశ్చాతాపంతో, కించిత్తు సిగ్గు పడ్డాడు. 
నిష్కామ జీవనం గడిపే ఋషులు మున్నగు వారి మీద, 
అలాగే జనులను పీడిస్తూన్న 
అర్ధం పర్ధం లేని కొన్ని ఇతర పన్నులను తొలగించాడు. 
గౌతమ బుద్ధుని ప్రభావంతో- మౌర్య సామ్రాజ్యం, 
సరి కొత్త సంస్కరణలతో కొత్త అడుగులను వేసినది.


*****************************************


గౌతమ బుద్ధుని సంస్కరణలు  ; (For Kids)
Published On Monday,
 November 14, 2011 By ADMIN. 
Under: విజ్ఞానం, వ్యాసాలు.   
రచన : కాదంబరి పిదూరి
;

22, నవంబర్ 2011, మంగళవారం

చిత్రలేఖన చక్రవర్తి రాజా రవివర్మ


అళగిరి నాయుడు, రామస్వామి నాయకర్ అనే వ్యక్తులు 
ట్రావెన్ కూర్ కు వచ్చారు. 
ఆ ఇద్దరి ఆగమనము, 
రవివర్మ (Raja Ravi Varma) జీవిత గమ్యాలకీ, జీవన విధానాలకు 
నిర్దిష్టమైన మలుపులకు కారణమైనది. 
వారిద్దరూ కుంచెతో రంగులను కాన్వాస్ మీద 
సుందరభరితంగా చిలికించగల నిపుణులు. 


నాటిదాకా భారతీయ చిత్రలేఖనము- 
ప్రాచీనసాంప్రదాయ విధానాల ఒరవడిలోనే నడుస్తూ ఉన్నది. 
అలహరి మిత్ర ద్వయం తమ తూలికకు కొత్త నాట్యాలను నేర్పారు. 
ప్రాచీనతలో ఆధునికతను మేళవించారు. 
తంజావూరు సంప్రదాయానికి, 
యూరోపియన్ ఆర్ట్ విధానాలను రంగరించారు. 
వారిద్దరూ యవనిక (కాన్వాస్)మీద
బొమ్మలను ఏకదీక్షతో వేస్తూండేవారు. 
వారి చేతివ్రేళ్ళ కదలికలతో అనేక రంగులు ఊసులాడుతూంటే, 
చిన్నవాడైన రవివర్మ ఏకాగ్రతతో గమనిస్తూ ఉండేవాడు.


ఒక యూరోపు కళాకారుడు థియొడర్ జెన్ సెన్
(Theodore Jensen, a European,Academy style ) కూడా 
అకాడమీ స్టైల్ లో వేసే బొమ్మలు,
బాలుడు రవివర్మ పరిశీలనలో పునీతమైనాయి.
అలాగ ఆడుతూ పాడుతూ తిరుగుతూన్న   బాల్యంలోనే  
రవివర్మకు తన అంతరాంతరాలలో 
నిగూఢంగా ఉన్న చిత్రలేఖనా కళా ఆసక్తికి 
మంచి పునాది ఏర్పడి, 
అటు పిమ్మట, కేరళలో అనేక నూతన కళాఖండాలు- 
వినూత్న పంథాలో జీవం పోసుకోవడానికి మూల కారణమైనవి. 


* * * * *


రాజా రవివర్మ 1848, ఏప్రిల్ 29 న జన్మించారు. 
యువరాజుగా వైభోగాలమధ్య గడిపాడు. 
త్రివేండ్రం కు ఉత్తరంగా 40 km దూరాన ఉన్న 
కిల్లిమనూర్ (Killimanoor in Kerala)లో 
జీవిత ప్రథమ దశ గడిచింది.
సాంప్రాదయబద్ధునిగా ఒద్దికగా పెరిగి పెద్దవాడౌతున్నాడు. 
భాగవత శ్రవణము, సాత్విక భారతీయ సంగీతము,
సంస్కృత అభ్యాసము, రాజ కుటుంబీకులతో కలిసి 
తరచుగా  చూసే కథాకళీ నృత్యాలు- 
ఇలాటి వాతావరణంలో ఎలాటి మానసిక ఒత్తిడులు లేకుండా 
కాలం గడుపుతున్నాడు. 


రాజరాజవర్మ మేనమామ "తంజావూర్ పద్ధతి"లో 
కృషి చేస్తూన్న వర్ధమాన పెయింటర్. 
రవివర్మ తల్లి పేరు ఉమా అంబా బాయి తంపురాత్రి -
ఆమె కవయిత్రి. 
అలాగే రవివర్మ తండ్రి Ezhymavil Neelakantan Bhattatripad 
సంస్కృత పండితుడు. 
ఇలాటి సుహృద్భావ కళా వాతావరణము 
రవివర్మకు సమకూడిన నేపథ్యంలో 
ఆతని అభిరుచులు చివుళ్ళు తొడగసాగాయి. 
"రంగుల లోకాన్ని తెరపైన ఆవిష్కరించ గల శక్తి రవివర్మలో ఉన్నదని"
గమనించిన మామ, ఆ క్రమంలో రవివర్మను ప్రోత్సహిస్తూ వచ్చినాడు. 


మద్రాసు పట్టణము(చెన్నై)లో
1873 లో "గవర్నర్ లలితకళా ప్రదర్శన" 
(Governor's Fine Arts Exhibition) జరిగినది. 
రవివర్మ వేసిన ""Nair Lady at Her Toilet" కు 
బంగారు పతకము లభించింది.
రవివర్మలో ఆసక్తి, ఉత్సాహములు హిమశృంగ తుల్యమైనాయి.
గోల్డ్ మెడల్ అతని కళా ప్రపంచానికి సింహద్వారమైనదని చెప్పవచ్చును.
1874 నుండి 1875 వరకు అవిశ్రాంత చిత్రలేఖన నిర్మాత ఐనాడు రవివర్మ 
"రాజా రవివర్మ  ఆధునిక భారతీయ చిత్రకళా  వైతాళికుడు" అంటూ 
ఒ.సి. గంగూలీ ఆదిగా ఎందరో కళావిమర్శకులు ప్రస్తుతించారు. 
ఒ.సి. గంగూలీ వంటి చారిత్రక పరిశోధనా విమర్శకులకు 
రాజా రవివర్మ కదలికలు నూతనోత్తేజాన్ని కలిగించిన కొంగ్రొత్త ఔషధం ఐనది.


'గవర్నర్ కాంచన పతక విజేత' గా నిలబెట్టిన బొమ్మ - 
"అలంకరణ వేళ నాయర్ వనిత" ("Nair Lady at Her Toilet") 
మోడరన్ ఇండియన్  పెయింటింగు కు నాంది పలికింది. 


రాజా రవివర్మ 1906 లో కీర్తిశేషులైనారు.
;












;
తమిళ కవి సుబ్రహ్మణ్యభారతి ఎంతో బాధపడుతూ 
రాజా రవివర్మను స్మరిస్తూ, ఎలిజీ (elegy)రాసారు.
;
Subramania Bharati  (elegy)
  "Artist's Death" లోని 
                   
కొన్ని పంక్తులు:-
;
;
"God made the moonlight


And the chakta bird to drink it;


He made ambrosia


And gods to partake of it;


He made the white pachyderm


Worthy of the King of gods.


Beauty he created


In the flower, the azure sky,


And in the woman's face


So that the far-famed Ravi Varma


Can capture it with his great vision,


His fancies and his wisdom."
;
చిత్రలేఖన చక్రవర్తి అనే మాట సర్వ కాల సత్య వాక్కు.


***********************************/////



[Raja Ravi Varma - Photo by:Cyberkerala.com]




చిత్రలేఖన చక్రవర్తి రాజా రవివర్మ (Link: Web patrika)

Raja Ravi varma (Link Haram)

User Rating: / 2 
Member Categories  - తెలుసా!
Written by kadambari piduri   
Sunday, 06 November 2011 12:39 

20, నవంబర్ 2011, ఆదివారం

శ్రీ తులసీ దాస "వినయ పత్రిక"


;
గోస్వామి తులసీ దాసు "తులసీ దాసు రామాయణము" లోక ప్రఖ్యాతమైనదే! 
ఐతే ఆ ఋషిపండితుడు ఇతరములు రాసినాడు.
"వినయ పత్రిక" అనే గీత సంపుటి 
శ్రీ తులసీ దాస విరచితము.
అందరు దేవీ, దేవతలను కీర్తించాడు.
అంతే కాదు!
ఆయనకు సహజంగా "దాస భక్తి" అంటే ఇష్టము. 
శ్రీ గణేశుడు, మహ విష్ణువు, లక్ష్మి, దుర్గ, శివుడు, 
ఇత్యాది దేవతలను మాత్రమే కాక - 
హనుమంతుడు, లక్ష్మణ, భరతుడు 
మున్నగు వారిని కూడా సంకీర్తనలను చేసాడు.
"దాస భక్తికీ, సోదర, అనుయాయ భక్తికి ప్రతీకలుగా" 
ఇతర పౌరాణిక మూర్తులను గూడా 
తన పాటలతో మూర్తిమత్వ ప్రభలను తిలకిస్తూ, 
రచించిన గేయ సంపత్తియే ఈ "వినయ పత్రిక".


గోస్వామి తులసీదాసు (1532-1623)  vinaya patrika ను 
"వ్రజ భాష " లో రచించిన సురభిళ గీతికా మంజరి.
ఇవి ఇంచుమించు  ౩౦౦ ఉన్నవి.
దేవీ దేవతలనే కాక , నదీ దేవతలను, స్థలములనూ, 
దైవ భక్తులనూ కూడా నుతించాడు.
ఆయన ప్రధానంగా రామభక్తుడే కాక, 
"మానవత్వముల, సాదు, వినయ తత్వముల" ప్రేమికుడు కూడా! 


*****************************;



శ్రీరామ , సీతా, హనుమ నామ భజనలు,
నుతులు, వినతులు,
గంగా నది, యమునా, కాశీ, చిత్రకూటము, 
లక్ష్మణ, భరత శత్రుఘ్నులు, హరిశంకర్, 
శ్రీ రంగ, నర నారాయణ, బిందు మాధవ సంకీర్తనలను  

రచనలుగా వెలయింప జేసినందున 
"వ్రజ భాష"కు వైభవము వచ్చినది.

ఉదాహరణకు:- 




Vinay Patrika: 
Bharat Stuti [39]


Raag Dhanaashree;
 jayati
bhoomijaa-ramann-padkanj-makrand-ras-
 rasik-madhukar bharat bhooribhaagee |
bhuvan-bhooshann, bhaanuvansh-bhooshann, bhoomipaal-
 manni ramchandraanuraagee ||1||


&&&&&&&&&&&&&&&&&&&


Vinay Patrika: Lakshman Stuti [38]


Raag Dhanaashree; ; 


Jayati
lakshmanaanant bhagvant bhoodhar, bhujag-
 raaj, bhuvnesh, bhoobhaarhaaree |
pralay-paavak-mahaajvaalmaalaa-vaman,
shaman-santaap leelaavtaaree ||1||


***************************************


శ్రీ తులసీ దాస "వినయ పత్రిక" (Link :- చూసి, చదివి, గానం చేసే వారికి )
;

18, నవంబర్ 2011, శుక్రవారం

రాధ సాధు గీతిక




















వేయబోవని తలుపు తీయమంటూ పిలుపు
రాధకెందుకో నవ్వు గొలుపు 
,
నీలోన నా లోన నిదురపోయే వలపు 
మేలుకొంటే లేదు తలుపు!!
,
విశ్వమంతా ప్రాణ విభుని మందిరమైన 
వీధివాకిలి ఏది చెల్లెలా?
,
విశ్వవిభుడే రాధ వెంట నంటీ రాగ
పిలుపేది తలుపేది చెల్లెలా? 
,
,


********************************;
,
,
సాధు గీతిక ఎవరిది?
ఈ భావ కవితా దీప కళిక ఏ కలము నుండి వెలుడినది?
ఇంకెవరో వేరే చెప్పాలా?
"ఆంధ్ర భావ కవితా వైతాళికుడు - దేవులపల్లి క్రిష్ణ శాస్త్రి"ది.


$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$ 

“సారంగధరీయము" త్ర్యర్ధి కావ్య ప్రజ్ఞా రచన





పోకూరి కాశీపత్యావధానులు ఆంధ్ర సాహితీ కర్షక శిఖామణి. 
ఆయన చిత్ర బంధ కవితా  చాతుర్యానికి మచ్చు తునుక ఈ పద్య రత్నము.


“కుధర సమాకృతి లాభ;
మ్మధికముగా( గొనె(* గుచ ద్వయం బొండొండా;
కుధ ముఖ లిపులు(* సనిన గ:
ట్యధర దృగంగోక్తి నాసికాస్య నఖములౌ!  ”
[ ( = అర సున్న ]


తాత్పర్యము:-


ఆమె కుచద్వయము పర్వతమునకు 
సమానమైన ఆకృతిని అధికంగా పొందినవని- 
“కుధర సమాకృతి లాభము” అను దానిని గురించి- 
ఒక్కొక్క అక్షరాన్నీ తీసివేస్తూ వెళితే అవి వరుసగా:-


1) కుధర సమాకృతి లాభము =పర్వతానికి సమానమైన ఆకృతిని (కుచములు)


2) ధర సమాకృతి లాభము= భూమికి సమాన ఆకృతినీ(పిరుదులు)


3) రసమాకృతి లాభము= అమృత సంపద వంటి రూప ప్రాప్తిని (పెదవులు)


4) సమాకృతి లాభము= ఎగుడు దిగుడు కానట్టి రూప ప్రాప్తిని (చూపులు/ దృక్కులు)


5) మాకృతి లాభము= లక్ష్మీ దేవి/ “మా” వంటి ఆకార ప్రాప్తిని (అంగము)


6) కృతి లాభము= కావ్య రచనా రూపాన్ని- అంటే చమత్కారాన్ని (ఉక్తులు);


7) తి లాభము=  నువ్వు పువ్వును పోలిన దీప్తిని (నాసిక/ ముక్కు)


8) లాభము= చంద్రుని (లః) వంటి కాంతిని (అన్యము);


9)  భము=  నక్షత్రాతిశయమును (గోళ్ళు/ నఖములు)


ఇలాగ వరుసగా ఒకే ఒక్క పదమును- వాడుతూ, 
తెలుగు అద్భుత సారాంశ చమత్కారాన్ని సాధించాడు అవధాని . 
ఆంధ్ర వాఙ్మయ రమణీ మణికి అలంకారమైనది ఈ పద్య రాజము. 
ఈ పద్దెము- బ్రహ్మశ్రీ పోకూరి కాశీపత్యావధానులు రచించిన 
“సారంగధరీయము” లోనిది (2- 41) .
;

ఒక కావ్యములోని గొప్పదనాన్ని గ్రహించి, 
అద్దానిని అంకితముగా గైకొన్న “కృతిభర్త” లు కూడా చిరస్మరణీయులే కదా! 
అలాగ కావ్య ఘనతను కనుగొని, 
కాశీపత్యావధానులు  విరచించిన 
ఈ “సారంగధరీయము”ను స్వీకరించిన 
కావ్య రస పరిశీలనా సమర్ధులైన “శ్రీ సీతారామభూపాల్” 
గ్రంధమును అవధాని పండితుని నుండి అంకితముగా గైకొని 
'కృతి భర్త'గా కీర్తిని గాంచారు.


శ్రీ సీతారామభూపాల రాజా వారు ఈ త్ర్యర్ధి కావ్యాన్ని విని 
బహుధా ప్రశంసింస్తూ, “గ్రంధం వ్రాసి, పేరు పెట్టారా లేక నామకరణం చేసి,  
గ్రంధాన్ని రచన గావించారా?” అని అంటూ,  
కాశీపత్యావధాని చాతుర్యాన్ని మెచ్చుకున్నారు.


వదాన్యులైన “శ్రీ సీతారామభూపాల్ -“సారంగధరీయము” ని 
నాకు అంకితం సేయగలరా!?" అని కాశీపత్యావధానులుని కోరారు. 
వారు ఆ పుస్తక ముద్రణా బాధ్యతని సంతోషముగా స్వీకరించారు.


“సారంగధరీయము"   త్ర్యర్ధి కావ్య ప్రజ్ఞా రచన.


ప్రతి పద్యంలోనూ – ఈశ, చంద్ర. సారంగధర – 
ఈ మూడు కథల భావాలూ అంతర్లీనంగానూ, 
ప్రకాశంగానూ వచ్చేటట్లు చేయగలిగిన కవి కలము ధన్యత ఒందినది. 
ప్రాచీన ప్రబంధాదులలో ద్వ్యర్ధి కావ్యాలుగా


“రాఘవ పాండవీయము”, 
“యాదవ రాఘవ పాండవీయము” మున్నగు గ్రంధములు వెలిసినవి. 
కానీ, కాశీపతి వలె సాక్షాత్తు గ్రంధము యొక్క పేరునే 
రెండర్ధాలు, లేదా మూడు అర్ధాలు వచ్చేటట్లు తన కావ్యమునకే పేరును కూడా పెట్టుట
ఇచ్చట మాత్రమే సంభవమైనది, 
తెలుగు సారస్వత లోకములో ఇలాగ కనిపిస్తూన్నది 
“సారంగధరీయము” వద్ద మాత్రమే అని నుడువగలము.


కాశీపత్యావధాని రచనలోని ఒక పద్యాన్ని గమనించుదాం.


“రాజిత నగాగ్రమున విహారంబు సల్పు;


నీలకంఠాతిశయము రాణిలుట కంటె


రాజిత నగాగ్రమున విహారంబు సల్పు;


నీలకంఠాతిశయము రాణిలుట కంటె ” {2- 138}


ఈ చిన్ని పద్య రత్నము – “ద్విపాది”: 
మీరు పై పద్యాని పరిశీలిస్తే ఈ అంశము ఇట్టే బోధపడుతుంది.


“ద్విపాది” అనగా 1,2 పాదాలు – 
అలాగే 3, 4 పాదాలు ఏమాత్రం మార్పు లేకుండా 
అవే  అక్షరసముదాయ సంరంభములే! 
కానీ, మొదటి, రెండవ పాదాలలోని అర్ధాలూ, 
అలాగే- రెండవ, మూడవ పాదాలలోని భోగట్టా మాత్రం వేర్వేరు.


భావములు:-


“ప్రకాశించు పర్వత అగ్రమున వేడుకగా తిరుగుతూన్న ఈ
శుని గొప్పదనం కంటే” అని పైన చెప్పిన 
ప్రథమ, ద్వితీయ పాదాలకు అర్ధము.


“విరాజిల్లుచున్న చెట్టు చివరన సంచరిస్తూన్న 
నెమళ్ళ యొక్క (మయూరి/ మయూరములు) 
గోరోజనమును/ అతిశయాన్నీ  పరికించావా?” 
అని తదుపరి తృతీయ, చతుర్ధ పాదాల భావము.


ఇంతటి రమణీయకత కల కావ్య సుధలను గ్రోలిన 
“శ్రీ సీతారామభూపాల రాజా” తత్కృతి స్వీకర్త అవడంలో 
ఔచిత్య రామణీయకత ఉన్నదనడంలో సందేహమేమున్నది?


(ఆధారము:- పాటిబండ్ల మాధవ శర్మగారి  షష్ఠిపూర్తి  సన్మాన సంచిక: 
హైదరాబాదు; సెప్టెంబరు;1972).


“సారంగధరీయము" త్ర్యర్ధి కావ్య ప్రజ్ఞా రచన (Link web)
Member Categories - తెలుసా!
Written by kusuma   
Monday, 12 September 2011 10:25 


వ్రతఫలము దక్కింది (konamanini; మంగళవారం 3 మార్చి 2009)


పోకూరి కాశీపత్యావధానులు 
(Link 1 - konamanini; బుధవారం 7 సెప్టెంబర్ 2011)


పోకూరి కాశీపత్యావధానులు  (Link ౨ వ్రతఫలము దక్కింది! 
Member Categories - తెలుసా!
Written by kadambari piduri   
Tuesday, 09 August 2011 13:08 )
పోకూరి కాశీపత్యావధానులు (Link 3)
"అక్షరార్చన"  36 వ్యాసముల  రత్న మాలిక (Link 4 Review September 17, 2011)
;

పాల వేకరి కదిరీపతి "శుక సప్తతి"


పాల వేకరి కదిరీపతి "శుక సప్తతి"

"శుక సప్తతి" తెలుగు సేత కర్త - పాల వేకరి కదిరీపతి - ఇంటి పేరు, ఊరు, సీమలు :- 


ప్రాంతాలను , సీమలను, దేశాలనూ పరిపాలించిన వ్యక్తులే,  
మహా పద్య, వచన కావ్యాలను వెలయింపజేయడం గొప్ప విశేషమే! 
కరవాలమును పట్టిన చేతితోనే, ఘంటం కూడా పట్టి, 
రచనలు చేయడం మాననీయము. 
అతి ప్రాచీన కాలం నుండీ- చక్రవర్తులు, తత్ అధికార గణములోని వారూ- 
అనగా మంత్రి, సేనాధిపతి ప్రభృతులు కవులుగా కూడా 
తమ జీవిత పరమార్ధ భాగ్యాలను ఇబ్బడి ముబ్బడిగా 
ఇనుమడింపజేసుకోవడం జరిగింది.


రాజకవులు గణనీయ సంఖ్యలో పరిఢవిల్లి, 
మన దేశ చారిత్రక గగనాన్ని, 
మనోజ్ఞ భాషా ప్రాభవములతో  
పరిపూర్ణమైన కావ్య కాంతి కిరణముల తేజో యశస్సులను ఆర్జించి, నింపినారు. 
మనకెంతో గర్వకారణమైన కవి చక్రవర్తుల, 
రాజకీయ రంగములోని కవుల పట్టిక పెద్దదే ఔతుంది.తప్పకుండా 
ఈ కోణంలోని  ఈ విశేషం గిన్నిస్ బుక్ రికార్డులలో తలమానికమౌతుంది. 
కాబట్టి, చరిత్ర, సాహిత్య అభిమానులు- 
ఈ లిస్టును సోపపత్తికంగా సమర్పిస్తూ-  
గిన్నీస్ రికార్డ్ లో స్థానం సమకూర్చే మహత్కార్యము 
పరిశోధకులకు గొప్ప పనియే ఔతుందనడంలో సందేహం లేదు.
;
సరే! ప్రస్తుతం ఒక రాజకవిని గమనించుదాము.  
పాల వేకరి కదిరీపతి మహారాజు అలాటి రచయిత. 
సంస్కృతంలో ప్రసిద్ధి కెక్కినది "శుక సప్తతి" అనే శృంగార కావ్యము. 
అద్దానిని పద్య ప్రబంధముగా, 
తెలుగులో మొట్టమొదటి అనువాదం చేసిన కీర్తి 
శ్రీ పాల వేకరి కదిరీపతి కి దక్కినది. 
పంచదార పలుకుల రామచిలుకమ్మ- కథానాయికకు వరుసగా 
ప్రతి రాత్రీ వివరించినట్టి 70 కథలు ఉన్నవి. 
10 వ శతాబ్దానికి మున్నే లోకవ్యవహారంలో ఉన్నవి - 
గ్రంథస్థములైన కథారూపాలను సంతరించుకున్నవి.


పాల వేకరి కదిరీపతి ఎవరు? 
ఈయన ఎప్పటి వాడు? 
ఇత్యాది విషయాలు-అనేక క్రొత్త సంగతులను ఆవిష్కరించినవి. 
1-20, 21 పద్యములలో 
"... భోగ సుత్రాముడు తాడిగోళ్ళ పుర ధాముడు శ్రీ పెద యౌబళుండిలన్" 
1) వీరి ఇంటి పేరు మొదట- పాల వేకరి. పెద ఔబళ రాజు- తాడిగోళ్ళ నగరమును చేరిన నాటినుండి- "తాడిగోళ్ళ" వారైనారు.
2) ఆశ్వాసాంత గద్యలు- అన్నింటిలోనూ - రెండు గృహనామములు కూడా వ్రాసాడు కవి పాల వేకరి కదిరీపతి. 
"అచ్యుత గోత్రుడను, చంద్ర వంశ క్షత్రియుడిని" అనినాడు. కంఠోక్తిగా వక్కాణించాడు.


మూల పురుష గౌరవ స్థానమును అందుకున్న
పెద ఔబళ రాజు నుండి క్రమేణా వారి వంశ క్రమమును 
వర్ణించినాడు పాల వేకరి కదిరీపతి.




పెద ఔబళ రాజు  తనయుడు ఆ] నారపరాజు. 
ఈతనికి తొమ్మిది మంది కుమారులు. 
వారిలోని ఒకడు- ఔబళరాజు, పత్ని బాలమ్మ. 
వీరి పుత్రుడు కరె మాణిక్య రాజుకు నలుగురు భార్యలు. 
వీరికి నలుగురు సుపుత్రులు. 
వీరిలోని రెండవ వాడు - రామరాజు.
ఆ రామరాజు యొక్క తనూజుడు రఘునాథ రాజు.




అలాగే- నాలుగవ వాడు కదుర రాజు  యొక్క కుమారుడు "వెంకటాద్రి". 
ఈ ఆరవ తరము వాడే - మన కృతికర్త ఐన పాల వేకరి కదిరీపతి
ఇలాగ సంశయం లేకుండా, 
పాల వేకరి కదిరీపతి - కృత్యాదిలోనే విపులంగా వక్కాణించినాడు.




శ్రీకృష్ణ దేవ రాయలు పాలనాధికార వారసుడు  తరువాతి తరములలో - 
అళియరామరాయలు. 
అళియ రామ రాయలు- కొనసాగించిన 
జైత్ర యాత్రలలో పాల్గొన్న వీరుడు పెద ఔబళ రాజు. 
అందువలన అళియ రామ రాయలుకు- పెద ఔబళ రాజు సమకాలీనుడు.




శ్రీకృష్ణదేవరాయలు - విజయనగర సామ్రాజ్యాన్ని మూడు భాగాలుగా విభజించి, 
మువ్వురికి ఇచ్చాడు. 
త్రిలింగదేశము:- "పెనుగొండ" రాజధానిగా శ్రీరంగ దేవరాయలు స్వీకరించాడు. 
కన్నడ ప్రాంతము:- "శ్రీ రంగ పట్టణము" రాజధానిగా "రామదేవరాయలు" గైకొన్నాడు; 
ఈతని పేరోలగములోని వాడు, మరియూ సామ్రాట్టుకు "సరి గద్దె నెక్కిన గౌరవాలను" పొందిన వ్యక్తి - కరె మాణిక్యరాజు. 
ఈ పాలనా కాలము 1618- 1630. చంద్రగిరి- కేంద్ర పట్టణంగా 
తమిళ ప్రాంతాధిత్యాన్ని నెరిపిన మూడవ వాడు వెంకటపతిరాయలు.




వీరి పాలనాకాలము నాడు జరిగిన 
కొన్ని తిరుగుబాటులను అణుచుటలో 
తాడిగోళ్ళ రామరాజు విశేష సహాయం తోడ్పాటు ఉన్నవి. 
ఈ రామరాజు మనుమడు, 
శుక సప్తతి కావ్య రచయిత ఐన పాల వేకరి కదిరీపతి. 
ఇతను 17 వ శతాబ్దం ఉత్తరార్ధములో - సాహితీ కృషీవలత్వం చేసాడు.


పాల వేకరి కదిరీపతి నివాస స్థలము, 
తిరిగిన ప్రదేశ వివరాల గూర్చి జిజ్ఞాస సహజము.


పాల వేకరి కదిరీపతి ధామము నామము “తాడి గోళ్ళ”. నేడీ తాడిగోళ్ళ ఒక కుగ్రామము. కడప జిల్లాలోని నేటి - తాడిగొట్ల- కావొచ్చునని ఊహ. తాడిగోళ్ళ పురము - కోలారు మండలములోనిది- అని వాదము ఒకటి.


వీరి ఇలవేల్పు "కదిరి నరసింహమూర్తి". ఆనాడు కదిరి మండలము, అనంతపురము దక్షిణ భాగం నుండి మైసూరు రాజ్యంలోని "శివ సముద్రము" దాకా వ్యాపించినది. పెద ఔబళుడు ఏలికగా "కదెరాకమున "తెర్క" మొదలుగా కలిగిన...."




కావేరీనదికి ఉపనది - గుండ్లు నది. 
గుండ్లుపేట తాలూకాలో "తెరకణాంబె" అనే పల్లె ఉన్నది. 
త్రికంబరి ఈశ్వరి కోవెల ఈ ప్రాంతాల ప్రసిద్ధి ఐన మహిమాన్విత దేవళము. తెర్కణాంబయే “తెర్క” ఐఉండవచ్చును.




ఉత్పలమాల:-


ఆ రసికావతంసకుల మాతృ సముద్భవ హేతుభూతమై


ధీరతఁ బాలవెల్లి జగతిం దగె దన్మహిమం బపారగం


భీర ఘనాఘ సంభరణ భీమ బల ప్రతిభాప్తిఁ గాంతు నం


చార యఁ బాలవేకరి కులాఖ్య వహించె ను సుదంచితోన్నతిన్.


[1-20]


ఉత్పలమాల:-


ఆ మహితాన్వవాయ వసుధాధిపు లచ్యుత గోత్రపాత్రులు


ద్ధామ భుజా పరాక్రమ విదారిత ఘోర మదారి వీరులౌ


భూమి భరించి రా నృపుల భూతి మహోన్నతి నేలె భోగ సు


త్రాముడు తాడిగోళ్ళ పురధాముడు శ్రీ పెద యౌబళుండిలన్.       [1-21]


ఇదీ శుకసప్తతి కావ్యములోని ఊళ్ళకు  ఆధారములు.

సీస పద్యము:-


కావ్య నైపుణి శబ్ద గౌరవ ప్రాగల్భ్య


మర్ధావనాసక్తి యతిశయోక్తి


నాటకాలంకార నయ మార్గ సాంగత్య


సాహిత్య సౌహిత్య సర సముద్ర


సకల ప్రబంధ వాసన సువాక్ప్రౌఢిమా


న్విత చతుర్ విధ సత్కవిత్వ ధాటి


లక్ష్య లక్షణ గుణ శ్లాఘ్యతా పటిమంబు


నైఘంటిక పదానునయని రూఢి."






గనిన నీకు నసాధ్యంబె గణుతి సేయ


ధాత్రి శుకసప్తతి యొనర్పఁ దాడిగోళ్ళ


ఘన కులకలాప “కదురేంద్రు కదుర భూప”


చెలగి వాక్ప్రౌఢిచేఁ గృతి సేయు మవాణి.


పాల వేకరి కదిరీపతి విద్వత్కవి, రక్షణానుసంధాయకుడే కాదు, 
తానే స్వయంగా ఘంటమును చేపట్టి, కావ్య రచన చేయగల మేధావి. 
కనుకనే పాల వేకరి కదిరీపతి సంస్కృత శుకసప్తతిని ఆంధ్రీకరణ చేయగలిగాడు.


కళాత్మకంగా తెలుగున “శుకసప్తతి”ని తీర్చిదిద్దిన, 
ఈ ప్రయత్నంలో ప్రథమ తాంబూలం పొంది, 
అటు చరిత్రలోనూ, ఇటు కావ్య చరిత్ర పేరోలగములోనూ 
ప్రత్యేక స్థానాన్ని గడించిన ఈ రాజకవి ధన్యుడు
;
"శుక సప్తతి" తెలుగు సేత కర్త - పాల వేకరి కదిరీపతి (Link; WEB)  
Member Categories - తెలుసా!
Written by kusuma   
Monday, 03 October 2011 12:24

15, నవంబర్ 2011, మంగళవారం

గిడుగు రామ్మూర్తి పంతులు - సవర జాతి చారిత్రక అంశాలు


పర్లాకిమిడిలో ఉన్న గిడుగు రామ్మూర్తి పంతులు 
మొదట ఒరియా భాషను నేర్వాల్సి వచ్చినది. 
ఒరిస్సాలో విద్య, అక్షరాస్యతలో వెనుకబడిఉన్నది, 
టీచర్లు కూడా తక్కువ మంది. 
ఫలితంగా:-  ఓఢ్రులకు కూడా 
తెలుగు ఉపాధ్యాయులే బోధన చేయాల్సి వచ్చేది. 
గిడుగు రామ్మూర్తి పంతుల శిష్యులైన బుర్రా శేషగిరి రావు 
“1890 లలోనే గిడుగు రామ్మూర్తి పంతులు గారు  - 
సవరల పాఠశాల ను ఆరంభించారు.” అని పేర్కొన్నారు.


గిడుగు రామ్మూర్తి పంతులు కూడా 
ఒరియాను నేర్వక తప్పలేదు. 
ఆ ప్రయత్నంలో ఒక పానో తో పరిచయం ఏర్పడినది. 
అతని పేరు “తౌడు”. 
తౌడు మాతృభాష ఒరియా, 
కానీ అతనికి సవరల భాష కూడా తెలుసును.
గిడుగు రామ్మూర్తి పంతులు ఇంటికి వచ్చి, 
రెండు భాషలనూ నేర్పే వాడు.


1894 నాటికి గిడుగు రామ్మూర్తి పంతులుగారికి సవర భాష పట్టుబడింది. 
సవర భాషకు  లిపి లేదు, 
అందుచేత తెలుగు అక్షరాలలోనే
సవర భాషలోని పాటలను, కథలూ, గాథలనూ రాసుకునే వారు.
కొత్తగా స్కూలులో చేరిన విద్యార్ధికి మల్లే - 
గిడుగు రామ్మూర్తి పంతులు  సవర భాషను, 
వారి నిత్య జీవిత విధానాలనూ కూడా పరిశీలించారు.


సవర చారిత్రక అంశాలను కూడా అనుకోకుండా 
ఆ వరుస క్రమంలో తెలుసుకున్నారు. 
గిడుగు రామ్మూర్తి పంతులు తన అధ్యయనాంశాలను 
విజయనగరములోని విద్యావేత్తలకూ, మిత్రులకూ చదివి వినిపించారు.
అటు తర్వాత గిడుగు రామ్మూర్తి పంతులు గారి వ్యాసాన్ని
“మద్రాసు లిటరరీ సొసైటీ వారి జర్నల్”లో ప్రచురిచారు.


గిడుగు రామ్మూర్తి పంతులు  కృషితో 
సవరల జాతి ప్రాచీనమైనదనీ వెల్లడి ఐనది. 
సవరల ప్రస్తావన ఋగ్వేదములో ఉన్నది. 
తమిళ నాడులో నాటి మద్రాసు ప్రెసిడెన్సీలో కోండ్లు గిరిజనులు ఎక్కువ.
వారి తర్వాత ద్వితీయ స్థానంలో సవరలు ఉన్నారు.
;
మద్రాసు(నేటి చెన్నై) రాజధానిలో
64 రకముల ఆదిమ జాతి తెగలు ఉండే వారు. 
ఋగ్వేదములోనూ, గ్రీకు, రోమన్ మేధావులైన 
టోలమీ, ప్లీనీ మున్నగు వారి రచనలలో
సవరల గురించి, భాషకునూ ప్రస్తావించారు.
ఇట్టి బలమైన విశేషాలతో నిరూపణలు, ఉపపత్తులనూ చూపి,
గిడుగు రామ్మూర్తి పంతులు సవర జాతీయులకూ, 
సవర భాషకూ గల ప్రాచీనతను 
సోపపత్తికముగా ఋజువు చేసారు.


సవరల గ్రామ పెద్దలు గోమాంగ్ బుయాలు.
 [ఒక తెలుగు సినిమాలో “గోమాంగో!...” అని వినిపించింది కూడాను, 
మూవీ పేరు గుర్తు లేదు]
గోమాంగ్ బుయాల సహకారంతో  
గిరిజనులను చదువు పట్ల ఆకర్షించగలుగుతామని
 గిడుగు రామ్మూర్తి పంతులు  చెప్పారు. 
ఆర్యుల రాక వలన, ఆర్య నాగరికత విజృంభణ వలన
నాటి సమాజంలో అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి.


ముఖ్యంగా తమ భాషా సంస్కృతుల పట్ల మమకారం ఉన్న వారు 
తమ సర్వ శక్తులనూ ధారపోసి
 కాలానికి ఎదురీదారనేది చేదు నిజం. 
అడవులలోనికీ, కొండ కోనలలోనికీ వెళ్ళి
తమ ఆచార సంప్రదాయాలను కాపాడుకున్నారు. 
ఇలాగ గిరిజనులుగా నిలద్రొక్కుకున్న 
ఇలాంటి కొండ జాతులలో సవరలు కూడా ఒకరు.


ఫలితంగా వారి చారిత్రక సంపదగా
వారి జీవన విధాన విలక్షణతలు నేడు, 
గిడుగు రామ్మూర్తి పంతులు వంటి వారి కృషి వలన 
లోకానికి వెల్లడి ఐనాయి.


Max Muller, Sayce మున్నగు భాషా తత్వ వేత్తలు రచించిన 
essay లనూ, రచనలనూ ఆసక్తితో చదివే వారు. 
గిడుగు రామ్మూర్తి పంతులు 1892 నుండీ
గిరిజనుల భాషల పట్ల ఆసక్తితో అధ్యయనం చేయ మొదలిడినారు. 
“సవరల భాష” ను నేర్చుకోవడానికి నాంది పలికారు. 
అసలు లిపియే లేని మారు మూల అడవులలోని
జనుల భాషను పరిచయం చేసుకోవడమంటే మాటలా? 
ఆ నాటి సంఘంలో ఇలాంటి ప్రయత్నమంటే అర్ధము -కట్టుబాట్లను ఎదిరించడమే!!
;

గిడుగు రామ్మూర్తి పంతులు - సవర జాతి చారిత్రక అంశాలు ;
Member Categories  - తెలుసా!
Written by kusuma   
Tuesday, 01 November 2011 13:15
సవర జాతి చారిత్రక అంశాలు (Link 'New') 
;

ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు

"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...