8, అక్టోబర్ 2013, మంగళవారం

కిమ్ కవీంద్ర ఘటా పంచానన - కాశీనాధులు కిమిన్నాస్తి!

తిరుపతి వేంకటకవులు"అష్టావధానప్రక్రియ”కు ఆంధ్ర సారస్వత ఆస్థానమునందు రత్న పీఠమును నిర్మించి అందు ఆసీనను గావించిన పుంభావ సరస్వతులు.

చర్ల బ్రహ్మయ్యశాస్త్రి వీరినిద్దరినీ “జతగా చేర్చి, జంటగా కవితా జననికి ఫాలమున కస్తూరి తిలకమును దిద్దించుటను” ప్రోత్సహించారు. 
చిత్రమేమిటంటే ఆ ఇద్దరు ఒకే ఊరివారు కారు. ఒకరిది ఆ నాడు ఫ్రెంచివారి ఆధీనంలో ఉన్న యానాం- ఇంకొకరిది భీమవరం వద్ద ఎండగండి అనే కుగ్రామము. 
ఈ కవిద్వయం ఆశుపద్యోక్తులలో అద్వితీయ ఛందోవిన్యాసాలను చేసారు, హాస్య దామినీ ఝటిత్ చమక్కులను మెరిపించారు. నాటకములకు వీరి పద్యములు ఆచంద్రార్కం నిలిచే ‘కొటేషన్లు'గా స్థిరపడినవి అంటే అతిశయోక్తి కాదు. 

దివాకర్ల తిరుపతి శాస్త్రి, చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రి- తెనుగు అక్షర గోదావరీ దరిని విహరించే రీతిగా దోహదము చేసిన వ్యక్తి చర్లబ్రహ్మయ్యశాస్త్రి. ఆ కవిద్వయానికి కోమలమైన కవితల అల్లికలను నేర్పారు. చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రి తొలుత “పద్య రచన, గోణము కట్టుట, పద్యాలను” చెప్పగలిగారు. 
అటు తర్వాత చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రి తనకు కవితాప్రయాణములో జంటగా ఉండగలిగిన 
దివాకర్ల తిరుపతి శాస్త్రికి ఛందోబద్ధ పద్య, కావ్య రచనలను నేర్పిసాధన చేయించారు. 
కనుకనే “చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రి నాకు గురుతుల్యులు” అని పేర్కొని, 
దివాకర్ల తిరుపతి శాస్త్రి, తన గురుస్థానములో చెళ్ళపిళ్ళ గారిని ఉంచుకుని, 
ఆరాధనా భావంతో మెలిగారు.

- - - - -

పౌరాణిక నాటకముల ప్రదర్శనలకై అనేక నాటకసంఘములూ, థియేటర్లు వెలిసినవి అంటే అప్పట్లో పౌరాణిక నాటకములు పట్టిన రాజ యోగము ఎంతటి శిఖరాగ్రాలను అధిరోహించినవో- వేరే చెప్పనవసరం లేదు.

అప్పుడే మూకీలు, తర్వాత టాకీలూ వచ్చినవి. ప్రదర్శనారంగములు సాహితీ అక్షయపాత్రలనుండి పౌరాణిక నాటకములు, ప్రాచీన ఇతిహాస, జానపద కథలు- సునాయాసంగా గైకొన్నవి.

- - - - -

“పాండవోద్యోగ విజయాలు” ప్రభావం సంఘంలో సహస్రకిరణతేజములైనవి. 
అప్పటిదాకా పండితుల జ్ఞానశాలలకు మాత్రమే పరిమితమైన 
పద్య, సంస్కృత భాషాపదసుధా వర్షధారలు విద్యాగంధం లేని పామరుల దోసిళ్ళలో కురిసింది. నిత్యజీవితంలో- వాడుకునే జాతీయాల ఓలె వీరి పద్దెములు మారినవి.

“అదిగో ద్వారక! ఆలమందలవిగో…”

“వచ్చినవాడు అర్జునుడు, అవశ్యము గెల్తుమనంగరాదు..”

“బావా! ఎప్పుడు వచ్చితీవు? సుఖులే భ్రాతల్ సుతుల్ చుట్టముల్ …………"

"బావా! ఎక్కడనుండి రాక ఇటకు? ఎల్లరున్ సుఖులే కదా?........."

“జెండాపై కపిరాజు ……”

“అలుగుటయే ఎరుంగని మహామహితాత్ముడు……”

“అన్నమాట జవదాటని……”

ఇలాగ, ఒకటేమిటి? వీరి “శ్రీకృష్ణ రాయబార (పాండవోద్యోగ విజయములు; – పడక సీను)  ఒక్కమాటలో చెప్పాలంటే "సినిమాలకు లభించిన ఆదిబిక్ష వీరి నాటకరచనలు. సినిమాలకు మొదటినటీనటులు, విదూషకులు సంభాషణలకూ, పాటలకూ, పద్య గాన, సంగీతబాణీలకూ శ్రీకారం చుట్టినవానిలో తిరుపతి వేంకట కవుల రచనలకు ప్రధమతాంబూలం దక్కుతుంది.

"జంటకవులు" అనే పదానికి నిఘంటువులో చేర్చవలసిన పదమౌక్తికముగా మార్చినవారు దివాకర్ల తిరుపతి శాస్త్రి, చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రి. 
చర్ల బ్రహ్మయ్యశాస్త్రి శిష్యులైన తిరుపతి వేంకట కవులు రాయబారమునకు వెళ్ళిన కృష్ణుని సంభాషణలు ఇలాగే ఉంటాయి- అనిపించేలా వెదజల్లిన పన్నీటిఅత్తరు అక్షరముల గురుమూర్తులు.

- - - - -

తమ రచనలలో చిరంజీవులైన తిరుపతి వేంకటకవులు ఆశువుగా అనేక కవితలు చెప్పారు. అనేక అష్టావధానములు, శతావధానములు జరిగినవి. వీరి ప్రతి ప్రదర్శనా సభికులకు పదేపదే చెప్పుకునే మంచి సంఘటనలుగా మారుతూండేవి. ఒకసారి ఒక సాహితీ సభలో తటస్థ పడిన విశేషం ఇది!

- - - - -


కిమ్ కవీంద్ర ఘటా పంచానన:

తిరుపతి వేంకట కవులకి “కిమ్ కవీంద్ర ఘటా పంచానన “ అనే బిరుదు ఉన్నది. 
ఒక సమావేశములో అష్టావధానముప్రదర్శనలో ఒకతను వింత ప్రశ్నను, జవాబునూ సృజించాడు.
ప్రక్రియ:  దత్తపది, వర్ణన, ఆశువు, నిషిద్ధాక్షరి, సమస్యాపూరణం, అప్రస్తుతప్రసంగము (అడిగే వాడికి చెప్పే వాడు లోకువ- ఇక్కడ పృచ్ఛకుడు తమాషాప్రశ్నలు వేసి, అవధానిని ఖంగు తినిపించాలని ప్రయత్నిస్తూంటాడు), గంటల లెక్కను విని చెప్పుట, వ్యస్త అక్షరి, అనే 8 విభాగములు ఒండే సాహితీ క్రీడ. ఎనిమిది అంశములు కాస్త భేదములతో ఉంచి నిర్వహిస్తారు.

పృచ్ఛకుడు, రవంత గేలిచేస్తూ “కిమ్ కవీంద్ర ఘటా పంచానన”- అంటే- 
అంటూ అక్షరాక్షరాన్నీ విడగొట్టి, భావాన్ని చించేసి- ఒక కొత్త అర్ధాన్ని నిర్వచించాడు.

“కిమ్ కవీంద్ర= జల విహంగాలలో గొప్పవి ఐనట్టి: ఘటా = పెద్ద గుంపు; 
పంచ =బాగా వెడల్పు ఐన; అవననము = ముఖము కలిగిన: 
అనగా ఈ బిరుదార్ధమును “పెద్ద కొంగలు” అని వివరణను చెప్పుకోగలము.” 
కాశీనాధుని వక్రభాష్యం విని సభికులు అవాక్కయ్యారు.

చెళ్ళపిళ్ళ చటుక్కున ఇలాగ అన్నారు 
“యదార్ధవాక్కులు వీరివి. కాశీనాధులు గారు సెలవిచ్చినట్లు 
మా బిరుదుకు అర్ధం ‘ఘన బకములే!’ 
ఇక మరో అంశం సైతం మన నుడువులలో చోటు చేసుకోవడం సముచితము. 
అదేమిటనగా-కాశీనాధ నామధేయానికి కూడా విలక్షణత ఉన్నది. 
“కా” = నీళ్ళు; “అశి”= తిరుగాడునట: పదార్ధము ఏమనగా- ‘ పెద్ద చేపలు ’. 
అందుచేత ప్రస్తుత ప్రసంగమున వారి పాలిట పెద్ద కొంగలం మేమే!”

కిమ్ మత్స్యం గప్ చుప్! 
ఇక కాశీనాధులు కిమిన్నాస్తి.

- - - - -

{ఆచార్యులు చర్ల బ్రహ్మయ్యశాస్త్రి - సెప్టెంబర్ 5 వ తేదీ 2013 న “టీచర్స్ డే” – ని పురస్కరింఛి )

  ***********************************************************,
కిమ్ కవీంద్ర ఘటా పంచానన - కాశీనాధులు కిమిన్నాస్తి  (NewAwky.com)
Email User Rating:  / 3 
Member Categories - ప్రముఖుల హాస్యం
Written by kusuma kumari
Monday, 23 September 2013 15:22
Hits: 122 

ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు

"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...