30, జులై 2012, సోమవారం

షోకిల్లా విసనకర్ర


“వనితా వీవన” కు నిర్వచనం జపాన్ మహిళామణులు ఉపయోగించే 
షోకిల్లా విసనకర్ర.గాలి కూడా కందిపోతుందేమో- అనిపించేటంతగా – 
సుమ సుకుమారంగా, సుతారంగా, చేతులతో పట్టుకుని, 
సుతిమెత్తగా విసురుకుంటూ తిరుగాడుతూన్న వైనం 
మన కళ్ళకు కట్టిన బొమ్మలాగా కనిపిస్తుంది.


16 వ శతాబ్దం నుండి ఈ వీవన జాణ యూరోపులో వ్యాపించింది.
ఐరోపా ఖండంలో ఈ సొగసుల వీవన ప్రవేశించి, 
వారి సంఘములో అంతర్భాగమై పోయింది.
ఎంతగా ఐనదంటే- "మనస్తత్వ శాస్త్రపరంగా వర్గీకరణలు సైతం మొదలైనాయి.”
కోమలాంగులు ఏ ఏ డిజైన్లును , 
ఎలాటి బొమ్మలు, రంగులు ఉన్న వీవనలను వాడుతున్నారో, 
దాన్ని బట్టి వారి వ్యక్తిత్వాలను అంచనా వేయడం” -
క్రొత్త ప్రక్రియగా అభివృద్ధి చెందినది.
;
జపాన్ లలనల fan dance
ఈ వయ్యారి వీవన, పురాతన కాలం నుండీ 
తూర్పు ఆసియా దేశాలలో ప్రజల నిత్య జీవన సంప్రదాయంలో 
అవిభాజ్యంగా ఆదరించబడుతూన్నది అవడంతో- ఎక్కువ చరిత్రనే గడించింది. 
క్రీస్తు పూర్వం 2 నుండి చైనాలో వెదురు బద్దలతో చేసిన Hand Fans వాడుకలో ఉన్నాయి. 
వారు పక్షుల ఈకలను కూడా ఈ చేతి వీవనలు అలంకరించడానికి వాడే వారు.అంతేకాదు,

చీనీ పద్యాలను, నాలుగు పదాల జాతీయములను 
“చేతి వీవనల”పైన చక్కగా రాసేవారు.
క్రమంగా “చే వీవనల చిత్ర కళాకారులు” రాజ దర్బారులో గౌరవ స్థానాన్ని పొందేవారు. 
రాజ వంశీయుల నామావళి మున్నగు వాని యవనికలుగా అమరినవి. 
అలాగే హోదా, లింగ భేదము, వృత్తి- లను స్ఫురింపజేసే 
వివిధ hand fans వచ్చాయి. నాట్యం చేసే సందర్భాలకు 
స్పెషల్ డిసైన్ లతో వీవనలు ఉపయోగానికి వచ్చాయి.
వీనిలోని పల్చటి బ్లేడులు, 
వాని సంఖ్య- డిజైన్లు ,రాజాస్థాన, అధికారుల, ఉద్యోగుల హోదాలను, స్థాయిలను 
ప్రతిబింబించే అంశాలుగా మార్పు చెందినవి.
(అంటే ఉదాహరణగా – పోలిసుల షర్ట్, కోటు – డ్రస్సుల మీద బాడ్జిల వలె అన్న మాట)


చైనాలోనూ, ఆ మాటకు వస్తే భారత దేశంలోనూ “కర వింజామరలు” వాడబడ్తూండేవి.
6,7, 8 వ శతాబ్దాలలో “మడత విసన కర్రలు” రూపొంది, వారి సంస్కృతిలో లీనమైనవి. 
జపాను తాపసి “చోనెన్”(Chonen)  “హియొగీ”, “కవహొరి”  అనే వీవనలు చేసాడు.
వాటిని చోనేన్ ఎంతో నేర్పుతో తయారుచేసాడు. 
ఇరవై (20) పలుచని చెక్క బద్దలతో హియొగీ, 
రెండు కాగితపు విసనకర్రలను (kawahori hogi) లను చేసాడు.
ఆ ముని 988 లో చైనా చక్రవర్తికి వీటిని బహుమానంగా ఇచ్చాడు.


11 వ శతాబ్దంలో కొరియా వాసులకు కూడా బాగా నచ్చడంతో, 
ఆ ప్రజలు కూడా వీటిని “కానుకలు”గా ఇచ్చి
షోకిల్లా విసనకర్ర పుచ్చుకునే ఖరీదైన కానుకలుగా 
తమ సమాజంలో వాడుకలోనికి తెచ్చారు.
అటు పిమ్మట పోర్చుగీసుల ప్రమేయంతో
పాశ్చాత్య దేశాలలో కొత్త హాబీగా నిలద్రొక్కుకున్నది.
Folding Fan ( మడత విసనకర్ర ) అనగానే 
అందరికీ “జపానీయులు”, Japan country గుర్తుకు వస్తారు.


మడుపు వీవన- జపాన్ దేశీయుల పవిత్ర సంకేతంగా స్థిరపడిందీ- అంటే అతిశయోక్తి కాదు.


జపాన్ సంప్రదాయానికీ, ఫోల్డింగ్ ఫ్యానుకూ అవినాభావ సంబంధం ఏర్పడింది. 
జపాన్ లోకి పాశ్చాత్యులు అడుగుపెట్టాక, 
ఆ పడమటి సీమల జనాన్ని ఈ విసనకర్రలు ఆకర్షించాయి. 
western country వారికి ఇది నచ్చగానే,
సముద్రాలు దాటి,  (Europe continent) యూరోపు ఖండములో కూడా 
ఈ ఫోల్డింగ్ ఫాను ఒక ఫ్యాషన్ లాగా అతి శీఘ్రముగా వ్యాప్తి గాంచింది.


794- 1185 లలో జపాన్ లో “Heian period”లో 
ఈ వయ్యారి వీవన- చైనా (Sung Dynasty కాలము నుండీ) లో
ప్రాచుర్యంలోనికి వచ్చినది.
15 వ శతాబ్దంలో పోర్చుగీసు వారి వలన 
పాశ్చాత్య ప్రపంచం వారికి, యూరోపు ఖండములో
ఈ జపాన్  వన్నెల విసనకర్ర పరిచితమైనది.


ఈ రీతిగా అది- జపాన్ దేశానికి  
సంస్కృతీ పరంగా ప్రత్యేక గుర్తింపును తీసుకువచ్చింది.  
చరిత్ర ప్రకారం- జపాన్ వీవన-కు మూలం తాటాకు రూపము.
palm leaf shape దీనికి పునాది. 
నిజానికి శీతల దేశం ఐన జపాన్ లో 
ప్రాచీనులు ఎండ తాకిడికి తట్టుకోలేక ,
విసనకర్రలను ఆశ్రయించడమే-
వీటిని కనిపెట్టే మూల హేతువు. 
అంత దాకా ఎందుకు? 
మన దేశములో సైతము విసనకర్రలు ఉన్నవి.
తాటాకులతో, చొప్పదంటు బద్దలతోనూ, ఈతాకులతోనూ, 
నెమలి ఈకలు కూర్చినవి  చేసే వారు. 
చొప్పదంటు చీలికతో చేసిన వాటిని చుట్టూ 
బార్డర్లలో సిల్కు గుడ్డలతో రిబ్బను కుచ్చులలాగా కుట్టి, 
అలంకారంగా గోడలకు తగిలించి ఉంచే వారు.
స్యుహిరో (Syuhiro) అనే మరొక పేరుతో వ్యవహారంలో ఉన్నది-
అనగా “కొస దాకా విసృతమైనది” అని అర్ధం.


జపానీయుల పూర్వీకులు ‘మడత ఫ్యాను’ను 
కేవలం ఉపయోగ వస్తువుగానే కాక, 
‘అది తమ భాగ్యమునకు, ఉజ్జ్వల
భవిష్యత్తుకు ప్రతీకగా ‘భావించసాగారు.
అందుకనే అవి కళాత్మకతను మేళవించుకుని, 
ఆకర్షణీయ పద్ధతిలో అభివృద్ధి గాంచినవి.


కామకురా (1185-1333) రాజ్య పాలన నుండీ , 
వీనిపై ప్రత్యేక ఆసక్తి ఆ “సూర్యోదయ దేశము”లో మొదలైనది.


అటుపిమ్మట మ్యూరోమచ్ కాలం (Muromach period) లో 
జపాన్ మడత వీవనలు అందమైన రూపురేఖలను ఇనుమడించుకున్నవి.


వాని పైన బొమ్మలలోని వర్ణాలు, 
Design లలో లయబద్ధత ,లతా తరు పుష్ప ఫలాదులు, 
ప్రకృతి సౌందర్యాలతో వీవనలు విప్పారినవి.
ఈ సుందర చిత్ర మాలికలకు తర్వాతి కాలాన మరింత విస్పష్టత ఏర్పడినది.


17 వ శతాబ్దము నుండీ ప్రపంచ దేశాల దృష్టిని ఆకట్టుకునేటంతగా సొగసులీనసాగినవి.
తవరాయ సొతాత్సు ఈ మేలిమలుపునకు కారకుడు.
ఈ జపాన్ పెయింటర్లు, వీవన నిర్మాతలు ముఖ్య కేంద్ర బిందువులు ఐనారు. 
ఇంత పెద్ద మలుపును తెచ్చిన సోపాన దశ 
"ఎడో పాలనా కాలంలో ”( Edo period, 1603-౧౮౬౮) ఏర్పడినది.
హస్త వీవనలలో ఈ పెను పరిణామము – వానికి చరిత్రను సృష్టించినది.


ఈ నాడు అవి షింటో మతాచార్యులు (Shinto Priests) వీనిని ధరిస్తున్నారు. 
అలాగే పండుగలు, పరిణయ శుభ వేళలలో జపాన్ రాజు, రాణీల  చేతులలో 
ఈ “లహరీ వీవనలు”అర చేత అలంకరణలుగా, 
సంప్రదాయ దర్ప సూచికలుగా ధరిస్తున్నారు.


వీటిలో డాంబికంగా ఉండేవి, సింపుల్ గా ఉండేవీ సైతం ఉన్నవి.


“హరిసెన్”(Harisen Fan) లు


సాదా పేపర్ ఫ్యాన్సు, “హరిసెన్”(Harisen) లు, 
ఆబాలగోపాలానికీ ఇప్పుడు సుపరిచితాలే! 
ఎందుకంటే, గ్రాఫిక్, యానిమేషన్ పిక్చర్సులో, కామిక్ నవలలో  
ఈ హరిసేన్లు సర సరా విసిరే కామెడీ ఆయుధాలుగా ప్రత్యక్షమౌతున్నాయి కాబట్టి.


                               - కాదంబరి


**************************


షోకిల్లా విసనకర్ర April 2012
Posted on April,2012 by విహంగ
This entry was posted in వ్యాసాలు. Bookmark the permalink.

28, జులై 2012, శనివారం

Viswamitra Information, Videos, Pictures and News

Viswamitra Information, Videos, Pictures and News:

'via Blog this'

Happy Birth Day! మిల్ డ్రెడ్!- పాట నేపథ్యము


Kentucky sisters














ఆ మూడు ఇంగ్లీషు పాటలు గిన్నీస్ రికార్డుల గద్దెను అధిరోహించినవి. 
అవి ఏమిటి? సింహావలోకనము చేద్దామా!?


అమితంగా పాప్యులర్ ఐన ఆ పాటలు ఇవి:


1) "Happy Birth Day to you! Happy Birth Day to you!"
2)  Auld Lang Syne’;
3) ‘For He's a Jolly Good Fellow.’


మ్యూజికాలజిస్ట్ ఐన మిల్ డ్రెడ్ కంపోజ్ చేసిన 
"హ్యాపీ బర్త్ డే టు యు" పాట, 
పుట్టినరోజు నాడు జేజేలు పలుకుతూ 
ప్రపంచవ్యాప్తంగా ఆత్మీయతల కలబోతల శుభాకాంక్షలను 
ఈనాటికీ పంచిపెడ్తూనే ఉన్నది.


మిల్డ్రెడ్ జె.హిల్ (1855 - 1916)లో లూస్ విల్లె లో - జూన్ 27, 1855 జన్మించింది. 
ఆమె చెల్లెలు ప్యాటీ స్మిత్ హిల్. 
ప్యాటీ హిల్ పాటను రాస్తే, మిల్ డ్రెడ్ దానికి ట్యూను కట్టినది. 
ఆ మ్యూజిక్ తమాషా అంతా 1893 లో జరిగింది.


"Good morning to all" అనే ఆ పాటను 
తర్వాత ప్యాటీ హిల్ పుస్తకమును  ప్రింట్ చేసి అందులో చేర్చినది. 
"Childrean's songs"లో చేర్చింది ప్యాటీ హిల్. 
ప్రతిరోజూ విద్యార్ధులు ఈ పాటను పాడుతూ ఉండేవాళ్ళు. 
తర్వాత అదే ట్యూనుతో "జన్మ దిన శుభాకాంక్షలు"  చెప్పే పాటను 
తమ టీచరు సహకారముతో కూర్చారు! 
అదే "హ్యాపీ బర్త్ డే టూ యూ!"
ఆ క్షణాన తమ గళములను కలిపిన ఆ చిన్నారి చిట్టి పాట 
భావి కాలాన అనంత ప్రజాదరణను గడిస్తుందని 
ఆ రోజు అక్కడ ఉన్న వారు అనుకుని ఉండరు.


ఒక నెల ఆలస్యంగానైనా హ్యాపీ బర్త్ డే సృష్టికర్తకు -
"బిలేటెడ్ బర్త్ డే Wishes చెబుదామా...."

హ్యాపీ బర్త్ డే టు యూ!
హ్యాపీ బర్త్ డే టు యూ! 
హ్యాపీ బర్త్ డే Dear మిల్ డ్రెడ్! 
హ్యాపీ బర్త్ డే టు యూ!"


హ్యాపీ బర్త్ డే టు యు - మిల్డ్రెడ్ జె.హిల్ (Link- Awakaaya.com)
User Rating: / 1 
Member Categories - తెలుసా!
Written by kadambari piduri   
Friday, 27 July 2012 14:48 


visitor Number : 00046976;  Konamanini
;Comments:- 
#1 BHASKAR — the tree 2012-07-27 19:31
good thing to know, thanks.
;

25, జులై 2012, బుధవారం

ఆ నై వా ఈ ?????


దిక్కులు- "విదిక్కులు

;


ఆ నై వా ఈ - ఈ అక్షర బంధాలు విన్నారా? చూసారా? 
వాస్తు శాస్త్రములో, భూగోళ, నైసర్గిక శాస్త్రాలలో వీటికి విస్తృత పరిధిలో  ఉపయోగించబడుతూంటాయి. పాత తరమువాళ్ళు ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి. 
"పెద్దబాలశిక్ష", "చిన్న బాలశిక్ష", పాఠశాల తెలుగు వాచకములలో ఉండేవి. 
బాల బాలికలకు ఖచ్చితంగా తెలిసితీరాల్సిన ముఖ్య అంశాలుగా  పరిగణించేవారు.


నేను రాసిన "అజిబీధ- పపా - విశ్వేసకి", పింగళి - 
అనే వ్యాసము తర్వాత 
ఇలాంటి ఆలోచన వచ్చింది. దేశ దేశాల్లో, 
అనేక భాషల్లో, చిట్టి అక్షర రత్న కాంతులలో, 
విస్తార వర్ణకాంతుల భావాలు పరిశీలనలకు అనువైనవి.


ఇంతకీ - ఆ నై వా ఈ - అంటే ఏమిటబ్బా?


*********          
చిట్టితమ్ముడు; అనే సినిమా - 1962 లో విడుదల ఐనది. 
కె.బి. తిలక్ దర్శకత్వము వహించిన ఈ మూవీలో 
(ఆలివర్ ట్విస్ట్ - అనే చార్లెస్ డికెన్స్ నవలా థీమ్ ఆధారము). 
ఈ తెలుగు చలనచిత్రము లో ఒక హిట్ సాంగ్ ఉన్నది.


"దిక్కు లేని వారికి దేవుడే దిక్కు 
ఆ దేవుడెలా ఉంటాడో తెలీదు అదే కదా చిక్కు"


"నీవే దిక్కు భగవాన్!" ఇంటికి పెద్ద దిక్కు, 
దిక్కూ మొక్కూ లేని, దిక్కు తెలీక, దిక్కు తోచని; 
దిశా నిర్దేశము చేయుట; ..... మున్నగు పద, జాతీయ, సామెతలు 
మన తెలుగు భాషలో ఉన్నవి.


********  
ఆ నాలుగక్షరముల కథా కమామిషూలను సింహావలోకనము చేద్దామా! 
ఇంతకీ - ఆ నై వా ఈ - అంటే ఏమిటబ్బా ?!?


NEWS అనగా "వార్తలు". నెల నాలుగు చెరగులా జరిగే 
సంఘటనల సమాహారములే న్యూస్/ వార్తలు.


"NEWS"= north, East, West, South -----> "NEWS"


********* 


"తూర్పు, పడమర, ఉత్తరము, దక్షిణము" అని మనము చెప్పుకుంటాము. 
వీనికి "దిక్కులు" - అని పేరు. (వీనిని సులభంగా గుర్తు ఉండడానికి  
"తూ - ద - ప - ఉ "  అనే "లిపి బంధము"ను కొండగుర్తుగా అట్టిపెట్టవచ్చును) 


ఐతే "విదిక్కులు" అనే పదము కూడా ఉన్నది. "విదిక్కులు" అంటే ఏమిటి
విదిక్కులు అనగా అష్ట దిక్కులలో పై నాలుగు-  వాటి మధ్యన ఉన్న 
తతిమ్మా నాలుగు దిక్కులు.


ఆసియా ఖండ దేశముల సంస్కృతిలలో  ప్రాగ్ దిశకు అత్యంత ప్రాధాన్యత ఉన్నది. 
అందుచేత మన దేశములో దిశల  పట్టిక 
సూర్యుడు ఉదయిస్తూ ఉండే "తూర్పు"తో ప్రారంభము ఔతుంది.


ప్రభాత ఉదయానికి సింహాసనం ఐనట్టి ప్రాచీ దిశను మొదట చెప్పి, 
మిగతా దిక్కులను ఆ వెనువెంట అనుసంధానిస్తారు. 
తూర్పు, పశ్చిమ దిక్కు/ పడమటి దిక్కు; ఉత్తరము, దక్షిణము అనే 
ఆ నాలుగు దిక్కుల నడుమ- "ఐ మూల" గా ఉన్న వాటికే 
"విదిక్కులు" అనే చిహ్నములు. 
ఆగ్నేయ, నైఋతి, వాయువ్యము, ఈశాన్యము- ఇవన్న మాట "విదిక్కులు".
ఈ చతుష్ పదముల ఫస్ట్ లెటర్సు ని - వరుసగా పేర్చితే - ఏర్పడిన నవ పదమే "ఆ- నై - వా - ఈ"-.
మళ్ళీ ప్రథమ పంక్తిని, తొలి వాక్యాల దరికి వద్దాము.
ఆ నై వా ఈ   - ఈ సంజ్ఞల విసృతి చాలామందికి తెలిసినవే! 
కాస్తో కూస్తో పంచాంగ, ఖగోళ, వాస్తుశాస్త్రాల పరిచయ లబ్ధిని పొందిన వారికి 
తటాలున స్ఫురించేఉంటుంది.


ఆ నై వా ఈ - లను గుండ్రని చక్రాకృతిలో బొమ్మను గీసి చూడండి. 
ఆ నడిమి నాలుగు దిశలు అంటే దిశా చక్రమును వేయాలి. 
అందులో వాటి మధ్యన - విదిక్కులునుగా రచిస్తే వరుసగా
ఈ కింద పేర్కొన్న విధానమును పొందుతున్నవి


కుడి నుండి ప్రదక్షిణ దిశగా 
తూర్పు- ఆగ్నేయ; 
దక్షిణము - నైఋతి; 
పడమర - వాయువ్యము; 
ఉత్తరము - ఈశాన్యము ఔతూన్నవి.


అనగా ఇందాకటి వలె - ఒక్కొక్క దిక్కుకు  - ఒక్కొక్క గ్రహమును - 
కేటాయించారు మన పెద్దవాళ్ళు. 
ఆ సమాచారము అనేక గ్రంధాలలో వివరణలు ఇవ్వబడి ఉన్నవి. 


లోకాస్సమస్తాస్సుఖినో భవంతు! శుభం!




******


సముద్రయానము చేసే వారు, కొండలనూ పర్వతములనూ ఎక్కే వాళ్ళు 
ఉపయోగించే "దిక్సూచి" - లో దిక్కులకు, విదిక్కులకు గుర్తులను ఉంచుతారు. 
వీనికి అదనముగా, వీటితో పాటే మరి ఎనిమిది దిక్కులు కూడా గుర్తులుగా ఉంటాయి. 


వానిని - విదిక్కులు- కు ఇరు వైపులా రాస్తారు.




North,                North East, 
East,West,            South East;
North ;               North West,
South ;                 South  West 


అంటే  వరుసగా 16 డిగ్రీల నామావళి"కంపాస్" లో పరిగణనలో ఉంటున్నవి. 
360 డిగ్రీల స్థానాలను వేటికి అవి విభజనలుగా వ్యవహారములో ఉన్నవి. 
నావికులు, పర్వతారోహకులు, దిక్సూచిలను ఉపయోగించే వాళ్ళు 
ఇతరులతో చెప్పేటప్పుడు 
"మనము 234 డిగ్రీలు NNE (= North- North East)దిశలో ఉన్నాము". 
ఇలాగ అన్న మాట వారి విపులీకరణలు ఉంటూంటాయి. 
దిశాంతాల కొలతలను కొలిచే పరికరములను 
విజ్ఞాన ప్రపంచ నేతలు, శాస్త్రవేత్తలు కనిపెడుతూనే ఉన్నారు. 
అహరహమూ శ్రమిస్తూ, 
ఆధునిక జగత్తు పురోభివృద్ధికి వారు అందిస్తూన్న 
సౌలభ్యతలు, సౌకర్యాలు ఎంతో గొప్పవి. 

ఆ నై వా ఈ ఆ నై వా ఈ  
User Rating: / 1 
Member Categories - తెలుసా!
Written by kusuma   
Sunday, 22 July 2012 15:59
;

21, జులై 2012, శనివారం

బాల అరవింద ఘోష్


అరవింద ఘోష్ మేమమామ జోగీంద్ర కాస్త సరదాగా ఉండేవాడు. 
ఒకసారి జోగీంద్ర ఒక అద్దమును తెచ్చాడు. అతను ఆ mirror ని 
అరవింద ఘోష్ ఎదుట పట్టుకుని నిలబడ్డాడు.
"ఇదిగో ఇక్కడ కోతి, చూడు! చూడు!" అన్నాడు నవ్వుతూ.
బాలుడైన అరవింద ఘోష్ వెంటనే అద్దము వెనకకు తొంగిచూసాడు. 
ఆ మిర్రర్ వెనక నిలబడి ఉన మామయ్యను చూస్తూ తాను కూడా చెణుకు- ను విసిరాడు.
అచ్చోట స్టడీగా అద్దమును గట్టిగా పట్టుకు నిలబడి ఉన్నది ఆ జోగీంద్ర మామ కదా!
బాల  అరవింద ఘోష్ " అదిగో, అక్కడ కూడా వానరము ఉన్నది.
గ్రేట్ అంకుల్! గ్రేట్ మంకీ! పెద్ద మామయ్య! పెద్ద కోతి!" 
("బడో మామా, బడో బానర్!") అంటూ 
చప్పట్లు కొడుతూ పకపకా నవ్వేసాడు.


"Great uncle, great monkey! Bado māmā bado bānar!" 




************************************


 అరవింద ఘోష్ ఆగస్ట్ 15 1872 లో జన్మించాడు.
(15 August 1872 - 5 December 1950 )
అరవింద ఘోష్ మేమమామ జోగీంద్ర ;
అరవింద ఘోష్ తండ్రి కృష్ణ ధన ఘోస్. 
డాక్టర్ క్రిష్ణ ఘోష్ నిరీశ్వరవాది. 
ఇంగ్లీషు భాషనూ, పాశ్చాత్య సంస్కృతినీ అభిమానించేవాడు.      
విపరీతభావావేశాలు గల జనకుని పెంపకములో- 
ఒక వింత వాతావరణము ఏర్పడినది. 
అరవింద ఘోష్, అతని సోదరులూ ఇంగ్లండులో చదివారు.
అరవింద ఘోష్ చిన్ననాటి అనుభవాలలో గుర్తుంచుకోదగినవి 
కొన్ని మాత్రమే తీపి గురుతులుగా ఆతని స్మృతిపథములో నిలిచాయి. 
చిన్ననాటి మధుర  జ్ఞాపకములలో పైన పేర్కొన్నది ఒకటి.
   
+++++++++++++++++++++++++++++++++++++++++


బాల  అరవింద ఘోష్ : Link For matter

శ్రీకృష్ణుడు పురాణపురుషుడు


శ్రీకృష్ణుడు పురాణపురుషుడు, ప్రజల అభిమానాన్ని సంపాదించి, 
దైవస్థానాన్ని పొందిన అద్భుత వ్యక్తి. !!!!!
శ్రీకృష్ణుని ప్రాచీనతనునిరూపించే ఆధారాలు అనేకం దొరికాయి. 
ఆ ఆధారాలను కనుగొని, వెల్లడించినది 
విదేశీయులే అవడము చెప్పుకోదగిన విశేషమే!
(Sir William Jones’ studies )  సర్ విల్లియం జోన్స్ 
అధ్యయనములు మున్నగునవి 
భగవంతునిగా సుప్రతిష్ఠుడు ఐనట్టి 
"శ్రీకృష్ణుడు- అత్యంత ప్రాచీనకాలమునాటివాడు" తేటతెల్లము చేస్తూన్నవి.
-శ్రీకృష్ణుని- అత్యంత ప్రాచీనతను, వైష్ణవము పురాతన కాలము నుండీ 
ప్రజాబాహుళ్య ఆకర్షణా మతముగా - సుస్థిరమైనది. 
ఈ విశేషాలను 3-4 శతాబ్దములనాటి 
క్రీస్తుపూర్వ నాణెముల ముద్రలు - ఋజువు చేస్తూన్నవి
ఆఫ్ఘనిస్తాన్, సోవియెట్ రష్యాసరిహద్దులలో  "ఐ-ఖనం" అనే ప్రదేశములో 
అన్వేషణ జరిపారు.
ఆ సర్వేను చేసిన పరిశోధకుడు "పి.బెర్నార్డ్ "ఫ్రెంచ్ ఆర్కియలాజికల్
(P. Bernard and a French archeological expedition) అన్వేషకులు. 
వారిని (antiquity of Krishna worship in India) ఆకర్షించిన అంశము -
"భరతవర్షములో శ్రీకృష్ణ ఆరాధన ఎంత ప్రాచీనమైనది? "     
Ai-Khanum వద్ద ఆరు కంచు నాణెములు త్రవ్వకములలో లభించినవి. 
ఆ రెక్టాంగులర్ కాయిన్లు 180-165 బి.సి. నాటివి అని బోధపడినది.  
 Indo-Greek ruler Agathocles (180?-?165  BC).  
దీర్ఘ చతురశ్రముగా ఉన్న 6 కంచు (bronze) కాయిన్స్ లభ్యమైనవి.  
అవి అగాథాక్ల్స్ - అనే ఇండో గ్రీకు పాలకుడు జారీ చేసిన
దీర్ఘ చతురశ్రముగా ఉన్న 6 కంచు (bronze) కాయిన్స్
(six rectangular bronze coins (180?-?165 BC)  గొప్ప చారిత్రక సంపద.
ఆ ఆరు నాణెములపైన గ్రీకు, బ్రాహ్మీ అక్షరములు కలవు. 
ఆ రెండు భాషల లిపితోపాటుగా విష్ణుమూర్తి/ వాసుదేవ బొమ్మ ఉన్నది.
ఆ ప్రతిమ హస్తములలో చక్రము, శంఖము ఆకారపు వస్తువు ఉన్నవి. 
వైష్ణవ మతములో ఆరాధించే "శ్రీ విష్ణుమూర్తి"  శంఖ, చక్ర, గదా, పద్మములను ధరించును. 
వీనిలోని రెండు చిహ్నములు- ఐన శంఖ, చక్రముల ధారణ-  వలననే 
'ఈ బొమ్మ విష్ణువుది!'- అనే అభిప్రాయానికి ప్రత్యక్షనిదర్శనము. 
అక్కడ దొరికిన మరో - "అగాధో క్లిస్- కాయిన్" "(Agathocles (180?-?165 BC) పైన 
"హలమును ఎత్తి పట్టినట్టి బలరామదేవుని చిత్రము, 
అలాగే పరమేశుడు, దుర్గాదేవి, కుషాణ ప్రభువైన రెండవ కనిష్క చక్రవర్తి బొమ్మ, 
3-4 శతాబ్దములనాటి కాయిన్- బ్రహ్మదేవుని వదనము కలది- 
చారిత్రక శోధనకు అమూల్యముగా దొరికినవి. 


*****************************************************:


దర్గా పీర్ రత్తన్ నాథ్- కాబూలులో ఒక విగ్రహము ఉన్నది. 
ఆ పాలరాతి బొమ్మ పీఠముపై ఇలాగ రాసి ఉన్నది.
"మహా వినాయకుని ఘన సుందర మూర్తి"- అని పీఠముపైన చెక్కబడి 
ఉన్న ఆ మార్బుల్ ప్రతిమను "షాహి రాజా ఖింగలుడు" ప్రతిష్ఠితమొనర్చెను. 
ఆఫ్ఘనిస్తాన్ లో 5వ శతాబ్దికి చెందిన ఈ బొమ్మ గర్దెజ్ అనే చోట లభించినది.




(మెగస్తనీస్ - గ్రీకు దేవుడైన హెరాక్లిస్ - కృష్ణుడు పర్యాయ పదములుగా భావిస్తూ- "  
"యమునా నదీ ప్రాంతాలలో శ్రీక్రిష్ణుడు పూజ్యనీయుడైనాడు" అని లిఖించాడు)


స్వామి బి.జి. నరసింఘ ఇలాంటిఅనేక విశేషాలను తన వ్యాసములలో చెప్పారు.


ఆధారములు:-


శ్రీ కృష్ణ 
image of Vishnu, or Vasudeva, carrying a Chakra,
a pear-shaped vase/ conchshell,                                    
Indo-Greek ruler Agathocles (180?-?165B.C.).
(six rectangular bronze coins issued by the Indo-Greek ruler  #

17, జులై 2012, మంగళవారం

దర్జీ కథ (Tailor)


లేడీస్ టైలర్ Ladies' Tailor 1985

వంశీ (/జె.వి.కె. నారాయణ రాజు) దర్శకత్వంలో 
రాజేంద్రప్రసాద్, శోభన, శుభ- లు నటించిన 
 "లేడీస్ టైలర్" చలన చిత్రము- 
1985లో రిలీజ్ ఐనది.
;
"లేడీస్ టైలర్" సినిమా అందరికీ తెలిసినదే! 
;
టైలర్ అనగానే చెవిలో పెన్సిలు, చేతిలో కత్తెర, 
మనిషి దేహపు కొలతలను తీసుకోవడానికి టేపు,  
సైజుల వారీగా కొన్ని కుట్టిన బట్టలు 
పక్కన కుప్పలుగా ఉన్న దృశ్యము 
మన మనోయవనికపై ప్రత్యక్షమౌతుంది.
కొంచెం పోష్ గా, సిటీలలో షాపులలో 
గాజుతలుపుల మధ్య- 
అలమార్లలో- హ్యాంగర్ లకు తగిలించిన గుడ్డలు గుర్తుకొస్తాయి. 
అలనాటి స్వర్గసీమ ఇత్యాది మూవీలలో స్త్రీలు 
ఇంట్లో కుట్టు మిషనుపై టకటకా గౌనులూ వగైరాలను కుట్టేస్తూ, 
తమ పిల్లలను పెంచి, పెద్ద చేసిన ఉదంతాల ఇతివృత్తాలు, ప్రేక్షకులను ఆకట్టుకుని, 
రజతోత్సవ, స్వర్ణోత్సవాలు జరుపుకున్నవి.  
ఇంతకీ చెప్పొచ్చేదేమిటంటే- Tailor అనే మాటకు ఇంకో పదాన్ని ఊహించగలరా? 
ట్రై చేస్తారా మరి?! 
దర్జీ - అనే పదమును మీరు వినేఉంటారు.
దర్జీ - (Darzi or Darji) అనే పదమును మీరు వినేఉంటారు. 
దశాబ్దంక్రితం ఈ మాట వాడుకలో ఉండేది. దర్జీ అంటే టైలర్ ( tailor) అని అర్ధము. 
పర్షియన్ మాట- "దర్జాన్" నుండి - దర్జాగా వచ్చినది "దర్జీ". 
దర్జ్= అనగా కుట్టుట. {darzan - seam }
సంస్కృతములో సూది- ని సూచీ- అని అంటారు.
(సూచించుట; దిక్సూచి, సూచ్యగ్రము- మున్నగునవి- 
సూచన, సలహా= అనే భావముతో ఉన్నవి)  
सुचिकार  అన్నచో -  సూదిపని వాళ్ళు అని బోధపడ్తున్నది.   
************************************;                                 
రాజస్థాన్ లో యుద్ధ వీరులు ఐన రాజపుత్రుల  (Rajputs warriors) 
గాథా సంబంధముగా "సూచీకార వృత్తి" (Peepaji and Namdeo) ప్రసావనలో ఉన్నది.
పరశురాముడు ప్రతీకార గాథ విలక్షణమైనది. 


ఆతను పరశువు చేబూని 
పగను తీర్చుకోవడనికి ముందుకు నడిచాడు. 
వరుసగా క్షత్రియ ప్రభువులను దునుమాడసాగాడు. 
(శ్రీమహావిష్ణువు యొక్క దశావతారములలో 6 వ అవతార్ "పరశురాముడు")
(Parshurama (Rama with an axe, 6th incarnation of Vishnu) 
was destroying the Kshatriya (also known as the Rajput people)
క్షత్రియ సైనికులలో ఇద్దరు అన్నా తమ్ముళ్ళు పారిపోయి,  
తలదాచుకోవడానికై- ఒక కోవెలకు చేరుకున్నారు.
వారికి అక్కడ పూజలు చేయ వచ్చిన అర్చకస్వామి కనబడ్డాడు.
ఆ అర్చకుడు కూడా వాళ్ళను చూసాడు.
 భయంతో వణికిపోతూన్న సహోదరులు ఇద్దరూ పూజారిని "శరణు"వేడారు.
ఆ ఇరువురూ ఒక పూజారిని వేడుకున్నారు. 
కరుణార్ద్రహృదయుడు ఐన అర్చకస్వామి- 
వారిని దాక్కోవడానికి జాగా చూపించి రక్షించాడు.
అటుపిమ్మట, భక్తులుగా మారిన సోదరద్వయము 
"దైవసేవలో తరించే సాధనమార్గమును నుడువండి, స్వామీ!" 
అనీ చేతులు కట్టుకుని వినయ విధేయతలతో పృచ్ఛ చేసారు.
పూజారి గర్భగుడిలోని భగవంతుని విగ్రహమును వారికి చూపిస్తూ  పలికాడు 
"చిప్పీ! అలాగైతే ఈ ప్రతిమకు "దుస్తులను కుట్టి, అలంకరించు" 
అదే రీతిలో రెండవ వానికి పని అప్పచెప్పాడు. 
"నీ అన్న తయారుచేసిన వస్త్రాలకు అద్దకము చేసి, మంచి మంచి 
రంగులతో శోభిలేటట్లుగా- దైవ విగ్రహాలంకరణను చేయుమోయీ!"
అలాగ "షిమ్మీ" అనే మనిషి మొదటి సూదిపనిని ఉపాధిగా గైకొనే వారికి 
ఆదిపురుషుడు ఐనాడు. 
షిమ్మీ- అన్నదే క్రమేణా ఉచ్ఛారణా పరిణామములో
- చిప్పీ- గా మారినది. సూచీకారులకు - చిప్పీ -  
మూలపురుషునిగా గౌరవ స్థానమునార్జించెను.
************************************; 
దర్జీ పదమునకు-  సామాన్యముగా కొన్ని మాటలు 
సమానార్ధకములుగా ఉపయోగిస్తున్నారు. షింపీ, హిప్పీ, సుజీ, 
(హిందీలోని స్యూయ్) మవి,  కుట్టుపనివారు మున్నగునవి కలవు.
ఐతే అందరికీ తెలిసినదే- "టైలర్" ఈ నాడు మనకందరికీ కంఫ్యూజన్ 
చేయకుండా అర్ధమౌతూన్న నామము, సంబోధనా నామ వాచకము. 
కర్ణాటక రాష్ట్రములో భావసార క్షత్రియులు వీరు- అని తలపు. 
గృహనామములు(= surnames ) కన్నడప్రాంతములో - వాడె, 
కాకడె,పిస్సె, సన్యాసి - మొదలైనవి.
ఒరిస్సాలో- మహారాణా, మహాపాత్రో, దర్జీలు- గా చెలామణీలో ఉన్నారు
************************************; 
దర్జీ పనిని ఉద్యోగముగా నేడు విలువైన నైపుణ్యస్థాయిలో గుర్తింపు పొందుతూన్నది.
సూదీ దారములతో కుట్టుటలోనూ, వైరు బుట్టల అల్లిక పనులలోనూ 
స్త్రీలు, ప్రత్యేకించి గృహిణులవి మన దేశములో అందె వేసిన చేతులు. 
ఈనాడు అన్నిరంగములలో మాదిరిగానే వీరు వారననేల? 
నిపుణతనుబట్టి - ఈ టైలరింగు jobలో సైతమూ ఆసక్తికలిగిన వారు అందరూ- 
కులముతో ప్రమేయము లేకుండా- చేబూని, "భళీ!" అనిపించుకుంటూన్నారు.


ఫ్యాషన్ టెక్నాలజీ, ఎంబ్రాయిడరీ, కుట్లు అల్లికలు- మున్నగు అనేక శాఖలుగా విస్తరిస్తూన్నది. 
పరిసరాలను మనకు కన్నులపండువుగా సాక్షాత్కరించేటట్లు చేస్తూండడంలో 
ఈ కుట్టు మిషను పనితనము పాత్ర 
ఎంతో గణనీయపాత్రమైనదని వక్కాణించక తప్పదు.
రెడీమేడ్ దుస్తుల ప్రభంజనముతో- 
ఫ్యాషన్ రంగానికి సింహాసనము దక్కినది.
అందుచే- ఆ బాటల ద్వారా- లక్షలాదిమందికి ఉపాధి, భుక్తి లభిస్తూన్నవి, 
ఇది ముదావహమూ, ఆమోదనీయ మోదకరమున్నూ! ఔనా?! 
ఈ సూచీకారుల హస్తమహిమతో చిందులు వేస్తూన్న 
"చిన్న సూది పుణ్య ఫలమే!"కదూ!


\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\        

  (పరశురాముడు, Peepaji and Namdeo)

దర్జీ కథ
User Rating: / 2 
Member Categories - తెలుసా!
Written by kadambari piduri   
Sunday, 08 July 2012 16:22

15, జులై 2012, ఆదివారం

తగువులు తీర్చిన జగన్నాథ పండితుడు








ఉత్తర హిందూస్థానానికి తెలుగువాళ్ళు 
ఎవరైనా వెళితే,
అక్కడివాళ్ళు ‘మీరు తెలుగు వారా? 
మీరు ఆంధ్రులా?’అని అడగరు.
మరి ఏమని అడుగుతారు?


“యే పండిత్ రాజ్ కీ దేశ్ వాశీ హై| 
              యే మల్లినాధసూరీ కే దేశ్ వాశీ హై|”
                                           అంటూ చెబుతారు.
“మీరు పండిత రాయల దేశము వారా?
    మీరు మల్లినాధ పరగణాల వారేనా?” 


అంటూ ప్రశ్నిస్తూ పరిచయాలను చేసుకుంటారు.
రాష్ట్రాన్నీ, సీమలనూ, దేశాలనూ 
ఆట్టే పరిగణనలోనికి తీసుకోకుండా
పాండిత్యాన్నిబట్టి మాత్రమే,
ఆగంతకుల గురించి ప్రస్తావించుకునే గొప్ప సాంప్రదాయాలు
అలనాటి (16వ శతాబ్దము నాటి)హిందూదేశములో,
ముఖ్యంగా ఉత్తరాదిని నెలకొని ఉన్న గొప్ప సామాజిక అంశము.
కవి- అనే పదము కన్నా “పండితుడు” అనే పదములో
పవిత్ర భావన గుబాళింపు ఉన్నది,
“ఋషి తుల్యుడు, దైవ సమానుడు”
అనే సమున్నత భావన అది.
జగన్నాధ పండిత రాయలు- వంటి
కొద్దిమంది మాత్రమే మనకు ఇలాగ చరిత్రలో గోచరిస్తూంటారు.


*******************************************


జగన్నాథ పండిత రాజ్ ఉపద్రష్ట గృహనామము కల కుటుంబము వ్యక్తి.
ఆ రోజులలో సాధారణముగ బ్రాహ్మణులు, “ఉంఛ వృత్తి”ని అవలంబించేవారు.
ప్రధానంగా భగవత్ సేవయే- తమ జీవన విధానముగా ఎన్నుకొనుటచే,
వారు లౌకిక భోగాదుల పట్ల విముఖులై-
స్వచ్ఛందముగా బీదరికములో ఉండుటయే ఇందుకు కారణము.
జగన్నాథ పండిత రాయలు అట్టి ఉంఛ వృత్తి- స్వీకరించాడు.
ఉంఛ వృత్తి:-
(విద్యార్ధిగా, బ్రహ్మచారి ఐన విద్యార్ధిగా యాచన చేయుట
      అనగా- ordinary Brahmin engaged in unchavritti 
                                              (i.e. begging for alms)
‘ఏ రోజుకు సరిపడే భోజనమును ఆ రోజుకు మాత్రమే సంపాదించాలి- అనేది
ఉంఛవృత్తిలోని నియమము.


సంఘసేవా దృక్పథంతో మెలగే తాపసులు, బౌద్ధ సన్యాసులు,
దీనిని ఒక పవిత్ర భావనా మార్గంగా- హిందూ సంఘముచే ఏర్పరచబడినది.
తాపసులు, బౌద్ధ సన్యాసులు,
దీనిని ఒక పవిత్ర భావనా మార్గంగా- హిందూ సంఘముచే ఏర్పరచబడినది.
ఈ క్రమంలో బ్రాహ్మణ విద్యార్ధులు యాచనచే లభించిన
ధాన్యాదులను, వారే వండుకునే వారు,
లేదా “గురు పత్ని” వండి, గురుకులములోని అందరికీ వడ్డనలు చేసేది. 
గురువు భార్య , కన్నతల్లి ప్రేమను విద్యార్ధులకు ఒసగేది.
ఈ క్రమంలో విద్యార్ధులు, భోజనం చేయడానికి- విస్తళ్ళు తయారుచేసుకునే వాళ్ళు.
అలాగ జగన్నాథుడు కూడా గ్రామంలోని
ఒక మర్రి చెట్టు, బాదం చెట్టు ఆకులను కోసి తెచ్చుకుని, విస్తళ్ళను కుట్టిపెట్టేవాడు.
ఐతే ఒక రోజు ఈ విధికి ఆటంకం ఏర్పడింది.
అక్కడ కాపలాదారు కొత్తగా వచ్చిఉన్నాడు.
కావలివాడు  నిరోధించాడు” ఈ చెట్లను తాకవద్దు.
మా అయ్యగారు నిషేధించాడు” అటూ అటకాయించాడు.
ఈ విఘాతమునకు నిర్ఘాంతపోయాడు జగన్నాథుడు.
“చక్రవర్తి- ఈ భూమిని మా యజమానికి
జాగీరుగా బహుమానంగా ఇచ్చారు” అన్నాడు ఆ కావలివాడు.
గ్రామ వ్యవహారాలను చూసే బాధ్యతలను కరణం చూసేవాడు.
అందుచేత జగన్నాథుడు గబ గబా కరణము వద్దకు వెళ్ళాడు.
(village karanam = 
        official incharge of village revenue and administration)
“ఆకులను కోసుకోవడానికై అనుమతి ఈయండి” అంటూ అడిగాడు.
కానీ ఆ కరణం నిర్లక్ష్యంగా నిర్ద్వంద్వంగా చెప్పేశాడు
“ఢిల్లీకి వెళ్ళు. పోయి,పాదుషాకు చెప్పుకో! నా చేతుల్లో ఏమీ లేదు”


జగన్నాథుడు తల్లిదండ్రులకు ఈ దుర్ఘటనను వివరించాడు.
భార్య కామేశ్వరికి చెప్పాడు
“ముడి బియ్యమునూ, బెల్లమునూ మూట కట్టి ఇవ్వు”
(ఆ రోజులలో బాల్యంలోనే పెళ్ళిళ్ళు జరిగేవి)
Gur and pounded rice లను భుజంపైనిడుకుని,
పెద్దలకు పాదాభివందనములు చేసాడు జగన్నాథుడు.
విద్యార్ధి జగన్నాథుడు హుటాహుటిన ఢిల్లీకి
(ప్రాచీన కాలంలో పేరు – హస్తినాపురము) బయలుదేరాడు.
(gur and pounded rice for the journey,
and really went to Delhi!)
జగన్నాథుడు వీరావేశంతో డిల్లీ కోట వద్దకు చేరాడు,
కానీ “తన బోటి వారికి సింహద్వారము వద్దకు కూడా చేరలేరు" 
అని అర్ధమైపోయింది.
కులపతి మిశ్రా “మీకు ఆధారం దొరికే వఱకూ -
మా ఇంట్లో కొన్నాళ్ళు బస చేద్దురుగాని, రండి!” అని పిలిచాడు.
మిశ్రా కుటుంబీకులు జగన్నాథుని సమాదరించారు.
కొన్నాళ్ళకు అదృష్టము ఆతని తలుపు తట్టినది.
ఒకానొక రోజున  జగన్నాథుడు, 
అక్కడి సైనికులతో వాగ్వాదం  చేయాల్సి వచ్చినది.
ఆ ఇరువురు పర్షియన్ సైనికులు. (Persian speaking soldiers)
వాళ్ళిద్దరూ పరస్పరం పోట్లాడుకుంటుంటే,
అక్కడే ఉన్న జగన్నాథుడు ఒక్కడే ప్రత్యక్ష సాక్షి ఐనాడు.
రాజాస్థానానికి ఆ ఇద్దరు సైనికులు ” ఇతడు అంతా చూసిన వాడు.
(witnessed the quarrel) మాలో ఎవరు దోషియో కళ్ళారా చూసిన వ్యక్తి ఈతడే!
అంటూ జగన్నాథుని  కొలువుకు రప్పించారు.
స్థానానికి ; జగన్నాథుని కొలువుకు రప్పించారు.
ఆ పర్షియన్ భాషీయులు ఇద్దరిలో ‘ఎవరు నిర్దోషి?’ అని 
తేల్చడం కష్టమై పోయినది.
కొందరు సాక్షులలో ఒక్క జగన్నాధుని పలుకులే 
నిజ నిర్ధారణకు పనికి వచ్చాయి.
 జగన్నాథుడు స్వతహాగా ఏకసంథాగ్రాహి
(recall the altercation/ a single recitation)
అతను ఉన్నది ఉన్నట్లుగా అక్షరం పొల్లుపోకుండా
సైనికుల  సంభాషణను న్యాయాధికారికి చెప్పగలిగాడు.
(repeated the exchanges verbatim,
eventhough he did not know a word of Persian! )
“ఈ కొత్త మనిషికి పర్షియన్ అస్సలు తెలీదు.
ఐనప్పటికీ ఆ పరాయి భాషలోని సైనికుల వాదులాటను
ఉచ్చారణా దోషాలు సైతం లేకుండా సభాసదుల సమక్షంలో నుడివాడు,
జగన్నాథుడు సభాసదుల సమక్షంలో నుడివాడు.
సభలోని వారు, రాజోద్యోగులతో పాటు,
చక్రవర్తి కూడా జగన్నాథుని
“ఓయీ! నీ ఏకసంథాగ్రాహిత్వమునకు 
మేము ముగ్ధులమైనాము.  వహ్వా!”
జగన్నాథుని వేనోళ్ళ పొగడ్తలలో ముంచెత్తారు.
అతని పేరు, వివరాలను అడిగి తెలుసుకున్నారు.
“జగన్నాథా! నీ వంటి మేధావి
మాకు ఆస్థాన కవిగా ఉండడము
మాకు గర్వకారణమౌతుంది” అంటూ దీనారములను ఇచ్చాడు.
అలాగ కాకతాళీయంగా ఆ ఆస్థాన కవి పదవి 
ఆతనికి విలువైన కానుకగా లభించినది.
ఆ నాటి నుండీ “పండిత రాజ్ జగన్నాథ్ ( /జగన్నాథ పండిత రాయలు)” గా
గౌరవ స్థానాన్ని పురస్కారముగా పొందగలిగాడు.


**************************


“ఈయన మన ఆంధ్రుడు” అని 
గర్వపడుతూ చెప్పుకోగలిగిన ఈ వ్యక్తి, ముంగండలో జన్మించాడు.
జగన్నాధ పండిత రాయలు యొక్క తల్లిదండ్రులు పేరుభట్టు, మహా లక్ష్మీ దంపతులు.
ఆతడే “జగన్నాధ పండిత రాయలు”.
“రసగంగాధరం”, “భామినీ విలాసము”,
“అసఫ్ విలాసము” మున్నగు గ్రంధాలు,
అన్నిటికీ మించి “గంగాలహరి” ప్రసిద్ధి గాంచినది.
జగన్నాధ పండిత రాయలు “పంచలహరులు” ను 
వక్కాణముగా రచించిన వ్యక్తి,:-
ఆ సంస్కృత స్తోత్రముల పేర్లు:-
“గంగా లహరి ”- దివిజ గంగానది స్తుతి
”అమృత లహరి ”- యమునా స్తుతి
“కారుణ్య లహరి”- శ్రీ విష్ణు మూర్తి స్తుతి
“లక్ష్మీ లహరి”-  శ్రీ లక్ష్మీదేవి స్తుతి
“సుధాలహరి”-  సూర్యస్తుతి.
;


Published On Friday, February 10, 2012 
By ADMIN. Under: విజ్ఞానం, వ్యాసాలు.   
   రచన  : కాదంబరి
haaram:జగన్నాధ పండిత రాయలు ; (LINK 2 )
,

14, జులై 2012, శనివారం

మరో అమరశిల్పి - రువారి మల్లిటమ్మ


సోమనాథపుర





























అమరశిల్పి జక్కన్న మన అందరికీ తెలుసు. 
తెలుగులో "అమరశిల్పి జక్కన" (నాగేశ్వరరావు, బి.సరోజ)
ఈస్ట్ మన్ కలర్ లో నిర్మించిన సినిమా కూడా వచ్చింది.


అమరశిల్పి జక్కన్న ఆచార్య వలెనే శిల్పకళా విద్యలో 
వాసికెక్కిన శిల్పి "రువారి మల్లిటమ్మ". 
పశ్చిమ చాళుక్యుల సామ్రాజ్యములో నివాసి, ప్రముఖ శిల్పాచార్యుడు. 
శిల్ప, దేవాలయ నిర్మాణ కళలలో చేయి తిరిగిన వాడు రువారి మల్లిటమ్మ. 
ఈతని కళా నైపుణ్యము 12 శతాబ్దములలో కర్ణాటక, 
దక్షినబారత రాష్ట్రాలలో విరాజమానమైనది. 
3వ నరసింహ చక్రవర్తి హొయసల పాలించాడు. 
ఆతని దండనాయకుని పేరు సోముడు. 
"సోమనాథపురములో 1268 CE లో ని గొప్ప కోవెల
సోమ నిర్మించిన గుడి.
ఈ గుడి మైసూరుకు 30 కిలోమీటర్ la దూరములో ఉన్నది.
అమృతేశ్వర దేవాలయము మున్నగు దేవళములలో విరాజిల్లినది. 
గోవిందపల్లి వద్ద 13వ శతాబ్దములో 
పంచలింగేశ్వరస్వామి కోవెల శిల్పాచార్యుడైన 
రువారి మల్లిటమ్మ ప్రజ్ఞకు తార్కాణము.
ఈ గుడి హొయసల శిల్ప శైలిలో కనువిందు చేస్తూన్నది. 
హొయసలలో- అద్భుత శిల్పాలను 40 పైనే 
అనుయాయులు,శిష్యులు చెక్కి నిలిపినారు. 


నేటికీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య వంటి 
ఇంజనీరులకు మార్గదర్శకునిగా 
వృత్తినైపుణ్యములో- మహామహుల నమోవాకములను 
అందుకున్న శిల్పకారుడు Ruvari Mallitamma
ఆధునిక చిత్రలేఖన, శిల్ప, వాస్తు, సివిల్/ భవన నిర్మాణ రంగములు 
రువారి మల్లిటమ్మ అడుగుజాడలను 
భక్తిభావముతో మననము చేసుకొంటున్నాయి అంటే అతిశయోక్తి కాదు.

;

User Rating: / 3 
Member Categories - తెలుసా!
Written by kusuma   
Sunday, 10 June 2012 14:28 
మరో అమరశిల్పి (సోమనాథపుర) రువారి మల్లిటమ్మ - new AvakAya


రువారి మల్లిటమ్మ (Link 2)


13, జులై 2012, శుక్రవారం

గుల్లెకాయి అజ్జి మండపము


ఆమె (By: kadambari)















శ్రావణబెళగొళ- అనే జైన పుణ్యక్షేత్రము సు ప్రసిద్ధమైనది. 
ప్రపంచ ఖ్యాతి గాంచిన ఈ జైన క్షేత్రము కర్ణాటక రాష్ట్రములో ఉన్నది. 
ఈ కోవెలకు దగ్గరలో ఒక చిన్న గుడి ఉన్నది. 
అదే "గుల్లికాయ అజ్జి దేవళము".

గుల్లెకాయి అజ్జి మండపము 

              (गुल्लेकायी अज्जी मंडप) :-


Gullekayi Ajji ఈ గుడిలోని ప్రతిమకు ఒక స్థానిక స్థల  గాధ (legend) చెబుతారు. 
గంగ వంశ చక్రవర్తుల - మంత్రిగా వాసికెక్కినవాడు చాముండరాయుడు. 
క్రీస్తు పూర్వము 983 -  బాహుబలి/ గోమఠేశుని విగ్రహనిర్మాణానికి పూనుకుని, 
విజయవంతముగా పూర్తి చేసాడు. 
అంతటి ఘన విగ్రహాది నిర్మాణాలను తానే చేయగలవాడినని- అతనికి గర్వము కలిగింది.
ఇక తన కీర్తి దశదిశలా వ్యాపించేలా- మహామస్తకాభిషేకాన్ని చేయ పూనుకున్నాడు. 
తేనె, కుంకుమ, పసుపు, సింధూరము, పాలు మున్నగు పవిత్ర ద్రవ, ద్రవ్యాలతో- 
అభిషేకం చేయడము సంప్రదాయానుసారంగా జరుగుతుంది.
(బాహుబలి యువరాజు, [అశోక సామ్రాట్టువలె ] యుద్ధములు చేసాడు. 
రణభూమిలో రక్తపాతమును రోసాడు, ఫలితంగా "అహింసావాది"గా మారి,
"గోమఠేశ్వర స్వామి" గా వెలిసాడు.)
శ్రావణ బెలగొళ లోని బాహుబలి కి మహామస్తకాభిషేకమును  చేయాలని 
 చాముండరాయ స్థిరసంకల్పముతో ఉన్నాడు.
తన సిరిసంపదలు, గొప్పదనాన్నీ లోకులకు చాటడానికి 
ఈ కార్యమును ఒక సాధనముగా ఎంచుకున్నాడు. 
Bhagavan Bahubali అత్యంత ఎత్తైన మహా విగ్రహము.  
"నేనే ఈ విగ్రహానికి మహామస్తకాభిషేకము చేస్తాను" అన్నాడు.
భగవాన్ సంపూర్ణ అభిషేకము గొప్ప కార్యము. 
దేవుని  పెళ్ళికి అందరూ పెద్దలే!- అనేది సకల లోక విదిత జాతీయము. 
కానీ-  అమాత్యుడు - తన దర్ప, ఆడంబరములను ప్రకటించే 
పరికరముగా దీనిని ఎన్నుకున్నాడు. 
స్వామి కార్యములో ఎల్లరూ భాగస్వాములే కదా! =
ఈ విషయాన్ని విస్మరించాడు ఆయన.
బాహుబలీ స్వామి యొక్క పాదములు తడిసేదాకా పాలను - 
స్వామి శిరసు పైనుండి పోసారు. 
ఆపాదమస్తకమూ  క్షీరధారలలో తడిసినప్పుడే 
ఆ మహాభిషేకము పూర్తి  అవుతుంది.
చిత్రంగా ఆ రోజు - Chamundaraya తెప్పించిన పాలు ఐపోతున్నప్పటికీ- 
ఘన బాహుబలీ ప్రతిమ- పూర్తిగా తడవలేదు.   
కానీ ఎన్ని కుంభాల పాలను పోస్తున్నప్పటికీ కాలి చీలమండ దాటడం లేదు.
అందరూ విస్మయచకితులౌతూ, ఎటూ పాలుపోని స్థితిలో మల్లగుల్లాలు పడ్తున్నారు.
అందరిలోనూ ఉత్కంఠ నెలకొనసాగింది. 
"ఎక్కడనో ఏదో లోపం జరిగినట్లున్నది!
ఆ దొసగు ఏమిటో?" - అందరిలోనూ ఎంతగా ఆలోచనలు, 
ముప్పిరి గొన్నప్పటికీ  సమాధానము లభించ లేదు.    
అమాత్యుడు (Ganga dynasty minister Chavundaraya)  
 రాజ్యం నలుమూలలనుండీ తెప్పించిన పాలు అన్నీ ఐపోయినవి. 
అప్పుడు ఒక ముదుసలి స్త్రీ అక్కడికి వచ్చింది. 
ఆమె చేతిలో "పాలు నింపిన గుల్లెకాయ" ఉన్నది. 
"ఈ పాలను స్వామికి స్నానమునకై పోయాలి " అన్నది. 
ఆమె ప్రార్ధనను పెడచెవిని పెట్టేసిన ద్వారపాలక భటులు, 
"లోపలికి ప్రవేశము లేదు నీకు" అంటూ వెళ్ళగొట్టసాగారు.  
అది తెలిసిన రాజు "ఆమెను ఆవరణలోనికి రప్పించండి" అంటూ 
అమాత్య సచివులను పంపించాడు.
లోపలికి అడుగిడినది ఆ మహిళ. 
తీరా చూస్తే ......................... 
చేతిలో అతి చిన్న గుళ్ళికాయెడు పాలు 
(gullekai -outer shell of co-conut) మాత్రమే! 
కొబ్బరి చిప్ప అంత పాలు ఏ మూలకి సరిపోతాయి? 
ఇన్ని పాలను పోసిన తర్వాత కూడా తడవలేదు దైవము బొమ్మ! 
 రాజాజ్ఞ, రాణి అనుమతులతో 
ఆ "అజ్జి" (అవ్వ ) తీసుకు వచ్చిన పాలను అర్చకులు తీసుకుని, 
నిచ్చెనలతో కూర్చిన మంచెల మీదుగా ఎక్కారు. 
అవ్వ పాలను వాళ్ళు పోసిన పిమ్మట  జరిన అద్భుత దృశ్యము- 
అందరినీ చకితులను చేసినది.
గుళ్ళికాయ అజ్జి తెచ్చిచ్చిన పాలు శీర్షమునుండి జారసాగాయి. 
లిప్తపాటులో సంరంభం!  
బాహుబలి నఖశిఖపర్యంతమూ- తడిసిముద్దైనాడు. 
అటు పిమ్మట పాలు కారుతూనే ఉన్నవి. 
అలాగ నిర్విరామ క్షీర వర్షాలతో మడుగు ఏర్పడింది. 
ఆ కొలనులోని నీళ్ళు " పాల వెల్లువ లాగా- తెల్లగా ఉన్నవి.
అందుచే "బెలగొళ" అనే పేరు వచ్చింది. 
కన్నడములో "బెల= తెల్లని/ శ్వేత;
 (వెల్ల వేయుట; వెలుగు- మున్నగు పదాలకు మూలము ఇది)
                    కొల= కొలను
(“the Jaina’s white pond” నేడు ఆ పట్టణానికి కూడా 
"Shravana-beli-kola") అనే పేరు వచ్చినది.                                                                            
 ఆమెకై అందరూ చూసారు, అంతటా వెతికారు. 
"ఆమె ఎవరు? ఆమె ఏది? "                           
అపుడు వచ్చిన స్త్రీ- ఆమెయే జైన రక్షా దేవి "యక్షిణి పద్మావతి". 
(Jain guardian angel called Yakshi Padmavathi, old woman or Ajji)
12 వ శతాబ్దమునాడు కట్టిన గుళ్ళు ఆ సీమలో ఉన్నవి.
గుల్లికాయి అజ్జి మండపము ప్రత్యేక వాస్తు, శిల్ప శైలీ చాతుర్యములను భాసిస్తూ, 
సందర్శకులకు   నేత్రపర్వాన్ని కలిగిస్తూన్నది. 

9, జులై 2012, సోమవారం

విధి విలాసము - శ్రీరాముడు


 నంది గ్రామములో ఎల్లరికీ సంభ్రమం! అక్కడికి అందరూ ఎప్పుడో వచ్చేసారు. 
మూడు ఝాములైనా ఎవ్వరూ అక్కడినుండి అంగుళమైనా కదల్లేదు. 
వేచిచూస్తూనే ఉన్నారు ఆ వింత ముహూర్తం కోసరమని!!!!
మున్నెన్నడైనా కనీ, వినీ ఎరుగ లేదు, ఇప్పుడు జరుగుతూన్న సంగతి!
కాళ్ళకు తొడుక్కునే చెప్పులకు పట్టాభిషేకమట! 
సింహాసనము మీద పాదరక్షలను ఆసీనము చేయబోతూన్నారు!


ఇంత విడ్డూరపు సంఘటన చారిత్రక ఔన్నత్యాన్ని పొందుతుందని గానీ ముందు తరాల జనులలో నీతి నియమాల రూపచిత్రణలను చేస్తూ ప్రపంచమునకే ఆదర్శ సమాజము అంటే ఇదీ!...... ఇదే!.... 
అని పదే పదే చెప్పుకుంటూ, తమ ఆచరణకు నమూనాగా తీసుకునే శక్తి గలిగిన ఘటన ఇది! 
కొన్ని యుగాలనూ, కొన్ని కోట్లాది సంవత్సరముల దాకా జనుల ప్రవర్తనకు గీటురాయిగా అమరబోతూన్న మహోన్నత దృశ్యమాలిక ఇది!
కనుకనే ఇతిహాస రచనలకే కానుకగా అందబోతూన్న ఈ అద్భుత అంశము కోసమని ఆబాలగోపాలమూ అలాగే నిలువు కాళ్ళమీద నిలబడి ఎదురు చూస్తూనే ఉన్నారు.....


* * *
దశరధ మహారాజు పుత్రిక శాంత. 
అంగదేశాధిపతి రోమ పాదుడు, అయోధ్యాధిపతి దశరధ మహారాజు మంచి మిత్రులు. 
దశరధుడు తన మిత్రుడైన రోమ పాదునికి, శాంతను దత్తత ఇచ్చాడు.
ఆనాటి నుండీ, ఆమె రోమ పాదుని ప్రేమాభిమానాలను పొందుతూ, అంగదేశములో నివసించసాగినది.
రోమ పాదుడు సాధు జనులను దూషిస్తూ తూస్కరించి, అగౌరవపరిచాడు. 
తత్ ఫలితంగా అంగదేశము అనేక సంవత్సరాలు వర్షాలు లేక కరువు కాటకములతో అల్లాడింది. 
రోమ పాదుడు మంత్రులు, మునులు, పురోహితుల సలహా అడిగాడు.
"మహా రాజా! విభాండక ముని కుమారుడు ఋష్యశృంగుడు. బాలుని వలె స్వచ్ఛమైన మనసు గల ఋష్యశృంగుడు అడుగిడితే, మన సీమ సుభిక్షమై, పాడిపంటలు వృద్ధి పొంది, కళకళలాడుతుంది"
ఆంతరంగీకుల, శ్రేయోభిలాషుల సలహాలను అంగీకరిస్తూ, వెనువెంటనే ఆచరణకు ఉపక్రమించాడు రోమ పాదుడు.
అనేక ప్రయత్నాలతో ఋష్యశృంగుని రప్పించగలిగాడు రోమ పాదుడు. 


ఋష్యశృంగుని అంగదేశ ప్రవేశము జరిగిన వెంటనే ఆ రాజ్యములో వర్షాలు పడ్డాయి. వానలు పడి, అంగదేశము పాడిపంటలతో వర్ధిల్లుతూ, విలసిల్ల్లుతూ ఉంటే
ప్రజలు ఆనందభరితులౌతూ, రాజును కొనియాడారు.


* * *
రోమ పాదుడు కృతజ్ఞతతో తన కుమార్తె శాంతను ఋష్యశృంగ మునికి ఇచ్చి పెళ్ళి చేసాడు.
శాంత సంతోషముగా ఋష్యశృంగుని అర్ధాంగి ఐ, అరణ్య వాసిని ఐనది. 
శాంత భర్తను సేవిస్తూ, పర్ణశాలలో ఆనందముతో జీవనము గడుపసాగినది. 
పతిదేవుడు ఋష్యశృంగునికి యజ్ఞ యాగాది కార్యక్రమాలలో అండదండగా ఉంటూన్నది. 
అనేక రాజ్యాలకు వెళుతూ ఋష్యశృంగుడు, తన విధులను నిర్వహిస్తూండేవాడు. 
ఆతని తపోబలము వలన అనేక దేశాలు సుబిక్షములైనవి. 
దశరధుని నుండి ఆహ్వానపత్రికలు అందినప్పుడు,అయోధ్యకు శాంత,ఋష్యశృంగులు వెళ్ళారు. 
మళ్ళీ అయోధ్యాపురి నుండి ఆ భార్యాభర్తలకు పిలుపు వచ్చినది.


"శ్రీ రామ పట్టాభిషేకము జరుగును.
తామెల్లరూ ఈ మహోత్సవానికి తరలిరావలసినదిగా కోరుచున్నాము,
భవదీయుడు దశరధుడు" 


దశరధుని ఆనతితో సుమంత్రుడు ఈ లేఖను కుమార్తెకు, అల్లునికీ పంపించాడు. 
ఋష్యశృంగుడు, పత్నితో బయలుదేరాడు. 
వారు ఇతః పూర్వమే ఇతర రాజ్యాలకు వెళ్ళి వచ్చారు. 
అందుచేత ప్రయాణ సామగ్రిని సర్దుకొనుటకు ఆట్టే తడబాటుపడలేదు. 
దర్భలూ,దర్భాసనాలూ, వల్కలములూ, వ్యాఘ్రాసన చర్మము,
పాదుకలూ మున్నగు సరంజామాతో ఇరువురూ బయలుదేరారు. 


* * *
ఋష్యశృంగుడు, శాంత అయోధ్యలోనికి అడుగు పెట్టారు.
వారి రాక తెలిసి, కౌసల్య, సుమిత్ర, కైకేయి, అంతఃపురములోని అతివలు 
ముని దంపతులకు ఎదురేగి, స్వాగతము పలికారు. 
దశరధుడు అల్లుడు ఋష్యశృంగునీ, పుత్రికామణి శాంతనూ ఆప్యాతగా పలకరించాడు. 
శ్రీరామ, లక్ష్మణ, శత్రుఘ్నులు, బంధువులు ప్రేమాభిమానాలతో 
క్షేమసమాచారములు అడిగుతూ, ముచ్చట్లు చెప్పారు. 
భక్తితో ప్రజలు "అమ్మా! శాంతా! సర్వోన్నతుడైన ఋష్యశృంగ మౌని పాదముద్రలతో
ఈ పుడమి సస్యశ్యామలమౌతూన్నది" అంటూ శ్లాఘించారు.
ఋష్యశృంగుడు, శాంత తన పతిదేవుని సజలనయనాలతో సంతోషాంతరంగిణి ఔతూ వీక్షించినది.
" సోదరుడు రామచంద్రుని పట్టాభిషేకమునకు ఇంక నాలుగు రోజులే ఉన్నవి,
ఏర్పాట్లు అన్నీ బాగుగా జరుగుచున్నవి కదా!?" మందస్మిత వదన నవ్వుతూ అన్నది.
"సోదరివి, నీవే శుభ అభ్యంగనస్నానమునకై, నలుగు పెట్టవలసిఉన్నది. 
మరి ఈ లేపన విద్య నేర్చుకున్నావా?" లక్ష్మణ సతి ఊర్మిళ సరదాగా అన్నది.
భరత, శత్రుఘ్నుల భార్యలు మాండవి, శ్రుతకీర్తి కూడా, పరిహాసోక్తులతో శృతి కలిపారు.


* * *
అందరూ చెప్పుకునే కబుర్లతో, చందమామ కూడా మేలమాడిన వెన్నెల వానలతో అయోధ్యలోని ఆ రాజభవనము మెలకువతో కళకళాలాడుతూండగనే, భళ్ళున తెల్లవారింది.
ఋష్యశృంగుడు, "శాంతా! తెల్లవార వచ్చెను, ఇక నిద్దుర లెమ్మని" తట్టాడు. 
ఋష్యశృంగుని సందడికి శాంత నవ్వుతూ 
"అసలు మాకెవ్వరికీ కనురెప్పలు అరముడిస్తేనే కదా, 
అందరమూ జాగరణములోనే ఉన్నాము లెండి!" అన్నది.
పరిచారికలు హడావుడిగా ఏమో గుసగుసలాడ్తూ, రహస్యంగా మాట్లాడుకుంటున్నారు.
"ఏమిటి చెలులూ! అలాగ చెవులు కొరుక్కుంటూన్నారు?" 
ఊర్మిళ నుడువులకు దాసీలు తటపటాయిస్తూ అన్నారు. 
"ఏమోనమ్మా! మాకు సైతమూ ఏమి జరుగుతున్నదో,
అసలేమి జరగబోతూన్నదో అర్ధము కావడము లేదు"


"అదేమిటి? ఎందుకా అలజడి మీలో ఈ పొద్దున?" 
మాండవి పదంపడి ప్రశ్నార్ధకమై నిలబడింది.
శ్రుతకీర్తి కూడా అదే ప్రశ్నను రెట్టిస్తూన్నట్లుగా. 
ఇంతులతో శాంత కూడా కుతూహలముతో, 
కొంత గాభరాతో ఆ సంభాషణను వినసాగింది.
"కైకేయీ మహలులోకి మంధర రుసరుసలాడ్తూ వెళ్ళింది.
ఏమేమి చాడీలు చెబ్తూన్నదో? ఏ కొంప ముంచబోతూన్నదో?" 
కౌసల్య కడ ఉండే పరిచారిక తనలోని వణుకును అణచిపెడుతూ చెప్పింది. 
మధ్యాహ్నము మందర ఎదురైతే, ఈమె రంగవల్లులను వేస్తూన్నది; మందరను ఎగతాళి చేసింది. 
ఎప్పుడైతే మందర కోపంతో విసవిసా నడుస్తూ, గునగునా వెళ్ళిందో 
అప్పటి నుంచీ ఈమె మనసు మనసులో లేదు. 
ఈమెకు అన్నీ దుశ్శకునాలే గోచరిస్తూన్నాయి, అందుకే ఇలాగ ఈమె బెంబేలు!!!!!
శాంత అక్కడ ఆ ఉదయం, ఆకాశం అరుణ వర్ణమౌతూ భీతిని కలిగిస్తూన్నది. 


* * *
ఝాము ఝాముకూ అందరిలో ఇదీ అని చెప్పలేని ఏదో గుబులూ, భయము ముప్పిరిగొనసాగాయి.
మంగళ తూర్యారావాలు ఉన్నట్టుండి ఆగిపోయాయి.కారణమేమిటి? అందరిలో ఒకే ప్రశ్న.
శాంత , ఋష్యశృంగు కారణమేమిటి? 
"మంగళ తూర్యారావాలు ఉన్నట్టుండి ఆగిపోయాయి.కారణమేమిటి?" అందరిలో ఒకే ప్రశ్న.


కైకేయి కోపగృహములో ఉన్నది. 
తన ముద్దుల మూడవ భార్యను అనునయించి,
ఆమె ఆగ్రహమునకు హేతువును అరయడానికై లోనికి దశరధుడు వెళ్ళాడు. 
ఇన్ని గంటలైనా బైటికి రానే లేదు, లోపల ఏమి జరుగుతూన్నదో ఎవ్వరికీ బోధపడడం లేదు. 
ప్రతి ఒక్కరూ "ఉత్కంఠ నిండిన రాగి కలశములలాగా ఉన్నారు." 
రాణివాసములలోనూ, ఆస్థానములోనూ, కోటలోనికీ 
ఆ  మాటకు వస్తే చక్రవర్తుల నివాసాలలోనికి భద్రతా కారణాల దృష్ట్యా 
ప్రవేశానికి అనుమతి లభించడం 
కొంత సంక్లిష్ట వ్యవస్థగా ఏర్పడిందనే చెప్పవచ్చును.


ఇప్పుడేదో అసాధార పరిస్థితి ఏర్పడబోతూన్నదని అందరి డెందాలలోనూ 
ఏదో వాటిల్లబోతూన్న కీడు గూర్చిన సంశయాలు పడగలెత్తుతూన్నాయి.
ఉన్నట్టుండి, కైకేయి నుండి "తనయుడు శ్రీరాముని రమ్మన"మని ఆదేశం.
మందహాస వదనుడు రాముడు ఆ కోపగృహములోనికి వెళ్ళాడు,
కొద్ది నిముషాల అనంతరము ఇవతలికి వచ్చాడు.
అయోధ్యాపురి భవితవ్యాన్ని మలుపు తిప్పిన విశేషము జరిగింది.


(పుట : 1)
******************;
పెదవులపైన చెరగని చిరు నవ్వులు ఆ నీలమోహనునికి పెట్టని ఆభరణములు!

అందుకే లోపల అంత లోపలలోనే జరిగినట్టి అయోధ్యాపురి భవితవ్యాన్ని మలుపు తిప్పిన ఆ విశేషము దాని బీజము ఎలాటిది? 
అందరితోపాటుగా శాంతకూ, ఆమె భర్తకూ కూడా అంతుబట్టడం లేదు. 
ఇవతలికి వచ్చిన ఇనకులాబ్ధి సోముడు "జననీ! నేను 12 ఏళ్ళు అరణ్యవాసము చేయవలెను, నన్ను ఆశిర్వదించండి!" 
కౌసల్య మాత్రమేనా? అక్కడున్న యావన్మందీ ఉలిక్కిపడ్డారు అనేకంటే దాదాపు మూర్ఛవస్థలో మునిగారనడమే సబబు.
ముని ఋష్యశృంగుడు కూడా,
అటవీ సీమలనుండి తన తోటి వచ్చిన ఇతర తాపసుల వైపు నిర్ఘాంతపడి, చూస్తూ నిలబడ్డాడు.


శాంత "ఇదేమిటి? స్వామీ! ఇలాగ ఎలాగ సంభవిస్తూన్నది? తాము భూత వర్తమానాలనే కాదు, భవిష్యత్ కాలమును కూడా తెలుప గల దార్శనికులు గదా?
ఇప్పుడు మనము చూస్తూన్నది వాస్తవమేనా? కల కాదు కదా?"


ఋష్యశృంగుని వద్ద సిద్ధ సమాధానములు లేని ప్రశ్నల వర్షమై 
ఆతని అర్ధాంగి శాంత తారట్లాడుతూంటే 
నిస్సహాయుడై శిలాప్రతిమ వోలె నిలబడ్డాడు ఋష్యశృంగుడు. 


* * *
కొంత తడవు గడిచాక అనేక సంఘటనా పరంపరలు పెను వేగముతో జరిగిపోయాయి,
సీతాదేవి, లక్ష్మణుడు కూడా నీలమోహనశ్యాముని అనుసరించారు.
"ప్రపంచములో ఎవ్వరైనా ఈ రీతిగా భోగ భాగ్యాలను తృణప్రాయముగా త్యజిస్తూ స్వచ్ఛందముగా, అరణ్యవాసమును మహదానందముగా స్వీకరించారా?" 
శాంత, ఋష్యశృంగులు తత్తరపడ్డారు,
ధరణీపుత్రి సీతాదేవి "నారచీరలను ఏ పద్ధతిలో కట్టుకోవాలి?" అని శాంతను అడిగింది. 
శాంత ఆమెకు నార చీరలను ఇచ్చింది. 
కళ్ళలో నుండి ఉబికి వస్తూన్న కన్నీళ్ళను అణచిపెట్టడం శాంత తరం కావడం లేదు.
క్రితం క్షణం దాకా తన నయన ద్వయిలో ద్విగుణీకృత శోభలతో రాణి ఆహార్యములో విరిసిన జానకీ సౌందర్యము ఇప్పుడు వల్కలధారణముకై తన కడ ఉన్నది? 
లాక్షణికులూ, వేదాంతవేద్యులూ, తార్కికులూ విధివిలాసమునకు ఇంతకు మించిన తార్కాణం ఎత్తి చూపగలరా? 


ఋష్యశృంగుని అవస్థ కూడా శాంత మానసిక కల్లోలానికి భిన్నంగా లేదు.
ఆ వైభోగ సీమలో అప్పటికప్పుడు సర్వసంగపరిత్యాగులు ధరించే వస్త్రాదులు దొరుకవు. 
శ్రీరామచంద్రుని వివేచనా పరిధి అత్యంత వైశాల్యమైనది.
తత్ క్షణమే శాంత, ఋష్యశృంగులకు "వల్కలధారణా నిమిత్తమై" కబురందినది.
సీతమ్మకూ, శ్రీరామచంద్రునికీ, తమ్ముడు లక్ష్మణునికీ ఋష్యశృంగ, శాంతలు వల్కలాదులు ఇచ్చారు.
చూస్తూండగానే పురవీధులన్నీ ప్రజల వేదనా ఘోషలతో నిండిపోయాయి. 
సకల జనవాహిని సంవేదనా సాగరములను దాటుతూ సీతా, రామ, లక్ష్మణులు వెడలిపోయారు.


* * *
అటు పిమ్మట దశరధుడు పరలోకగతుడైనాడు.
భరతుని మాతులుడు యుధాజిత్తు. 
భరతుడు తన మేనమామ యుధాజిత్ వద్దకు వెళ్ళి ఉన్నాడు. 
కేకయ రాజ్యము నుండి అయోధ్యకు తిరిగి వచ్చిన భరతుడు తల్లి కైకేయి అత్యాశకు ఖిన్నుడైనాడు. 
అన్న రాముని వెదుకుతూ వెళ్ళాడు.


సాకేత సార్వభౌముడు "తండ్రికి ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నాను" అని అన్నాడు. 
కొసకు భరతుడు ఆ స్థిర సంకల్పుని వేడగా అనుంగు సోదరుని ప్రార్ధన మన్నించి, శ్రీరాముడు పాదుకలను ఇచ్చాడు.
ఇచ్చిన పాదుకలు, ఆ పాదుకలకు, భరతుడు పూజిస్తూ, పట్టాభిషేకము చేస్తూన్నాడు.


శాంతకు ఇప్పటికీ "తాను సీతమ్మకు నారచీరలను కడుతూన్నప్పుడు కలిగిన భీతి, వణుకు" ఇంకా తగ్గనేలేదు. 
ఋష్యశృంగుడు "మేము పర్ణశాలనుండి తెచ్చుకున్న వృక్షముల (భూర్జ తరు) బెరడులు అవతారమూర్తుల మేని స్పర్శతో పునీతములైనాయి, ఔరా! విధి విచిత్రము ఇదే సుమా!" అనుకున్నాడు.
అనుకుంటూనే ఆ కుగ్రామములోని "శ్రీరామ పాదుకా పట్టాభిషేకము" తిలకిస్తూన్న ప్రేక్షకులలో ఋష్యశృంగుడు, తన ధర్మ పత్ని శాంత ఇరువురూ భాగస్వాములౌతూ, తాదాత్మ్య చిత్తులై, తిలకిస్తూ ఉన్నారు. 
;

విధి విలాసము - శ్రీరాముడు, శ్రీరామ పాదుకా పట్టాభిషేకము  (patrika.haaram.com)



రచయిత : కాదంబరి (కోణమానిని)         ప్రచురణ తేది: 3/30/2012 12:00:00 AM

My story:  మూడు తరాలు  in - my Blog - కోణమానిని-  గురువారం 7 జూన్ 2012
(మూడు తరాలు ; బామ్మ సణుగుడు విరామమెరుగని ఆమె గొణుగుడు సాగుతూనే ఉన్నది.)



ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు

"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...