29, మార్చి 2019, శుక్రవారం

ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు

"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ,
సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ
ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు చేరాడు మదన్ మోహన్. 
కల్హారములు కళకళలాడే కొలను అలల మాదిరిగా -
కూని రాగాలు జిహ్వామూలాగ్రం నుండి వెలువడుతున్నాయి.
మదన్ మోహన్ తరచుగా క్యాంపుకెళ్తూంటాడు, 
ఫ్యాక్టరీ వాళ్ళే గెస్ట్ హౌస్ నూ, రాజభోజనాన్నీ అరేంజ్ చేస్తారు, 
కాబట్టి నిశ్చింతగా అటు నుండి అటే రోజుకో సెకండ్ షోనూ చూసి, 
హాయిగా ఊరికి వచ్చేస్తూ ఉంటాడు.
మదన్ మోహన్ కి సినిమా ప్రభావం కాదు గానీ,
ఒక చల్లని రాత్రి - సినిమాలో హీరో చంద్రమోహన్ కి లాగానే 
తన భార్య ఇందుమతి మీద చిన్న ప్రయోగాన్ని చేయాలని బుద్ధి పుట్టింది.
ఆ బుద్ధి కాస్తా కీచురాళ్ళ రొదలా కంటి మీద కునుకు రానీయడం లేదు. 
ఇక తన డౌట్ ని క్లియర్ చేసుకోవాల్సిందే! -
అనే దృఢ నిశ్చయానికి వచ్చేసాడు.
అనుకోవడమే తడవుగా ఆచరణకు నాంది పలికాడు,
..... సారీ! నాంది చేసాడు.

****************************
మదన్ మోహన్ కి టైపు చేయడం రాదు.
అందుకని జెరాక్స్ షాపుకు దారి తీయక తప్పింది కాదు. 
మదన్ మోహన్ కి, సిబ్బందికీ షాపులో తాను పని చేస్తూన్న 
కంపెనీ సంబంధిత ఫైళ్ళను ఇస్తూ ఉంటారు, 
కాబట్టి ఆ మడిగెలోని వర్కర్సు ముఖపరిచయాలు ఉన్నవాళ్ళే!
టైపిస్టు పలకరింపుగా నవ్వి 
"ఈ ఒక్క పేపరేనా సార్!?" అడిగాడు. 
ఇప్పటిదాకా అంత చిన్న పేపరు ఈ కంపెనీ ఉద్యోగులద్వారా తమ వద్దకు రాలేదు. 
కించిత్ ఆశ్చర్యార్ధకంతో ప్రశ్నించాడు.
మదన్ మోహన్ గతుక్కుమన్నాడు. 
"వీడికి అక్కర్లేని సందేహాలు వస్తాయి" అనుకుంటూనే నోటికి వచ్చింది అనేసాడు
"మా కంపెనీ వాళ్ళ పత్రికలో ప్రేమలేఖల పోటీ పెట్టారోయి! 
అందుకే ఈ తతంగం " 
టైపు చేసాక అతను " సార్! నా పేరు మధుకర్ . 
నేనో అమ్మాయిని ప్రేమిస్తున్నాను. 
మా లవ్ సక్సెస్ అవ్వాలని ఆశీర్వదించండి" అన్నాడు. 
అయిష్టంగానే మదన్ మోహన్ 
"ఓ!కే!. నీ లవ్ దిగ్విజయోస్తు! 
నీ గర్ల్ ఫ్రెండ్ నిన్ను తప్ప అన్యుల వైపు కన్నెత్తిచూడదు, సరేనా?"
మదన్ మోహన్ "నాకింత భాషాప్రావీణ్యాదులు ఉన్నవని నాకే తెలీదే! -
అని అనుకుంటూ అబ్బురపడ్తూ లోలోన ముసిముసిగా నవ్వుకొన్నాడు.
*************, 
మధుని ఎంకరేజ్ చేసాడు.
"సర్!" మొహమాటపడుతూ గౌరవసూచకంగా నిలబడ్డాడు.
మదన్ మోహన్ "ఏమిటి? ఏం కావాలి?" అన్నట్లుగా
కనుబొమ్మల పైన ప్రశ్నార్ధక ముడిని వెలయింపజేసాడు.
మధు "నాకో చిన్న హెల్ప్ కావాలి" మదన్ మోహన్ గతుక్కుమన్నాడు,
"డబ్బు దస్కమూ అప్పు, చేబదులు అడుగుతాడేమో?!? 
వీడి ఇల్లు కూడా ఎక్కడో ఏమో?"
అనామతుగా నాలికను అదుపులో ఉంచుకోవాలిరా మదన్ మోహన్ ! - అనుకున్నాడు. 
"ఆహ! మరేమీ పెద్దవీ, హిరణ్యాక్ష వరాలూ కాదు సార్!" 
"హమ్మయ్య!" అనుకుని నిట్టూర్చి, ప్రసన్న వదనుడైనాడు మదన్ మోహన్ . 
"ఐతే ఏం కావాలో చెప్పు,

అవతల నాకు కంపెనీ వాళ్ళు శ్రీముఖం జారీ చేస్తారు,
త్వరగా వెళ్ళాలి" అన్నాడు కించిత్ హడావుడి చేస్తూ.
"మరి. మీరు లవ్ లెటర్ ని చాలా బాగా రాసారు. 
నాకేమో వలపు లేఖల్ని రాయడం చేతకాదు. 
నా విరజ నన్నెప్పుడూ ఎద్దేవా చేస్తూంటుంది-
కనీసం ఒక్క లవ్ లెటర్ ఐనా రాయలేదు నువ్వు. అంటూ. 
మీరు పత్రికకి పంపిస్తూన్న ఈ లెటర్ కాపీని నాకిస్తారా?
ప్లీజ్! తనకు ఫైర్ కాపీని ఇస్తాను" 
ఇలాటి ప్రపోజల్ ఎదురౌతుందని అనుకోలేదు మదన్ మోహన్.
అతని ముఖంలో మారుతూన ఫీలింగ్స్ ని గమనించి, "
మీరు లవ్ లెటర్సు రచనలో ఎక్స్ పర్ట్ సార్! ఆహా! ఏమి శైలి! ఏమి భావాలు!" 
మధు పొగడ్తతో ఉబ్బితబ్బిబ్బు ఐనాడు మదన్ మోహన్ .
"సరే! దాందేముంది? నీ ప్రేమ సౌధానికి 
ఈ నా ఉత్తరం పునాది ఔతుందంటే అంతకంటే కావల్సింది ఏముంది! 
నకలు ప్రతి, ఒరిజినల్ ప్రతి, సాదా ప్రతి ఇత్యాదులు

అర డజను పాంప్లెట్ లు రెడీ ఐనాయి. 
మూడు కరపత్రములతో వెనుదిరిగాడు మదన్ మోహన్.  
*************, 
ఇవాళ జరిగింది వింతగా తోచింది మదన్ మోహన్ కి. 
మధు అభిలాషని వినినంతనే ఉలికిపాటు ఎందుకని? 
ఔను! ఎందుకంటే - ఆ చిన్ని కాగితాన్ని తను ఏ మాగజైన్ కోసమూ రాయలేదు. 
తానే అష్టాచమ్మాలో లాగా మారుపేరుతో రాసాడు. 
సుధాకర్ అనే పేరుతో చేవ్రాలు చేసి, 
సాక్షాత్తూ తన భార్యకే పంపించే బృహత్ ప్రణాళికను వేసాడు మరి! 
భార్య ఇందుమతి రియాక్షన్ ని పరీక్షకు పెట్టి,
తద్వారా తన అనుమాన నివృత్తి చేసుకోవాలనుకుంటూన్నాడు.
చేతివ్రాతని ఇందు గుర్తుపట్టేస్తుందని - ఇదిగో! ఇలాగ ఈ అంగడికి వచ్చేసాడు. 
"మిత్రమా! షాపు అనాలి, అంగడి కాదు" 
చెవిలో ఊదే అశరీరవాణిని ఆట్టే పట్టించుకోకుండా
పెడ చెవిని పెడ్తూ పోస్టాఫీస్ ముఖం పట్టాడు.
*************, 
ఆ తర్వాత అనేక సంఘటనలు సినిమా రీలులాగా గిర్రున తిరిగాయి.
మధుకర్ గర్ల్ ఫ్రెండ్ కి లవ్ లెటర్ తెగ నచ్చింది.
మూడు నెలల్లో మదన్ మోహన్ కి మధుకర్ వీర భక్తుడైనాడు. 
కానీ మదన్ మోహన్ కే వింత పరిస్థితి ఎదురైంది.
లవ్ లెటర్ ని పోస్ట్ మాన్ ఇవ్వగానే అందుకుంది ఇందుమతి. 
అలాగ అటు తీసుకుని, ఇటు చదివేసుకుంది కూడా! అంతేనా! 
గుంభనంగా ముద్దుపెట్టుకుని, ఇంచక్కా బీరువాలో
పెళ్ళినాటి పట్టుచీరల నడుమ పదిలంగా ధాచిపెట్టుకుంది. 
"హమ్మో! హమ్మో! గుండెలు తీసిన నెరజాణ!
ఎవడో రాసిన లెటర్ ని చూసీ చూడగనే - అరిచి గీ పెడుతుంది,
కళ్ళనీళ్ళు పెట్టుకుంటూ తనకు చూపించి, ఆగమాగం చేస్తూ, 
వాడెవడో కనుక్కుని ఆ సుధాకర్ గాడి భరతం పట్టేయండీ!" 
అంటూ తనను హత్తుకుని
గోడు గోడున ముక్కు చీదుకుంటూ విలపిస్తుంది, అనుకున్నాడు, 
కానీ ఇదేమిటి?
ఏమీ ఎరగని నంగనాచి తుంగబుర్రలాగా ముసిముసినవ్వులు చిందిస్తూన్నది. 
అరవిరుపు అధరాలలో దరహాసాల్ని నొక్కి పట్టి, 
రోజువారీ పనులను చక్కగా చేస్తూ, దినచర్యలో ఎలాంటి మార్పునూ కనబడనీయట్లేదు, 
"ఇలాగైతే ఏ మగాడైనా ఎంతకని ఓర్పు వహిస్తాడు?" 
"బీరువా తాళాలేవీ? ఆఫీసు పేపర్లు తీసుకోవాలి?" అడిగాడు. 
ఆ వంకతో అరలను కెలికి, చీర మడతల్లో పెట్టుకున్న 
ఆ చిట్టి కాగితమ్ముక్కను పెకలించి,
"ఇదెవరు రాసారు? చెప్పు! ఎన్నాళ్ళనుంచీ సాగుతోన్నదీ భాగోతం?" 
అంటూ హుంకరిస్తూ గదమాయించాలని ప్రయత్నం.
ఊహూ! ఇందూ మగని కన్నా నాలుగాకులు ఎక్కువే చదివింది, 
మీకు సంబంధించిన ఫైళ్ళు, దస్త్రాలూ అన్నీ హాలులో అలమార్లో పెట్టేసానండీ!"
"ఓసి దీని..." ఒక కఠోరమైన తిట్టును లోలోనే తిట్టుకున్నాడు మదన్ మోహన్. 
రమారమి దిగ్భ్రమలో మునిగి, ఇంచుమించు చేష్ఠలుడిగి మ్రాన్పడిపోయాడు.
*************, 
గేటు తీసుకుని లోపలికి వస్తూన్నాడు, అతను మధుకర్. 
"అమ్మయ్యో! తన లేఖా గ్రంధ సాంగత్వం గుట్టు కాస్తా రట్టు ఔతుంది - 
ఒక్క ఉదటున భార్యతో మాట్లాడుతున్నవాడల్లా సంభాషణను ఆపేసాడు; 
మదన్ మోహన్ బైటికి ఉరికాడు. 
ఇందు "ఏమిటండీ ఆ పరుగులూ ఉరుకులూ?" అడుగుతూన్నది. 
ఆమె నోట్లో మాట నోట్లో ఉండగానే
"అర్జంటుగా కాఫీ పట్రా!"
అనేసాడు వెనక్కి తిరక్కుండానే. 
ఆమైన ఏమాత్రం వెనుకంజ వేయకుండానే మధుకర్ ని ఒక్క అంగలో చేరాడు. 
మండువా బైట పూల చెట్ల వద్దనే ఆగిపోవాల్సివచ్చింది మధుకర్. 
శుభలేఖను మదన్ మోహన్ చేతికి ఇస్తూ 
"సర్! మా పెళ్ళి వచ్చే వారమే!

మీరూ మేడ మేడమ్ గారూ తప్పక రావాలి. ఆవిడ ఉన్నారా?" 
మళ్ళీ పౌనః పున్యాలు తప్పలేదు మదన్ మోహన్ కి.
మనసులోనే కరకు బూతును తిట్టుకుని, 
"మా ఆవిడ గుడికి వెళ్ళిది. అసలే అసుర సంధ్య కదా! 
త్వరత్వరగా అందరికీ మీ వెడ్డింగ్ కార్డులని ఇవ్వండి"

ఇక వెళ్ళవచ్చునని సిగ్నల్ ఇస్తూ నొక్కి పలికాడు.
*************,

"మేడమ్ మేడమ్ అట! ఏడు జన్మల పరిచయాలు ఉన్నట్లు. హ్హు!" 
పళ్ళు పట పటా నూరుకుంటూ అనుకున్నాడు. 
వెనక్కి తిరగ్గానే గుమ్మం దగ్గర నిలబడి రోడ్డుకేసి చూస్తూ భార్యామణి! 
మదన్ మోహన్ గుండె గుభేల్ మన్నది. 
పతిదేవునికి కాఫీకప్పును అందిస్తూ అన్నది ఇందు.
"ఏమండీ! ఆ వెళ్ళేది సుధాకర్ కదూ!" గొంతులో దిగుతూన్న వేడి వేడి ద్రవం తో పొలమారింది. 
"ఎవరో తలుచుకుంటున్నారు" జీవితభాగస్వామి తలపై తట్టుతూ అంది ఆ ఉత్తమ ఇల్లాలు.
"ఈ బతుక్కి అదొక్కటే తక్కువ" రోషావేశాలతో ఉచ్ఛ్వాస నిశ్వాసాలు వేగం పుంజుకున్నాయి. 
"ఆహా! ఆ సుధాకర్ మదన్ మోహన్ మునుపే తమరికి తెలుసునన్న మాట."
"ఆ! ఈ మధ్యనే పరిచయ భాగ్యం కలిగింది." 
"ఆ! ఆ!." కుర్చీలో చతికిలబడ్తూండగా టేబుల్ పైన రెపరెపలాడుతూ అగుపిస్తూన్నది 
ఆ pamphlet, పింకు కలర్ పేపర్ ముక్క. 
దాన్ని పట్టుకునే సాహసం కూడా చేయడానికి అశక్తుడైనాడు.
"ఇదిగో! తమరు రాసిన ముద్దు ఉత్తర సాహిత్యం." మొగుడి కరకమలాలలో పెట్టేసింది. 
"ఎలా కనిపెట్టావు?" గుటకలు మింగుతూ అడిగాడు. 
"అలాగ నీళ్ళు నమలడం ఆపేసి, ముందు ఈ మామిడిముక్కను నమలండి"
'ఇంకా నయం! అన్ని తెలిసిపోయినా ............
తనను ఏరా! ఒరే! అనకుండా ......... 
ఏమండీ అనే సంబోధనతో మన్నిస్తూన్నది
ఇంకా ...... , ఇప్పటికీ - ఫర్వాలేదు ...... అనుకుంటూ, 
సతీలలామ తనంతట తానే విస్తారంగా విప్పి చెబ్తూన్న కథా కమామిషూలను వినసాగాడు. 
"సుధాకర్ అనే పేరు మీకు చాలా ఇష్టం. మనకు పుట్టబోయే బాబుకు పెట్టాలని 
మీరు సెలక్టు చేసిన నామధేయం అది. సంతకం గట్రాలు చేస్తే దొరికిపోతారని- 
ఇదిగో ఇలాగ టైపు మిషను పైకెక్కించిన లెటర్ ను వదిలారు. ఔనా?!" 
"అదిసరే గానీ అంతమాత్రానికే......"
"లెటర్ కొసన అలవాటు చొప్పున, ప్రింటింగు చేసే వాళ్ళు - 
తమ షాప్ అడ్రసును ముద్రించారు." "ఐతే....
" భేతాళుని సందేహపూర్వక ప్రశ్నకు ఇంకా సరైన సమాధానం దొరకలేదు. 
"తమరు సైతం అలవాటు చొప్పున పై మూలన 'శ్రీరామ ' చుట్టేసారు. 
మీ బాల్ పెన్ను ఇంకు రంగూ, ముత్యాల్లాంటి ఆ మూడు అక్షరాలూ 
ఈ చోరశిఖామణిని పట్టిచ్చేసాయి. .........
ఐతే ఇదేం బుద్ధి, ఇదేం వాలకం, ఇదెప్పటి నుంచ్హీ తమరి బుద్ధికి ఎక్కిన తిమ్మిరి సార్!?"
అప్పటికప్పుడే జెరాక్స్ షాపుకు వెళ్ళింది ఇందుమతి, దాంతో అన్నీ ఆటోమాటిక్ గా
'ఆ నుండి 'క్ష' దాకా ఆమూలాగ్రం తెలిసి వచ్చినవి. 
సిగ్గుపడుతూ పూసగుచ్చినట్టు అంతా చెప్పేసి 
"ఇది సినీ ప్రభావం బేలా! నన్ను క్షమించు" 
ఆనందబాష్పాల తాలూకు కన్నీటి తెమ్మెర నుండి మదన్ మోహన్ కి ఇందుమతి ఇప్పుడు - 
మేలిముసుగు వేసుకున్న గిరిజన రాణిలాగా అగుపిస్తూన్నది. 
"మిమ్ములని మన్నిస్తున్నాం భోళా శంకరా! సినిమాలమీద నింద వేస్తున్నారు గానీ, 
పాత్ర అపరిశుభ్రతను గూడా పరిగణనలోకి తీసుకోవాల్సిందే!
ఎందుకంటే ఆ మూవీని మా వేలు విడిచిన పెదమామయ్యగారు నిర్మించారు."
"ఏం, గోరు [= nail] కూడా విడవొచ్చు కదా ... "
భర్త కామెడీకి' ఇందు' - పనిలో పనిగా - వంపు పెదవులపై
ఒక వంకర నవ్వును విసిరేస్తూ ... కొనసాగించింది తన సంభాషణని.
"పెద్ద మామయ్యగారిది ఉత్తమాభిరుచి.
నేను భాగ్యనగరంలో - ఆ film ప్రివ్యూ చూసేసాను........" 
ఇంకా సాగుతూన్న అర్ధాంగీమణి వాగ్ధాటికి నమస్కారం పెడుతూ
"మహా ప్రభో!" అని పెడబొబ్బ పెట్టాడు.
"ఆ విరజా, మధుకర్ ల పరిణయ పత్రికను ఇటు ఇవ్వుడు.
ఐతే మదన్ మోహన్ వివాహవేడుకకు మనమిద్దరమూ వెళ్ళి,
దంపతి తాంబూలాన్ని, చందన తాంబూలాది సత్కారాలనూ గ్రహిస్తున్నామన్న మాటే కదా!" 

క్వశ్చనించింది.
"తప్పకుండా! పెళ్ళివాళ్ళు మనకి అంతటి మర్యాదలను చేస్తే స్వీకరించడమేమన్నా చేదా?"
పట్టు విడుపులు ఉన్న సంసారంలో - అప్పుడప్పుడూ తారసిల్లే చిటికెడు చేదులు -
అటు పిమ్మట సంభవించే తీపితేనెల మాధుర్యాల గ్రుమ్మరింపులలో రంగరించబడుతూంటే
ఎల్లరూ ఇష్టంగా, తినే ప్రీతిపాత్రమైన ఉగాదిపచ్చడియే కదా! నేస్తాల్లారా! -
అంటూ ఆహ్వానిస్తూన్నవి 
శ్రీ వికారి నామ సంవత్సర ఉగాది శుభఘడియలు .

****************************************************, 
రచన ;- కోణమానిని కాదంబరి [pen name ] ;
ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు  ;  - Link Lipi ;
కథ, Telugu STORY, PDR లిపి కథా జగతి 

కామెంట్‌లు లేవు:

ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు

"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...