24, జనవరి 2018, బుధవారం

సంపూర్ణ వసంతసేన నాటకము ;- part - 2

కూటమి నడక - కూడలి వైపుకి ;-
మాధురుడు ;- మార్గా, ఓ మార్గుడా;
మార్గుడు ;- ఎవరు? మాధురుడా!?
మాధురు ;- ఆహా, గుర్తు పట్టావు కదా, మీ పల్లెకు పక్కన ఉన్న గ్రామ నివాసిని నేను, 
ఐనా గుర్తించావు, నీ జ్ఞాపక శక్తికి నా జోహార్లు.
మార్గు ;- ఇల్లరికం వెళ్ళావు, మీ అత్తవారింటిలో వైభోగంగా ఉన్నావా!?
మాధురు ;- భోగం, వైభోగం - అదీ మగవానికి అత్తింటిలో ......
 భలే భలే! చెప్పావు మార్గా! 
పురుషునికి ఇల్లరికం - గౌరవ మర్యాదలు ............ 
హు ....... తట్టుకోలేకే - నేను నేడు ఇక్కడ ఉన్నాను.
మార్గు ;- ఓహో, కాస్త అటు ఇటుగా మన అందరి పరిస్థితి ఒకటే లాగ ఉన్నాయన్న మాట 
మాధురు ;- అన్న మాట కాదన్నా - ఉన్న మాటే అది.
మార్గు ;- చారుదత్తుడు అనే మహనీయుని బండిని తోలుతున్నాను, మరి నీవో ........
మాధురు ;- నీకు ఉదాత్త పురుషుడు యజమానిగా లభించాడు, 
నాకు అట్లాంటి మంచి ఆశ్రయం ఏదీ దొరక లేదు. ఒక జూద శాలను పెట్టుకొని, నడుపుకుంటున్నాను.
మార్గు ;- జూదశాల, ఐతే మూడు దమ్మిడీలు, ఆరు వరహాలు ........... 
మాధురు ;- ఆరు వరహాలు, పన్నెండు వజ్రాలున్నూ ...... కాదా మరి.
మార్గు ;- అంత  నిరాశ పడుతున్నావేమిటి?
మాధురు ;- బహిరంగ రహస్యమే, అసమర్ధ ప్రభువు, అతని రాబందు బంధువులూ ......
మార్గు ;- విరాట రాజుకు కీచకునిలా - బావమరిది శకారుడున్నాడు, అతని గురించేనా?
మాధురు ;- బావ, బావమరిది, ఇంకా అతని తోకలు, చాలా చాలా చాలామంది ......
మార్గు ;- ఔనా, ఐతే ఒక చోటికి వెళ్తున్నాను, వస్తావా?
మాధురు ;- ఎక్కడికి?
 మార్గు ;- మన బోటి వారి కూటమి అది. ఒక రహస్య .......
మాధురు ;- రహస్య ......
మార్గు ;- సమావేశం, రాజు గారి కోటలో ...........
మాధురు ;- హమ్మో,  నేరుగా కోటలోనే. 
మార్గు ;- ఆ,  కోటలోనే, చెరసాల వెనుక ఒక చీకటి కొట్టులో సమావేశం.
మాధురు ;- పట్టుబడుతామేమో .......
మార్గు ;- కొందరు సైనికులు, కొందరు కాపలా భటులు సాయపడ్తున్నారు.  
మాధురు ;- ఎట్లా ఎట్లా, అది ఎట్లా?                                                                  
మార్గు ;- ఔను మరి, నమ్మితీరాలి - భటుల కుటుంబాలు కూడా  ......... 
అధికార బాధితులే!
రాజు గారి చుట్టాలు, స్నేహితుల స్వార్ధం ఎవ్వరినీ వదల లేదు. 
వీరు అడగానే - వాళ్ళు సమర్పించుకోవాలి ; నోట్లో మాట నోట్లో ఉండగనే ...... ; 
చందనుడు ;- బ్రహ్మ - పిపీలిక పర్యంతం శకారాదులు దేనినీ వదిలిపెట్టరు, 
జుర్రుకుని, పీల్చి పిప్పి చేస్తున్నారు.
మార్గు ;- నిజం చెబ్తున్నాడు సంవాహకుని ఉవాచ -
నూటికి నూరు శాతం సత్యం సత్యం పునః సత్యం. 
మాధురు ;- సింహం జూలు విదిలిస్తే పడేది దుమ్ము, మన మీద. 
ఇక నుండి మీ కూటమిలో నేను కూడా సభ్యుణ్ణి. 
తుందిలుడు ;- మార్గా! ఓ మార్గా! ఓహో మార్గుడా, ఓహోహో మార్గయ్యా!          
మార్గు ;- ఓహో తుందిలుడా! ఈతను వసంతసేన గారి శకట సారధి, వీరు మాధురులు ;
వీరి నామం చందనుడు - రాజభటుడు.  
మాధురు ;- పరస్పర పరిచయాలు బాగా చేస్తున్నావు, నన్ను కూడా ...... 
ఈ కొత్తవారికి పరిచయాలు చేయండి. 
మార్గుడు ;- సంవాహకా, ఎచ్చటి నుండి రాక ......... 
మాధురు ;- సంవాహకుడు కదూ, మార్గా - 
వీనికి నూత్న పరిచయ అవస్థ - అనవసరం.
సంవాహకుడు ;- అరె, జూదశాల నిర్వాకులు, మాదురుడు - అయ్యా, మన్నించండి - 
మాధురు ;- గుర్తున్నానన్నమాట!!!! హూ ......... జూదశాలకు నిత్య అతిధివి. 
జూద మండపంలో తిష్ఠ వేసి, వినోదం పొందే వాడివి. 
మంటపం అద్దె ఎగకొట్టే చిట్కాలు నీ దగ్గరే అందరూ నేర్చుకోవాలి మరి.
సంవాహకుడు ;- ఏమి చేయగలను? 
జూదంలో గెలుపు అనే దేవత నన్ను కరుణించడం లేదు, 
ఒక్క అవకాశం చాలు, ఒక్క గెలుపు చాలు - 
నీ బాకీ - చిటికెలో తీరుస్తాను కదా, మీ మీద ఒట్టు.
మాధురు ;- సరి, సరి - తిన్నగా నా పైననే, వద్దు, 
ఒట్టు తీసి, గట్టు మీద పెట్టు.
మార్గు ;-  మీ వాదనలు తరువాత - కాస్త, ఈ మార్గుని మాట చెవికి ఎక్కించుకోండి. 
ఇప్పుడు - మన గమ్యస్థానానికి బయలుదేరుదాం. 
మాధురు ;- ఈ మాధురుడు సిద్ధం, ఆర్యక కేంద్రం వద్దకు.
సంవాహకు ;- మా సంవాహక, తుందిలుల జంట కూడా - ఎప్పుడో మీ జతలో చేరాము, 
తుందిలు ;- కదలండి అందరూ, పదండి, ముందుకు పదండి ముందుకు. 
అందరు ;- మును ముందుకు -ముందుకు,  పదండి ముందుకు. ;
*****************************************;

[ previous episode ;-       అధ్యాయ శాఖ ;- 12 ;- మీ గృహమున మా నగలు మీ భద్రం] ;
♣♣♣♣♣♣ ♣♣♣ ♣♣♣   ♣♣♣♣♣♣ ♣♣♣ ♣♣♣
బౌద్ధ సన్యాసి సంవాహకుడు ;-
బుద్ధం శరణం గచ్ఛామి ;
సంఘం శరణం గచ్ఛామి ;
ధర్మం శరణం గచ్ఛామి ;
[సంవాహకుడు నడుస్తున్నాడు.]
కుశావతి ;- ఇదిగో స్వామీ వరహా, స్వీకరించండి! 
ఈ పేద కుశావతి ఇస్తున్నది, స్వీకరించండి!
సంవాహక ; శుభమస్తు కుశావతీ
కుశావతి ; అరె సంవాహకా, నీవా, నువ్వు ఆర్యకుని పటాలంలో చేరావని, 
సైనిక శిక్షణ పొందుతున్నవని విన్నాను.
సంవాహక ;- వెళ్ళాను, చేరాను. కానీ పరాక్రమవంతులకే యుద్ధం చేయడం చేతనౌతుంది. 
నేను యుద్ధ పిరికిని, సభా పిరికిని కూడా. 
కుశావతి ;- అందుకని పారిపోయి వచ్చి, బౌద్ధ సన్యాసివి ఐనావా [నవ్వింది]
సంవాహక ;- సమాజం, వ్యవస్థ - నిలకడగా ఉండాలంటే - నిజాయితీ అవసరం. 
నీతి పట్ల ఆదరణ భావం ప్రతి మనిషికి ఉండాలి. 
వ్యక్తులలో - నీతి, నిజాయతీల ఆచరణలు నిలుచునట్లు - చేయగలవారు 
బోధ గురువులు.
కుశావతి ;- అందుకే ఇట్లాగ కాషాయాంబర ధారివి ఐనావు, అంతేనా!
సంవాహక ;- సంఘ జీవన విధానములందు సమ తూకమును కాపాడటం మా విధి.
కుశావతి ;- నిజమే, నువ్వు మంచి బాధ్యతను నిర్వహిస్తున్నావు. 
అరుగో వసంతమ్మ వస్తున్నారు.
వసంత సేన ;- చెరువులో తామరలు, కలువలు వికసించి, కళ కళ లాడ్తున్నవి, కుశా! 
కుశావతి ;- ఔనమ్మా, వికసించిన పూలు, ఆ చెరువుకు ఎంతో శోభ నిస్తున్నవి.
వసంత ;- ఈ ఉద్యానవనానికి వచ్చిన ప్రతిసారీ - వాటిని కోయాలని ఆశ. 
కానీ ఎట్లా కోయగలం?
కుశావతి ;- ఔనమ్మా, ప్రతిసారీ - ఉత్తి చేతులతో వెళ్ళి పోతున్నాము.
[సంవాహక ;- స్త్రీలు ఇరువురు సంభాషిస్తున్నారు,  
వారి మాటలను వినిన సంవాహకుడు -  చెరువు దగ్గరికి వెళ్ళి, నీరజములను తెచ్చాడు.]
సంవాహక ;- ఇవిగోనమ్మా, పద్మాలు, కువలయాలు ;
వసంత సేన ;- ధన్యవాదాలు, సంతోషం స్వామీ, ఇతను ......
కుశావతి ;- ఇతను సంవాహకుడు. ఆర్య చారుదత్తుని వద్ద పని చేసే వాడు.
వసంత సేన ;-  ఔను కదూ, ఇదేమిటి, బౌద్ధ సన్యాసిగా.... !?
సంవాహక ;- అమ్మా, జూదం దుర్వ్యసనం. చాలా చెడ్డ వ్యసనం. 
నేను జూద శాల మాధురునికి - డబ్బు చెల్లించ లేక పోయాను. 
వాళ్ళు నన్ను తరుముకుంటూ వచ్చారు.
వసంత సేన ;- ఆ, అప్పుడు మా గృహంలో దూరి, దాక్కున్నావు.
కుశావతి;- అప్పుడేమో, మా వసంతమ్మ - మాధురుని మనుషులకు ధనం చెల్లించి, 
నీ బాకీని చెల్లు వేసారు కదా.
సంవాహక ;- అప్పుడు నాకు చాలా సిగ్గు వేసింది. పశ్చాత్తాప పడ్డాను. 
కుశావతి ;- చారుదత్తుల వద్ద ఉన్న మనిషివని అమ్మకు అభిమానం. 
అందుకే నిన్ను ఋణ విముక్తుని చేసింది సంవాహకా, కాదు కాదు - స్వామివారూ!
వసంత సేన ;- ఇంక సెలవు స్వామీ, ఈ ధనమును తీసుకోండి. 
ప్రజల క్షేమ, సౌకర్యాలకై వినియోగించండి.
కుశావతి ;- సంవాహకుడు మంచి నిర్ణయం తీసుకున్నాడు. 
వసంత సేన ;- మేలైన బాటలో సాగే జీవన విధానం - గౌరవాన్ని ఇస్తుంది.
కుశావతి ;- అది నిజమేనమ్మా, ముందు సైనికునిగా మారాలని అనుకున్నాడు. 
కానీ - ఇతని వ్యక్తిత్వానికి అది నప్పలేదు. 
అక్కడే ఉంటే - ఆర్యకుని పటాలానికి చిక్కులే కలిగేవి. 
సైన్యానికి పిరికిపందలు భారం ఔతారు.
వసంత సేన ;- భగవంతుడు ప్రాణికోటికి వివిధ సామర్ధ్యాలను అనుగ్రహించాడు. 
అందరూ తమ తమ శక్త్యానుసారం, పనులను చేస్తూ జీవిత గమనం సాగించాలి. 
అటువంటి గమ్యాలకై నిర్మించుకున్న సదాశయ మార్గాలు సంఘానికి, 
ప్రకృతికి మేలు చేకూరుస్తూ, శాంతి సౌభాగ్యాలను ఒసగుతాయి.
ఇతని ప్రవృత్తికి అనుగుణమైన సరైన దారిని ఎన్నుకున్నాడు. 
సంవాహకుని వంటి వారి సంఘ సేవ - లోక కళ్యాణదాయిని ఔతుంది.
వసంత సేన ;- తుందిలుని పిలువు కుశా! 

ఇంక వెళ్దాము. సెలవు సంవాహక స్వామీ! 
;
♣♣♣♣♣♣ ♣♣♣ ♣♣♣   ♣♣♣♣♣♣ ♣♣♣ ♣♣♣
మైత్రేయుని పొరపాటు ;- ;    [ చారుదత్తుని ఇల్లు ] ;-
చారుదత్తుడు ;- మైత్రేయా, వర్ధమానకా, 
             ఆమె ఆభరణాలను భద్రంగా కాపలా కాయండి, 
రదనికా, రోహణునికి పాలు ఇచ్చావా, 
రదనిక ;- ఇచ్చాను, రోహణ బాబు పాలు తాగారు, 
ఇంక మీకోసం ఎదురుచూస్తున్నారు. మీరు కథ చెప్పాలని.
ధూత ;- రామాయణ, భారతం, భాగవతం, ఉపనిషత్తులు - 
 ప్రతి రోజూ - ఏదో ఒక కథ చెప్పాలి. 
రదనిక ;- లేకుంటే నిద్ర ఎట్లా పడుతుందమ్మా, 
                  పిల్లలకు కన్నతల్లి పలుకులు తేనె ఊటలు కదా.
ధూతమాంబ ;- గదిలోకి వెళ్తున్నాము. 
చారుదత్త ;- ఆభరణముల సంరక్షణను - ఆ ఇద్దరు - బాధ్యతగా చేస్తారులే, ధూతా! 
ఎంతైనా - స్త్రీలకు నగలంటే ఎంతో ఇష్టం. [ ఆమె నవ్వింది]
వర్ధమానకుడు ;- సరే స్వామీ! మీరు నిశ్చింతగా నిద్ర పొండి. 
బయట - నేను, బండివాడు మార్గుడు - ఉంటాము. ఈగ కూడా జొరబడలేదు.
మైత్రేయుడు ;- వర్ధమానా, నీ మాట నాకు కొండంత ధైరాన్ని కలిగించింది. 
కాసినీ కూసినీ కావు కదా, పెట్టెడు నగలు .......... భోషాణములు కూడా ఇక్కడ లేవు. 
దాన ధర్మముల కోసం స్వామి చారుదత్తుల ఆస్థిపాస్తులు, బంగారం,  వస్తువులు అన్నీ ఐపోయాయి, 
ఇంక తలదాచుకోను తాతల నాటిది, ఈ పాత ఇల్లు మిగిలింది. 
హా - నాకేమో ఈ ఆవులింతలు ఆగవు, కంటి రెప్పల మీద కునుకు వేళ్ళాడుతున్నది. 
ఇంక ఈ నగల మూటను నా తల కిందే పెట్టుకుని పడుకుంటాను.
;
[రాత్రి - దొంగ - శర్విలకుడు ]
శర్విలకుడు ;- పురాతనమైనదే ఐనా ఈ ఇంటి గోడలు దిటవుగా, గట్టిగా ఉన్నవి. 
ముందు ఇద్దరు కాపలా ఉన్నారు. 
కాబట్టి ఇంక ఈ వెనుక వైపు మాత్రమే ఈ శర్విలకుడికి మిగిలిన దారి. 
[కన్నం వేసి, దూరాడు] 
;
మైత్రేయుడు ;- వర్ధమానా, నువ్వు కూడా నిద్ర పట్టక, తచ్చాడుతున్నావు, 
ఏమిటి, గాలికి దీపం మలిగినట్లున్నది. ఈ నగల మూటను నీ దగ్గర పెట్టుకో నాయనా! 
హమ్మయ్య - ఇప్పుడు ఇంక నాకు తగని నిశ్చింత. 
గుండెల మీద చెయ్యి వేసుకుని - హాయిగా నిద్ర పోతాను.
[ శర్విలకుడు గప్ చుప్ గా మూటను అందుకున్నాడు]
;
శర్విలకుడు ;- ఆహా, వేకువఝామున కలలోకి నా ప్రేయసి కుశావతి వచ్చింది. 
పొద్దున్నే వచ్చిన స్వప్నాలు నిజమౌతాయని నానుడి. 
కనుకనే ఈ శర్విలకుడికి ఇంత సులభంగా సొత్తు దొరికింది. 
వసంతసేనమ్మకు ఈ నగలు ఇస్తాను. దాంతో నా ప్రియురాలికి దాస్య విముక్తి. 

ఆ యజమాని వసంతమ్మకు ఋణం తీర్చగలుగుతున్నాను. 
ఆ ఆలోచనతో - నా మనసును మేఘాలలో తేలిపోతున్నది.
శర్విలక ;- వచ్చిన రంధ్ర ద్వారం నుండే బైటికి చేరి, ప్రహరీ గోడను ఎక్కి, దూకాను. 
హమ్మయ్యో, ఆ దిక్కున దండ నాయకులు - చందనకుడు, వీరకుడు ఉన్నారు. 
సరే, పక్క బాటలో నుండి జారుకుంటాను.
దూతకరుడు ;- శర్విలకా, ఆగు ఆగు. 
శర్విలకుడు ;- అరె, దూతకరుడు, దర్దురకుడు - 
మీరు ఇంత అపరాత్రి వేళ వీధులలో ......
దూతకరుడు ;- మామూలే కదా, మా మిత్రద్వయం - 
జూదంలో రేయిం బవళ్ళు గడపటం. నీ చేతిలో ఏమిటో ఆ మూట!?
దర్దురకుడు ;- నా మిత్రుడు - దూతకరుడి సందేహం నివృత్తి చేయనిదే 
అడుగు ముందుకు వేయలేవోయీ! 
శర్వికుడు ;- నా ఇష్ట సఖి - వేశ్యా వాటికలో ఉన్నది.  
ఆమె తల్లిదండ్రులు వేశ్య మాత వద్ద అప్పు తీసుకున్నారు. 
చేసిన అప్పును తీర్చేదాకా - నా రమణి కుశావతి - 
వారి వద్దనుండి ఈవలకు రాకూడదు కదా. 
నేను ఆమెను పెళ్లి చేసుకోవాలంటే - ఆ శుల్కం చెల్లించి తీరాలి. 
గత్యంతరం లేని పరిస్థితులలో చోరత్వానికి పాల్పడ్డాను.
దర్దురకుడు ;- వసంతసేన నుండి నీ మగువను తె
చ్చుకొని, సుఖంగా ఉండు శర్విలకా, 
ఈ దర్దురకుని మాట వేదవాక్కు.
దూతకరుడు ;- నీ కుశావతిని తెచ్చుకుని, 
పరిణయమాడి, పిల్ల పాపలతో - కుశలముగా జీవించుము - 

ఇది ఈ దూతకరుని దీవెనలు, శర్విలకా, క్షేమంగా వెళ్ళి, లాభంగా మరలుము.
ఇద్దరు ;- 'మీ శర్విలక -  కుశావతి జంట' 
కలకాలం సుఖంగా సౌఖ్యాల క్రీడలలో ఓలలాడుదురు గాక.
శర్విలక ;- సంతోషం. మీ అశీస్సులు ఫలించాలి. సెలవు, వెళ్తున్నాను.
దూతకర ;- మిత్రమా, దర్దురకా, అటునుండి ఏదో ధ్వని ........
దర్దురకుడు ;- ఔను దూతకరా! చారుదత్తుని ఇంటి నుండి - ఆ సవ్వడి ......... 
పద, చూద్దాము.
చారుదత్తుడు ;-  మైత్రేయా, మన ఇంటిలో ఏమి మిగిలి ఉంటాయని - 
దొంగ వస్తాడు,  చోర వృత్తి కొత్తగా చేపట్టిన వాడు ఐ ఉంటాడేమో కదా!
మైత్రేయ ;- చిత్తం. కానీ - కించిత్తు అదృష్టం - గుడ్డిలో మెల్ల. -
మిత్ర వర్ధునికి ఇచ్చాను - వర్ధమానా, వసంతా దేవి రత్నాల నగల మూట - 
నీకు ఇచ్చాను కదా, అవి నీ వద్ద భద్రమే కదా.
వర్ధమానకుడు ;- నాకు ఇచ్చావా, ఎప్పుడు, రాత్రి నాకు గాఢ నిద్ర పట్టింది. 
అసలు మెలకువయే రాలేదు .......
చారుదత్త ;- ఆ, ధూతా, రదనికా, ఇంట్లో ఎక్కడైనా పడి పోయాయేమో, వెదకండి.
మైత్రేయ ;- క్షమార్హుడిని కాను - దేవరా! వర్ధమానుడు అనుకుని, 
ఎవరి చేతికో నగల మూటలను ఇచ్చేసాను.
ధూతమాంబ ;- ఏడవకు మైత్రేయా, ఏడ్చి ప్రయోజనం ఏముంటుంది!?
రోహణుడు ;-  అమ్మా, ఏం జరిగింది!?
ధూత ;- అయ్యో, నా చిట్టితండ్రికి నిద్రా భంగం కలిగింది. 
రదనికా, రోహణ బాబును లోపలికి తీసుకు వెళ్ళు. 
ఆర్య చారుదత్తులు, వీటిని గ్రహించండి.
చారుదత్త ;- నీ నగలు వలిచి ఇస్తున్నావా, భార్యగా నీ చేయిని పరిగ్రహించాను. 

చివరికి భర్తగా నా నుండి నీకు లభించిన ప్రతిఫలం ఇంతే కదూ!
ధూత ;- స్వామీ, మీ కష్ట సుఖములలో భాగస్వామిని ఐనప్పుడే - 
అర్ధాంగిగా నా బ్రతుకు సార్ధకత, నా మీద కృపతో వీనిని స్వీకరించండి. 
చారుదత్త ;- మైత్రేయా, మీరిద్దరు - ఈ నగలను - ఆమె ఇంటికి వెళ్ళి ఇచ్చివేయండి.  
మైత్రేయ ;- వసంతసేనమ్మకు - పొరపాటు జరిగింది - కనుక 
మా అమ్మగారి నగలను బదులుగా ఇస్తున్నాము. - అని చెప్పి, ఇచ్చి వస్తాము దొరా!
;
♣♣♣♣♣♣ ♣♣♣ ♣♣♣   ♣♣♣♣♣♣ ♣♣♣ ♣♣♣;
 కలికి కామాక్షి పయనం  ;-
రదనిక  ;- కలవారి కోడలు కలికి కామాక్షి ; కడుగుచున్నది పప్పు కడవలో పోసి ; 
అప్పుడే వచ్చెను ఆమె పెద్దన్న ; కాళ్ళకు నీళ్ళిచ్చి కన్నీరు నింపె ........
పట్టె మంచము మీద పడుకున్న మామా ;;
మా అన్నలొచ్చారు, మమ్మంపుతారా!? 
నేనెరుగ నేనెరుగ, మీ అత్తనడుగు ;;
ముక్కాలి పీటపై కూర్చున్న అత్త ; 
మా అన్నలొచ్చారు, మమ్మంపుతారా!?  ..............
[రదనిక కూనిరాగం తీస్తూ, సన్నగా పాడుతున్నది]; 
ఇంతలో వాకిలి నుండి వస్తూన్న వ్యక్తి భగీరధుడు]
భగీరధ ;- నమస్కారం బావ గారూ!
చారుదత్తుడు ;- భగీరధా, ఉభయ కుశలోపరి. 
దూతమాంబా! మీ పెద్దన్నయ్య వచ్చారు ....
రదనిక ;- భగీరధయ్య బాబుగారా, దండాలు, 
అమ్మగారూ ..... [లోనికి వెళ్ళింది]
ధూత ;- మజ్జిగ తీర్ధం పుచ్చుకోండి అన్నయ్యా, 
అమ్మ, నాన్నగారు, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు - 
అందరూ కులాసా కదా, చిన్ని పెళ్ళి కుదిరిందా!?
భగీరధ ;-  ఆ పని మీదే  అందుకే వచ్చాను, 
మీదే బాధ్యత, పెద్దలు,  మీరు ముందుంటే మాకు భరోసా. 
మీరందరూ తప్పక రావాలి బావ గారూ! మండలం రోజులలో ముహూర్తం. 

ఇదిగో తొలి లగ్న పత్రిక మీకే.
బావగారూ! పెళ్ళికి సకుటుంబ సమేతంగా మీరు విచ్చేయాలి. 
చారదత్తుడు ;- వివాహ సుముహూర్త వేళకు వస్తాము
భగీరధూ! మాకు ఇక్కడ ఇల్లూ వాకిలి, చిన్న వ్యాపారము - చూసుకోవాలి కదా.
భగీరధ ;- వ్యాపారం - అన్నాక లాభ నష్టాలు ఉంటాయి. 
ఇప్పుడు చిన్న వ్యాపారం - మునుపటి దశకు - 
ఉన్నత స్థాయికి తప్పక చేరుకుంటారు బావా. 
చారుదత్త ;- ఇట్లాంటి ఒడిదుడుకులు - 
జీవితంలో ప్రతి మనిషికి తటస్థ పడతాయి. 
క్రుంగిపోకుండా కాలం గడపగలిగిన మనిషియే స్థితప్రజ్ఞుడు. 
భగీరధ ;- అందుకే బావా, మిమ్మల్ని చూస్తే - నాకు  గర్వం కలుగుతుంది. 
రదనిక ;- బాబు గారూ, భోజనం సిద్ధం, వడ్డించమంటారా!? 
అమ్మగారు అడగమన్నారు.
భగీరధ ;- సరే, మా సోదరినైనా - శుభకార్యానికి పంపిస్తే మాకు ఆనందం.
ధూతమాంబ ;- మరి రోహణుని కూడా తీసుకువెళ్ళనా!? 
రదనిక ;- రోహణ బాబుకు - కొత్త గాలి, నీళ్ళు పడవు కదా అమ్మా.
చారుదత్త ;- నిజమే, గతంలో కొన్నిసార్లు జరిగింది కదా! 
బిడ్డకు కొత్త వాతావరణం గిట్ట లేదు.
రదనిక ;- సుస్తీ చేసింది అయ్యా.
చారుదత్త ;- ఇప్పుడు ధూతమాంబ మీతో వస్తుంది. 

పెళ్ళిరోజుకు, నేను, రోహణునితో వస్తాను.
భగీరధ్ ;- మీరెట్లా సెలవిస్తే అట్లాగే ఆ బావగారూ!
♣♣♣♣♣♣ ♣♣♣ ♣♣♣   ♣♣♣♣♣♣ ♣♣♣ ♣♣♣;
;
ఆర్యకుడు బందిఖానా ;- 
కిటికీలో నుండి కోకిల పాట వినిపిస్తుంది. అటు వెళ్ళబోయింది కుశావతి. 
"కుశావతీ! ..... "  వసంతసేన గొంతు అది.
వసంతసేన  ;- ఇక్కడ ఒకతను వచ్చాడు, ఎవరో చూడు. 
కుశావతి ;- [సిగ్గు పడుతూ] శర్విలకుడు అమ్మా ...... 
వసంత సేన ;- గుర్తు పట్టావే. [పకపకా నవ్వుతూ అంటూ ]
శర్విలకా, నీ చేతిలో ఆ మూట ఏమిటి, 
ఏదీ, నువ్వు తెచ్చిన మూటను విప్పి, చూపు.
[చూపుడు వేలుతో సంజ్ఞ చేస్తూ అన్నది వసంత సేన]
శర్విలకుడు ;-  సరే [తటపటాయిస్తూ చూపించాడు ]
[రమణులు ఇద్దరు ఉలిక్కిపడ్డారు]
కుశావతి ;- అయ్యో, ఈ నగలు ....... 
చారుదత్తుల ఇంట్లో నుండి దొంగిలించావా ఏమిటి!?
శర్విలకుడు ;- అబ్బే, అదేం కాదు, కాదు.
కుశావతి ;- కాక, ఇంత విలువైన నగలు .......  
ఈ వజ్రాభరణాలు ......  ఈ ఊళ్ళో కొద్దిమందికే ఉన్నవి.
వీటిని స్వయంగా వసంతసేన - వారి ఇంట్లో దాచిపెట్టమని ఇచ్చారు. 
నువ్వు, ఇంకా ఏవైనా 
కాకమ్మ,  పిచుకమ్మ కథలు అల్లి, చెప్పాలని ఆలోచిస్తున్నావా!?
శర్విలకుడు ;- తప్పైపోయింది, గుంజీలు తీస్తాను, 
ఇదంతా నీ కోసమే చేసాను కుశావతీ! 
కుశావతి  ;- చేసింది దొంగతనం, హూ .........  ఇంకేమున్నదని 
చెప్పుకోవడానికీ, సమర్ధించు కోవడానిన్నీ. 
మునుముందు ఇంకా ఏమి అవస్థలు కలుగుతాయో ఏమో ......... 
పైగా నా కోసం ఇంత నీచం [ఆమె ఎక్కిళ్ళు పెడ్తున్నది]
వసంతసేన ;- ఊరుకో కుశావతీ! ఇంత తెగింపు ప్రేమ నీ కోసమే కదూ! 
శర్విలకునికి నీపై అనురాగం మెండు. 
[ఇంతలో మైత్రేయుని రాక]
మైత్రేయుడు ;- కుశావతీ! మీ స్వామిని సొమ్ములు మేము భద్రపరచ లేక పోయాము. 
కనుక, ఈ నగలను వసంతసేనకు ఇవ్వమని నన్ను పంపారు చారుదత్తులు.
వసంతసేన ;-ఈ రత్నాభరణములు - ధూతమాంబ ధరించినవి కదూ.
[మనసులో అనుకున్నది] 
వసంతసేన ;- భూమి గుండ్రంగా ఉన్నది - కుశా! 
నీ సఖుడు శర్విలకుని వలన అనుకోకుండా మేలు జరిగింది. 
కుశావతి ;- సాక్షాత్తు వారివి ఇవి. అర్ధంపర్ధం లేని పనులు చేసాడు శర్వుడు.
వసంతసేన ;- ప్రేమ కోసం, ప్రేమ వలన, ప్రేమ తోటి - ఇంత సాహసం.
ఎంతైనా అటువంటి ప్రియుడు లభించాడు నీకు.
భాగ్యశాలినివి కుశావతీ! శర్విలకా, మీ ఇద్దరి పెళ్లిని నేను చేస్తాను. 
నువ్వు నిశ్చింతగా ఉండు. 
కుశావతి ;- అమ్మా, మీ తల్లిగారికి కోపం వస్తుందేమో. 
వసంతసేన ;- మా జననికి నేను నచ్చజెబుతాను. మైత్రేయా, 
చారుదత్తుల వారికి నా కృతజ్ఞతలు తెలుపు.
మైత్రేయుడు ;- వసంత దేవీ! విధివిలాసం అంటే ఇదే కాబోలు! 
మీ ఆభరణాలను మీకు చేర్చాను.
వెళ్ళివస్తాము. పద వర్ధమానకా!
[  మైత్రేయుడు, వర్ధమానకుడు వెళ్లిపోయారు. ]
శర్విలకుడు ;- జీవితంలో ఒకే ఒక్కసారి - గ్రహపాటు బాగోలేక చేసాను పొరపాటు. 
ఇంక ఎన్నడూ చేయను, భూమి మీద ఒట్టు వేస్తున్నాను.
వసంతసేన ;- అన్నేసి ఒట్లు ఎందుకు!?, [నవ్వుతూ] 
శర్విలక, కుశావతిల జంట కన్నుల పంట. 
పెళ్ళినాటి ప్రమాణాలు మరువక, కట్టుబడి ఉండు, అదే పది వేలు. 
శర్విలకుడు ;- పెళ్ళి ముహూర్తాలు పెట్టుకోగానే, మీ వద్దకు మళ్ళీ వస్తాము. 
మీ ఆశీస్సులు తీసుకుంటాము.
వసంతసేన ;- శర్విలకుని, కుశావతిల జంట - సంతోషం కలకాలం వర్ధిల్లాలి. 
శర్విలకుడు ;- బయట కోలాహలం, అదేమిటి!? 
అక్కడ వీరకుడు, 
చందనకుడు - పరిగెడుతున్నారు.
[బైట అరుపులు, కేకలు ;- ప్రజలు యావన్మందికీ హెచ్చరిక. 
అందరూ ఈ చాటింపును శ్రద్ధగా వినండి.  
ఆందోళనకారుడు ఆర్యకుని చెరసాలలో వేసారు.
కనుక ప్రజలు - తగు జాగ్రత్తల్తో మెలగవలసినదిగా తెలుపుతూ -
టముకు వేస్తున్నాము - ఒహో .... ]
శర్విలకుడు ;- కుశావతీ! నువ్వు మీ కన్నవారి ఇంటికి 
వెళ్ళు. నేను నిన్ను ఆనక కలుస్తాను. నా ప్రాణ స్నేహితుడు 
ఆర్యకుడు చిక్కుల్లో ఇరుక్కున్నాడు, నిన్ను మళ్ళీ కలుస్తాను.
వసంతసేన ;- తుందిలా! కుశావతిని -ఆమె పుట్టినిల్లు వద్ద దించు. 
తుందిలుడు ;- అమ్మా, కుశావతి సోదరుడు రేభిలుడు ఉండే స్థలం నాకు తెలుసు, 
అక్కడ ఈమెను అప్పగించి రమ్మంటారా!?  - 
కుశావతి ;- కానీ మా అన్న చెప్పా పెట్టకుండా దేశాంతరములకు వెళ్ళాడు .....
శర్విలకుడు ;- రేభిలుడు - నీ సోదరుడా, ఆహా, అతను మంచి గాయకుడు.
ప్రజలలో ఉత్సాహాన్ని నింపుతున్నవి అతని పాటలు. 
మా దళమునకు రేభిలుని గానం ద్వారా అత్యంత ఉపకారం చేకూరుస్తున్నాడు. 
వసంతసేన ;- మొత్తానికి వెదకబోయిన తీగలు కాలికి తగులుతున్నవి. 
శర్విలకుడు ;- ధన్యవాదములు అమ్మా! మీ మేలు ఎప్పటికీ మరువలేను. 

ప్రస్తుతం - దేశరక్షణ - తక్షణ కర్తవ్యం నాకు. సెలవు తల్లీ! 
**********************************************************; ;
 ;  ©   ®   ©   ®  ©   ®  ©   ®  ©   ®  ©   ®  ©   ®  ©   ®  ©   ®  ©   ®  ;
 **********************************************************; 
♣♣♣♣♣♣ ♣♣♣ ♣♣♣   ♣♣♣♣♣♣ ♣♣♣ ♣♣♣
మళ్ళీ చారుదత్తునికి ఇంటికి ఆమె ;-
;
వసంతసేన ;- శర్విలకుడు, కుశావతి వెళ్ళిపోయారు.
కుశ వెళ్ళిన తర్వాత - ఒంటరి తనం - తెలిసి వస్తున్నది
ధూతా దేవి నగలు - నాకు భారంగా అనిపిస్తున్నవి. 
వెంటనే వీటిని ఆమెకు చేర్చి తీరాలి. తుందిలుడా! 
తుందిలుడు ;- బండిని సిద్ధం చేసి ఉంచాను దేవీ!
వసంత సేన ;- తుందిలుడా! ఆర్యకుడు ఎవరు? 
                       నగరంలో ప్రశాంతత - స్థిరంగానే ఉన్నదా!?  
తుందిలుడు ;- కొంచెం కల్లోలంగా ఉన్నదమ్మా! 
ఐనా ఫరవాలేదు, కొంత సద్దు మణిగినట్లే ఉంది. 
వసంతసేన ;- తుందిలా, ఎందుకైనా మంచిది, 
పక్క సందు నుండి శకటమును పోనివ్వు.
తుందిల ;- చారుదత్తుల ఇల్లు వచ్చింది అమ్మా! 
వసంత సేన ;- అదే తోట, అదే ప్రశాంతత.
ఆ ఇద్దరు పరిచారకులు పంచపాళీలో చదరంగ క్రీడను చెరిగేస్తున్నారు.

మైత్రేయుడు ;- వర్ధమానా, చూడు పందెం.
వర్ధమాను ;- మైత్రేయుని శకటు ఓడి పోయింది, గెలుపు పందెం 
ఈ వర్ధమానునిదే కదా.
వసంతసేన ;- గృహమునందు యజమాని ఉన్నారా!? 
మైత్రేయ ;- చారుదత్తా! వసంతసేన వచ్చారు. 
చారుదత్తుడు ;- వసంతసేన ఆగమనం ఆశ్చర్యదాయకం. 
మైత్రేయా, ఈమెకు నగలను ఇచ్చావా!?
మైత్రేయ ;- చారుదత్త స్వామీ, మీరిచ్చిన మూటను 
               ఆమెకు అప్పటికప్పుడు - 
                   అప్పుడే ఇచ్చేసాను దేవరా! 
వసంతసేన ;- అరె, మైత్రేయుని నిజాయితీని శంకించకండి. ఇవేగా ఆ నగలు, చూసి చెబుతారా?
చారుదత్త ;- ఔను, మీకు నచ్చలేదు కాబోలు. మీ ఆభరణముల విలువకు సమం అవవు. 
నెమ్మదిగా - తరువాత వాటి విలువను - ద్రవ్య రూపంలో ఇస్తాను. 
ఈ పేదవాని వలన తప్పిదం జరిగి పోయింది. మీ సొమ్మును కాపాడ లేక పోయాను. 
వసంతసేన ;- అరె, మీ మీద నాకు భరోసా ఉన్నది. 
చోరులు తెగించారు, మీరేమి చేయగలరు? 
ఇవి మీ భార్యవి కదా, కళళలాడుతున్న ధూతాంబ ఆభరణాలను - 
మీరు నాకు పంపించారు. నాకు దోషం, పాపం అంటుకుంటాయి. 
ఆవిడకు ఇవ్వండి.
మైత్రేయ ;- అమ్మగారు తమ సోదరి పెళ్ళికి వెళ్ళారు. 
దేవరా! వంట గదిలో భోజన పదార్ధాలు ఉంచాను. 
ఏదో మగవాని చేతి వంట, మీరు సర్దుకోక తప్పదు.
వర్ధమానుడు ;- దొరా! మైత్రేయుని ఆప్తులు వచ్చి ఉన్నారు. 
పండుగ పనులకు ఇతని చేతి సాయం కావాలంటున్నారు - బైట నిలబడి ఉన్నారు.
చారుదత్ ;- సరే, మైత్రేయా! అంత కావలసిన బంధువులు పిలుస్తున్నారు కదా, వెళ్ళు. 
భోజనాదులు, పనులు - మేము చూసుకుంటాములే.
&
వర్ధమానుడు ;- తుందిలా, నీ గూడుబండిని బాగా అలంకరించావు. శభాష్!
తుందిలుడు ;- నా పని అద్దంలాగా ఉంటుంది - అని 
మా వసంత దేవి మెచ్చుకుంటుంటారు, తెలుసా. 
వర్ధ ;- ఎవరి కర్తవ్యాన్ని వారు సక్రమంగా చేస్తుంటే 
లోకంలో కరువులు, కన్నీళ్ళు ఉండవు కదా.
మైత్రేయుడు ;- మా ఆప్తులు వచ్చారన్నావు కదా, వర్ధమానా, ఏరీ, ఎక్కడ?
వర్ధ ;- అమాయక బ్రాహ్మణుడా. మైత్రేయా, 
నీకు అర్ధం కావాలంటే పుష్కర కాలం పడుతుంది. 
మైత్రేయుడు ;- అంటే .... ?
వర్ధమాన ;- యజమాని పెళ్ళికి ఊరికి వెళ్ళుట హుళక్కి అని భావం. 
పద, ఆ గుట్ట మీది గుడికి వెళ్ళి వద్దాము.  
తుందిలుడు ;- ఓహో, మీ జోడీ - అట్లాగ కులాసాగా తిరిగిరండి. 
మీకు ఈ తుందిలుడి శకునం అభయం, శుభం భూయాత్.  

 [నవ్వాడు తుందిలుడు] ;
;
♣♣♣♣♣♣ ♣♣♣ ♣♣♣   ♣♣♣♣♣♣ ♣♣♣ ♣♣♣
శకారుని ఘోష యాత్ర  ;-
శకారుడు ;- విటూ, ఆ కాలి గజ్జెలు, ఆ అందెల సవ్వడి  ...
వసంతసేనవి అనిపిస్తున్నది ...
విరటుడు ;- చిత్తం ప్రభూ. ఆ కాలి గజ్జెలు, ఆ అందెల సవ్వడి  ... అవి అవే. 
శకారుడు ;- భేష్, ఐతే నా అనుచరుడు - 
ఈ విరటుడి చెవులు రెండు - బాగా పనిచేస్తున్నవన్న మాట.
విరటుడు ;- చిత్తం, ఈ విరటుని శ్రవణేంద్రియాలు బహు చురుకు. 
మీ మదిని రాపాడుతున్న ఆ వసంతసేన  జాడలను - 
ఇట్టే పసికట్టగలుగుతున్నవి.
శకారుడు ;- ఆ మదిరాక్షి వసంతసేనను లోబరుచుకులేకపోతున్నాను, 
నా రాజ పదవికి అవమానం.
విరటుడు ;- చిత్తం. గతంలో మూడు సార్లు వెంటపడ్డారు, ఫలితం శూన్యం. 
తుర్రుమని వెంట్రుకవాసిలో తప్పించుకున్నది. తప్పించుకో గలగడం 
ఆమెకు వెన్నతో పెట్టిన విద్య అనుకుంటాను. 
శకారుడు ;- తోటలో ఆ బాలుడు - చారుదత్తుని కొడుకు ఐ ఉంటాడు - 
ఇటు బయటికి రప్పించు, విటూ.
విరటుడు ;- బాబూ, ఇటు రా .....
రోహణుడు ;- నా పేరు రోహణుడు.
శకారుడు ;- రోహణూ! నీ బుల్లి బండి బాగుంది. 
ఇంతకంటే మంచి వెండి బండి బొమ్మను తెచ్చి ఇస్తాను నీకు, 
ఒక సంగతి చెప్పు. 
ఇప్పుడే మీ ఇంటి లోపలికి వచ్చింది, ఆమె మీ అమ్మ కదూ .
రోహణుడు ;- ఊహు, కాదు. మా అమ్మగారు ఊరికి వెళ్ళారు. ఈమె మా పిన్ని.  ;
శకారుడు ;- విటూ - పిన్ని - అని కూడా పిలిపించుకుంటున్నది, 
ఎంతైనా ఆ వసంతసేన జగజ్జాణ.
రోహణుడు ;- నా నేస్తాలు ఆటకి పిలుస్తున్నారు.
శకారుడు ;- విటూ, ఆ జగజ్జంత్రి -  వసంత సేన ఆ ఇంట్లోనే తిష్ఠ వేసింది. చూస్తాను, 
దీని పొగరు అణచకపోతే - నా పేరు శకారుడే కాదు, విటూ!
విర ;- చిత్తం, నాదొక చిన్న విన్నపం. విరాటుడని చక్కని పేరు నాది. 
మీరు - విటూ - అనేస్తున్నారు. వినడానికి ససిగా లేదు. విటుడు - అనే అర్ధం - వస్తున్నది.
[ఆర్యకుని దళంలోని వాళ్ళు - పరిగెడుతున్నారు, పట్టుకోండి, పట్టుకోండి]
శకారుడు ;- పద పద విటూ. దాక్కుంటూ పరుగు పెట్టాలి మనం. 
వాళ్ళ కంట పడితే మనకు ప్రమాదం.
విరటుడు ;- ఇతను శకారుడు, హ్హు .... 
ఈ మహా హా హా హా వీరునికి అనుచరుణ్ణిగా నేను, ప్రారబ్ధం, హా......... !
శకారుడు ;- ఓ భటులారా, ఆ దళాలను తరమండి, వెంటాడండి. 
తరిమి తరిమి పట్టుకోండి  [గట్టిగా అరుస్తూ, పక్కకు తిరిగి, లోగొంతుకతో] 
విటూ, మనం ఈ పక్క సందులో నుండి నెమ్మదిగా కోటకు చేరుదాం. 

విరటుడు ;- అట్లాగేనయ్యా, ఇట్లాగే - గమ్ముగా, గమ్మత్తుగా - జారుకుందాం, పదండి.  
;
♣♣♣♣♣♣ ♣♣♣ ♣♣♣   ♣♣♣♣♣♣ ♣♣♣ ♣♣♣
;
 ▼  November (7) ;-  13] కూటమి నడక - కూడలి వైపుకి ; 
14]  బౌద్ధ సన్యాసి సంవాహకుడు ; 15] మైత్రేయుని పొరపాటు ; 
16] కలికి కామాక్షి పయనం ; 17] ఆర్యకుడు బందిఖానా ; 
18] మళ్ళీ చారుదత్తునికి ఇంటికి ఆమె ; 19] శకారుని ఘోష యాత్ర ;
24, జనవరి 2018, బుధవారం ;
♣♣♣ ♣♣♣ ♣♣♣ ♣♣♣♣♣♣ ♣♣♣ ♣♣♣ ♣♣♣♣♣♣ ♣♣♣ ♣♣♣ ; 

కామెంట్‌లు లేవు:

ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు

"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...