17, జులై 2009, శుక్రవారం

బాల సాహిత్యము

"జనులకు హితమును చేకూర్చేది సాహిత్యమని" ఆర్యులు భావించారు.
నేటి సాహిత్యములో ఒక శాఖగా అలరుతూన్న "బాల సాహిత్యము" కూడా ఈ భావనకు న్యాయము చేకూరుస్తున్నదని చెప్పవచ్చును.
మనలోని అంతర్నేత్రాలకు సుదూర వర్ణమయ ప్రపంచాలను చూపించే వాహిక పుస్తకము (సాహిత్యము).
"జలబిందు నిపాతేన క్రమశః పూర్వతే ఘటః

స హేతుః సర్వ విద్యానాం, ధర్మస్య చ, ధనస్య చ"
బాల సాహిత్యము ఎలా ఉండాలి? బాల బాలికలకు అర్థమయ్యేలా, బుడి బుడి నుడువులతో, నిష్కల్మష భావాలను ఆవిష్కరించ గలిగినప్పుడు,బాల సాహిత్యము సార్ధకమౌతుంది. తేట తేట తెలుగు పదాలు కూర్చిన లయాత్మక గీతికలుగా ఉండాలి.(అంటే వారి వారి మాతృ భాషలలో కూడా ఇదే వర్తిస్తుంది. ఇంగ్లీషు, తమిళ, మళయాళ, కన్నడ, హిందీ వగైరాలున్నూ, కొసకు సంస్కృత భాషలో ఐనా సరే! ఈ అలతి అలతి పదాల అన్వయ నియమము వర్తిస్తుంది)
*** *** *** ***

బాల గేయాలను 3 రకములుగా విభజించ వచ్చును.
దేశ భక్తి గేయములు
అభినయాత్మక క్రీడా గేయాలు
నీతి కథా ఖండ కావ్యములు , దేశ భక్తి గేయాలు క్లిష్ట పదాన్వయ భరితముగా ఉన్నప్పటికీ, గాన, లయ, తాళములతో ఒనగూడినవై శృతి సుభగత్వమును కలిగి ఉంటే మేలైన పద్ధతి.
శ్రీ దేవుల పల్లి కృష్ణ శాస్త్రి గారి పాటను ' ఆహ్లాదించుకోండి '.
"జయ జయ జయ ప్రియ భారత జనయిత్రీ! దివ్య ధాత్రి!

జయ జయ జయ శతసహస్ర నరనారీ హృదయనేత్రి!
జయ జయ సశ్యామల,సుశ్యామ చలచ్చేలాంచల !
జయ వసంత కుసుమ లతా చలిత లలిత పూర్ణ కుంతల!
జయ మదీయ హృదయాశయ, లాక్షారుణ పద యుగళా!..."

మరొక పాటను గమనిద్దాము... పై పాట ఎంత క్లిష్ట సమాస పూర్ణమైనదో ఈ క్రింది ఉదాహృత రచనలు అంతటి తేట పదాలతో నిండి ఉన్నవి.
"తేనెల తేనెల మాటలతో

మన దేశ మాతను కొలిచెదమా!
భావం, భాష్యం కలుపుకుని
ఇక జీవన యానం చేయుదుమా..."
దేశ భక్తి పాటలు, దైవ భక్తి పాటలు ఇట్టి సమాసములతో, భాషా పటిమనూ, అటు చక్కెర చిలకల వంటి తేలిక పదాలతోనూ సమర్ధవంతముగా ఆబాల గోపాలమునూ అలరిస్తూంటాయి. అల్లి బిల్లి పదాల ఈ గేయాలను అవలోకించండి.
"తాత వంటి తాత లేడు :

గాంధి తాత వంటి తాత:
ఎందు ఎంత వెదకిననూ
లేడు, లేడు, కాన రాడు........
చిన్న నాటి నుండి పెద్ద బుద్ధులు కలవాడంట! .......పిన్నలలో పెద్ద అంట!........."
ప్రసిద్ధ రచయిత (గుడిపాటి వేంకటాచలం)చలం గారు ఇలా అన్నారు:
"పిల్లలకు పాటలను రాయడము చాలా కష్టము.
దాని కంటే మహా కవి కావడము సులభము."
పిల్లల వాఙ్మయము ఆ పలుకులు నిజమేనని నిరూపిస్తాయి.
శ్రీ న్యాయపతి రాఘవరావు(రేడియో అన్నయ్య) రచనలు అనేకము ఉన్నాయి. వానిలో ఒకదానిని చదివి చూడండి.

"పిల్లలకే స్వారాజ్యం వస్తే;
పిల్లలకే స్వాతంత్ర్యం ఇస్తే
చిట్టి తండ్రినీ రాజును చేస్తాం!
చిట్టి తల్లినీ రాణిని చేస్తాం! //

మా తాత ఒక బొమ్మయితేను;
మా అవ్వ ఒక బొమ్మయితేను
బొమ్మల పెళ్ళి ఇంపుగ చేస్తాం;
కమ్మని విందులు గుమ్ముగ తింటాం! //

సూర్యుడు ఎర్రని కాగితమైతే;
చంద్రుడు తెల్లని కాగితమైతే
వేడుక తోటీ తాడును కట్టి;
గాలి పటంలా తేలించేస్తాం!..."
ఇలాగ మృదు మధురంగా సాగి పోతుంది.

శ్రీ రెడ్డి రాఘవయ్య గారి
కలం చిందుల సొగసులను చూడండి.

"పిల్లలం పిల్లలం,
పిల్ల గాలి విసురులం!
పిల్లలం పిల్లలం,
మల్లె పూల జల్లులం //

పిల్లలం పిల్లలం,
తెల్ల మబ్బు తునకలం
పిల్లలం పిల్లలం,
ఎల్లరి కను విందులం!..."శ్రీ శ్రీ ప్రఖ్యాత గేయం ఇది:
"మెరుపు మెరిస్తే,వాన కురిస్తే

ఆకసమున హరి విల్లు విరిస్తే
'అవి మాకే!' అంటూ
ఆనందించే కూనల్లారా!

పాపం పుణ్యం, ప్రపంచ మార్గం
కష్టం,సౌఖ్యం, శ్లేషార్ధాలూ
ఏమీ ఎరుగని పువ్వుల్లారా!
ఐదారేడుల పాపల్లారా!..."
ఇలాగ సాగే ఈ కవిత "బాలల శ్రేయస్సును గూర్చి పెద్దలకు ఉపదేశిస్తూన్న
కవితా లహరి గా పేర్కొన వచ్చును.
"నిజమైన బాల సాహిత్యము మామిడి పండులా ఆపాత మధురంగా ఉండాలి.
భాష సరళంగానూ, లలితంగానూ ఉండాలి.
చెప్ప వలసినది విప్పి పండు ఒలిచి చేతిలో పెట్టినట్లుగా ఉండాలి.
బాల సాహిత్య వేత్తలు ఈ మూల సూత్రమును పాటించినంత కాలమూ,
బాల వాఙ్మయము బాలల ఆదరణను పొందుతుంది" అని దాశరధి గారు అన్నారు.
అక్షర జ్యోతి, అక్షరాస్యతా ఉద్యమాల వలన
' విద్యా ప్రగతి, ఆవశ్యకతను ' తెలిపే గేయాలు అనేకము వెలిసాయి.

"పలుకుల తల్లి పిలిచెను చెల్లీ!
చదువులపై నీ మనసును నిలుపు! //
ఎంత కురిసినా ఆగని ధార!
ఎంత త్రవ్వినా తరగని గనిలే!
కదలవె బాలా! -అదరక,బెదరక
కుదురుగ విద్యను నేర్చుకొనంగ //"

ఇల్లాంటిదే మరి ఒకటి:

"రా రా చిన్నోడా!
బళ్ళో కెడదాము//
దొరలు దోచగ లేరు;
దొంగ లెత్తుక పోరు.
అన్న దమ్ములు వచ్చి,
భాగ మడుగగ బోరు...."
అచ్చులను వరుస క్రమంలో బోధించే పాట, గుడిసేవ విష్ణు ప్రసాద్ రచన ...
"అక్షరాలను దిద్దాలి; ఆనందంతో మెలగాలి!

ఇలలో అందరు చదవాలి;
ఈ జగమంతా మెచ్చాలి.." అంటూ కొనసాగినది.
"అ-ఆ -ఇ-ఈ-రావాలి; అందరమొకటై పోవాలి..." అన్నారు. ఎం.లక్ష్మణాచార్యులు
"వందనమమ్మా!వందనమమ్మా!

తెలుగు తల్లి అభి వందనమమ్మా!
అందరమొకటైని నీ ఉన్నతికై
అహరహమూ కృషి చేసేమమ్మా!
కుల మత భేదం మాకు లేదనీ ; జగతి అంతటా చాటేమమ్మా!..." అన్నారు
"బాల ప్రపంచం; పాల ప్రపంచం పాల వలె తెల్లనిది, పాల వలె తియ్యనిది!" అన్నారు ఏడిద కామేశ్వరరావు.
"విరిసే పూవుల రేకుల్లారా! మురిసే చివురాకుల్లారా!" అని పిల్లలను మెచ్చుకున్నారు కరుణశ్రీ. వింజమూరి శివరామారావు చాచా నెహ్రూజీని తలుస్తూ, రచించిన పాట
"ఏమి నోము నోచినదో, ఈ ఎర్రని గులాబీ; అందుకున్నదెల్లెడలా; అందరి మన్ననలు" ప్రజల హృదయాలను కరిగించినది.

"అందమైన చందమామ ; అందరాని చందమామ:అమ్మా! నా చేతిలోని అద్దములో చిక్కినాడే!....." ఎంత మనోజ్ఞ భావనమిది!
"భావ కవి"గా పేరెన్నిక గాంచిన శ్రీ దేవుల పల్లి కృష్ణ శాస్త్రి రాసిన బాల గేయాలు లావణ్య రాసులే. ఆంధ్ర దేశములోని జల సంపదను వర్ణించిన ఆయన గేయ ఫణితి అమోఘమైనది.

"తరలి రారమ్మా!2//
గౌతమి,మంజీర,
ఓ నాగావళి,వంశ ధార;
తుంగ భద్ర, పినాకినీ;
ఉత్తుంగ భంగా కృష్ణ వేణీ!//

నురుగుల ముత్యాల చెరగుల;
తరగ మడతల పావడాల;
తురిమి సిగలో రెల్లు పూ మంజరులు;
ఝరులౌ సోయగముతో//తరలి రా రమ్మా!..."

ఈ మనోజ్ఞ గేయ పంథాలో బాల సాహిత్య సృజన కర్తలకు ఇలా మనవి చేస్తున్నాను;

"తరలి రారండీ! తరలి రారండీ!//
నగవుల ముత్యాలు చల్లగ;
పలుకు మల్లెల గూడు లల్లి;
అలరు బాలల జగతి కొరకై ;
కథలు ,నుడువులు,గేయములను;
సృజన చేసే మహిత శీలురు;తరలి రారండీ!" '''''''''

"ఇపుడే వస్తానమ్మా! తొందర చేయొద్దమ్మా!"
--------------------------------------------
అంటూ సాగే ఈ పాట బాల బాలికల నిష్కల్మష ప్రవృత్తికి అద్దం పడ్తూన్నది.

1) "పిల్ల గాలి ఊసులన్ని -
చిన్ని పూల బాసలన్ని
మనసు విప్పి చెబుతుంటే-
చెవులొగ్గి వింటున్నా!

ఇపుడే వస్తానుండమ్మా!
కొంచెం సేపు ఆగమ్మా!//

2) వన్నె వన్నె ఈకలనూ -
చిన్ని రాళ్ళు ,గవ్వలను
మెల్ల మెల్లగా ఏరి-
పోగు చేసుకును చేసుకుని

నేను ఇపుడే వస్తానమ్మా!
చిడి ముడి చేయొద్దమ్మా!//

3) గడ్డి పూల సొగసులను,
వెన్నెలకు అందిస్తా!
అందమైన ప్రకృతికి-

బాల సారె,పేరు పెట్టి
ఆనందపు ఋతువులకు -
అ-ఆ-లను దిద్దించి ,

అమ్మా! నే వస్తాగా!
తొందర చేస్తావేమి?! //

5) బుల్లి బుల్లి పిట్టలకు-
మాటలు నేర్పిస్తానే!
చిరు జల్లుల వానలను-
ఆటలు ఆడిస్తానే!
అలల నురుగు చిన్నెలను-హరి విల్లుకు చూపించి, పరిచయాలు చేసొస్తా! ఇపుడె వస్తా!ఆగమ్మా!//
అమ్మా!ఇపుడే వస్తా!
హడావుడి చేయొద్దు! //
(రచయిత్రి: పి.కుసుమ కుమారి)
ప్రాచీన కాలం నుండీ" భక్తి గాన వాహిని "
మన దేశములో దివిజ గంగా ప్రవాహముల జల పాతములై, జనావళిని సంతోష సంరంభములలో ఓలలాడించినది.
బాల కృష్ణునిపై భక్తి, వాత్సల్యములతో,
ఘంటములు, కలములు వేసిన ప్రతి చిందు ,సంగీత,నాట్యములకూ బంగారు వేదికలను అమర్చాయి.
అలాగే, మాతృ ప్రేమ వెలువరించిన జోల పాటలు మల్లెల సౌరభాల సందడులను వెలయించినవి.
శ్రీ నారాయణ తీర్ధుల వారి "శ్రీ కృష్ణ లీలా తరంగిణి" ఆపాత మధురమే!
"ఆలోకయే!శ్రీ బాల కృష్ణం!....." మొదలైన పాటలు సంగీత, నాట్య జగత్తులలో సుస్థిర కీర్తిని గాంచినవి. అన్నమాచార్యులు కృతి "జో అచ్యుతానంద!జో జో ముకుందా!......" సుప్రసిద్ధమైనదే!
గోపి, రాయప్రోలు వామన మూర్తి, వెల్దుర్తి మాణిక్యాల రావు, దొప్పల పూడి రాధా కృష్ణ మూర్తి, రాచకొండ విశ్వనాధము, యడ్లపాటి నారాయణమ్మ, విభావసు ప్రభాకర శర్మ, మంగా దేవి, స్వరజ్యం రామ కృష్ణమ్మ, రమణమ్మ మున్నగు వారెందరో బాల గీతికా మంజరులను విరబూయిస్తూన్నారు.
వెలగా వెంకటప్పయ్య (తెనాలి), విశ్వేశ్వరరావు(గుంటూరు) మున్నగు మహనీయులు ఎందరో,
తేట తెనుగులోని అందాలను, బాల సాహిత్యానికి చేస్తూన్నట్టి అవిరళ సేవల ద్వారా, ప్రజలకు అందిస్తున్నారు. అమెరికా మున్నగు విదేశాలలోని ప్రవాసంధ్రుల ఎనలేని కృషి తెలుగు సాహిత్య బృందావనిని నిరంతరమూ అంద చందాలతో, పరిమళాలతో ఘుబాళింప జేస్తున్నాయి.
ఏప్రిల్ 2 వ తేదీ "అంతర్జాతీయ బాలల పుస్తక దినోత్సవము". హన్స్ క్రిష్టియన్ ఆండెర్సన్ అనే రచయిత పుట్టిన రోజు సందర్భముగా నెలకొనబడినది ఈ "ఇంటర్నేషనల్ చిల్డ్రెన్స్ బుక్ డే"

3 వ్యాఖ్యలు:

Bhaskara చెప్పారు...
ఈ వ్యాఖ్యను రచయిత తీసివేశారు.
భాస్కర రామి రెడ్డి చెప్పారు...

చాలా బాగుందండి.ఒక చిన్న సూచన. గేయాలను పాదాల ప్రకారం వ్రాస్తే చదవడానికి బాగుండేదనిపించింది.

అక్షరాలను దిద్దాలి;
ఆనందంతో మెలగాలి
ఈలలో అందరు చదవాలి;
ఈ జగమంతా మెచ్చాలి

పలుకుల తల్లి పిలిచెను చెల్లీ! చదువులపై నీ మనసును నిలుపు! // ఎంత కురిసినా ఆగని ధార ఎంత త్రవ్వినా తరగని గనిలే! కదలవె బాలా! -అదరక,బెదరక కుదురుగ విద్యను నేర్చుకొనంగ

పలుకుల తల్లి పిలిచెను చెల్లీ!
చదువులపై నీ మనసును నిలుపు!
ఎంత కురిసినా ఆగని ధార
ఎంత త్రవ్వినా తరగని గనిలే
దలవె బాలా! -అదరక,బెదరక
కుదురుగ విద్యను నేర్చుకొనంగ.


బుల్లి బుల్లి పిట్టలకు-మాటలు నేర్పిస్తానే!
చిరు జల్లుల వానలను-ఆటలు ఆడిస్తానే!
అమ్మా!ఇపుడే వస్తా!
హడావుడి చేయొద్దు!

చాలా బాగున్నాయండి

Kusuma Kumari చెప్పారు...

భాస్కర రామి రెడ్డి గారూ!
నా రచనలను ఆసక్తితో చదివుతున్నందుకు మీకు ఎంతో కృతజ్ఞతలు.
మీ రచనలకు,నా బాల గేయములలోని పద ప్రయోగములు స్ఫూర్తిని ఇస్తున్నాయంటే,నాకు ఎంతో ఆనందము కలిగినది.
మీ అభిప్రాయాలు నా రచనలలోని ప్రమాణాల్ని మెరుగు పరుచుకొనడానికి ఎంతగానో ఉపకరిస్తున్నాయి.
మీ సలహాను అనుసరించి,నా వ్యాసమును తీర్చి దిద్దాను.చూసి,మీ అభిప్రాయాలను చెప్ప గోరుచున్నాను.
(మీ వ్యాఖ్యలో,"దిద్దు బట్లు"ను విపులంగా,బొమ్మ కట్టినట్లు చూపించారు,మెనీ thanks అండీ!)

ముద్దు పేర్లు - మొద్దు పేర్లు

"బుజ్జీ! చంటీ! బన్నీ! చిట్టీ! కాఫీ తాగుదురు గాని రండి! టిఫిన్ కూడా రెడీ."  ; తరళ, ఆమె సోదరి లవంగిక తమతమ పిల్లల్ని ఎలుగెత్తి పిలి...