24, ఫిబ్రవరి 2014, సోమవారం

“రఘుపతి రాఘవ రాజా రామ్" ( “రామ్ ధున్” ) బాణీ కట్టిందెవరు?

ప్రఖ్యాత గీతం “రఘుపతి రాఘవ రాజా రామ్” కు సంగీతబాణీ కట్టినది ఎవరో తెలుసా?

ఆయనే ప్రఖ్యాత పండిట్ విష్ణు దిగంబర్ పలూస్కర్. 
విష్ణు దిగంబర్ పలూస్కర్ గారికి లోకమాన్య తిలక్,మహాత్మా గాంధీజి మొదలైన ప్రముఖులతో సాన్నిహిత్యం ఉండేది. 
“రామ్ ధున్” మహాత్మా గాంధీకి చాలా ఇష్టమైన పాట.

సత్యాగ్రహ ఉద్యమం ఉవ్వెత్తున జరుగుతూన్న రోజులు అవి. 
దండి ఉప్పు సత్యాగ్రహం (Dandi March) సమయాలలో “రఘుపతి రాఘవ రాజా రామ్ ”ఈ పాటను అందరూ పాడేవారు. ప్రధానంగా భక్తి కీర్తనలు ఆలపించే విష్ణు పలూస్కర్ ఈ గీతమునకు ట్యూన్ ని కట్టాడు. 
జాతిపిత పండిట్ విష్ణు దిగంబర్ప లూస్కర్ కి రాగమును కూర్చమని- విష్ణు దిగంబర్ పలూస్కర్ కి చెప్పారు. విష్ణు దిగంబర్ పలూస్కర్ అమితానందంతో ఆ మహత్తర బాధ్యతను స్వీకరించారు. 

1907 లో లాలా లజపతి రాయ్ అరెస్టు ఐనప్పుడు విష్ణు దిగంబర్ పలూస్కర్ “పగ్రీ సంభాల్ జట్టా" అనే గీతమునకు సంగీత బాణీలను కట్టి, పాడారు. పండిట్ విష్ణు సమకూర్చిన బాణీలతో ఆ దేశభక్తి గీతాలు- ఉద్యమకారులలో ఉత్సాహ ఉద్వేగములు ఉవ్వెత్తున ఎగసిపడ్తూ పరవళ్ళు తొక్కించేవి.

**********

విష్ణు దిగంబర్ పలూస్కర్ (1872-1931)”సంగీత భాస్కరుడు”. 
విష్ణు దిగంబర్ పలూస్కర్ ప్రాచీన భక్తి గీతములను తీసుకుని, సాంప్రదాయిక స్వరములను కూర్చుటలో సిద్ధహస్తుడు. 
“వందేమాతరం” గీతమును పండిట్ విష్ణు దిగంబర్ పలూస్కర్ బాణీ కూర్చిన తర్వాత, 
“ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మీటింగులు”లో దేశభక్తి గీతముగా 
“వందేమాతరం…..” ను ఆలపించుట సంప్రదాయముగా ఏర్పడినది.

**********

మీరజ్ సీమ రాజు విష్ణు దిగంబర్ పలూస్కర్ లో సంగీత ప్రతిభ ఉన్నదని 
ఈతని 12 ఏళ్ళ వయసులోనే గుర్తించిన వ్యక్తి ; బాలక్రిష్ణ బువా పండితునికి “ఈ బాలునికి సంగీతము నేర్పమని” అప్పగించారు. 
బాలక్రిష్ణ బువా పండితుని వద్ద విష్ణు దిగంబర్ పలూస్కర్ సంగీత విద్యకు శ్రీకారము చుట్టబడినది.

***********

సంగీతమును ప్రజలకు హృదయంకిము అయ్యేలాగా, అందరికీ చేరువలోకి తెచ్చాడు శ్రీ పండిట్ విష్ణు దిగంబర్ పలూస్కర్. అప్పటిదాకా చక్రవర్తుల పోషణలో ఉన్నతశిఖరములను చేరిన కళలు- ప్రజాస్వామ్య యుగములో- ప్రజలకు చేరువ అవ్వాల్సిన అవసరం కలిగినది. 
హిందూస్థానీ సంగీతమును జనుల మానస సరోవరములలో విరబూసే సహస్రదళ పద్మములా విరబూయించిన ఘనత పండిట్ విష్ణు దిగంబర్ పలూస్కర్ దే! 
పండిట్ విష్ణు దిగంబర్ పలూస్కర్ సాంప్రదాయ హిందూస్థానీ, ఘరానా రీతులు ఇత్యాదులు- పండితులకే పరిమితమవకుండా, పామరులకు సైతం అందుబాటులోకి తేగలిగాడు. ఇందుకు ఆయన స్థాపించిన “గాంధర్వ మహావిద్యాలయ” తొలి కాంచన సోపానమైనది. 
ఆయన శిష్య ప్రశిష్యులు ఎందరివో నిష్కామ సేవలు, నిస్సందేహంగా ఈ రంగంలోని మూలస్థంభాలు.

వినాయకరావు పట్వర్ధన్, ఓంకామఠ్ ఠాగూర్, నారయణరావు వ్యాస్, శంకర్ రావ్ వ్యాస్, బి.ఆర్. డియోధర్ మున్నగువారు- పండిట్ విష్ణు దిగంబర్ పలూస్కర్ యొక్క శిష్యులై, హిందుస్థానీ ; సాంప్రదాయ సంగీతమును ప్రజలకు కరతలామలకం చేసారు. 
సంగీతప్రపంచములో అనర్ఘ రత్నములైన ఇట్టివారు- కళామతల్లికి చేసిన పూజలు తరువాతి తరముల వారికి లభించిన గొప్ప వరములైనవి. 
ఆబాలగోపాలమూ సంగీత కళను ఆప్యాయతతో అభ్యసించే మేలిమి మలుపు ఏర్పడినది.

**********

పండిట్ విష్ణు దిగంబర్ పలూస్కర్ కుమారుడు “దత్తాత్రేయ విష్ణు పలూస్కర్” తన తండ్రి ఆశయాలను ఆచరిస్తూ, సంగీత ఉద్యమమును కొనసాగించిన ధన్యజీవి. 
పండిట్ విష్ణు దిగంబర్ పలూస్కర్ రచించిన “సంగీత్ బాల్ ప్రకాశ్” 3 వాల్యూములు, రాగములను గూర్చి వెలువరించిన 18 భాగములు సంగీతప్రపంచములో అనర్ఘ రత్నములు.

(రచన: కోణ మానిని)
**********

“రఘుపతి రాఘవ రాజా రామ్" 
బాణీ కట్టిందెవరు? (లింక్- New Awa - Web Magazine) 
Print Email User Rating:  / 2 
Member Categories - తెలుసా!
Written by kusuma kumari
Thursday, 13 February 2014 10:41
Hits: 200
Image: gajananbuwajoshi.com
IMAGE: GAJANANBUWAJOSHI.COM

12, ఫిబ్రవరి 2014, బుధవారం

కాళికాంబా సప్తశతి

శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి "కాళికాంబా సప్తశతి".
“ముడుమాల” ఒక మారుమూల పల్లెటూరు. 
ఐతే ఆ చిన్ని కుగ్రామం గొప్ప అదృష్టం చేసుకున్నదనే చెప్పాలి. 
ముడుమాలలో ఉన్నది “సిద్ధప్ప మఠము”. 
ముడుమాల లో అపూర్వ తాళపత్ర గ్రంథములు కొన్ని ఉన్నవి. 
“కాళికాంబా సప్తశతి” అట్టి మహత్తర గ్రంథము.

కడప జిల్లాలోని కందిమల్లయ్యపల్లె- ఈ పేరు చెవినబడగానే 
స్ఫురణకు వచ్చే పేరు “జగద్గురు శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి”. 
శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారికి – సిద్ధప్ప అనే భక్తుడు శిష్యుడై తరించిన చోటు “కందిమల్లయ్యపల్లె”.

***************************,
“కాలజ్ఞానము” గురించి ఆంధ్రదేశములోని ఆబాలగోపాలమునకూ తెలుసును అంటే అతిశయోక్తి కాదు. పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి తత్వములు, గేయభణితి- ప్రజల నాలుకలపై ఆడుతూండేవి. 
“పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి” తత్వములను ఆశువులుగా చెప్పిన నుడువులు జనుల డెందములను భిత్తికలుగా చేసుకున్నవి. 
భవిష్యత్ కాలమున ఈ ప్రపంచ వేదికలో రాబోతూన్న అనేక మార్పులను గూర్చి వాక్రుచ్చిన దీర్ఘ దర్శి ఆయన.
*******************,

చరిత్రలో పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి, కాలజ్ఞానము రచయితగా ప్రసిద్ధి కెక్కారు. ఐతే వీరబ్రహ్మేంద్ర స్వామి విరచిత గ్రంథము ఇంకొకటి సైతం ఉన్నది. “కాళికాంబా సప్తశతి” అనే పద్యసంపుటి- జగద్గురు శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి ఘంటము నుండి విస్తృతమై ఉన్నది. 700 చిట్టి పద్దెముల పొత్తము – అని పేరును బట్టే బోధ పడ్తూన్నది. 
సి.పి. బ్రౌన్ గారు పూనిక చేతనే ఈ కాలజ్ఞానము భద్రపరచబడి, ఈ నాటికి మనకు లభించినవి.

***************************,

“కాళికాంబాసప్తశతి” లో అనేక అంశాలు అనుకోకుండ పరిశీలనలోనికి వస్తూ ఉన్నవి. జగద్గురు పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి, వేమన- సమకాలీనులే! అందుచేతనే పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారు – వేమనను గూర్చి, తన పద్యాల్లో తలిచి, మెచ్చుకున్నారు కూడా;

    “వేదవిద్యలెల్ల బాధాకరమ్ములు;
    ఎంగిలింత మ్రింగ హేమమాయె;
    హేమమైన బ్రహ్మ వేమన్న ఒక్కడే!…………. .” {59} 

ఈ రీతిలో బ్రహ్మం గారు రచనాపరంగా ఎలాంటి భేషజాలు లేని నిగర్వి- అనే విశేషం పాఠకులను ఆశ్చర్య చకితులను చేస్తుంది.
*******************,

ఇద్దరు కవులకు ; సంఘ సంస్కరణ ముఖ్య గమ్యం. ప్రాథమికముగా వీరు ఇరువురూ మూఢాచారములను నిరసించినారు. తమ నిరసనలను తెలిపే వారధికి వలె -వాక్కు లనూ, పద్యరచనలనూ ఉపయోగించారు. వేమనకు వలెనే “ఆటవెలది” ఛందస్సులో రచన చేసారు. ఇద్దరూ “అచలయోగులు, స్వరయోగులు”. వేమన మూఢాచారాల్ని తీవ్రంగా దూషించాడు. జగద్గురు శ్రీశ్రీశ్రీ శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి కూడా అంతే, కానీ, ఆయన తత్వములను బోధించే ‘యోగిపుంగవుని’గా ప్రసిద్ధికెక్కాడు.

*******************,

జ్ఞాన నేత్రమునకు యోగశాస్త్రములో అగ్రస్థానం ఉన్నది. ఇడ, పింగళ, సుషుమ్న – అనే మూడు నాడులు ప్రథమ గణ్యాలైనవి. ఆ త్రయాన – భ్రుకుటీ స్థానం
(ఫాలము, కనుబొమ్మల నడుమ, అనగా బొట్టు పెట్టుకునే ప్రాంతాన ఆజ్ఞాచక్రము ఉన్నది. ఆజ్ఞాచక్రము తెరుచుకుంటే అపారమైన కాంతి, తేజో పారావారము గోచరము ఔతుంది.

    “మూర్తి రూపురేఖ భ్రూమధ్యమున నిల్ప;
    దివ్యమైన వెలుగు తేజరిల్లు;
    మూర్తి లేని రాయి ముఖ్యమ్ము గాబోదు
    కాళికాంబ! హంస! కాళికాంబ!” {77} 

కొన్ని చోట్ల వేమనకూ, బ్రహ్మం గారికీ కొన్ని కొన్ని భావాలలో విభిన్నత కనిపిస్తుంది.

*******************

యోగము, ప్రాణాయామము, నిష్ఠ, క్రమశిక్షణలలో గొప్ప పట్టు కలిగిన సాధువు వీరబ్రహ్మేంద్ర స్వామి.
“కాళికాంబా సప్తశతి” లో ఉపబలకములు ఐన నుడువులు అగుపిస్తూన్నవి.
“కండ, కుండలించి; కుండలి నాడించి; జమిలి మోత నాగసరము నూద ..”
“దృష్టి మధ్యమందు; దేవుడెప్పుడు నుండు; కష్టమేమి లేక కాంచ వచ్చు ;తుష్టి గూర్చి గురుడు తోవలు చూపించు: కాళికాంబ! హంస! కాళికాంబ!”

*******************,
“రాజయోగము” అనే సిద్ధాంతము (మౌంట్ ఆబూ) ఆ నాటికే నాటుకున్నదని 361 పద్యమువలన తెలుస్తున్నది.

    “సాంఖ్యయోగములను సాధింపవచ్చును:
    బ్రహ్మపదము చేరవచ్చు దాన:
    రాజయోగులకును రాచబాటది కదా!
    కాళికాంబ! హంస! కాళికాంబ!” {361}

    “నాద,బిందు,కళల నయముగ గుర్తించి;
    వాద భేదములను వంచి గురుడు;
    సమయజేయు దేహ సందేహ దాహమ్ము
    కాళికాంబ! హంస! కాళికాంబ!” (91)

    “తన్ను తా గ్రహింప తారకయోగమౌ:
    రాయి కొయ్య గొలువ- రాదు ముక్తి; …
    కాళికాంబ! హంస! కాళికాంబ!” (112)

*******************
“భారతీయుడు” – పద ప్రయోగము:-

“భారతీయుడు” అనే పదవ్యుత్పత్తి ఏనాటి నుంచి ప్రయోగములో ఉన్నదో – అనే అంశముపై- భాషా, చారిత్రకుల మీమాంసలు ఉన్నవి. 298 లో ఈ పదప్రయోగం ఉంది.

“మంత్ర తంత్ర యంత్ర మాహాత్మ్య గాథలు:
భారతీయులకును- భారమాయె: …”

ప్రపంచములోని ఇతర మతాలలోనూ, ఇతర సంఘాలలోనూ – ఇన్ని కట్టుబాట్లూ- మూఢనమ్మకములూ- తద్వారా ఏర్పడిన- మనకు గోచరించుట లేదు. అలాటి ఆచారములు, సాధారణప్రజల నిత్యజీవన వ్యవహారములకు పెను అడ్డంకిలు ఐనవనీ-అలాటి విపరిణామాలను గుర్తించిన మహనీయుడు పోతులూరి. ఈ పైన ఉదహరించిన పద్యంతో పాటు అనేక సోదాహరణములు ఉన్నవి.

    “మంత్ర తంత్ర యంత్ర మాహాత్మ్య గాథలు:
    భారతీయులకును భారమాయె: …”
    జనులపాలికివియె శాపనార్థము లాయె:
    కాళికాంబ! హంస! కాళికాంబ!”

    “తెట్ట గట్ట బూది, తిరుమణి, తిరుచూర్ణ;
    ములు మొగాన బూయ ముక్తి రాదు;
    చిత్తశుద్ధి లేని చేష్టలు దుష్టాలు;
    కాళికాంబ! హంస! కాళికాంబ!” (309)

    “తళుకుబెళుకు వస్త్రములు దాల్చువారలు;
    వ్రేళ్ళ నుంగరములు పెట్టువారు;
    వాని విలువ తప్ప వారికి వెల లేదు……” (364) 

*******************,
జగద్గురువు “యోగశాస్త్రము, ప్రాణాయామము, తపస్సు” లను అభిమానించి, సాధన చేసి వానిలో ప్రావీణ్యతలను సాధించారు. బ్రహ్మము, తేజస్సు, నాడులు, ఇత్యాది పదాలను అలవోకగా వాడగలిగారు.

    “మేళమెంతొ చేసి మెప్పులు గనెనయా:
    మేళజతలు పదియు మెఱపు నొకటి;
    పదిని మించి ఎంచ బ్రహ్మంబు లేదయా ….. ” (421)

    “ఎట్లు నిస్సరణమొ? (=ముక్తి)
    ఏమొకొ మహిమమ్ము? :
    శివుని మాయ యేమొ? చెప్పరాదు:
    అనుచు బ్రహ్మవిదులు కనుగొనిరా జ్యోతి ……” (428)

    “అడవిలోన గురుడు పడి యాకటం బడి;
    అడవి నెల్ల తినెదమంచు జూడ;
    పరికెలోన గచ్చపొదలు బలిసియున్నవి కదా! ……” (436) 

{పరికె= నాలుగు రోడ్ల కూడలి/ జంక్షన్/ శృంగాటకము}

    “కిటికి నుండి సూర్యకిరణమ్ము గను రీతి;
    ఆత్మలోన మోక్ష మరయవలయు:
    ఆత్మ యనెడి కిటికి కవి యెన్ని మూతలో
    కాళికాంబ! హంస! కాళికాంబ!” (441) 

********************,

మున్ముందు తాను రాసే “కాలజ్ఞానము” నకు పునాదులు ఐన తేట తేట ఆశు కవితలు ఇక్కడు గోచరిస్తున్నవి.

“ఆకసమ్ము పైన అంత శూన్యమ్మని;
పలుకు నరులకెల్ల బ్రహ్మ సాక్షి;
పిండమండమైన పృధివి బ్రహ్మాండమౌ; ………” (586);

*******************,
పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి సమాజపరముగా ఆటుపోట్లు, మిట్ట పల్లాలు చూసారు, కాళికాంబాసప్తశతి లో వానిని చిత్రించారు.

    “సెలవొసంగు టెట్టు లిల దేవుడైనాడు;
    సుకృతకర్మతోడ జూచె నన్ను;
    అజ్ఞతయును దీఱె నలజడులును మాఱె; …………..” (593) అన్నారు.

    “నాల్గుజాతులకును నాగేటి మొనలోన;
    ప్రాణమున్నదంచు పలికినారు;
    ఇలను దున్నువారు బలభద్రులగుదురు” (622)

    “ఉపనిషత్తులందు నుపదేశికులయందు;
    శ్రుతులయందు శ్రద్ధ చూపవలయు;
    శ్రద్ధ లేక ముక్తి సాధింప శక్యమా?” (649)

    “పుస్తకములు చదువ పూర్ణత్వమబ్బదు;
    హృదయసంపుటముల చదువవలయు;
    పారిశుధ్యమొకటె పరమాత్మ చేర్చును ………..” (658) 

*******************,

    “కన్నులకును పొరలు కడకు వీడితె కదా:
    జ్ఞానమనెడి జ్యోతి కానవచ్చు:
    కన్నులకును మాయ మబ్బు (=చీకటి)న వేసె; ……” (461)

    “మనసు బుద్ధులకును మరసీల గొన్నట్లు;
    గురుని పాదచింత గూడదాయె;
    ఎఱుకయనెడి సుత్తె నెగురగొట్టగవలె; ……… “(416)

    “గళమునందు నిలువ గాయత్రి మంత్రంబు;
    బడవ మాంత్రికులతొ గొడవ యేల?;
    సూత్రధారి ముక్తి చూపగా నోపడు;
    కాళికాంబ! హంస! కాళికాంబ!” (493)

****************************

    “మంత్రతంత్రములకు మాతృకామూర్తివి:
    పదములకును జ్ఞాన పథము నీవు;
    శూన్యజాలమునకు శూన్యసాక్షిణి నీవు:
    కాళికాంబ! హంస! కాళికాంబ!” (506)

    “సర్వశుభము లీయ శాంకరి వౌదువు;
    భవ్యవాక్కులీయ వాణివీవ;
    కోరుకుల నొసంగు నారాయణి నీవ:
    కాళికాంబ! హంస! కాళికాంబ!” (513)

    “ఈశు జూచి కూడ నిది’నిబద్దనలేరు (=నిజము);
    వాసి లేని యొడలు పాసిపోయె;
    మోసపోయి నరులు మూర్ఖులైపోయిరి;
    కాళికాంబ! హంస! కాళికాంబ!” (562)

    “మేకలెల్ల గూడి యాకు మేసెడి తావు;
    తోకచాలు, పిల్లమేక వచ్చు;
    అట్టి తీరు భక్తులా హరి వెనకుంద్రు; ….” (578)

    “ఆకసమ్ము పైన అంత శూన్యమ్మని;
    పలుకు నరులకెల్ల బ్రహ్మ సాక్షి;
    పిండమండమైన పృధివి బ్రహ్మాండమౌ;
    కాళికాంబ! హంస! కాళికాంబ!” (586) 

*********************************,

“కన్యాశుల్కం” లాంటి ఆధునిక రచనలలోనూ, 19- వ శతాబ్దము తర్వాత సామాజిక వాడుకలో ఉన్న పదాలు పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వ్రాతలలో కనిపిస్తూన్నవి. “కులము గోత్రమంచు కూసెడి మలపల్ని….”; నాలిముచ్చుల్ని, పోకిరిసన్నాసులు; దగుల్బాజీ వాళ్ళ పోకడలను ఏకిపెట్టాడు.

“మతము మత్తుమందు గూర్చు మార్గమ్ము కారాదు…… “- (694 ప||) అని ఎలుగెత్తి ఘోషించాడు.

*******************,
కడప మాండలికములు:-

కడప మాండలికములు:- విరివిగా స్వామి ఘంటము నుండి ముగ్గులో చుక్కల లాగా చమక్ మంటూ తారసిల్లుతూన్నవి.

కిటికి; {పరికె= నాలుగు రోడ్ల కూడలి/ జంక్షన్/ శృంగాటకము;
మరసీల; గడె, సంతకాయ, గడె= గడియ; తొఱ్ఱి;తుఱగలి= వెలుతురు;హుకుము (=హుకుం);

************************************;


700 ఆటవెలదులు మణులై ఉన్న ఈ అమూల్య పుస్తకము పునర్ముద్రణలు వెలువడినవి.

“కాళికాంబా సప్తశతి”
పేజీలు 176
వెల: రు. 20-00
సర్వస్వామ్యాలు శ్రీవీరబ్రహ్మేంద్రస్వాములవారి మఠమునకు చెందినవి.


ప్రతులకు:
మేనేజరు,
శ్రీవీరబ్రహ్మేంద్రస్వాములవారి మఠం,
కంది మల్లయ్య పల్లె,
కడప జిల్లా – 516503 ఆంధ్రప్రదేశ్   
కాళికాంబా సప్తశతి ; 
More articles by అతిథి »
Written by: అతిథి
Tags: Articles by Kadambari, spotlight
potuluri

వ్యాసకర్త: కాదంబరి, konamanini

Essay: (Link: web magazine: Pustakam.net  
*********** 
VIEWS: 54921; 

ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు

"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...