24, జనవరి 2018, బుధవారం

సంపూర్ణ వసంతసేన నాటకము ;- part - 4

బాట అదే - బండి మారింది  ;-
[శకారుని బండి బాటపైన వెళ్తున్నది. గూడు బండిలో వసంతసేన ]

వసంత సేన ;- ఇవాళ ఎందుకనో నిద్రమత్తుగా ఉంది. అమ్మ ఇచ్చిన భక్ష్యాలు తిన్నాను, 
అప్పటి నుండి కొంచెం  మైకంగా అనిపిస్తున్నది. 
స్థావరకుడు ;- బాట కిట కిటలాడుతున్నది, తప్పుకోండి తప్పుకోండి - పల్లెటూరి బైతులారా! 
వసంత సేన ;- ఇది మార్గుని గొంతులా అనిపించడం లేదు.  మా కొత్త దాసీ, 
'వెనుక గుమ్మం వద్ద బండి వచ్చి, ఆగి ఉందని' చెప్పింది. 
గూడు పైన చిలకపచ్చ వస్త్రం నుండి - 
బైట  ఏమీ కనిపించడం లేదు, ఏమీ తెలియడం లేదు.
స్థావ ;- ఇది రాజు శకారుల బండి, 
దారి ఇవ్వక పోతే -ఖైదులో వేస్తాం, పక్కకు జరగండి, హూ ...... 
వసంత ;- ఇది శకారుని బండి, దైవమా, కాపాడు. 
గుండంలోకి దిగాను. కంటిరెప్పల మీద నిద్ర ..... 
నా తల్లికి  నేను చారుదత్తుని కడకు చేరడం ఇష్టం లేదు. 
మధురమోదములదు ఏదో కలిపినట్లు ఉన్నది. 
నేను రహస్యంగానే ఈ  తీరున ప్రయాణిస్తున్నాను. పోనీ - బండి దిగనా!? 
భటులు ;- స్థావరకా, నీ ఒళ్ళంతా బురద. 
స్థావరక్ ;- ఎకసెక్కాలు చేస్తున్నారు. ఇందాక మీరు కనబడి ఉంటే - 
నాకు కాస్త చేతి సాయం అంది ఉండేది.
వసంతసేన ;- హమ్మయ్యో, భటులు, 
             వీరికి చిక్కితే - నాది అధోగతి, 
                అసలే వేశ్యలంటే చులకన.  ;;
స్థావ;- ఇవాళ బయలుదేరిన వేళ బాగుళ్ళేదు. 
అరె, బండి చక్రం బురదలోన కూరుకు పోయింది. ఎవరూ సాయం  చేయడం లేదు, 
ఒక్కణ్ణే ఇంత బరువు చక్రం తీసాను. అబ్బ, ఆయాసం. [ఎద్దులను అదిలించాడు] 
వీటికి కూడా  అలసట - శ్రమ పడింది నేనైతేను. 
బండిలో ఎంతో బరువు ఉన్నట్లు - మెల్లగా లాగుతూ, కదుల్తున్నాయి. హెయ్, 
వేగిరం - హెయ్ [ఛెమ్కీ తో కొట్టాడు] 
వసంత సేన ;- అక్కడ తోటలో నా కోసం ఆర్య చారుదత్తులు వేచి ఉంటారు, 
కనుక ఉద్యానం చేరిన పిమ్మట - 
ఆ చోట  సురక్షితం ఔతాను. పైన దేవుడే గతి.
వీరకుడు ;- అదేంటో - ఇవాళ చిలకపచ్చ వస్త్రాల మేళా జరుగు తున్నాదా ఏమిటి, 
ఐదు క్షణాల కిందట -  చారుదత్తుని శకటం వెళ్ళింది. ఇదే రంగు వలువతో. 

ఇట్లాంటి ఖరీదైన వలువ బండి - లోన వసంత సేన ఉన్నదట. 
స్థావ ;- ఓహో, చందనకుడు నాతో గిల్లికజ్జాలు పెట్టుకున్నాడు, తగాదా పెట్టుకున్నాడు, 
నన్ను సోదా చేయనీయ లేదు. 
ఐతే వీరకా! అందచందాలకు పెట్టింది పేరట కదా, ఆమె.
వీరకుడు ;- ఔను, చారుదత్తుడు అంటే దానికి తెగ ఇష్టమట. 
డబ్బు లేక పోయినా అంత గొప్ప సానిది - 
వాణ్ణి  తగుల్కొన్నది. దేనికైనా పెట్టి పుట్టాలి, 
మనమూ ఉన్నాము ఎందుకూ, 

భూమి మీద లెక్కకు ఒకటి చొప్పున  అదనంగా.
వసంత ;- చారుదత్తులు బండిని పంపారన్న మాట. ఇంక ఫర్వాలేదు. 
పొరపాటున ఎక్కాను ఈ బండిని. ఇది శకట  విపర్యాసం. వ్యత్యస్త శకట విపత్తు. 
దిగితే ఈ భీకర గండు పిల్లులు నన్ను - శకారునికి పట్టి ఇస్తారు, 
భగవంతుడా,  అన్యధా శరణం నాస్తి, త్వమేవ మమ గతి ;
[ఎద్దుల మెడలలో చిరు గంటల చప్పుడు - ముందుకు వెళుతూ] ; 
[ చాటింపు ;-  పారా హుషార్,  నగరి సమయ ఘంటా నాదం ఇది - 
మలి సందె - మూడవ ఝాము గంట - పారా హుషార్ - 
మసక  వెలుతురు వేళ - కనుక ఏమరుపాటున సాగండి, ప్రమాదాలు జరగవు. 
అశ్వ సంచార భటులకు దారి విడువండి, 
అప్రమత్తులవండి, పారాహుషార్  పారాహుషార్ ] ;


♣♣♣♣♣♣ ♣♣♣ ♣♣♣ ; ♣♣♣ ♣♣♣  ; 
ఆమెకు బుద్ధ పరిరక్షణ ;- 

[శకారుని బండి ఉద్యానవనానికి చేరింది.] ;
వసంతసేన ;- పుష్ప పరిమళాలు ... తోటకు చేరాము, అంబా, భగవతీ, 
ఆర్య చారుదత్తులు ఇప్పటికిప్పుడు ఈ పుష్ప కరండకంలోనే ఉండేటట్లు అనుగ్రహించు. 
శకార్ ;- హీనుడైన నీతో పిచ్చాపాటీ మాట్లాడీ మాట్లాడీ నాకు దప్పిక వేస్తున్నది. 
అడుగో, బౌద్ధ శ్రమణకుడు, ఒరేయ్, ఇటు రారా - 
నాకు దాహం వేస్తున్నది, అత్యవసరంగా జలం పట్టుకురా.
బౌద్ధ [సంవాహకుడు] ;- సరే. [ తామరాకులలో తెచ్చి, ఇచ్చాడు]
శకార్ ;- అకులోనా, ఈ శకారునికి బంగారు గిన్నెలో నీళ్ళు ఇవాలని తెలీదూ.
విరటు ;- అతను సన్యాసి, బీదరికాన్ని స్వచ్ఛందంగా స్వీకరించిన  పరివ్రాజకుడు. 
ఈ పర్యాయం నేను స్వర్ణ, రజత పాత్రలను తెచ్చి - అట్టి పెడతాను 
[ విరటు చేతితో సన్యాసికి సైగ చేసాడు -  సన్యాసి జారుకున్నాడు]
శకారుడు ;- రేయ్, స్థావరకుడా, నీకు ఒళ్ళు బలిసిందిరా. ఇంత ఆలస్యంగా వచ్చావు.
స్థావరక్ ;- మహాప్రభూ, బాటలన్నీ బహు రద్దీ, 
చాలదన్నట్లు బండి కాస్తా బురదలో కూరుకుపోయె, చాలదన్నట్లు - 
వీరకుడు ఆపాడు, చాలదన్నట్లు పాదచారులతోటీ, ప్రయాణీకులతోటీ పోట్లాటలు ....
 'ఇది స్థావరకుని బండి - జాగ్రత్త - ' అన్నాను. 
మీ పేరు చెప్పగానే తలలు పాతాళానికి దించుకుని వైదొలిగారు అనుకోండి .....
విటుడు ;- స్థావర భట్రాజు - మాటలలో మేటి. ఎవరినైనా మాటలతో బోల్తా కొట్టిస్తాడు.
శకార్ ;- నా పేరు చెబితే హడల్. [మీసం మెలి దిప్పబోయి] 
అరె, నా మీసం ఏదీ, ఎక్కడ మర్చిపోయాను?
విరటుడు ;- అందం ద్విగుణీకృతం ఔంతుందని - 
రెండు రోజుల క్రితమే - తమరు మీసాలు, గడ్డాలు - గొరిగించుకున్నారు కదా.
శకార్ ;- ఔనుస్మీ. నిలబడి, నిలబడీ కాళ్ళు నెప్పి పుడ్తున్నాయి. 
విరటూ, బండిలో పరుపును దులిపి, సర్ది పెట్టు.
విర :- [లోనికి తొంగి చూసి] వసంతసేనా, గణిక బుద్ధి - నీవు - 
చారుదత్తునికి కట్టుబడి ఉన్నానని చెప్పిన మాటలన్నీ -
వట్టి నీటిమూటలు, ధనం కోసం ఈ శకారుని వద్దకు వస్తున్నావే ....
వసంతసేన ;- చారుదత్తుల కొరకు వచ్చాను. పొరపాటున ఇందులో ఇరుక్కున్నాను. రక్షించు.
విర ;-[ఇవతలికి తిరిగి చూస్తూ ] శకారా, ఈ వేళ చల్లగాలి మైమరపిస్తున్నది. 
కులాసాగా, నడుస్తూ వెళదాము.
శకారుడు ;- రాజ శ్యాలక శకారునికి చరణ ధూళి అంటడం అసంభవం. 
ఇంత పెద్ద తోటకు ఆసామిని, దర్జాగా బండి - బండి నెక్కి వెడతాను, అంతే. 
[శకారుడు ఎక్కబోయి] బావా, లోపల దయ్యం ఉన్నది.
విరటు ;- ఆ, ఆ, పిశాచి ఉన్నది, అందుకే నడక అన్నాను.శకారుడు 
శకారుడు ;- ఊహు, కమ్మని వాసన - పిశాచి - అంటే ఆడదెయ్యం - 
[మళ్ళీ  తొంగి చూసి] లోన వసంతసేన ... ఆహా  ఆహాహా ,
విర ;- వసంతసేన, చిత్తం - ఆమె చిత్తం మీ పైన - కనుకనే ఆమె ఈ రాక - మీకు కానుక 
[ మనసులో ] - ఇంక ఈమెను ఆ దేవుడే కాపాడాలి.
వసంతసేన ;- ఇంక దిగక తప్పదు. 'నీకు తగని ధైర్యం - ఎక్కువ ' అని -
మా అమ్మ మెచ్చుకుంటూ ఉంటుంది. 
దేవీ, ధైర్యలక్ష్మీ, నాకు ఇప్పుడు ధైర్యం, ఆత్మ స్థైర్యాలను ప్రసాదించు. [ దిగింది]
శకార్;- నీ అమూల్య రత్నాభరణాల ధగధగలు, కిణకిణలు - 
వసంత సేనా, ఆకాశం నుండి నా కోసం నువ్వే దిగివచ్చావా.
విర ;- ఔను, మిమ్మల్నే వెదుకుతూ వచ్చింది ఆమె. 
వసంతసేన ;- కాదు, ఆర్య చారుదత్తుల కోసమే వచ్చాను.
శకార్; ఏమిటి, ఏమి కూసావు, చాతురుదత్తుడే నీకు ఎక్కువా!? 
ధనవంతుడు, భాగ్యవంతుడు ఈ శకారుని కాదని, దరిద్ర చారుని కోరుతున్నావా!? 
వాడికి అభిసారికవై, సారె సారెకూ వెళ్తున్నావు --- 
విర ;- వేశ్యలకు మాట చాతుర్యం నిధులు అంటారు. 
ఇదేమిటి, ఈ వసంత సేన  ఆపదలను కొని తెచ్చుకుంటున్నది, 
విపత్తులను కోరి మీద వేసుకుంటున్నది,
ఈ 'చారుదత్తుల ప్రేమిక'కు రక్షణ ఎక్కడ ఉన్నట్లు!? ........ ,  

శకార్ ;- స్థావరా, ఈ నికృష్ట వసంత సేనను చంపు. 
స్థావరక ;- ముందు జన్మలో ఏదో పాపం చేసి, వెట్టి చాకిరీ వాడినైనాను. 
ఈమెను ఇక్కడికి తెచ్చాను, పాపం మూట కట్టుకున్నాను, 
చాలు దొరా, అబలను చంపడమా, నేను చెయ్యను.
శకార్ ;- విటూ - విరటూ, దీన్ని నీ ఉత్తరీయంతో గొంతుకు ఉచ్చు బిగించి, చంపు. 
విర ;- నన్ను పూర్తి పేరు పెట్టి, :) :) పిలుస్తున్నారు. 
ఐనా సరే, స్థావరకుని సమాధానమే నా సమాధానం.
స్థావరక్ ;- మీరు కూడా ఈ పాపం పని చేయకండి, నేను ఊరుకోను.
విర ;- ఈ పాపం చేస్తానంటే నేను మాత్రం ఊరికే - ఎట్లాగ ఊరకుంటాను!?

శకార్ ;- [లోన] వీళ్ళిద్దరూ ఎదురుతిరిగారు - సరే మెరమెచ్చు మాటలను చెబ్తాను ;;
అరె, మీ స్వామిభక్తి ఎంతున్నదో అని పరీక్షించాను. ఈమెను సరస సల్లాపాలతో బులిపించి, 
దారికి తెచ్చుకుంటాను.మీ ఎదుట వీలవదు కదా
విర ;- అదీ నిజమే, మేమిద్దరం - కొంతసేపు అవతలకు వెళ్ళి ఉంటాము, పద, స్థావరకా. ; 
శకార్ ;- వీళ్ళిద్దరు నాపై అనుమానంతో ఇటు పక్కనే దాక్కున్నారు. 
కానీ చూద్దాం. ఓహో సేనా, నీవు - నువ్వు - ఈ వసంత ఋతువుకే గొప్ప శోభవు - 
విరట్ ;- ఇతని మనసు మారింది, ఆమెకు హాని చేయడు,  
పద, స్థావరకా, చెరువు గట్టున కూర్చుందాం. 
స్థావ ;- ఆ చెరువులో తన బట్టలు ఉతుక్కుంటున్నాడు,
 ఆ సన్యాసితో ముచ్చట్లు చెప్పుకుందాం. పదండి విరటూ. [ వెళ్ళారు] 
శకార్ ;- వసంత సేనా, నన్ను ప్రేమిస్తావా లేదా ;
 [ ఆమె తిరస్కార సూచకంగా - పెదవి విరిచి, తల అడ్డంగా ఊపి, 
తోట నలు దిక్కులా - చారుదత్తునికై చూడసాగింది ] 
వసంత సేన ;- చారుదత్తా, ఎక్కడ ఉన్నారు? ; 
శకార్ ;- ఐతే నువ్వు చారుదత్తుని అభిసారికవై వచ్చావు, 
వాడు ఇక్కడే ఎక్కడో ఉన్నాడన్న మాట.
వసంతసేన ;- కలకాలం సుగుణవంతులు 
చారుదత్తుల వనితగా కట్టుబడి ఉంటాను. 
[ శకారుడు వేగంగా దూకి, ఆమె పీక పట్టుకున్నాడు - 
విలవిలలాడుతూ పడిపోయింది &
ఇంతలో విరట, స్థావరకులు వస్తున్నారు.]
స్థావర ;- విరాటయ్యా, ఆ సన్యాసికి కాషాయ వస్త్రాలను ఉతుక్కోవడం - మనమే నేర్పాలి .....   
విర ;- స్థావరకా, కొత్తగా సన్యాసం స్వీకరించినట్లున్నాడు, 
అతని కావి గుడ్డలు కొత్తవి, అంత మురికి పట్ట లేదు, తెలుసుకో - 
అక్కడ మాధురుడు - మనకు కొత్త మిత్రుడు అయ్యాడు. 
ఆర్యకుని గురించి - మనకు కొత్త సంగతులు అనేకం తెలిసినవి. 
స్థావరక ;- వసంతమ్మ - పడి ఉన్నదేమిటి? శకారయ్యా, చంపేసావా?
విర ;- ఐతే అన్నంత పని చేసేసావా!?
విరటుడు ;- అయ్యో, అయ్యో అయ్యో - సుగుణవతివి, దయామతివి, 
నీవు లేక ఇంక మా నగర శోభ మసకబారింది. 
వచ్చే జన్మలో కుల వధువు జన్మను భగవంతుడు ప్రసాదించాలని ఇదే నా ప్రార్ధన. 
శకార్ ;- వసంత సేనను నువూ చంపావని ఒప్పుకో, నీకు వెయ్యి దీనారాలు ఇస్తాను.
స్థావరక ;- ఈ పాపం ఫలితం నాకు అంటగడుతున్నారు, గడుసువారే దొరగారు.
శకార్ ;- విరటూ, నీకైతే - ఇన్నూరు మణుగుల స్వర్ణం కార్షపణాలు --- 
నా - ఈ నందన వనం కూడా ఇస్తాను. 
విరటుడు ;- తోటనే కాదు, సామ్రాజ్యం ఇచ్చినా - తిరస్కారమే నా సమాధానం. 
స్థావరకుడు నా కన్నా మేలు, నిర్భయంగా ఎదిరించాడు.
విరటుడు ;- అబలా హత్య - నికృష్ట అపరాధం - 
ఛీ. శకారుని వంటి దుర్మార్గులకు అధికారం అయాచితంగా లభిస్తున్నది, 
ధర్మదేవతపైన కాళ్ళూనుతున్నారు. 
ఇది విధి విలాసమా, దేవుని నిర్లిపత కారణమా!? 
శకార్ ;- విటూ, నువ్వు, నేను మిట్టమధ్యాహ్నం నుండి ఇక్కడే ఉన్నాం. 
చాలామంది చూసారు. 
నువ్వే ఈమెను పై లోకాలకి పంపావని అభియోగం వేస్తాను.
విరటుడు ;- ఎట్లాగూ చేయని నేరం మీద పడుతున్నది కదా, 
నిన్నే చంపి - భటులకు లొంగి పోతాను 
శకార్ ;- వద్దు వద్దులే ;
విరటు ;- వీని ఆశ్రయంలో ఉంటే - ఖాండవ వనంలో ఉన్నట్లే. 
శర్విలకుడు, చందనకులు ఆర్యకుని దళంలో చేరారు. 
నేను కూడా వారి అనుయాయిని ఔతాను.ఒరేయ్ స్థావరకా, 
ఇది నీ ఎడ్ల కొరడా, ఇక్కడ పెట్టి ఉంచి, 
నువ్వే ఈ హత్య చేసావని నిరూపిస్తాను.
శకార్ ;- విరటుడు వెళ్ళి పోయాడు. స్థావరకా, 
కొంతమంది గుంపుగా వచ్చి, దీన్ని చంపారని - అధికరణ మండపంలో నేను చెబుతాను.
నువ్వు నాకు వత్తాసుగా పలుకు, సరేనని చెప్పాల్సిన సాక్షి నీవే. 
స్థావరక ;- అంగీకరించకపోతే - వీడు నన్ను ఈ నేరంలో ఇరికిస్తాడు. 
ఇప్పటికి ఒప్పుకోక తప్పదు. ----- అట్లాగే దొరా.
శకారుడు ;- సరే, ఇదిగో, నా బంగారు మురుగులు, నీకు బహుమతి. 
నా ఇంటికి వెళ్ళి అక్కడే ఉండు. -------
[స్థావరకుడు, విటుడు వెళ్ళి పోయారు.]
శకారుడు ;- వాళ్ళిద్దరు  వెళ్ళి పోయారు. 
స్థావరకుని నా మిద్దె పైన మూల గదిలో బంధిస్తాను
శకారుడు  ;- మా బావ ఈ తోటను నాకు బహుమతిగా ఇచ్చాడు. ఇంత దాకా దీనిని శుభ్రం చేయలేదు.  

అదీ ఒకందుకు మంచిదే, ఈ చెత్త చెదారం, ఆకులు - ఇప్పుడు ఉపయోగపడ్తాయి. 
వసంత సేన శవాన్ని మాయం చేస్తాను. నా ఉత్తరీయాన్ని కప్పుతాను ..... 
ఊహు, కూడదు, దీన్నిబట్టి నేరగాడు ఈ శకారుడే అని గుర్తులు ఇచ్చినవాణ్ణి ఔతాను. 
ఎప్పుడూ శుభ్రం చేయని తోట ఇది, ఎండు ఆకులు దండిగా ఉన్నవి. 
ఈ శీర్ణ పత్రాలతో కప్పుతాను. 
బౌద్ధ ;- బుద్ధం శరణం, బోధిసత్వునికి శరణం శరణం  .........
శకారుడు ;- శ్రమణకుడు వస్తున్నాడు, వీణ్ణి నా చేతికి దొరికినప్పుడల్లా కొట్టాను, 
హింసించి, ఆనందించాను. ఇప్పుడు నన్ను పసికడితే - 
నన్ను ఖైదు చేయించి తీరుతాడు, కనుక మెల్ల మెల్లగా తప్పుకుంటాను. 
ప్రస్తుతానికి - నాకు అదే క్షేమం.మెల్ల మెల్లగా తప్పుకుంటాను. 
[ శకారుడు దొంగ చూపులు చూసుకుంటూ వెళ్ళి పోయాడు ]
&
బౌద్ధ సంవాహకుడు ;- ఈ పూలు కోసి, బుద్ధదేవుని- పూజ కోసం బయలుదేరుతాను. ..... 
పూలబుట్ట నిండింది. ఇంక నా పంచె, ఉత్తరీయాలను ఆరబెట్టి, నగరిలోకి వెళతాను.
ఎంత పిండినా తడి  వస్త్రాలు, నీళ్ళు కారుతున్నవి.
కోతులు - వలువలు, చెట్ల కాయలు ......

వానరమూక అన్నింటినీ చిందరవందర చేస్తున్నవి. 
వలువలను నేలపైన ఈ ఎండుటాకుల పైన ఆరేస్తాను.
ఆరామంలో అర్చనలు చేసిన పిదప, బిక్షాటన నిత్య విధి.
జీవునికి తిండి తిప్పలను తప్పనిసరి అవసరంగా - నిర్దేశించాడు ఆ దేవుడు - 
ఎంత పిండినా తడి  వస్త్రాలు, నీళ్ళు కారుతున్నవి. 
వస్త్రములను ఈ ఆకుల పైన ఆరేస్తాను. ...... 
హమ్మయ్య, ఆరేయడం పూర్తి ఐనది. 
ఇంక ఊళ్ళోకి నా గమనం ....... 
ఊ  ....... , ఆకులు కదులుతున్నవి ..... 
వెలుపలికి చేయి కనబడుతున్నది .... బైటికి - పైకి చాచి, పిలుస్తూ .... 
అది స్త్రీ హస్తం - ..... ఎండిన ఆకులను తొలగిస్తాను ...
వసంత సేన ;- [మూలుగుతున్నది] ఎవరమ్మా, మీరు వసంతమ్మ కదూ, ఇక్కడ, 
ఇట్లాగ - భూమిలో - మిమ్మల్ని - ఎవరి అకృత్యం ఇది? 
నెమ్మది నెమ్మది, నిమ్మళంగా మెల్లగా లేవండి. 
వసంత సేన ;- దుర్మార్గ శకారుడు నన్ను చంపాలని యత్నించాడు. 
శకారుడు నా గొంతు నులిమాడు,  చచ్చిపోయాను ..... అనుకుని ....... 
వదిలి పెట్టి, పోయినట్లుగా ఉన్నాడు.
హు ... నేను ఉంటేనేం , పోతేనేం ..... 
బౌద్ధ సంవాహకుడు ;- వైరాగ్యం వలదమ్మా, నన్ను ఆనవాలు పట్టారా, 
మీ ఉపకారం వలన  ఋణవిముక్తుడిని ఐనాను.
వసంత సేన;- నీవు ... మీరు .... !?
బౌద్ధ సంవాహకుడు ;- జూదంలో ఓడి, పారిపోయి, మీ ఇంటిలో దాక్కున్నాను.
అప్పుడు జూదం పందెంలో చెల్లించాల్సిన- నా - శుల్కాన్ని చెల్లించి, 
ఋణవిముక్తుణ్ణి చేసారు. నన్ను గుర్తు పట్టారా!? 
వసంత ;- ఔను, చారుదత్తుల ఇంటి నుండి తెచ్చిన వెండి పాత్రను అమ్మజూపావు ...... 
బౌద్ధ సంవాహకుడు ;- నాడు సంవాహకుడిని, నేను మారాను తల్లీ, 
వసంతసేన;- ఈ తీరుగ సన్యసించావా!
బౌద్ధ సంవాహకుడు ;- శరణాగత రక్షణం - బౌద్ధ విహారం - ఇక్కడికి దగ్గరలోనే ఉన్నది. 
మీ గాయాలు నయమై, తేరుకునే దాకా అక్కడ ఉందురు గాని.
వసంత సేన ;- భగవత్ కృప.   ;  [ఇద్దరు వెళ్తున్నారు.]  

♣♣♣ ♣♣♣ ♣♣♣ ♣♣♣♣♣♣ ♣♣♣ ♣♣♣ ♣♣♣♣♣♣ ♣♣♣ ♣♣♣ ; ♣♣♣ ♣♣♣  ; 
▼  ▼  December (10) ;- 28] బాట అదే - బండి మారింది ; 29] ఆమెకు బుద్ధ పరిరక్షణ ; &
▼  ▼  ▼  2018 (7) ;- ▼  January (7) ;- 
30] చారుదత్తునిపై ఆరోపణలకు ఋజువులు ; 31] తాటాకుల కవిలె కట్ట సేకరణ ;
32] జయ జయ జయహో ; & +
సంపూర్ణ వసంతసేన నాటకము ;- part - 4 
సంపూర్ణ వసంతసేన నాటకము ;- part - 3
సంపూర్ణ వసంతసేన నాటకము ;- part - 2
సంపూర్ణ వసంతసేన నాటకము ; part - 1

వసంతసేన - ఎందుకు రాసాను? 

కామెంట్‌లు లేవు:

ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు

"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...