'''''''''''
పల్లవి
చైత్ర మాసములోన - కుహు కుహూ కోయిలా!
అను పల్లవి
రాగాల రంజిల్లు స్వర జల్లు కోయిలా!
రాగలవ?ఇటుకేసి - మా పర్ణ శాలకు
1)
పారిజాతము తరువు ఛాయలో
నక్కి నక్కీ దాగి ఉండినాడే!
మా చిలిపి కృష్ణుడు - నవనీత చోరుడు
2)
గుట్టుగా నువ్వు - వానినీ పట్టిస్తే
మా గారాల పట్టి అపరంజి బొమ్మ
పట్టెడంత మావి చిగురులెన్నెన్నో
పెడుతుంది నీకు ఓపికతొ బాగా!
ఓపినంతంతా మెసవవే! ఓ పికమా!
తోపులన్నీ నీవె ఈ నాడు కదవే!
3)
మరకత శ్యాముడు, మా కుందనపు క్రిష్ణయ్య
చెక్కుటద్దముల మీద - తెలి వెన్నెలల నీడలను
కనుల కన్నావా? - తెలుసుకున్నావా?
బాలా! నెమలి కన్నులు సిగను ధరియించినట్టి
అల్లరల్లరి వాని జాడలల్లవిగవిగో!
''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి