14, జులై 2009, మంగళవారం

చదరంగము ఆట

ఆడుచున్నది గోపి(క)
చదరంగమాట
చతురులే ఆడుతూ
చతురతలు మెరయగా //

1) "బంటును జరపర శౌరీ!"
అన్నది రాధిక, వీనుల విందుగా.

2) "నీదు బంటును నేనే కాదా!
జరుగు చుంటి"ననె శ్రీ గిరిధారి.

3) "గజమును జరపితి నేను!
కానిమ్ము క్రీడను, కువలయ నేత్రా!"

"గజ గామిని!వయ్యారి నడకలు చూసిన
ఏనుగు కదల నేరదు, వింతగ!
నీ ఓర చూపులే అంకుశమ్ములిట."

ముని పంటను నొక్కిన
ముసి ముసి నవ్వుల సిరి పంట
ఆడే క్రీడలు కన్నుల పంటగ.

4) "ఒంటె కదిలినది ఐ మూలకును."
"ఒంటిగ నా ఒంటె
నడవ నేర్వదు."

5) "తురగ వల్గనము
అదుపు లేనిది.
అతివ ఎత్తుల ముందు
చిత్తు నేనింక,
నీ చిత్తము! నా భాగ్యము! చిత్తం!"

6) "చిత్తమును కుదురుగా నిలిపి
మంత్రినైనా కదుపు"మనె గోముగా.

7) "కరణేషు మంత్రీ!
నిను జూచి ఈ వేళ
అమాంతముగా దాగె
నా అమాత్య వర్యులు"

జగడములు అనిపిస్తు,
కొంటె నవ్వులు చిలుకు
ఆ జంట మధు పలుకులే
' శ్రీరామ రక్ష ' ఎల్ల జగములకు.
*******************************************

1 వ్యాఖ్య:

భాస్కర రామి రెడ్డి చెప్పారు...

మీ చిరు కవితలలో ఏదో తెలియని ఆనందం కలుగుతుంది, ప్రత్యేకంగా మీరు పిల్లలకోసం రాసేవాటినుంచి నేను చాలా పదాలు ఏరుకుంటుంటాను.
ఈ కవిత కూడా నాకు బాగా నచ్చిందండి.

అలాగే మీరు Word verification తీసివేస్తే వ్యాఖ్యలు వ్రాసే వారికి సులువుగా వుంటుంది.

ముద్దు పేర్లు - మొద్దు పేర్లు

"బుజ్జీ! చంటీ! బన్నీ! చిట్టీ! కాఫీ తాగుదురు గాని రండి! టిఫిన్ కూడా రెడీ."  ; తరళ, ఆమె సోదరి లవంగిక తమతమ పిల్లల్ని ఎలుగెత్తి పిలి...