వ్రేపల్లెలో యశోద, రోహిణీదేవి,
ఇద్దరు పిల్లలను చేర పిలిచి,
బాల క్రిష్ణుని, బలరామునికి నగలను సింగారించారు.
“బర్హి పింఛము ఇదిగో అమ్మా!”
నవ్వుతూ అమ్మ చేతికి ఇచ్చాడు చిన్నిక్రిష్ణుడు.
నందుడు పకపకా నవ్వి,
“మా క్రిష్ణమ్మ నెమలీకను మాత్రం ఎప్పటికీ మరువడు కదా!
జంతువులూ, పక్షులూ, ప్రకృతీ అంటే ఎనలేని ప్రేమ!” అన్నాడు.
గోపభామలు ముందుకు ఉరికి, క్రిష్ణుని సిగలోన నెమలి పింఛాలను తీరుగా ముడిచారు.
ఆవులమందలను తోలుతూ అడవిబాట పట్టారు ఆ అన్నదమ్ములు.
క్రిష్ణుని రాకతో అటవీ ప్రాంతమంతా సందడిగా మారింది.
తోటే వచ్చిన గోపాల బాలకులతో కలిసి
కోతికొమ్మచ్చి, గూటీ బిళ్ళ, ఏటిలో ఈదులాటలూ….
ప్రతి కదలికా ఒక నూతన క్రీడయే కదా అక్కడ!
ఆటలు, పాటలను ఆలమందలు,
చిట్టడవిలోని ప్రతి మొక్క, చెట్టు, పువ్వు చెవులొగ్గి వింటూండేవి.
ఆటవిడుపుల వేళలలో హాస్యాలూ, ఏటిలో ఎదురీతలు ……..
ఆనక గుజ్జనగూళ్ళు సందడే సందడి!!!!
బూరుగు చెట్లు, జమ్మి చెట్లు, రావిచెట్లు, మర్రి చెట్లు, సకల వృక్షాలూ
“మా తరుఛాయలఓ కూర్చుని, ఫలహారాలు చేయండి!” అంటూ ఆహ్వానిస్తూన్నవి.
అందరూ తాము తెచ్చుకున్న చల్ది అన్నం మూటలను విప్పి, సరదా సరదాగా తినేవాళ్ళు.
వినోదాల తర్వాత మిట్టమధ్యాహ్నమవడముతో- క్రిష్ణునికి నిద్ర వచ్చింది.
ఒక కదంబ పాదపము నీడలో కొంచెం కునుకు తీస్తూన్నాడు.
అందరూ ఎవరి కబుర్లలో వాళ్ళు ఉన్నారు.
ఇంతలో ఒక పిల్లవాడు అక్కడికి వచ్చాడు.
అడవిలో నివసిస్తూన్న ఆ పిల్లవాడు-
దూరం నుంచీ వీళ్ళ అల్లరి, గోలల సవ్వడులను వింటూన్నాడు.
అక్కడికి వచ్చాడు,
కానీ గ్రామీణ దుస్తులతో- జానపద గీతాలు పాడుతూ, ముచ్చట్లాడుతూన్న
ఈ గోపకుల వద్దకు రావడానికి సంశయిస్తూ చాటుగా నక్కి నక్కి చూస్తూన్నాడు.
వివిధ ఆభరణాలు, సిగలో పులు, నెమలి ఈక, అధరముల విరిసే చిరునవ్వులు
క్రిష్ణుడు అంటే- చాలా ప్రేమ కలిగింది.
“మురళిని ఎంత బాగా వాయిస్తున్నాడు ఇతడు!” అనుకున్నాడు
ఆ ఆదివాసీ చిన్నవాడు.
మాగన్నుగా నిద్దరోతున్న క్రిష్ణునికి-
నిద్రాభంగము కలుగకుండా-
నెమ్మదిగా అతడి గుప్పిట్లోని వేణువును తీసుకున్నాడు.
తాను కూడా “పిల్లనగ్రోవిని ఊదసాగాడు”
కానీ రకరకాల వింత ధ్వనులే గానీ, సుస్వర నాదమేదీ
ఆ గొట్టములోనుండి రావడం లేదు.
ఈ హడావుడికి అందరూ ఆ చోటికి వచ్చేసి, గుమిగూడారు.
“నీకెంత ధైర్యం? మా క్రిష్ణుని వేణువును తీసుకున్నావు!
అంతే కాకుండా ఎంగిలి కూడా చేసావు!” అన్నారు.
మరికొందరు”మా క్రిష్ణుని అంత బాగా మురళీగానాన్ని చేద్దామనుకున్నావా?
మా క్రిష్ణమ్మతో సమ ఉజ్జీగా మధుర సంగీతాన్ని మురళిపైన పలికించాలంటే,
అబ్బో! మరెన్నో జన్మలెత్తాలి!!”అంటూ ఎగతాళి చేయసాగారు.
మెలకువ వచ్చిన క్రిష్ణుడు అందర్నీ కనుసైగతో వారించాడు.
“నీకు వంశీ గానం ఆలపించాలని ఉన్నదా?” అడిగాడు క్రిష్ణుడు.
“ఔను! ఔనౌను! నువ్వు చాలా బాగా ఈ వెదురు గొట్టంలోనుండీ గొప్ప రాగాలను ఊదుతూన్నావు.
నాకూ నేర్పిస్తావా?” అప్పటికే సందెపొద్దు వాలింది. ఇళ్ళకు అందరూ వెళ్ళాలి!
కాబట్టి క్రిష్ణుడు అక్కడి ఒక వెదురు చెట్టునుండీ,
చిన్న కొమ్మను తీసుకుని, రంధ్రాలు చేసాడు.
అప్పటికప్పుడు ఒక వేణువును తయారుచేసి ఇస్తూ,
“మురళిని ఇలాగ పట్టుకుని,
గాలిని పెదవులతో సన్నగా ఊదుతూంటే,
నెమ్మదిగా స్వరాలు వెలువడుతాయి”
అందరూ అడవి పిల్లోడికి “వీడుకోలు!” చెప్పేస్తూ
గృహోన్ముఖులు ఐనారు.
ఆ పిల్లవాడు ఆ కారు చీకట్లను సైతం లెక్కసేయలేదు.
అలాగే కూర్చుని, వేణువాదనమును ప్రాక్టీసు చేయసాగాడు.
కానీ పాపము!
ఎంతసేపటికీ- “తుస్! తుస్స్!…… ” లాంటి
వింత ధ్వనులు, వికారంగా వస్తూన్నాయి గానీ,
మధుర సంగీతం మాత్రం కుదురలేదు.
క్రిష్ణుడు ఆతని తపనను అర్ధం చేసుకున్నాడు.
ఇకనుండీ, నా మేని రంగు లాగా నీకూ నీలి వన్నె కలుగుతుంది.
ఈలపాట వంటి పాటలు పాడుతూ,
అందరికీ సమ్మోహనపరచగలిగే పక్షిగా
నీవు అవతరిస్తావు” అంటూ అనుగ్రహించాడు.
గిరిజన పిల్లవాడు ఒక పక్షిగా జన్మించాడు.
ఆ కొత్త పక్షే “కస్తూరి పిట్ట".
:
ఆ నాటినుండీ కొత్తగా వచ్చిన - కస్తూరీ పక్షి(Whistling Thrush of Malabar)
‘వీల పాటలను’ వింటూ,
వనదేవత ఆహ్లాదంతో పచ్చగా మెరవసాగినది.
ఈ పక్షిని- కేరళ ప్రభుత్వము-
“రక్షిత రాష్ట్ర విహంగము”
(protected state bird) గా స్వీకరించింది.
********************;
;
Shri Krishna Playing Flute, Peacock dancing |
;
*******************,
1) కస్తూరీ పక్షి (My story:- in)
jabilli web magazine (Link)
కస్తూరీ పక్షి – భవ్య భారతి
March 01, 2013 By: జాబిల్లి Category: కథలు
2) కస్తూరీ పక్షి: Bird Forum (Link for Information)
(Whistling Thrush of Malabar)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి