31, జులై 2009, శుక్రవారం

వందనమిదే !

వాడేటి పూవులకు ఆసరాగా
నిలిచిన తొలకరుల మబ్బులకు
అభివాదము! అభివాదము! //

పాడేటి పికములకు
చివురులను ఒసగిన
మామిడి తరువులకు,//అభి//

పాడి పంటల అలరారేటి
పల్లెల తొణికేటి మమత లన్నిటికిని //అభి//

మా పల్లె జనములకు
చదువులను ప్రేమతో
నేర్పేటి గురువులకు
అభివాదము! అభివాదము //

29, జులై 2009, బుధవారం

అందాల పాపాయి.. ముద్దుల తాతయ్య..!

పట్టంచు పావడాలు బోలెడన్ని పాపాయికి --
పట్టెమంచం, పావుకోళ్లు చాలునంట్ తాతయ్యకి -
అరటి పిలక అరటి పండు బోలెడన్ని పాపాయికి -
బోడి పిలక విబూది పండు చాలునంట తాతయ్యకి -
వంకీ జడలు కలకండలు బోలెడన్ని పాపాయికి -
వంపు కర్ర కండువాలు చాలునంట తాతయ్యకి -

జామకాయలు కజ్జికాయలు బోలెడన్ని పాపాయికి -
పొడుము కాయ పడకకుర్చీ చాలునంట తాతయ్యకి -
గుడుగుడు గుంచం గుండే రాగం అన్నీ పాపాయికి -
గుండూ తుడుముడు గుళ్ళో పాటలు తాతయ్యకి -
సిరి సిరి నవ్వులు చెమ్మచెక్కలు బోలెడన్ని పాపాయివి -
ముసిముసి నవ్వులు చప్పరింపులు ముద్దుల తాతయ్యవి...!
వెబ్ దునియా లొ ప్రచురితమైన నా ఈ బాల గీతమును చదవండి.
"ఆంధ్ర ప్రభ"వార పత్రికలో నా మొట్ట మొదటి రచన,ఈ పాట.
"పాపాయికి,తాతయ్యకు"అనే ,ఈ పిల్లల పాట,నా స్వంత రచనయే!దేనికినీ అనువాదం కాదు.
ప్రముఖ పత్రికలో ,నేను చూసుకున్న మొదటి రచన,కాబట్టి,నాకు మరీ మరీ ఇష్టం.
ఇప్పుడు,వెబ్ పత్రికలలో చదువుకుంటే,మరీ,మరీ మరింత ఇష్టం.

28, జులై 2009, మంగళవారం

నాగిరెడ్డి - నాగయ్య

రేవతీ స్టూడియో అధినేత గా శ్రీనివాస రాఘవన్.' సారంగధర' సినిమాను భానుమతి, ఎన్.టి.రామారావులు పాత్రధారులుగా సినిమాను నిర్మించారు.
ఆ సినిమా ప్రేక్షకుల తిరస్కారమునకు గురి అయ్యినది. నష్టాల్లో కూరుకుపోతూన్న రేవతీ స్టూడియోని నాగిరెడ్డి కొన్నారు.
తెలుగు సినిమా దర్శకుల్లో మంచి విలువలతో,ఉన్నత ప్రమాణాలతో ఉత్తమ అభిరుచి గల దర్శకులలో,మొదటి స్థానం, ఎవరనే ప్రశ్న వస్తే మనం ముందుగా వినే పేరు “బి.ఎన్‌. రెడ్డి”. నిజానికి 30 ఏళ్ళ సినీ జీవితంలో ఆయన తీసింది పదకొండు సినిమాలే! కాని ప్రతి ఒక్కటీ పేరు గడించిందే!ఆయన అసలు పేరు"బొమ్మి రెడ్డి నరసింహా రెడ్డి".65 వేల రూపాయలు పెట్టుబడితో "రేవతీ స్టూడియో"నిర్మాతగామారారు.
విజయ వాహినీ స్టూడియోగా అది పునర్జన్మను పొందినది.
నాగిరెడ్డి గారి సాహసోపేత నిర్ణయాత్మక నిర్ణయాలు ఎన్నెన్నో గొప్ప మైలు రాళ్ళను తెలుగు సినీ చరిత్రలో నెలకొల్పాయి.


గోవింద స్వామి గారి వయోలీన్ కచ్చేరీలో ఒక బాలుడు
భాగవతములోని 'ప్రహ్లాద' పద్యాలను శ్రుతి సుభగంగా పాడాడు. ఆ
బాలుని కి నాగిరెడ్డి ఆశీస్సులు అందించారు. అమోఘ దీవెనలను పొందిన ఆ పిల్లవాడే చిత్తూరు నాగయ్య!
మైసూరు మహారాజా గారి సన్మానం అందుకున్న నాగయ్య గారి ‘‘త్యాగయ్య’’ (1946) గొప్ప కళాఖండమే!
నటుడుగా, దర్శకుడిగా, నాగయ్య గారి జీవితంలో ‘‘త్యాగయ్య’’ ఓ మైలురాయిలా నిలిచిపోతుంది. ఇక్కడో సంఘటన చెప్పాలి: మైసూరు మహారాజాగారు తన రాజభవనంలో ‘‘త్యాగయ్య’’ చిత్రాన్ని ప్రత్యేక షో ఏర్పాటు చేయించుకని నాగయ్య గారిని వెండి శాలువాతోనూ, 101 బంగారు నాణాలతోనూ సత్కరించారు. శ్రీరామచంద్రుడి బొమ్మ ఉన్న ఒక బంగారు నెక్లెస్‌ను కూడా బహూకరించారు.

26, జులై 2009, ఆదివారం

జొన్నలు,మధు సేవ

శ్రీ పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారి బాల్య స్మృతిలో ఇది ఒకటి.


శర్మగారికి తెలుగు సబ్జెక్టును, ఇంగ్లీషు -సబ్జెక్టును
జొన్నలగడ్డ శివశంకర శాస్త్రి బోధించేవారు.

శివశంకర శాస్త్రి తమ తోటి ఆంధ్రోపన్యాసకుడైన
"శ్రీ మద్రామాయణ కల్పవృక్షము" రచయిత అయిన
శ్రీ విశ్వనాధ సత్యనారాయణ గారిని పట్టుకునితమాషాగా ఇలా అనేవారు,

"కవి సామ్రాట్! యు ఆర్ టాకింగ్ సమ్ రాట్!" ( some rot)

"మధు సేవ " అనే నాటకంలోని ఈ తమాషా సీస పద్యాన్ని చదవండి.


********************************


(సీసము) :
"మోర్నింగు కాగానె మంచము లీవిన్గు
మొగము వాషింగు , చక్కగ సిటింగు
కార్కు రిమూవింగు గ్లాసులో ఫిల్లింగు
గడగడ డ్రింకింగు గ్రంబులింగు
భార్యతో ఫైటింగు ,బైటకు మార్చింగు
క్లబ్బును రీచింగు , గేంబులింగు
విత్తము లూజింగు, చిత్తము రేవింగు
వెంటనే డ్రింకింగు , వేవరింగు

(తేటగీతి)
మరల మరల రిపీటింగు. ,మట్టరింగు
బసకు ష్టార్టింగు, జేబులు ప్లండరింగు
దారీ పొడవున డేన్సింగు, థండరింగు
సారె సారెకు రోలింగు, స్లంబరింగు.

25, జులై 2009, శనివారం

పేరడీ-బీ రెడీ!


జొన్నలగడ్డ రామ లింగేశ్వరరావు నవ కవిత :::::
జొన్నవిత్తుల ఒక పేరడీ పద్యాన్ని రాసారు.

"నేను సైతం
నల్ల రంగును కొనుక్కొచ్చాను.

నేను సైతం
నల్ల రంగును తెల్ల జుట్టుకు రాసి దువ్వాను.

ఇంత చేసీ ,
ఇంత క్రితమే
తిరుపతయ్యకు జుట్టు నిచ్చాను.

ఈ పేరడీ గీతమునకు
శ్రీ శ్రీ ప్రసిద్ధ రచనకు మూలం.
అది ఇదే! చదవండి !

"సింధూరం, రక్తచందనం,
బందూకం, సంధ్యారాగం,
పులిచంపిన లేడినెత్తురూ,
ఎగరేసిన ఎర్రజెండా,
రుద్రాలిక నయనజాలిక,
కలకత్తా కాళిక
కావాలోయ్ నవకవనానికి--

ఘాటెక్కిన గంధక ధూమం,
పోటెత్తిన సప్త సముద్రాల్,
రగులుకొనే రాక్షసబొగ్గూ,
బుగులుకొనే బుక్కాగుండా,
వికసించిన విద్యుత్తేజం,
చెలరేగిన జనసమ్మర్దం
కావాలోయ్ నవకవనానికి--

రాబందుల రెక్కల చప్పుడు,
పొగగొట్టపు భూంకార ధ్వని
అరణ్యమున హరీంద్ర గర్జన
పయోధర ప్రచండ ఘోషం
ఖడ్గమృగోదగ్రవిరావం,
ఝఝానిల షడ్జధానం -
కావాలోయ్ నవకవనానికి--

కదిలేది కదిలించేదీ,
మారేది మార్పించేదీ,
పాడేదీ పాడించేదీ,
పెనునిద్దుర వదిలించేదీ,
మునుముందుకు సాగించేదీ,
పరిపూర్ణపు బ్రతుకిచ్చేదీ -
కావాలోయ్ నవకవనానికి .

మేఘాల జడ కుచ్చులు

మేఘమా! మేఘమా!
నీలి నీరదములారా!
ఏల ఈ సంబరము!!!!!

ఈ తొలి వేకువ గిలిగింతలు,
ఇంతగాను మీకు?
"తరుణీ మణి
ప్రభాత కిరణ రేఖల
సముదాయము నంతటినీ
ఓరిమితో తీర్చి దిద్ది,
ప్రజ్ఞ తోడ జడ అల్లినది!

"ఆ పసిడి ఇంద్ర ధనుసు
వన్నెల పూ రేకుల వాలు జడలో
జడ కుచ్చులుగా
మిమ్మే అమరించెననుచు"
అంత సంబరములు మీకు !!!!!"
అని మాకు తెలిసెను లే!!!
బాగు! బాగు!

22, జులై 2009, బుధవారం

భూత దయ

టీవీ 9 లో వార్త; "మృగ రాజు ముదమారగా ముదితను ముద్దాడుట".రెండేళ్ళ కిందట ఒక వనిత ,తిండీ తిప్పలూ సరిగా అమరని కారణము వలన ,చిక్కి,శల్యమై పోయింది. ఆ స్థితిలో ఆమె జాలి పడి, ఆ సింహాన్ని రక్షించేందుకు పూను కున్నది.తన చేతి డబ్బులు ఖర్చు పెట్టి,దనిని,"జీవ కారుణ్య సంఘము"ద్వారా,పోషణ భారాన్ని వహించి కాపాడింది. ఇప్పుడు ఆ అడవికి సామ్రాట్టు ఐన
సింహం, పుష్ఠిగా,ఆరోగ్యంగా ఉన్నది. (నేడు బహుశా అభయారణ్యములో ఉన్నది కాబోలును!))ఆ మహిళ అప్పుడప్పుడూ ఆ సింహాన్ని చూడటానికి వస్తూ ఉండేది.

ఇంత వఱకూ,సరే! అయితే,ఆ జంతు చక్రవర్తి,ఆమెను గుర్తు పట్టి,ప్రేమతో,కౌగిలించుకుని,ముద్దులు పెడుతూన్నది.అందు వలన్నే,ప్రజలనూ,ప్రసార మాధ్యమాలను ఆకర్షించిన అంశముగా మారి పోయినది.నాకు అమితంగా నచ్చిన విశేషం..
1)క్రూర మృగాలకు కూడా ఆపేక్షలు ఉండుట.
2)సింహము,ఇతర జంతువులకు కూడా జ్ఞాపక శక్తి ఎక్కువగానే ఉంటున్నది.సాధారణముగా,పావురాలు,కోతులు,ఏనుగులు వంటి కొన్ని జంతువులుకూ,పక్షులకూ మత్రమే గ్రహణ శక్తి ఎక్కువగా ఉంటూన్నది-అనే అభిప్రాయాన్ని పుస్సమీక్షించుకోవాల్సి వస్తున్నది.పరిశోధనలకు అనువైన కొంగ్రొత్త అంశమేనేమో!
సింహము పుట్టిన రోజును ఆమె,నిష్కల్మష అనురాగంతో,ఘనంగా సెలబ్రేట్ చేస్తున్నది. బుల్లి తెరపై,ఆమె ఆ మృగ రాజుకు ఇష్టమైన ఆహారన్ని పెడుతూంటే,అందరూ ఎంజయ్ చేసే దృశ్యాన్ని ప్రదర్శించారు.

ఇంత దాకా బాగానే ఉన్నది సరేనండీ!పునర్జన్మను పొందిన ఆ జంతువు చూపించిన ఆ అనురాగము మనలను అందరినీ మంత్ర ముగ్ధులను చేసింది.ఔను కదా!

కానీ,అరణ్య చక్రవర్తి 'జూలును సవరించుకుంటూ,విదిలించుకుంటూ,తింటూన్నది,పెద్ద పళ్ళెం నిండా ఆమె పెట్టిన మాంసాన్ని '. ఈ దృశ్యం మాత్రం నాకు చాలా వెగటుగా అనిపించింది. జీవ కారుణ్యంతో కాపాడిన సింహంపైన ప్రేమతో,"ఆమె పెట్ట వలసి వచ్చిన పదార్ధము ఏమిటి?మరల ఇంకో జంతువును వధించి తెచ్చిన మాంసమే కదా!"మరి,ఈ దాతృత్వాన్నీ,అందులోని మానవీయ విలువలనూ,మనము ఏ మేరకు అంచనా కట్టి,పాస్ మార్కులను వేయాలి?"ఇదేనండీ నా ధర్మ సందేహం?సందేహ నివృత్తికై మీ సమాధానం ఇస్తారు కదూ?
(అన్నట్టు వారి పేర్లు "టోరెస్ ,జూపిటర్". )

17, జులై 2009, శుక్రవారం

బాల సాహిత్యము

"జనులకు హితమును చేకూర్చేది సాహిత్యమని" ఆర్యులు భావించారు.
నేటి సాహిత్యములో ఒక శాఖగా అలరుతూన్న "బాల సాహిత్యము" కూడా ఈ భావనకు న్యాయము చేకూరుస్తున్నదని చెప్పవచ్చును.
మనలోని అంతర్నేత్రాలకు సుదూర వర్ణమయ ప్రపంచాలను చూపించే వాహిక పుస్తకము (సాహిత్యము).
"జలబిందు నిపాతేన క్రమశః పూర్వతే ఘటః

స హేతుః సర్వ విద్యానాం, ధర్మస్య చ, ధనస్య చ"
బాల సాహిత్యము ఎలా ఉండాలి? బాల బాలికలకు అర్థమయ్యేలా, బుడి బుడి నుడువులతో, నిష్కల్మష భావాలను ఆవిష్కరించ గలిగినప్పుడు,బాల సాహిత్యము సార్ధకమౌతుంది. తేట తేట తెలుగు పదాలు కూర్చిన లయాత్మక గీతికలుగా ఉండాలి.(అంటే వారి వారి మాతృ భాషలలో కూడా ఇదే వర్తిస్తుంది. ఇంగ్లీషు, తమిళ, మళయాళ, కన్నడ, హిందీ వగైరాలున్నూ, కొసకు సంస్కృత భాషలో ఐనా సరే! ఈ అలతి అలతి పదాల అన్వయ నియమము వర్తిస్తుంది)
*** *** *** ***

బాల గేయాలను 3 రకములుగా విభజించ వచ్చును.
దేశ భక్తి గేయములు
అభినయాత్మక క్రీడా గేయాలు
నీతి కథా ఖండ కావ్యములు , దేశ భక్తి గేయాలు క్లిష్ట పదాన్వయ భరితముగా ఉన్నప్పటికీ, గాన, లయ, తాళములతో ఒనగూడినవై శృతి సుభగత్వమును కలిగి ఉంటే మేలైన పద్ధతి.
శ్రీ దేవుల పల్లి కృష్ణ శాస్త్రి గారి పాటను ' ఆహ్లాదించుకోండి '.
"జయ జయ జయ ప్రియ భారత జనయిత్రీ! దివ్య ధాత్రి!

జయ జయ జయ శతసహస్ర నరనారీ హృదయనేత్రి!
జయ జయ సశ్యామల,సుశ్యామ చలచ్చేలాంచల !
జయ వసంత కుసుమ లతా చలిత లలిత పూర్ణ కుంతల!
జయ మదీయ హృదయాశయ, లాక్షారుణ పద యుగళా!..."

మరొక పాటను గమనిద్దాము... పై పాట ఎంత క్లిష్ట సమాస పూర్ణమైనదో ఈ క్రింది ఉదాహృత రచనలు అంతటి తేట పదాలతో నిండి ఉన్నవి.
"తేనెల తేనెల మాటలతో

మన దేశ మాతను కొలిచెదమా!
భావం, భాష్యం కలుపుకుని
ఇక జీవన యానం చేయుదుమా..."
దేశ భక్తి పాటలు, దైవ భక్తి పాటలు ఇట్టి సమాసములతో, భాషా పటిమనూ, అటు చక్కెర చిలకల వంటి తేలిక పదాలతోనూ సమర్ధవంతముగా ఆబాల గోపాలమునూ అలరిస్తూంటాయి. అల్లి బిల్లి పదాల ఈ గేయాలను అవలోకించండి.
"తాత వంటి తాత లేడు :

గాంధి తాత వంటి తాత:
ఎందు ఎంత వెదకిననూ
లేడు, లేడు, కాన రాడు........
చిన్న నాటి నుండి పెద్ద బుద్ధులు కలవాడంట! .......పిన్నలలో పెద్ద అంట!........."
ప్రసిద్ధ రచయిత (గుడిపాటి వేంకటాచలం)చలం గారు ఇలా అన్నారు:
"పిల్లలకు పాటలను రాయడము చాలా కష్టము.
దాని కంటే మహా కవి కావడము సులభము."
పిల్లల వాఙ్మయము ఆ పలుకులు నిజమేనని నిరూపిస్తాయి.
శ్రీ న్యాయపతి రాఘవరావు(రేడియో అన్నయ్య) రచనలు అనేకము ఉన్నాయి. వానిలో ఒకదానిని చదివి చూడండి.

"పిల్లలకే స్వారాజ్యం వస్తే;
పిల్లలకే స్వాతంత్ర్యం ఇస్తే
చిట్టి తండ్రినీ రాజును చేస్తాం!
చిట్టి తల్లినీ రాణిని చేస్తాం! //

మా తాత ఒక బొమ్మయితేను;
మా అవ్వ ఒక బొమ్మయితేను
బొమ్మల పెళ్ళి ఇంపుగ చేస్తాం;
కమ్మని విందులు గుమ్ముగ తింటాం! //

సూర్యుడు ఎర్రని కాగితమైతే;
చంద్రుడు తెల్లని కాగితమైతే
వేడుక తోటీ తాడును కట్టి;
గాలి పటంలా తేలించేస్తాం!..."
ఇలాగ మృదు మధురంగా సాగి పోతుంది.

శ్రీ రెడ్డి రాఘవయ్య గారి
కలం చిందుల సొగసులను చూడండి.

"పిల్లలం పిల్లలం,
పిల్ల గాలి విసురులం!
పిల్లలం పిల్లలం,
మల్లె పూల జల్లులం //

పిల్లలం పిల్లలం,
తెల్ల మబ్బు తునకలం
పిల్లలం పిల్లలం,
ఎల్లరి కను విందులం!..."శ్రీ శ్రీ ప్రఖ్యాత గేయం ఇది:
"మెరుపు మెరిస్తే,వాన కురిస్తే

ఆకసమున హరి విల్లు విరిస్తే
'అవి మాకే!' అంటూ
ఆనందించే కూనల్లారా!

పాపం పుణ్యం, ప్రపంచ మార్గం
కష్టం,సౌఖ్యం, శ్లేషార్ధాలూ
ఏమీ ఎరుగని పువ్వుల్లారా!
ఐదారేడుల పాపల్లారా!..."
ఇలాగ సాగే ఈ కవిత "బాలల శ్రేయస్సును గూర్చి పెద్దలకు ఉపదేశిస్తూన్న
కవితా లహరి గా పేర్కొన వచ్చును.
"నిజమైన బాల సాహిత్యము మామిడి పండులా ఆపాత మధురంగా ఉండాలి.
భాష సరళంగానూ, లలితంగానూ ఉండాలి.
చెప్ప వలసినది విప్పి పండు ఒలిచి చేతిలో పెట్టినట్లుగా ఉండాలి.
బాల సాహిత్య వేత్తలు ఈ మూల సూత్రమును పాటించినంత కాలమూ,
బాల వాఙ్మయము బాలల ఆదరణను పొందుతుంది" అని దాశరధి గారు అన్నారు.
అక్షర జ్యోతి, అక్షరాస్యతా ఉద్యమాల వలన
' విద్యా ప్రగతి, ఆవశ్యకతను ' తెలిపే గేయాలు అనేకము వెలిసాయి.

"పలుకుల తల్లి పిలిచెను చెల్లీ!
చదువులపై నీ మనసును నిలుపు! //
ఎంత కురిసినా ఆగని ధార!
ఎంత త్రవ్వినా తరగని గనిలే!
కదలవె బాలా! -అదరక,బెదరక
కుదురుగ విద్యను నేర్చుకొనంగ //"

ఇల్లాంటిదే మరి ఒకటి:

"రా రా చిన్నోడా!
బళ్ళో కెడదాము//
దొరలు దోచగ లేరు;
దొంగ లెత్తుక పోరు.
అన్న దమ్ములు వచ్చి,
భాగ మడుగగ బోరు...."
అచ్చులను వరుస క్రమంలో బోధించే పాట, గుడిసేవ విష్ణు ప్రసాద్ రచన ...
"అక్షరాలను దిద్దాలి; ఆనందంతో మెలగాలి!

ఇలలో అందరు చదవాలి;
ఈ జగమంతా మెచ్చాలి.." అంటూ కొనసాగినది.
"అ-ఆ -ఇ-ఈ-రావాలి; అందరమొకటై పోవాలి..." అన్నారు. ఎం.లక్ష్మణాచార్యులు
"వందనమమ్మా!వందనమమ్మా!

తెలుగు తల్లి అభి వందనమమ్మా!
అందరమొకటైని నీ ఉన్నతికై
అహరహమూ కృషి చేసేమమ్మా!
కుల మత భేదం మాకు లేదనీ ; జగతి అంతటా చాటేమమ్మా!..." అన్నారు
"బాల ప్రపంచం; పాల ప్రపంచం పాల వలె తెల్లనిది, పాల వలె తియ్యనిది!" అన్నారు ఏడిద కామేశ్వరరావు.
"విరిసే పూవుల రేకుల్లారా! మురిసే చివురాకుల్లారా!" అని పిల్లలను మెచ్చుకున్నారు కరుణశ్రీ. వింజమూరి శివరామారావు చాచా నెహ్రూజీని తలుస్తూ, రచించిన పాట
"ఏమి నోము నోచినదో, ఈ ఎర్రని గులాబీ; అందుకున్నదెల్లెడలా; అందరి మన్ననలు" ప్రజల హృదయాలను కరిగించినది.

"అందమైన చందమామ ; అందరాని చందమామ:అమ్మా! నా చేతిలోని అద్దములో చిక్కినాడే!....." ఎంత మనోజ్ఞ భావనమిది!
"భావ కవి"గా పేరెన్నిక గాంచిన శ్రీ దేవుల పల్లి కృష్ణ శాస్త్రి రాసిన బాల గేయాలు లావణ్య రాసులే. ఆంధ్ర దేశములోని జల సంపదను వర్ణించిన ఆయన గేయ ఫణితి అమోఘమైనది.

"తరలి రారమ్మా!2//
గౌతమి,మంజీర,
ఓ నాగావళి,వంశ ధార;
తుంగ భద్ర, పినాకినీ;
ఉత్తుంగ భంగా కృష్ణ వేణీ!//

నురుగుల ముత్యాల చెరగుల;
తరగ మడతల పావడాల;
తురిమి సిగలో రెల్లు పూ మంజరులు;
ఝరులౌ సోయగముతో//తరలి రా రమ్మా!..."

ఈ మనోజ్ఞ గేయ పంథాలో బాల సాహిత్య సృజన కర్తలకు ఇలా మనవి చేస్తున్నాను;

"తరలి రారండీ! తరలి రారండీ!//
నగవుల ముత్యాలు చల్లగ;
పలుకు మల్లెల గూడు లల్లి;
అలరు బాలల జగతి కొరకై ;
కథలు ,నుడువులు,గేయములను;
సృజన చేసే మహిత శీలురు;తరలి రారండీ!" '''''''''

"ఇపుడే వస్తానమ్మా! తొందర చేయొద్దమ్మా!"
--------------------------------------------
అంటూ సాగే ఈ పాట బాల బాలికల నిష్కల్మష ప్రవృత్తికి అద్దం పడ్తూన్నది.

1) "పిల్ల గాలి ఊసులన్ని -
చిన్ని పూల బాసలన్ని
మనసు విప్పి చెబుతుంటే-
చెవులొగ్గి వింటున్నా!

ఇపుడే వస్తానుండమ్మా!
కొంచెం సేపు ఆగమ్మా!//

2) వన్నె వన్నె ఈకలనూ -
చిన్ని రాళ్ళు ,గవ్వలను
మెల్ల మెల్లగా ఏరి-
పోగు చేసుకును చేసుకుని

నేను ఇపుడే వస్తానమ్మా!
చిడి ముడి చేయొద్దమ్మా!//

3) గడ్డి పూల సొగసులను,
వెన్నెలకు అందిస్తా!
అందమైన ప్రకృతికి-

బాల సారె,పేరు పెట్టి
ఆనందపు ఋతువులకు -
అ-ఆ-లను దిద్దించి ,

అమ్మా! నే వస్తాగా!
తొందర చేస్తావేమి?! //

5) బుల్లి బుల్లి పిట్టలకు-
మాటలు నేర్పిస్తానే!
చిరు జల్లుల వానలను-
ఆటలు ఆడిస్తానే!
అలల నురుగు చిన్నెలను-హరి విల్లుకు చూపించి, పరిచయాలు చేసొస్తా! ఇపుడె వస్తా!ఆగమ్మా!//
అమ్మా!ఇపుడే వస్తా!
హడావుడి చేయొద్దు! //
(రచయిత్రి: పి.కుసుమ కుమారి)
ప్రాచీన కాలం నుండీ" భక్తి గాన వాహిని "
మన దేశములో దివిజ గంగా ప్రవాహముల జల పాతములై, జనావళిని సంతోష సంరంభములలో ఓలలాడించినది.
బాల కృష్ణునిపై భక్తి, వాత్సల్యములతో,
ఘంటములు, కలములు వేసిన ప్రతి చిందు ,సంగీత,నాట్యములకూ బంగారు వేదికలను అమర్చాయి.
అలాగే, మాతృ ప్రేమ వెలువరించిన జోల పాటలు మల్లెల సౌరభాల సందడులను వెలయించినవి.
శ్రీ నారాయణ తీర్ధుల వారి "శ్రీ కృష్ణ లీలా తరంగిణి" ఆపాత మధురమే!
"ఆలోకయే!శ్రీ బాల కృష్ణం!....." మొదలైన పాటలు సంగీత, నాట్య జగత్తులలో సుస్థిర కీర్తిని గాంచినవి. అన్నమాచార్యులు కృతి "జో అచ్యుతానంద!జో జో ముకుందా!......" సుప్రసిద్ధమైనదే!
గోపి, రాయప్రోలు వామన మూర్తి, వెల్దుర్తి మాణిక్యాల రావు, దొప్పల పూడి రాధా కృష్ణ మూర్తి, రాచకొండ విశ్వనాధము, యడ్లపాటి నారాయణమ్మ, విభావసు ప్రభాకర శర్మ, మంగా దేవి, స్వరజ్యం రామ కృష్ణమ్మ, రమణమ్మ మున్నగు వారెందరో బాల గీతికా మంజరులను విరబూయిస్తూన్నారు.
వెలగా వెంకటప్పయ్య (తెనాలి), విశ్వేశ్వరరావు(గుంటూరు) మున్నగు మహనీయులు ఎందరో,
తేట తెనుగులోని అందాలను, బాల సాహిత్యానికి చేస్తూన్నట్టి అవిరళ సేవల ద్వారా, ప్రజలకు అందిస్తున్నారు. అమెరికా మున్నగు విదేశాలలోని ప్రవాసంధ్రుల ఎనలేని కృషి తెలుగు సాహిత్య బృందావనిని నిరంతరమూ అంద చందాలతో, పరిమళాలతో ఘుబాళింప జేస్తున్నాయి.
ఏప్రిల్ 2 వ తేదీ "అంతర్జాతీయ బాలల పుస్తక దినోత్సవము". హన్స్ క్రిష్టియన్ ఆండెర్సన్ అనే రచయిత పుట్టిన రోజు సందర్భముగా నెలకొనబడినది ఈ "ఇంటర్నేషనల్ చిల్డ్రెన్స్ బుక్ డే"

16, జులై 2009, గురువారం

సెన్సిటివ్ సెన్సారు ఇది,సారూ!


చెఱసాలలో అనేకమంది స్వాతంత్ర్య సమర యోధులు మగ్గుతున్నారు.

పుచ్చలపల్లి సుందరయ్య "శ్రీకృష్ణ జన్మ స్థానము" వైభోగాన్ని అనుభవిస్తూన్న వారిలో ఒకరు.
వార్తా పత్రికలలో, పరాయి పాలనను గురించి తీవ్రంగా దూషించే వార్తలను కత్తిరించి

లోపలకు ఇచ్చే వారు.
అందుచేత జైలులో ఉన్న నాయకులకు "కత్తిరింపులతో ఉన్న న్యూస్ పేపర్లు" చేతికి అందేవి. నాటి పత్రిక ఎడిటరు నార్ల వేంకటేశ్వర రావుకు
"మాకు ఇలాగ సెన్సారు చేయబడిన పేపర్లను ఇస్తున్నా"రని అంటూ వివరంగా లేఖ రాసారు.
పుచ్చలపల్లి సుందరయ్య ఉత్తరాన్ని చదివారు నార్ల.


కరోజు మొదటి పేజీలో అసలు ఏమీ రాయకుండా నిండా తారు పూసి, పత్రిక ను అలాగే విడుదల చేసారు నార్ల వేంకటేశ్వర్రావు.పత్రికా ప్రపంచములో ఇది చాలా ఘాటైన నిరసన. అంతే! దాంతో బ్రిటీషు వారు వార్తాపత్రికలను ఎలాంటి కత్తిరింపులనూ చేయకుండా ఖైదీలకు ఇవ్వసాగారు .

(Pramukhula Haasyamవార్తల సెన్సారుBy kadambari piduri )

హ్త్త్ప్://ఆవకాయ.కం

14, జులై 2009, మంగళవారం

చదరంగము ఆట

ఆడుచున్నది గోపి(క)
చదరంగమాట
చతురులే ఆడుతూ
చతురతలు మెరయగా //

1) "బంటును జరపర శౌరీ!"
అన్నది రాధిక, వీనుల విందుగా.

2) "నీదు బంటును నేనే కాదా!
జరుగు చుంటి"ననె శ్రీ గిరిధారి.

3) "గజమును జరపితి నేను!
కానిమ్ము క్రీడను, కువలయ నేత్రా!"

"గజ గామిని!వయ్యారి నడకలు చూసిన
ఏనుగు కదల నేరదు, వింతగ!
నీ ఓర చూపులే అంకుశమ్ములిట."

ముని పంటను నొక్కిన
ముసి ముసి నవ్వుల సిరి పంట
ఆడే క్రీడలు కన్నుల పంటగ.

4) "ఒంటె కదిలినది ఐ మూలకును."
"ఒంటిగ నా ఒంటె
నడవ నేర్వదు."

5) "తురగ వల్గనము
అదుపు లేనిది.
అతివ ఎత్తుల ముందు
చిత్తు నేనింక,
నీ చిత్తము! నా భాగ్యము! చిత్తం!"

6) "చిత్తమును కుదురుగా నిలిపి
మంత్రినైనా కదుపు"మనె గోముగా.

7) "కరణేషు మంత్రీ!
నిను జూచి ఈ వేళ
అమాంతముగా దాగె
నా అమాత్య వర్యులు"

జగడములు అనిపిస్తు,
కొంటె నవ్వులు చిలుకు
ఆ జంట మధు పలుకులే
' శ్రీరామ రక్ష ' ఎల్ల జగములకు.
*******************************************

13, జులై 2009, సోమవారం

Mad Cow Sacred Cow

హైదరాబాద్ నివాసి ఫర్హతుల్లా బేగ్ నిర్మాణతలో రూపుదిద్దుకున్న డాక్యుమెంటరీ సినిమా

"Mad Cow; Sacred Cow".

ఫర్హతుల్లా బేగ్ ఈ వెండితెర రూపకల్పన కోసం ఎంతో శ్రమించారు.

అతని పరిశోధనకు అనేక ప్రశంసలు, అవార్డులు లభించాయి.ఇదీ కథ!

కెనడా లో స్థిరపడిన భారతీయుడు ఆనందరామయ్య.

ఈతని భార్య కెనడా స్త్రీ. భార్యా పిల్లలతో హాయిగా పాశ్చాత్య దేశంలో ఉంటున్నాడు ఆనంద రామయ్య.

ఉన్నట్టుండి "mad cow" అనే పశు రోగం వలన వ్యవసాయ రంగములో సంక్షోభం ఏర్పడింది.

పశువుల సంరక్షణ, సేద్యం జీవనాధారమైన ఆనంద రామయ్య కూడా ఈ సుడిలో ఇరుక్కున్నాడు.

సస్య, పశు ప్రగతి రంగాలు అతలాకుతలమైనందు వలన

ఆ పరిస్థితులకు మూల కారణాలు ఎక్కడి నుండి మొదలైనాయో కనుగొనడానికి బయలుదేరాడు.

ఆ అన్వేషణలో అతను ఇండియాకు వచ్చాడు.

ఆ గాలింపులో వెలికి వచ్చిన సంగతులు ఎన్నో!

ఎన్నో ఫిలిమ్ ఫెస్టివల్సు లో ప్రదర్శించబడిన

ఈ డాక్యుమెంటరీ చిత్రం "గోల్డెన్ ఫిష్ అవార్డు"ను గెలిచినది కూడా!

Mad Cow Sacred కౌ,By kadambari piduri

Weaving interviews from internationally reknowned speakers such as Dr. Vandana Shiva, Maneka Gandhi, Dr. Murray Waldman, Nettie Wiebe and Swami Agnivesh with stunning visuals of a personal journey that crosses continents, the story of Mad Cow Sacred Cow takes us from the filmmaker’s own happy days of indiscriminate beef consumption to the frightening realities created by గ్లోబలైజేషన్.

(see" karmafilm "

Mad Cow Sacred Cow Trailer from KarmaFilm on Vimeo.

11, జులై 2009, శనివారం

ఎలాగైతేనేమి సాధించారు?


చింతా దీక్షితులు బాల సాహిత్య స్రష్ట. బాలబాలికలతో స్నేహము, వారి ఆట పాటల పట్ల ఆసక్తీ, పరిశీలనలు ఆయన వ్యక్తిత్వములో రంగరించుకున్న నైజములు. రిక్షా గూడు బండిలో మైకులో చెబుతూ, సినిమాలకు ప్రచారమును( నేటికీ పల్లెటూరులలో ఉన్నది.) చేసే వారు. అంతే కాదు, ఆ సినిమా వివరాలతో ప్రచురించిన కరపత్రాలను ఊరూరా పంచే వారు. ఒకసారి ఒక బాలునికి అలాంటి పాంప్లెట్టు దొరక లేదు. టవలు కట్టుకుని అప్పుడే వీధిలోనికి వచ్చారు చింతా. బిక్క మొహము వేసిన ఆ పిల్లవాణ్ణి చూసి జాలి పడ్డారు దీక్షితులు. అంతే! ఆ బండి వెనుక చిన్నబ్బాయి లాగా పరుగులు తీసారు. ఎలాగైతేనేం! కరపత్రాలను సాధించి, ఆ పిల్లోడికి ఇవ్వగలిగారు.

తృప్తిగా గాలి పీల్చుకోబోయి ఖంగు తిన్నారు చింతా దీక్షితులు .

ఆయన ఒంటి పైన అంగోస్త్రం లేదు మరి! అదన్న మాట!

***********************************************

మలేషియాలో వేడుకలు

-----------------------

A full scale installation of Sri Sri Gaura Nitai is scheduled to take place Seberang Jaya (Butterworth), Penang on Wednesday, 17th September – Thursday, 18th September 2008. Do not miss the rare opportunity in Malaysia.(At Bhaktivedanta Cultural Center (BCC) at Seberang Jaya, Penang.)
Dr. B.L. Sharma, a Vastu Architect and Consultant from Jaipur, India who generously offered free services, mentioned that the land purchased was “Godsent”. He said the land has good Vastu and instructed accordingly. at Bhaktivedanta Cultural Center (BCC) at Seberang Jaya, Penang.

(Photo
శ్రీ
బాల కృష్ణ)

(Telusaa!చింతా దీక్షితులుBy kadambari piduri )

10, జులై 2009, శుక్రవారం

గీతాంజలి

ఈ చేవ్రాలు ఎవరిదో,కనుక్కో గలిగారా?మీ ఊహ కరెక్టే!
నోబుల్ బహుమతి గ్రహీత,విశ్వకవి బిరుదాంకితుడు,
"జన గణ మన ...."రచయిత - శ్రీ రవీంద్ర నాథ టాగోరు గారిది!
Where the mind is without fear -
Where the mind is without fear
Where the head is held high;
Where knowledge is free;
Where the world has not been broken up

into fragments by narrow domestic walls;
Where words come out from the depth of truth;
Where tireless striving stretches its arms towards perfection;
Where the clear stream of reason

has not lost its way into the dreary desert sand of dead habit;
Where the mind is led forward by thee into ever-widening thought and action--
Into that heaven of freedom, my Father, let my country awake.

***********************************************
దీనికి తెలుగు అనువాదం -
----------------------
ఎక్కడమనస్సు నిర్భయంగావుంటుందో,
ఎక్కడమానవుడు సగర్వంగా తల ఎత్తుకుని తిరుగుతాడో,
ఎక్కడవిజ్ఞానం స్వేచ్ఛగా మనగలుగుతుందో,
ఎక్కడ ప్రపంచం ముక్కముక్కలై ఇరుకైన గోడల మధ్య మ్రగ్గిపోవదో,
ఎక్కడ మాటలు అగాధమైన సత్యం నుంచి బాహిరిల్లుతవో,
ఎక్కడా విరామమైన అన్వేషణ,పరిపూర్ణత వైపు చేతులుచాస్తుందో,
ఎక్కడ పరిశుద్ధ జ్ఞానవాహిని మృతాంధ విశ్వాసపుటెడారిలోఇంకిపోదో,
తలపులో పనిలో నిత్య విశాల పథాలవైపు ఎక్కడ మనస్సు పయనిస్తుందో-

ఆ స్వేచ్ఛాస్వర్గంలోకి, తండ్రీ! నా దేశాన్ని మేల్కాంచేట్టు అనుగ్రహించు

9, జులై 2009, గురువారం

చెప్పులకు పూజ

"స్వాతంత్ర్య పోరాటము" అంటేనే ఉద్విగ్నభరిత సంఘటనలకు ఆలవాలమైన

వాతావరణమును ఆవిష్కరించుకున్నట్టి చారిత్రక యవనిక.

త్రిలింగ దేశములో అనగా నేటి మన తెలుగుదేశములో

కాశీనాధుని నాగేశ్వరరావుగారు, టంగుటూరి ప్రకాశంపంతులుగారు, దుగ్గిరాల సీతారామయ్యగారు, కొండా వెంకటప్పయ్యగారు, దుర్గాబాయి్ దేశ్ ముఖ్ గారు, మున్నగు దేశభక్తులు ఎందరో ఉద్యమించారు.

"భారతమాత"ను కించపరిచే ఎంత చిన్న సంఘటననైనా ప్రజలను ఎంతో ప్రభావితం చేసేది.

"లాయిడ్" అనే ఆంగ్లేయుడు లెక్చరర్గా పని చేసేవాడు.

అతడికి హిందువుల సాంప్రదాయాలు మూఢనమ్మకాలుగా కనిపించేవి. భారతీయులు అందరూ అతడి దృష్టిలో పరమ ఛాందసులు.

"మీరు రాతి బొమ్మలకు పూజలు చేస్తారు. ప్రతి వాటినీ 'దేవుళ్ళు'గా భావిస్తూ పూజిస్తున్నారు. అదీ ఒక పూజయేనా? అంతకంటె నా కాలిచెప్పుకు పూజ చేయండి.............".

ఈ మాటలు అందరికీ తెలిసింది. ఇంకేమున్నది? క్షణాల్లో జనులలో ఆవేశం ఉప్పొంగినది.విద్యార్ధులందరూ స్ట్రైకు చేసారు. కొండా వెంకటప్పయ్య నాయకత్వం వహించగా కాశీనాధుని నాగేశ్వరరావు ఆయనకు కుడిభుజంగా నిలిచారు. వరుసగా పదకొండు రోజులు స్ట్రైకు జరిగింది.అటు పిమ్మట రాజీ కుదిరింది.

కొస మెరుపు

------------

ఆ ఇద్దరు నాయక శిఖామణులను అధికారులు కాలేజీ నుండి ఇళ్ళకు పంపించి వేసారు.

Pramukhula Haasyam

(By kadambari piduri)

8, జులై 2009, బుధవారం

బందరు -గొడుగు పేట


మచిలీపట్నం వురఫ్ బందరుతెలుగు సాహిత్య సరదాలకు తేనెపట్టు అయిన పట్టణము.

'బందరు కవితా సమితి'లో వివిధ సారస్వత సమావేశాలు,గుర్తుంచుకొనదగిన సంఘటనలనుసాహిత్య యవనిక మీద రంగులు చిందించినాయి.

ప్రొప్రైటరు వెల్లటూరి స్వామి నాధన్.

ఆయనను "గోల్డుస్మిత్ ఆఫ్ గొడుగు పేట"(Gold smith of Godugu peta) అని పిలిచే వారు.

వెల్లటూరి స్వామి నాధన్ ఒకసారిపింగళి లక్ష్మీ కాంతం గురించి ఇలాగ అన్నారు.

1)"కాంతాయ కాఫీ హోటలుప్రాంతాయ

రుజా క్రాంతాయవృధా పంధాయ."

అదే పంధాలోవెల్లటూరి స్వామి, మరి కొన్ని పృధక్కులు;;;;;;;

2)"చేత కానీ లేని పూల రంగడు"

3)పూవుల రంగడై విఱియ బూచినతంగెడు సంగడీడివై....

"ఆ నాటికి ఇంకా లబ్ధ ప్రతిష్ఠులైన కవివర్యులుగా నిల ద్రొక్కుకోలేదు.

ఆ తర్వాత "తెలుగు సాహిత్య చరిత్ర", "తెలుగు సరస్వతీ దేవికి" ముద్దుబిడ్డఅయినారు .
(
Pramukhula Haasyam పూలరంగడు By kadambari piduri )

6, జులై 2009, సోమవారం

ఇందిరమ్మ భాషలతో స్కిప్పింగ్


కాసు బ్రహ్మానంద రెడ్డి(ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి) ,తన సెక్రటరీతో హస్తినా పురమునకు,

అదేనండీ, ఢిల్లీకి వెళ్ళి రాచ కార్యాలు చక్క బెట్టుకుని వస్తూండే వారు.
ప్రధానమంత్రి ఇందిరా గాంధీ ఎదుట వినయంగా నిలబడి భక్తితో నమస్కరించేవారు.

ఆమె అందరినీ ఆప్యాయంగా పలకరించేది.

కాసు బ్రహ్మానంద రెడ్డి "మిమ్మల్ని ఆంధ్ర జనులు దేవతగా కొలుస్తున్నారు.

బీద ప్రజల పాలిటి కరుణ కురిసే అమ్మ మీరు."

ఇలా స్తోత్రం చేస్తూ, చాకచక్యంగా మన తెలుగునాడుకు నిధులను రాబట్టగలిగేవారు.

"కాసు" సార్ధక నామధేయుడే మరి!

ఇందిరా గాంధీ కూడా రాజకీయ దురంధురాలే!

ఇంగ్లీషులో మాట్లాడుతూ ,మూలనిధులలో నుండి

ఆంధ్రదేశమునకు కేటాయించిన నిధులనుండీ, ఇవ్వగలిగినంత మేర కేటాయింపులను

"ఓ.కే.! రెడ్డీజీ! I will give my help." అంటూ శాంక్షన్ చేసేవారు.

అత్యుత్సాహంతో రెడ్డి గారు, మన రాష్ట్రమునకు' నిజంగానే' ఉన్న అవసరాలనుఏకరువు పెడుతూ,

మరిన్ని నిధులను రాబట్టడానికై ప్రయత్నించేవారు.

చిన్న పథకములకు ఆమె ఉదారంగానే డబ్బును శాంక్షను చేసే వారు.

ఇక పెద్ద గ్రాంటుల ప్రస్తావన రాగానే, ఆమె భాష కాస్తా హిందీలోకి మారేది.

పాపం! బ్రహ్మానంద రెడ్డికి మన రాజ భాష రాదు!

" ఆప్ క్యా బోల్తే హై?రెడ్డీజీ!.."అంటూ, ఇందిరమ్మ హిందీ భాషలోనికి జంప్ చేసేవారు.

ఠకాల్న నిలబడి, రెడ్డి గారు భుజంపైని ఉత్తరీయాన్ని దులిపేస్తూ అనే వారు.

"సెక్రటరీ!ఈ ముం... ఇంక చేయదు గానీ ,పా! వెళ్ళిపోదాం!"

ఇందిరా గాంధీ రాజకీయ నైపుణ్యమునకు, అప్పటి "అగ్ర రాజ్యం ప్రెసిడెంటు" కూడా విస్తుబోయేవారు.

"ఆమె చాలా మొండిది."అని వ్యాఖ్యానించాడు, వారి ఎత్తుగడలకు లొంగిపోలేదన్న అక్కసుతో!

(By kadambari piduri )

2, జులై 2009, గురువారం

అరవై లక్షల గుర్రం స్వారీ!


ఐశ్వర్యా రాయ్ 1972 లో (మంగుళూరు వద్ద)జన్మించినది.ఆమె 1974 లో "ప్రపంచ సుందరి"గా ఎన్నిక అవడము భారతీయులకు ఎంతో గర్వ కారణమైనది.మణి రత్నం 1996 లో నిర్మించిన"ఇరువర్"అనే తమిళ సినిమాతో సినీ రంగంలోనికి అరంగేట్రం చేసింది.ఈ సినిమాయే తెలుగులో డబ్బింగు చేయ బడిన "ఇద్దరు".అలాగే "ఐష్ హీరోయిన్‌గా ఉన్నట్టి "జీన్స్"భారతీయ సినిమాలకు ఒక కొత్త ఒరవడిని సృష్టించినది.ఈ సినిమాలో ఐశ్వర్యా రాయ్ నటించిన యుగళ గీతము ,ఏడు ప్రపంచ వింతలు వద్ద చిత్రీకర జరగడం ఒక రికార్డు.ఈ సినిమా 1997 లో విడుదలైనది.తెలుగులో,నాగార్జున నటించిన "రావోయి చంద మామా"లో ఈమె నటించినది.హిందీ వెండి తెరకూ రాణి అయ్యి,అమితాభ్ బచన్,జయ బాధురి ల కోడలు అయి,అభిషేక్ బచ్చన్ ఇల్లాలు అయిన అద్వితీయ సౌందర్య రాశి ఐశ్వర్యా రాయ్,సారీ!ఐశ్వర్యా బచన్.

అరవై లక్షల గుర్రం స్వారీ!,

కండు కొండేన్-కండు కోండేన్అనే సినిమా షూటింగు నిమిత్తమై, ప్రఖ్యాత హీరోయిన్ ఐశ్వర్యా రాయ్ యూరోప్ కు వెళ్ళింది. బ్రిటన్ షూటింగులో ఆ అందాల రాణి ఐశ్వర్యా రాయ్ పాల్గొన్నది. అప్పుడు ఆమెకు అపురూప సంఘటన తటస్థ పడింది.స్కాట్లండు రాణి మాత్రమే స్వారీ చేసే గుర్రం పై కూర్చుని స్వారీ చేసే అవకాశం ఐశ్వర్యాకు లభించింది. "ఆఫ్ట్రాల్!గుఱ్ఱమే కదా!" అని పెదవి విరవకండి. ఆ అశ్వరాజం గారి ధర అక్షరాలా రూ.60 లక్షల పైనే! అంతే కాదండీ! సాక్షాత్తూ రాణీ గారే స్వయంగా మన భారతీయ సినీ ప్రపంచపు మహా రాజ్ఞి ఐన ఐశ్వర్యా రాయ్ కి భోజన, ఆదరువులను వడ్డించింది కూడాను. ఈ సందర్భాన్ని పూస గుచ్చినట్లు చెప్పింది ఆ తేనె కళ్ళ సౌందర్య రాశి.

కోటి ప్రణామములు!


బ్లాగు రచన మొదలెట్టాక,ఎన్నెన్ని పల్టీలు?
ఆ చిత్రీకరణలో సరదాగా ఎన్నో కొత్త విషయాలను
నేర్చు కోవలసినప్పుడు,ఎంత తిక మకలు!
ఎంతటి భావోద్వేగాలు?
రాసూన్న "ఈ అంశములు"బ్లాగు తెరపైన ఎలాగ ప్రత్యక్షమౌతాయో ననే ఉత్కంఠ!
అప్పుడే,స్కూలులోకి అడుగు పెట్టిన చిన్న పిల్లల్లాగా,
చూస్తూ..... చూసు కుంటూ,
అడుగడుగును జాగ్రత్తగా వేస్తూ!
ఈ ప్రయాణములో,"తెలుగు వెబ్ పత్రికలు"
అవిశ్రాంతంగా భాషాభివృద్ధికై చేస్తూన్న సేవలూ........
ఈ పయనంలో,ఇతర బ్లాగులను కూడా వీక్షించే
మహద్భాగ్యం కలగడమూ!"
ఇంత మంది నిష్కామంగా చేస్తూన్న
మాతృ భాషా పద అర్చనా పరిమళాలలో
నా హృదయం మరో సాహిత్య బృందావనంగా........పరిణమిస్తూ,
ఆంధ్ర భాషా దేవికి ప్రణమిల్లడమూ ......విధి లీలలే సుమీ!

1, జులై 2009, బుధవారం

మనుష్యుల నీడలు


బొమ్మ 'లో'లోపలి బొమ్మ !
కాటుకలు 2 రకములుగా ,ఎలా తయారు చేయాలో,చదివారు కదా!
సరే!ఒక కవితను చదివేసి ఆనక ఇక్కడ ప్రచురించిన ఒక బొమ్మను చూడండి.
అలాగ,ఊరికే చూసి,ఊరుకుంటే ఎలాగ?! అలాగే దీర్ఘంగా చూస్తూనే ,ఉండండి!
హమ్మయ్య!ఇందులో దాగున్న "తిరకాసు"ను కనుక్కున్నారన్నమాట!
అదేనండీ!ఈ "పిట్ట గోడ"కథ,కమామిషున్నూ!
::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::
నిన్న ఫొటో ప్రచురించ బడ లేదు.ఏవో సాంకేతిక కారణాల వలన
బొమ్మ బ్లాగులో కన బడలేదు.
ఇవాళ ఈ దృశ్య తిలకమును వీక్షించండి సరదాగా!
ఆపిల్లర్ల మధ్య మనుష్యులు నీడలు ఏర్పడినట్లుగా,
నిలబడి ఉన్నట్లుగా ఉన్నది కదూ!

ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు

"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...