"ఆత్మబలం” తెలుగు సినిమా నిర్మాణం జరుగుతున్న రోజులలోని కొన్ని సరదా జ్ఞాపకాలను
కథానాయకి బి.సరోజాదేవి కబుర్లలో చెప్పారు.
తను జోడీగా నటించిన హీరోలలో,
అక్కినేని నాగేశ్వరరావు వ్యక్తిత్వం గురించి తన అభిప్రాయాలను వెల్లడించినది.
"నాగేశ్వర రావుకు అసలు కోపమే ఎరుగని తన0.
ఎప్పుడూ నవ్వుతూ, జోవియల్గా ఉంటారు.
జోక్సు వేస్తూంటారు, నవ్విస్తూంటారు .
ఏ విషయం తీసుకున్నా,
ఆ అంశం పై అనర్గళంగా మాట్లాడుతూండడం
ఆయనకు వెన్నతో పెట్టిన విద్య.
షూటింగు సమయంలో కూడా - ఇతరుల లాగా చిరాకు పడరు;
కోప తాపాలకు ఈయన అతీతులేమో! - అని నాకు అనిపిస్తూంటుంది.
"ఆత్మబలం" షూటింగు జరుగుతూన్నప్పుడు,
మా బంధువులు, సన్నిహితులూ నన్ను చూడడానికి వచ్చారు.
నేను వాళ్ళను కలవడానికి లేస్తూన్నాను.
అలా నిలబడుతూండగా, A.N.R. నా జడ పట్టుకున్నారు. నన్ను లేవనీయకుండా
"నీ జడ నా చేతిలో ఉంది. ఎలా వెళ్తావు?
వెళ్ళాలన్నా వెళ్ళలేవు." అన్నారు నాటకీయ ఫక్కీలో.
నేను కూడా తమాషా చేస్తూ, తటాలున ఆయన విగ్గును పట్టుకుని, ”ఇప్పుడు మీ విగ్గు నా చేతుల్లో ఉంది, నా జడ లాగితే నష్టమేం లేదు గానీ, మీ విగ్గుఊడితేనే డేంజర్. అందుకని, నా జడను మీరు వదిలేస్తే నేను మీ కృత్రిమ జుత్తును వదిలేస్తాను." - ఇలా నేననగానే వెంటనే నా జడను వదిలేసారు.
"తల్లీ! నీకో నమస్కారం.
ఇంత మందిలో నా విగ్ కాస్తా ఊడిపోతే నాకెంతవమానం!?
అమ్మా! మనిద్దరి మధ్యనా గలాభా ఎందుకులే, వెళ్ళి రా తల్లీ!
పోయి రావమ్మా!” అన్నారు.
నేను "అలా రండి దారికి!" అన్నాను.
అప్పటి రోజులు బంగారు రోజులు.
షూటింగులలో, మధ్య మధ్య విరామం వ్యవధిలో
అందరూ కలివిడిగా ఉండే వాళ్ళము.
ఎలాటి భేషజాలూ, అహంకారాలూ లేకుండా
అందరూ ఒకే కుటుంబ సభ్యుల్లాగా మసలుకునే వాళ్ళం.
అలాంటి రోజులు తలపునకు వచ్చినప్పుడు ఎంతో ఆనందము కలుగుతూంటుంది.”
"ఆత్మబలం" అప్పటికాలంలో సూపర్ హిట్ సినిమా.
పాటలూ సూపర్ డూపర్ హిట్లే.
పొడుగాటి రెండు జడలు వేసుకుని,
బి.సరోజదేవి - నాగేశ్వర రావుతో నటించిన
"చిటపట చినుకులు పడుతూవుంటే.." పాట సూపర్ హిట్.
ఇప్పుడు గనక మళ్ళీ అదే సినిమాను పునర్నిర్మిస్తే,
మాధురీ దీక్షిత్, ఐశ్వర్యారాయ్, షారుఖ్ లు నటించిన Hindi Movie - "దేవదాసు"లాగా
తప్పక విజయభేరీ మోగిస్తుంది కదూ!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి