"మహతి" మీటిన క్రిష్ణశాస్త్రి ;
కవితా గగనములో భావకవిత్వ చంద్రికలను
ఆరబోసినది దేవులపల్లి క్రిష్ణశాస్త్రి క్రిష్ణపక్షము .
ఈ క్రిష్ణ పక్షము- రాయక మునుపే,
ఈ పొత్తము ప్రచురణకు రాక మునుపే-
ఆయన – బ్రహ్మసమాజము వారు కోరగా-
ప్రార్థనాగీతములను రచించినారు.
అలాటి పాటలను కూర్చిన కూడలి-
“మహతి” అనే కవితాసంపుటి.
దేవులపల్లి క్రిష్ణశాస్త్రి గేయ సంపుటి- “మహతి” -
ఇందులో 67 పాటలు, 12 పద్యాలు ఉన్నవి..
“మహతి” సంపుటిలో అద్భుత దేశభక్తి గీతం ఉన్నది-
అదే –
“జయ జయ జయ! ప్రియభారత జనయిత్రీ! దివ్యధాత్రి!.......”
మహతి-లో మరొక దేశభక్తి గీతము ఇలాంటిదే ఉన్నది.
“తెలుగుతల్లికి మంగళం ;
మా, కల్పవల్లికి మంగళం;
కొలుచు మా ఎద, నిలుచు ;
మా, రాజ్ఞి!`నీమ తల్లికి మంగళం!
ప్రాతక్రొత్తల కౌగిలింతల;
ప్రసవమ్మగు బంగారు కాంతుల;
భావికాల స్వర్గమరుచు;
ప్రౌఢప్రతిభకు మంగళం!;
నాగరికతకు వలచి వచ్చిన;
నాడు నాడులు తరలి వచ్చిన;
భోగభాగ్యములందజూపే;
రాగరహితకు మంగళం!;
వేదవేదములన్ని తరచీ,
వాదభేదములన్ని మరచీ;
స్వామ్య ధర్మ పథమ్ము; పరచు
వి-శాల శీలకు మంగళం!;
నాకమందిన పగటివేళ;
నరకమందిన కారురేల;
ఏకగతి “తెలుగమ్మ “ నడిపిన:
ఏకయంతకు(?)మంగళం!
తెలుగుతల్లికి మంగళం!
మా కల్పవల్లికి మంగళం.”
మహతి-లోని గీతాలు అన్నీ
సాహిత్యసీమలలో ప్రచారం పొందినవి.
బ్రహ్మసమాజము ప్రార్థనా సమావేశాలలో
మారుమ్రోగేవి కొన్ని పాటలు.
“శిథిలాలయమ్ములో శివుడు లేడోయీ;
ప్రాంగణమ్మున గంట మ్రోగలేదోయీ!....”
వానిలో ఒకటి.
ఆ పాట నాకు (ఈ వ్యాస రచయిత్రికి) చాలా ఇష్టం.
దేవులపల్లి క్రిష్ణ శాస్త్రి రచనలు రాశిలో,
పరిమాణములో తక్కువ.
“ పుంఖాను పుంఖాలుగా రాయకుండా, తక్కువగా రచించారు ” అంటూ
ఆయన మీద విమర్శ ఉన్నది.
“అమరుక కవేః ఏకం శ్లోకః ప్రబంధం శతాయతేః ” అని కదా
సహృదయుల అభిమాన లోకోక్తి!!!!
“ నేనేదో భక్త కవినీ కాను; మీరనుకున్నంత భక్తుణ్ణీ కాను.
కొందరు అనుకునేటంత దుర్మార్గుణ్ణీ కాదు.
ఎప్పుడో హృదయావేదన భరించ లేనప్పుడు కేక పెడతాను.
అది కీర్తన ఔతుంది.”
సాధారణంగా భావ తాదాత్మ్య కవులందరికీ
ఈ పలుకులు వర్తిస్తాయి కూడా!
“మీది ఏ కులము?”
ఆ భావ కవీంద్రుని జవాబు
“మాది కవి కులము ”
1942 నుంచీ చెన్న పురికి నివాసం మార్చుకుని,
తన గీతాలతో
“మల్లీశ్వరి” ఆదిగా
ఆంధ్ర సినీ రంగాన్నికూడా పరిపూర్ణం చేసింది
ఆయన కలము.
అందుకే తిరుమల రామచంద్ర
“ నవ్య కవితా ప్రస్థానాచార్యులు ” అని
గౌరవ పురస్కరంగా పేర్కొనారు.
konamanini ( బుధవారం 11 ఆగస్టు 2010 - Link 1)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి