2, డిసెంబర్ 2010, గురువారం

శ్రీ సీతా రాముల కళ్యాణము & Koranjiilu


















శ్రీ సీతా రాముల కళ్యాణము ;
చైత్ర మాసములో, శుక్ల పక్ష నవమి నాడు,
పునర్వసు నక్షత్రంలో శ్రీ విష్ణు మూర్తి భువిపై శ్రీ రామ చంద్రుని గా జన్మించాడు.
కనుక చైత్ర శుద్ధ నవమి నాడు శ్రీ రాముని పూజించాలి అని అగస్త్య సంహిత చెప్పింది.
ఆ రోజు మధ్యాహ్న"కాల వ్యాపిని" గా ఉండాలని ధర్మ శాస్త్రాలలొ చెప్పారు.
చైత్ర శుద్ధ పాడ్యమి నుండి నవమి వరకూ ,
తొమ్మిది రోజులు “శ్రీ రామ నవమి ఉత్సవ ములను”
భారత దేశంలో ప్రజలు జరుపుకుంటారు.
మన ఆంధ్ర దేశంలో నవమి నాడు మాత్రమే కాకుండా,
ఎప్పుడూ శ్రీ సీతా రాముల కళ్యాణమును వేడుకగా చేసుకుంటూంటారు.
భద్రా చలం లో “పాంచ రాత్రాగమము”ను అనుసరించి,
పూజాదికములను నిర్వహిస్తారు.
@) కళ్యాణానికి సంకల్పం చెప్పి, ఆరంభిస్తారు.
(ఇతర సందర్భాలలో ఐతే వినాయక స్వామి పూజను చేయుట స్మార్త పద్ధతి)
@)భద్రాద్రిలో సంకల్పం చెప్పిన తర్వాత “విశ్వక్సేన పూజను” చేస్తారు.
@) పిమ్మట కళ్యాణ కర్తలకూ, కళ్యాణ వస్తువులకూ,
ఆ ప్రదేశానికీ పవిత్రతను కల్పించుటకై “పుణ్యాహ వచనం” చేస్తారు.
@)ఉత్సవ మూర్తులను గొని వస్తారు.
@)వధువు జానకీ దేవిని వరుడు దాశరధికి ఇచ్చి పెళ్ళి చేయుటకు “సంకల్పం చెబుతారు”.
@)యోక్త్రము ను తయారు చేసి ఉంచుతారు. ఈ యోక్త్రము 24 అంగుళాల నిడివి ఉంటుంది.
24 దర్భలతో సిద్ధంచేసి ఉంచిన ఈ యోక్త్రం న్ని పూజిస్తారు.
కన్య నాభి వద్ద – ఉల్ముకుడు అనే రాక్షసుడు – ఉంటాడు,
వానిని వధించడం కోసం జరిగేదే యోక్త్ర ధారణము.
అరిష్ట నివారణం కోసం ఈ తతంగం జరుగుతుంది.
యోక్త్రమును అమ్మ వారికి ధరింప జేస్తారు.
@) ఇలాగే రక్షార్ధమై కంకణ పూజ తో పవిత్రం చేసిన
“రక్షా బంధనము ను ధరింప” జేస్తారు.
@) ఇక్కడ వరుని కార్యక్రమములు నిర్వహించవలసి ఉంటుంది.
ఉపనయనము మాత్రమే జరిగి, బ్రహ్మచర్యాశ్రము పాటిస్తూన్నాడు అబ్బాయి.
మరి అతణ్ణి గృహస్థాశ్రమానికి తయారు చేయాలి కదా!!!
ఉపనయనము మాత్రమే జరిగి ఉన్న వరునికి, మళ్ళీ జంధ్యం వేయాలి.
ద్వితీయ యజ్ఞోపవీతమును ప్రసాదించేదే గృహస్థాశ్రమ అర్హత.
గార్హస్థ్యాశ్రమ నిర్వహణకు యువకుని, మానసికంగా సిద్ధం పరచ గలిగేదే ఈ ఆచారం.
శ్రీ రాఘవునికి సువర్ణ యజ్ఞోపవీతాన్ని అలంకరిస్తారు.
@ “కోరంజీలు” -> వీరు ఎనిమిది మంది బ్రాహ్మణుల గ్రూపు.
ఈ కోరంజీలకు తాంబూల, దక్షిణలను ఇస్తారు.
తర్వాత వారు కన్యా దాత వద్దకు వెళతారు.
@) మూడు సార్లు వీరు “ప్రవరలు చెబుతారు”.
అనగా, మొదట “గోత్రమును” చెబుతారు.
అటు పిదప ఆ ఇరువురి గోత్రీకుల వంశస్థులలోని
ముఖ్యుల యొక్క, ప్రముఖుల యొక్క,
పేరు పొందిన వ్యక్తుల వివరాలను వివరిస్తారు.
వధూ వరుల వంశములయొక్క వివరాలను
ఇరు వర్గాల వారికీ, అతిథులకూ తెలియ జేయడమే ఈ ఆచారంలోని ప్రముఖ ఉద్దేశ్యం.
పరస్పరమూ కొత్త – కాబట్టి ఈ పరిచయ వేదిక గా ఈ ఆచారం సమన్వయం చేస్తున్నది.
@) భద్రాచలంలో “రామ నారాయణుడు” అనీ,
“సీతా లక్ష్మి” అనీ వ్యవహరిస్తారు.
అందు చేత, ఇచ్చట మూడు తరాల ప్రముఖులనూ పేర్కొను పద్ధతి
కాస్త విభిన్నంగా ఉంటుంది.
ఆంధ్ర దేశములోని మన భద్రాచలంలో
“ శ్రీ రామ చంద్రుడు అచ్యుత గోత్రోద్భవుడు,
పర బ్రహ్మ ముని మనుమడు,
వ్యూహ నారాయణుని మనుమడు
విభవ వాసు దేవుని పుత్రుడు ......... “ అంటూ వివరణలను వక్కాణిస్తారు.
అదే రీతిగా “సీతా మహా లక్ష్మీ అమ్మ వారి వివరాలు
ప్రేక్షకులకు లభించే వినూత్న వరాలు!
“చతుర్వేదాధ్యాయిని,
సౌభాగ్య విశ్వంభరి,
సౌభాగ్య గోత్రోద్భవి,
విశ్వంభర శర్మ ముని మనుమరాలు,
రత్నాకర పౌత్రి, కీరార్ణవ శర్మ పుత్రి “
అలాగ ఒక విచిత్ర జగత్తు మనకు పరిచయం ఔతుంది.
@) ఆశీర్వచనం చేసి, పెళ్ళి కొడుకు శ్రీరామునికి పాద ప్రక్షాళన చేస్తారు.
పుష్పోదక స్నపనమునూ, ఆభరణాలంకరణనూ చేసి,
పూజలు చేస్తారు.
మధు పర్కముల కార్యక్రమము జరుగుతుంది.
(పెరుగు, నెయ్యి) దధి, మధు, ఘృత, మధుపర్క ప్రాశనము చేస్తారు.
ఇట్లు ప్రయాణ బడలికను తీర్చిన వెనుక,
తతిమ్మా కార్యక్రమాలు కొనసాగుతాయి.
@) వస్త్రములు ఇస్తారు. గో దానము చేస్తారు.
దృష్టి దోష నివారణకై కొన్ని పనులు చేస్తారు.
అన్నము చూపిస్తారు.
@ కన్యా దాన కార్యక్రమము మొదలౌతుంది.
అందుకు “మహా సంకల్పము”ను పఠిస్తారు.
@) కన్యా దాన ప్రశస్తి చెప్పిన తదుపరి ఇతర దానాలను చేసి,
“చూర్ణిక” ఎలుగెత్తి చదువుతారు.
సుముహూర్త ప్రశస్తి పరమైన పద్యం వంటి గద్య రచనయే చూర్ణిక.
@) ఇక జీలకర్ర, బెల్లం, పసుపులు కలిపిన ముద్దను
వధూ వరుల తలలపైన పెడ్తారు.
ఈ మిశ్రమాన్ని ఇరువురికీ ఉంచే నేత్ర పర్వమైన ఆచారమును
తెలుగు దేశములో భక్తులు యావన్మందీ ఎంజాయ్ చేస్తూంటారు.
ఇలాగ “హస్త మస్తక ప్రయోగ సంయోగముతో
పెళ్ళి పందిరికే జయ కళ వస్తుంది.
@) “అక్షతారోపణ” అంటే నవ వధూ వరులు
ఒకరి తలపై ఒకరు తలంబ్రాలు పోసుకొనుట
అత్యుత్సాహ భరితముగా జరుగుతుంది.
మొదట మూడు దోసిళ్ళు హరిద్రాక్షతలు పోస్తారు.
$}”యజ్ఞము వృద్ధి చెందాలని నా అభిలాష.”
అని మొదటి దోసిలిలోని అక్షింతల రాశినీ,
$}”ధర్మము సమృద్ధి పొందాలని నా కోరిక.”
అని రెండవ దోసిలివీ,
$} “పశు సంపదలు బాగా ఉన్నత స్థాయిని పొందాలని నా మనోభీష్టము.”
అనే భావనలతో మూడవ దోసిలిలోనివీ పోసుకుంటారు.
@) “బ్రహ్మ గ్రంధీ ధారణము”
“పెళ్ళి కుమార్తె, పెళ్ళి కుమారుడూ భార్యా భర్తలు అయ్యారు కదా!
కాబట్టి గృహస్థాశ్రములో అడుగిడి,
పరస్పర బద్ధ అనురాగముతో ప్రవర్తిస్తూ,
ధర్మ మార్గానుయాయులై దిన దిన ప్రవర్ధ మానముగా వర్ధిల్లాలనే
యోచనతో ఏర్పడినదీ ఈ బ్రహ్మ గ్రంధీ ధారణము.
కళ్యాణ ఆరాధనలు పూర్తి ఐన పిమ్మట, నివేదన తరువాత
భక్తులకు ప్రసాదము లభిస్తుంది.
ఆ ప్రసాదములే తెలుగువారికి నోరూరించే
వడ పప్పు, పానకములు అని ఈ పాటికే మీరు గ్రహించి ఉంటారు,

( ఆధారము ; late ananta ramayya)

1 కామెంట్‌:

sravanti చెప్పారు...

mi sitaramula pendli mucchatlu bavunnayi.

ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు

"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...