6, అక్టోబర్ 2016, గురువారం

అనులోమ-విలోమ పద్యాలు

మన సంస్కృతాంధ్ర కవులు మాటలతోనే గాక అక్షరాలతో కూడా అందమైన ఆటలాడుకున్నారు. పద్యాలు, పదాలతో రకరకాల విన్యాసాలు చేసారు. పద్యంలో ఇంకో పద్యం, ఎటునుండి చూసినా ఒకేలా ఉండే అనులోమ, విలోమ, పద్య భ్రమకం, పాదభ్రమకం, ఇలా ఎన్నో ఎన్నెన్నో…..

బమ్మెర పోతన భాగవతంలోని గజేంద్ర మోక్షం కథలో 
వృత్యనుప్రాసాలంకారం (ఒకే హల్లు పలుమార్లు ఆవృత్తి అవడం) ఉపయోగించి 
సర్వలఘు కందం ;- రాసి మనలనలరించాడు.

అడిగెద నని కడువడి జను
నడిగిన దను మగడు నుడువడని నడయుడుగున్
వెడవెడ సిడిముడి తడబడ
నడుగిడు నడుగిడదు జడిమ నడుగిడు నెడలన్ !!
;
] ఇంకో వింత చూద్దామా! ఒకే హల్లుతో వాక్యాలు, పద్యాలు ఎలా రాసారో చూద్దాం. 
‘క’ గుణింతంతో.. 
“కాకీక కాకికి కోక కాక కేకికా?”- 
కాకి ఈక – కాకికి – కోక కాక – కేకికా (నెమలికా)?”
 అని దీనర్ధం. 
;
అలాగే న గుణింతంతో ఓ పద్యం:
;
నానా నన నా నున్న న
నూనను నిన్ననెను నేను నున్ను ని నిననై
నానీ నను నానా నను
నానూన యనంగ నొంటి యక్షరమయ్యెన్!!
;
అని లక్షణకారుడు చెబితే మరో 'తుంటరి నూనె' అనే 
ఒక్క మాటతో గిలిగింతలు పెట్టాడు . 
ఇలా…”నా నూనె నీ నూనా? 
నీ నూనె నా నూనా? 
నా నూనె నీ నూనని నేనన్నానా”
;
మరి శ్రీశ్రీగారు ఊరకుంటారా. 
మ,న,స ;- అనే మూడక్షరాలతోనే 
"త్యక్షర కందం" రసవత్తరంగా అందించారు.
;
] అజ్ఞాత కవిగారు సప్తస్వరాలతో కంద పద్యాన్ని చెప్పి 
రసజ్ఞుల నలరించారు.

మా పని నీ పని గాదా
పాపను మా పాప గారి పని నీ పనిగా
నీ పని దాపని పని గద
పాపని పని మాని దాని పని గానిమ్మా!!
;
&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&
;
అనులోమ-విలోమ పద్యాలు ;- 
;
పద్యాలు మొదటినుండి చివరకు చదివితే ఒక అర్థం. 
చివరనుండి మొదటి వరకు చదివితే ఇంకో అర్థం వస్తుంది.

దామోదర సామ తనధ
రామా సరసాకర దశరధ హరి రాధా
కామా సదయాతి పరమ
ధామా వర యాదవకుల దారక రాసా!!
;
దామోదర సామ తనధ
రామా సరసాకర దశరధ హరి రాధా
కామా సదయాతి పరమ
ధామా వర యాదవకుల దారక రాసా!!

ఇప్పుడు క్రింది విధంగా చదివితే ఇంకో అర్థం వస్తుంది.

సారాకర దాల కువద
యారవ మాధామ రపతి యాదస మాకా
ధారా రిహ ధర శదరక
సారస మారా ధన తమసారద మోదా!!

పాద భ్రమకంలో ప్రతి పాదాన్ని 
మొదటి నుండి చివరకు, 
చివరి నుండి మొదటికి చదివితే 
ఒకేలా ఉంటాయి. ఇది చూడండి.
;
ధీర శయనీయ శరధీ
మార విభాను మత మమత మను భావి రమా
సారస వన నవ సరసా
దారద సమతార తార తామస దరదా!!
;
ఇక పద్య భ్రమకంలో ఐతే మొత్తం పద్యాన్ని 
ఎటునుండి చదివినా ఒకేలా ఉంటుంది. చూడండి. 
(ఈ ప్రక్రియను ఇంగ్లీషులో ఫలింద్రొమె అంటారు)

రాధా నాధా తరళిత
సాధక రధ తా వరసుత సరస నిధానా
నాధాని సరసత సురవ
తాధర కధ సా తళిరత ధానా ధారా!!

పింగళి వెంకట కృష్ణారావు కవిగారు ఒక సభలో 
తెనాలి రామకృష్ణుడికి వికట కవిత్వమెలా అబ్బిందో 
"క - భాష" లో ఇలా చమత్కారంగా చెప్పారు.
;
తే.గీ. కవి కక కట కక కవి కగ కన కను క
దీ కవ కన కలి కడి కకా కళి కక
కజ కన కని కవో కలె కక కని కక
కర కము కన కజూ కచి కన కపు కడె!!
;
ఈ పద్యంలో క లు తీసివేసి చదివితే ;-
" వికట కవిగ నను దీవన లిడి 
కాళిక జనని వోలె కనికరమున జూచి నపుడె ” 
అనే వాక్యం వస్తుంది.
;
ఇలా ఎందరో కవులు అక్షరాలతో పద్యాలాటలు ఎన్నో ఆడారు. 
కాని కొందరు ఇటువంటివి కవులు చేసే గారడీలని, కసరత్తులని, సర్కసులని ఎద్దేవా చేసారు. 
అసమర్థులకి అల్లరి, విమర్శలు చేయడం ఎక్కువే కదా. 
కాబట్టి వారిని పట్టించుకోకపోవడం బుద్ధిమంతుల లక్షణం.

అల్లంరాజు రంగశాయిగారు ;- 
"మ - గుణింతం" తో ఓ అందమైన కంద పద్యాన్ని అందించారు.
;
మామా మోమౌ మామా
మామా! మి మ్మోమ్మో మామ మామా మేమా
మే మోమ్మము మి మై మే
మేమే మమ్మోము మోము మిమ్మా మామా!!
;
ఈ పద్యానికి అర్థం చూద్దామా.
;
మా = చంద్రుని
మా = శోభ
మోమౌ = ముఖము గల
మామా = మా యొక్క
మా = మేథ
మిమ్ము, ఒమ్ము = అనుకూలించును
మామ మామా = మామకు మామా
ఆము = గర్వమును
ఏమి+ఒమ్మము = ఏమి ఒప్పుకోము
మిమై = మీ శరీరము
మేము ఏమే = మేము మేమే
మమ్ము,ఓముము+ఓముము =కాపాడుము, కాపాడుము
ఇమ్ము+ఔము = అనుకూలమగుమా
;
చంద్రుని వంటి ముఖముగల దేవా! 
మా బుద్ధి మీకు అనుకూలించును. 
గర్వపడక నిన్ను మేము అంగీకరింతుము. 
సశరీరివై మాకు అనుకూలముగా నుండి మమ్ము కాపాడుమని అర్థం. 
ఏకాక్షర నిఘంటువులు చూస్తే కాని ఇలాంటి పద్యాలు అర్థం కావు. 
కాని చదువుతుంటే సరదాగా ఉంటాయి.;
;
శ్రీకృష్ణదేవరాయల భువన విజయ సాహిత్య సభ లోని 
తెనాలి రామలింగడు /తెనాలి రామకృష్ణుడు  ;-
రాయలవారి కీర్తిని వర్ణిస్తూ అక్షర సౌందర్యంతో గంభీరంగా చెప్పిన ఈ పద్యం.
;
నరసింహ కృష్ణరాయని
కరమరుదగు కీర్తి యొప్పె కరిభిద్గిరిభి
త్కరి కరిభిద్గిరి గిరిభి
త్కరిభిద్గిరి భిత్తు రంగ కమనీయంబై!!
;
నరసింహరాయల కుమారుడైన శ్రీకృష్ణదేవరాయల కీర్తి – 
కరిభిత్ = గజాసుర సంహారియైన శివునిలా, 
గిరిభిత్కరి = ఇంద్రుని ఏనుగైన ఐరావతంలా, 
కరిభిద్గిరి =కైలాసంలా, గిరిభిత్ = వజ్రాయుధంలా, 
కరిభిద్గిరిభిత్తురంగ = శివేంద్రుల వాహనాలైన 
       నంది, ఉచ్చైశ్రవం (తెల్ల గుర్రం) లలా అందంగా తెల్లగా ఉందని భావం. 
;
షడ్జ మడ్జ ఖరాడ్జ వీడ్జ వసుధాడ్జ లాంశ్చ మడ్ఖాఖరే
జడ్జ ట్కి ట్కి ధరాడ్జ రేడ్ఘన ఘనః ఖడ్జోత వీడ్య భ్రమా
వీడ్యాలుడ్ భ్రమ లుట్ప్ర యట్ట్రి యపదా డడ్గ్రడ్గ్ర డడ్గ్రడ్గ్రహా
పాదౌటే త్ప్రట తట్ప్రట ట్ప్రట రసత్ప్రఖ్యాత సఖ్యోదయః !!
;
********************************************************;
;
-వలబోజు జ్యోతి గారి వ్యాసం ఇది . 
వలబోజు జ్యోతి , poddu , essay ;  LINK 
;
అనులోమ-విలోమ పద్యాలు ;- 

1 కామెంట్‌:

Unknown చెప్పారు...

చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు

ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు

"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...