9, జులై 2012, సోమవారం

విధి విలాసము - శ్రీరాముడు


 నంది గ్రామములో ఎల్లరికీ సంభ్రమం! అక్కడికి అందరూ ఎప్పుడో వచ్చేసారు. 
మూడు ఝాములైనా ఎవ్వరూ అక్కడినుండి అంగుళమైనా కదల్లేదు. 
వేచిచూస్తూనే ఉన్నారు ఆ వింత ముహూర్తం కోసరమని!!!!
మున్నెన్నడైనా కనీ, వినీ ఎరుగ లేదు, ఇప్పుడు జరుగుతూన్న సంగతి!
కాళ్ళకు తొడుక్కునే చెప్పులకు పట్టాభిషేకమట! 
సింహాసనము మీద పాదరక్షలను ఆసీనము చేయబోతూన్నారు!


ఇంత విడ్డూరపు సంఘటన చారిత్రక ఔన్నత్యాన్ని పొందుతుందని గానీ ముందు తరాల జనులలో నీతి నియమాల రూపచిత్రణలను చేస్తూ ప్రపంచమునకే ఆదర్శ సమాజము అంటే ఇదీ!...... ఇదే!.... 
అని పదే పదే చెప్పుకుంటూ, తమ ఆచరణకు నమూనాగా తీసుకునే శక్తి గలిగిన ఘటన ఇది! 
కొన్ని యుగాలనూ, కొన్ని కోట్లాది సంవత్సరముల దాకా జనుల ప్రవర్తనకు గీటురాయిగా అమరబోతూన్న మహోన్నత దృశ్యమాలిక ఇది!
కనుకనే ఇతిహాస రచనలకే కానుకగా అందబోతూన్న ఈ అద్భుత అంశము కోసమని ఆబాలగోపాలమూ అలాగే నిలువు కాళ్ళమీద నిలబడి ఎదురు చూస్తూనే ఉన్నారు.....


* * *
దశరధ మహారాజు పుత్రిక శాంత. 
అంగదేశాధిపతి రోమ పాదుడు, అయోధ్యాధిపతి దశరధ మహారాజు మంచి మిత్రులు. 
దశరధుడు తన మిత్రుడైన రోమ పాదునికి, శాంతను దత్తత ఇచ్చాడు.
ఆనాటి నుండీ, ఆమె రోమ పాదుని ప్రేమాభిమానాలను పొందుతూ, అంగదేశములో నివసించసాగినది.
రోమ పాదుడు సాధు జనులను దూషిస్తూ తూస్కరించి, అగౌరవపరిచాడు. 
తత్ ఫలితంగా అంగదేశము అనేక సంవత్సరాలు వర్షాలు లేక కరువు కాటకములతో అల్లాడింది. 
రోమ పాదుడు మంత్రులు, మునులు, పురోహితుల సలహా అడిగాడు.
"మహా రాజా! విభాండక ముని కుమారుడు ఋష్యశృంగుడు. బాలుని వలె స్వచ్ఛమైన మనసు గల ఋష్యశృంగుడు అడుగిడితే, మన సీమ సుభిక్షమై, పాడిపంటలు వృద్ధి పొంది, కళకళలాడుతుంది"
ఆంతరంగీకుల, శ్రేయోభిలాషుల సలహాలను అంగీకరిస్తూ, వెనువెంటనే ఆచరణకు ఉపక్రమించాడు రోమ పాదుడు.
అనేక ప్రయత్నాలతో ఋష్యశృంగుని రప్పించగలిగాడు రోమ పాదుడు. 


ఋష్యశృంగుని అంగదేశ ప్రవేశము జరిగిన వెంటనే ఆ రాజ్యములో వర్షాలు పడ్డాయి. వానలు పడి, అంగదేశము పాడిపంటలతో వర్ధిల్లుతూ, విలసిల్ల్లుతూ ఉంటే
ప్రజలు ఆనందభరితులౌతూ, రాజును కొనియాడారు.


* * *
రోమ పాదుడు కృతజ్ఞతతో తన కుమార్తె శాంతను ఋష్యశృంగ మునికి ఇచ్చి పెళ్ళి చేసాడు.
శాంత సంతోషముగా ఋష్యశృంగుని అర్ధాంగి ఐ, అరణ్య వాసిని ఐనది. 
శాంత భర్తను సేవిస్తూ, పర్ణశాలలో ఆనందముతో జీవనము గడుపసాగినది. 
పతిదేవుడు ఋష్యశృంగునికి యజ్ఞ యాగాది కార్యక్రమాలలో అండదండగా ఉంటూన్నది. 
అనేక రాజ్యాలకు వెళుతూ ఋష్యశృంగుడు, తన విధులను నిర్వహిస్తూండేవాడు. 
ఆతని తపోబలము వలన అనేక దేశాలు సుబిక్షములైనవి. 
దశరధుని నుండి ఆహ్వానపత్రికలు అందినప్పుడు,అయోధ్యకు శాంత,ఋష్యశృంగులు వెళ్ళారు. 
మళ్ళీ అయోధ్యాపురి నుండి ఆ భార్యాభర్తలకు పిలుపు వచ్చినది.


"శ్రీ రామ పట్టాభిషేకము జరుగును.
తామెల్లరూ ఈ మహోత్సవానికి తరలిరావలసినదిగా కోరుచున్నాము,
భవదీయుడు దశరధుడు" 


దశరధుని ఆనతితో సుమంత్రుడు ఈ లేఖను కుమార్తెకు, అల్లునికీ పంపించాడు. 
ఋష్యశృంగుడు, పత్నితో బయలుదేరాడు. 
వారు ఇతః పూర్వమే ఇతర రాజ్యాలకు వెళ్ళి వచ్చారు. 
అందుచేత ప్రయాణ సామగ్రిని సర్దుకొనుటకు ఆట్టే తడబాటుపడలేదు. 
దర్భలూ,దర్భాసనాలూ, వల్కలములూ, వ్యాఘ్రాసన చర్మము,
పాదుకలూ మున్నగు సరంజామాతో ఇరువురూ బయలుదేరారు. 


* * *
ఋష్యశృంగుడు, శాంత అయోధ్యలోనికి అడుగు పెట్టారు.
వారి రాక తెలిసి, కౌసల్య, సుమిత్ర, కైకేయి, అంతఃపురములోని అతివలు 
ముని దంపతులకు ఎదురేగి, స్వాగతము పలికారు. 
దశరధుడు అల్లుడు ఋష్యశృంగునీ, పుత్రికామణి శాంతనూ ఆప్యాతగా పలకరించాడు. 
శ్రీరామ, లక్ష్మణ, శత్రుఘ్నులు, బంధువులు ప్రేమాభిమానాలతో 
క్షేమసమాచారములు అడిగుతూ, ముచ్చట్లు చెప్పారు. 
భక్తితో ప్రజలు "అమ్మా! శాంతా! సర్వోన్నతుడైన ఋష్యశృంగ మౌని పాదముద్రలతో
ఈ పుడమి సస్యశ్యామలమౌతూన్నది" అంటూ శ్లాఘించారు.
ఋష్యశృంగుడు, శాంత తన పతిదేవుని సజలనయనాలతో సంతోషాంతరంగిణి ఔతూ వీక్షించినది.
" సోదరుడు రామచంద్రుని పట్టాభిషేకమునకు ఇంక నాలుగు రోజులే ఉన్నవి,
ఏర్పాట్లు అన్నీ బాగుగా జరుగుచున్నవి కదా!?" మందస్మిత వదన నవ్వుతూ అన్నది.
"సోదరివి, నీవే శుభ అభ్యంగనస్నానమునకై, నలుగు పెట్టవలసిఉన్నది. 
మరి ఈ లేపన విద్య నేర్చుకున్నావా?" లక్ష్మణ సతి ఊర్మిళ సరదాగా అన్నది.
భరత, శత్రుఘ్నుల భార్యలు మాండవి, శ్రుతకీర్తి కూడా, పరిహాసోక్తులతో శృతి కలిపారు.


* * *
అందరూ చెప్పుకునే కబుర్లతో, చందమామ కూడా మేలమాడిన వెన్నెల వానలతో అయోధ్యలోని ఆ రాజభవనము మెలకువతో కళకళాలాడుతూండగనే, భళ్ళున తెల్లవారింది.
ఋష్యశృంగుడు, "శాంతా! తెల్లవార వచ్చెను, ఇక నిద్దుర లెమ్మని" తట్టాడు. 
ఋష్యశృంగుని సందడికి శాంత నవ్వుతూ 
"అసలు మాకెవ్వరికీ కనురెప్పలు అరముడిస్తేనే కదా, 
అందరమూ జాగరణములోనే ఉన్నాము లెండి!" అన్నది.
పరిచారికలు హడావుడిగా ఏమో గుసగుసలాడ్తూ, రహస్యంగా మాట్లాడుకుంటున్నారు.
"ఏమిటి చెలులూ! అలాగ చెవులు కొరుక్కుంటూన్నారు?" 
ఊర్మిళ నుడువులకు దాసీలు తటపటాయిస్తూ అన్నారు. 
"ఏమోనమ్మా! మాకు సైతమూ ఏమి జరుగుతున్నదో,
అసలేమి జరగబోతూన్నదో అర్ధము కావడము లేదు"


"అదేమిటి? ఎందుకా అలజడి మీలో ఈ పొద్దున?" 
మాండవి పదంపడి ప్రశ్నార్ధకమై నిలబడింది.
శ్రుతకీర్తి కూడా అదే ప్రశ్నను రెట్టిస్తూన్నట్లుగా. 
ఇంతులతో శాంత కూడా కుతూహలముతో, 
కొంత గాభరాతో ఆ సంభాషణను వినసాగింది.
"కైకేయీ మహలులోకి మంధర రుసరుసలాడ్తూ వెళ్ళింది.
ఏమేమి చాడీలు చెబ్తూన్నదో? ఏ కొంప ముంచబోతూన్నదో?" 
కౌసల్య కడ ఉండే పరిచారిక తనలోని వణుకును అణచిపెడుతూ చెప్పింది. 
మధ్యాహ్నము మందర ఎదురైతే, ఈమె రంగవల్లులను వేస్తూన్నది; మందరను ఎగతాళి చేసింది. 
ఎప్పుడైతే మందర కోపంతో విసవిసా నడుస్తూ, గునగునా వెళ్ళిందో 
అప్పటి నుంచీ ఈమె మనసు మనసులో లేదు. 
ఈమెకు అన్నీ దుశ్శకునాలే గోచరిస్తూన్నాయి, అందుకే ఇలాగ ఈమె బెంబేలు!!!!!
శాంత అక్కడ ఆ ఉదయం, ఆకాశం అరుణ వర్ణమౌతూ భీతిని కలిగిస్తూన్నది. 


* * *
ఝాము ఝాముకూ అందరిలో ఇదీ అని చెప్పలేని ఏదో గుబులూ, భయము ముప్పిరిగొనసాగాయి.
మంగళ తూర్యారావాలు ఉన్నట్టుండి ఆగిపోయాయి.కారణమేమిటి? అందరిలో ఒకే ప్రశ్న.
శాంత , ఋష్యశృంగు కారణమేమిటి? 
"మంగళ తూర్యారావాలు ఉన్నట్టుండి ఆగిపోయాయి.కారణమేమిటి?" అందరిలో ఒకే ప్రశ్న.


కైకేయి కోపగృహములో ఉన్నది. 
తన ముద్దుల మూడవ భార్యను అనునయించి,
ఆమె ఆగ్రహమునకు హేతువును అరయడానికై లోనికి దశరధుడు వెళ్ళాడు. 
ఇన్ని గంటలైనా బైటికి రానే లేదు, లోపల ఏమి జరుగుతూన్నదో ఎవ్వరికీ బోధపడడం లేదు. 
ప్రతి ఒక్కరూ "ఉత్కంఠ నిండిన రాగి కలశములలాగా ఉన్నారు." 
రాణివాసములలోనూ, ఆస్థానములోనూ, కోటలోనికీ 
ఆ  మాటకు వస్తే చక్రవర్తుల నివాసాలలోనికి భద్రతా కారణాల దృష్ట్యా 
ప్రవేశానికి అనుమతి లభించడం 
కొంత సంక్లిష్ట వ్యవస్థగా ఏర్పడిందనే చెప్పవచ్చును.


ఇప్పుడేదో అసాధార పరిస్థితి ఏర్పడబోతూన్నదని అందరి డెందాలలోనూ 
ఏదో వాటిల్లబోతూన్న కీడు గూర్చిన సంశయాలు పడగలెత్తుతూన్నాయి.
ఉన్నట్టుండి, కైకేయి నుండి "తనయుడు శ్రీరాముని రమ్మన"మని ఆదేశం.
మందహాస వదనుడు రాముడు ఆ కోపగృహములోనికి వెళ్ళాడు,
కొద్ది నిముషాల అనంతరము ఇవతలికి వచ్చాడు.
అయోధ్యాపురి భవితవ్యాన్ని మలుపు తిప్పిన విశేషము జరిగింది.


(పుట : 1)
******************;
పెదవులపైన చెరగని చిరు నవ్వులు ఆ నీలమోహనునికి పెట్టని ఆభరణములు!

అందుకే లోపల అంత లోపలలోనే జరిగినట్టి అయోధ్యాపురి భవితవ్యాన్ని మలుపు తిప్పిన ఆ విశేషము దాని బీజము ఎలాటిది? 
అందరితోపాటుగా శాంతకూ, ఆమె భర్తకూ కూడా అంతుబట్టడం లేదు. 
ఇవతలికి వచ్చిన ఇనకులాబ్ధి సోముడు "జననీ! నేను 12 ఏళ్ళు అరణ్యవాసము చేయవలెను, నన్ను ఆశిర్వదించండి!" 
కౌసల్య మాత్రమేనా? అక్కడున్న యావన్మందీ ఉలిక్కిపడ్డారు అనేకంటే దాదాపు మూర్ఛవస్థలో మునిగారనడమే సబబు.
ముని ఋష్యశృంగుడు కూడా,
అటవీ సీమలనుండి తన తోటి వచ్చిన ఇతర తాపసుల వైపు నిర్ఘాంతపడి, చూస్తూ నిలబడ్డాడు.


శాంత "ఇదేమిటి? స్వామీ! ఇలాగ ఎలాగ సంభవిస్తూన్నది? తాము భూత వర్తమానాలనే కాదు, భవిష్యత్ కాలమును కూడా తెలుప గల దార్శనికులు గదా?
ఇప్పుడు మనము చూస్తూన్నది వాస్తవమేనా? కల కాదు కదా?"


ఋష్యశృంగుని వద్ద సిద్ధ సమాధానములు లేని ప్రశ్నల వర్షమై 
ఆతని అర్ధాంగి శాంత తారట్లాడుతూంటే 
నిస్సహాయుడై శిలాప్రతిమ వోలె నిలబడ్డాడు ఋష్యశృంగుడు. 


* * *
కొంత తడవు గడిచాక అనేక సంఘటనా పరంపరలు పెను వేగముతో జరిగిపోయాయి,
సీతాదేవి, లక్ష్మణుడు కూడా నీలమోహనశ్యాముని అనుసరించారు.
"ప్రపంచములో ఎవ్వరైనా ఈ రీతిగా భోగ భాగ్యాలను తృణప్రాయముగా త్యజిస్తూ స్వచ్ఛందముగా, అరణ్యవాసమును మహదానందముగా స్వీకరించారా?" 
శాంత, ఋష్యశృంగులు తత్తరపడ్డారు,
ధరణీపుత్రి సీతాదేవి "నారచీరలను ఏ పద్ధతిలో కట్టుకోవాలి?" అని శాంతను అడిగింది. 
శాంత ఆమెకు నార చీరలను ఇచ్చింది. 
కళ్ళలో నుండి ఉబికి వస్తూన్న కన్నీళ్ళను అణచిపెట్టడం శాంత తరం కావడం లేదు.
క్రితం క్షణం దాకా తన నయన ద్వయిలో ద్విగుణీకృత శోభలతో రాణి ఆహార్యములో విరిసిన జానకీ సౌందర్యము ఇప్పుడు వల్కలధారణముకై తన కడ ఉన్నది? 
లాక్షణికులూ, వేదాంతవేద్యులూ, తార్కికులూ విధివిలాసమునకు ఇంతకు మించిన తార్కాణం ఎత్తి చూపగలరా? 


ఋష్యశృంగుని అవస్థ కూడా శాంత మానసిక కల్లోలానికి భిన్నంగా లేదు.
ఆ వైభోగ సీమలో అప్పటికప్పుడు సర్వసంగపరిత్యాగులు ధరించే వస్త్రాదులు దొరుకవు. 
శ్రీరామచంద్రుని వివేచనా పరిధి అత్యంత వైశాల్యమైనది.
తత్ క్షణమే శాంత, ఋష్యశృంగులకు "వల్కలధారణా నిమిత్తమై" కబురందినది.
సీతమ్మకూ, శ్రీరామచంద్రునికీ, తమ్ముడు లక్ష్మణునికీ ఋష్యశృంగ, శాంతలు వల్కలాదులు ఇచ్చారు.
చూస్తూండగానే పురవీధులన్నీ ప్రజల వేదనా ఘోషలతో నిండిపోయాయి. 
సకల జనవాహిని సంవేదనా సాగరములను దాటుతూ సీతా, రామ, లక్ష్మణులు వెడలిపోయారు.


* * *
అటు పిమ్మట దశరధుడు పరలోకగతుడైనాడు.
భరతుని మాతులుడు యుధాజిత్తు. 
భరతుడు తన మేనమామ యుధాజిత్ వద్దకు వెళ్ళి ఉన్నాడు. 
కేకయ రాజ్యము నుండి అయోధ్యకు తిరిగి వచ్చిన భరతుడు తల్లి కైకేయి అత్యాశకు ఖిన్నుడైనాడు. 
అన్న రాముని వెదుకుతూ వెళ్ళాడు.


సాకేత సార్వభౌముడు "తండ్రికి ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నాను" అని అన్నాడు. 
కొసకు భరతుడు ఆ స్థిర సంకల్పుని వేడగా అనుంగు సోదరుని ప్రార్ధన మన్నించి, శ్రీరాముడు పాదుకలను ఇచ్చాడు.
ఇచ్చిన పాదుకలు, ఆ పాదుకలకు, భరతుడు పూజిస్తూ, పట్టాభిషేకము చేస్తూన్నాడు.


శాంతకు ఇప్పటికీ "తాను సీతమ్మకు నారచీరలను కడుతూన్నప్పుడు కలిగిన భీతి, వణుకు" ఇంకా తగ్గనేలేదు. 
ఋష్యశృంగుడు "మేము పర్ణశాలనుండి తెచ్చుకున్న వృక్షముల (భూర్జ తరు) బెరడులు అవతారమూర్తుల మేని స్పర్శతో పునీతములైనాయి, ఔరా! విధి విచిత్రము ఇదే సుమా!" అనుకున్నాడు.
అనుకుంటూనే ఆ కుగ్రామములోని "శ్రీరామ పాదుకా పట్టాభిషేకము" తిలకిస్తూన్న ప్రేక్షకులలో ఋష్యశృంగుడు, తన ధర్మ పత్ని శాంత ఇరువురూ భాగస్వాములౌతూ, తాదాత్మ్య చిత్తులై, తిలకిస్తూ ఉన్నారు. 
;

విధి విలాసము - శ్రీరాముడు, శ్రీరామ పాదుకా పట్టాభిషేకము  (patrika.haaram.com)



రచయిత : కాదంబరి (కోణమానిని)         ప్రచురణ తేది: 3/30/2012 12:00:00 AM

My story:  మూడు తరాలు  in - my Blog - కోణమానిని-  గురువారం 7 జూన్ 2012
(మూడు తరాలు ; బామ్మ సణుగుడు విరామమెరుగని ఆమె గొణుగుడు సాగుతూనే ఉన్నది.)



కామెంట్‌లు లేవు:

ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు

"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...