సరస్వతీ మహల్
By kadambari piduri,
తంజావూరులోని "సరస్వతీ మహల్"సాహితీ అభిమానులకు గొప్ప చలివేందిరము.
ఇచ్చట ప్రాచీన పుస్తకములు,తాళ పత్రములూ ఉన్నాయి.
52వేల సాహితీ సేకరణలు,5వేల కళా ఖండాలు లెక్కకు మిక్కిలిగా ఉన్న సరస్వతీ ధామము అది.
దేవనాగరి, తెలుగు ఇత్యాది భారతీయ భాషలతో బాటు
డానిష్, ఫ్రెంచి, ఇంగ్లీషు భాషలలోని గ్రంధాలు కూడా ఉన్నాయి.
ఇంతటి మహత్తర కృషి చేసిన సాహితీ రసజ్ఞుడు శారభోజీ మహా రాజు.
అతని తండ్రి తుల్జాజీ కాలము చేసిన పిమ్మట,
శర్ఫోజీ(/శరభోజీ)రాజ్యాన్ని సేనాధిపతి అమర సింహుడు ఆక్రమించాడు.
శరభోజీ కి ఆంగ్ల విద్య నేర్పిన మిషనరీ టీచరు C.F.Schwartz
అత్యంత ప్రయత్నముతో 10 సంవత్సరముల తర్వాత
శరభోజీని సింహాసనమును అధిష్టింప జేయగలిగాడు.
ఆపై రెండు ఏళ్ళకు ష్వెట్జ్ మరణించాడు.
రాజ్య కాంక్షతో సాగే అంతర్గత కుట్రల వలన శరభోజీ విసిగిపోయాడు.
దాంతో అతను బ్రిటీషు వారు భరణంగా ఇచ్చిన ధనమును తీసుకుని
ప్రశాంత జీవనమును ఎంచుకుని,
రాజ్యాధికార కాంక్షను వదలి, మనుగడను సాగించాడు.
ఆ సాహితీ సామ్రాట్టు,కళా పోషకుడు చేసిన సాహిత్య
సేవలు తర తరాల వారికీ లభించిన అమూల్య నవరత్న నిధులు.
దక్షిణ భారత దేశములో "దేవ నాగరి ప్రింటింగు ప్రెస్సు"
ను నెల కొల్పిన ఘనత శరభోజీ మహా రాజుదే!
ఇతర రాజులలాగా తనకు లభించిన
సొమ్మును దుర్వ్యసనాలకూ, విలాసాలకూ కరిగించలేదు.
సారస్వత సేవకై వినియోగించిన ఉదార బుద్ధి శరభోజీది.
దేశ, విదేశాలకు పండితులను
పంపించి ఇంగ్లీషు,డ్యానిషు,ఫ్రెంచి,పాశ్చాత్య భాషల లిటరేచరును కూడా సేకరించాడు.
స్వంత డబ్బును ఖర్చుపెట్టి, రమారమి 45వేల పుస్తకములను సేకరించాడు.
అనేక కళాఖండాలు మన జాతీయ వారసత్వ సంపదలుగా లభించాయీ అంటే
అది శరభోజీ చేతి చలువయే!
సరస్వతీ మహలు నేడు 52వేలు పై చిలుకు గ్రంధాలకు ఆలవాలము.
ఆ అముల్య సాహిత్య రత్నాకరము ముంగిట శరభోజీ యొక్క పాల రాతి విగ్రహము ఉన్నది.
మీరెప్పుడైనా అటు వెళితే
ఆ సాహిత్యప్రియునికి అభినందనాంజలని ఘటిస్తారు కదూ!
*********************************************
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి