25, నవంబర్ 2011, శుక్రవారం

సన్యాసుల పైన “సంచార కప్పము”

Bodhisattva Gautama 
;
మగధ రాజ్యంలో జనాలందరూ వింతగా మాట్లాడుకోసాగారు
“బింబిసార చక్రవర్తి, ఇన్నాళ్ళుగా మనపై వేసి,
వసూలు చేస్తూన్న అన్యాయమైన పన్నులను రద్దు చేసారు”అని.
 “అసలు ఇంత అకస్మాత్తుగా 
ఆయనలో ఇంత మంచి పరిణామం ఎలా కలిగింది?”


**********************************************


అది ఒక పుష్ప, ఫల, లతా తరువులతో శోభిల్లుతూన్న చిట్టడవి.
అక్కడ జింకలు చెంగు చెంగున గంతులు వేస్తున్నాయి.
అనేక హరిణములు ఆడుకునే ఆ చోటును
అందరూ “ మృగదవ, మిగదాయ,రిషిపట్టణ, ఇస్పితాన “
అని పిలుస్తున్నారు.


వారణాసి నగరమునకు ఈశాన్య దిక్కున-
(౨.౫ మైళ్ళు, ౪.౦ కిలోమీటర్లు) ఉసీ పట్టణము ఉన్నది.
ఋషులు ఉద్భవించిన సీమ కాబట్టి- ఉసి నగరము ఐనది.


సారంగములు, మృగములు- అనగా “జింకలు” తిరుగాడే చోటు,
కనుక “మృగవనము” అని పేరు వచ్చినది.


అక్కడ “యాసుడు” అనే అనాథ బాలుడు ఉన్నాడు.
"యాసుని ధనము, ఆస్తి అంతా నాదే!” అంటూ
వాని బంధువు “మారుడు” క్రూరంగా
యాసుని సొమ్మును హక్కుభుక్తం చేసుకుని, వెళ్ళగొట్టాడు.
యాసునికి ఎక్కడా ఆశ్రయం లభించలేదు.


కడకు ఈ ఉసీ నగరానికి వచ్చి చేరాడు.
జింకలు, సాధుజంతువుల నడుమ నిర్భయంగానే ఉండసాగాడు.
ఐతే ఋషీశ్వరుల ఆశ్రమాల నడుమ ఉన్నప్పటికీ,
యాసునికి విద్య అబ్బలేదు.
అతనికి చదువు ఒంటబట్టకపోవడంతో-
గురువులు కూడా ఆతనిపై ప్రత్యేక శ్రద్ధ వహించినప్పటికీ,
ఉపయోగం లేకుండా పోయినది.


యాసునికి “ఎవరో బోధిసత్వుడు అనే మహనీయుడు
మన బాధలను తొలగించడానికి వస్తున్నాడుట!” అని
తోటి వారు చెప్పగా తెలిసినది.


****************************************************
;
;
;
ఆషాఢ మాసంలో చెట్లు చిగురించి,
ఆ ఉపవనము కళకళలాడుతూన్నది.
ఆ చుట్టుపక్కల జనులందరికీ ఒక మంచి వార్త అందినది.
ఆ వార్త వ్యాప్తితో ప్రజలు కూడా ఆనందంతో కళకళలాడ్తూన్నారు.
మరి అది ఏమి వార్త? అది ఎలాటి కబురు? ……….


శాక్య ముని ఇల్లు వదలి, బయటి ప్రపంచంలోనికి అడుగుపెట్టాడు.
గయ అనే సీమలో ఒక రావి చెట్టు కింద తీవ్ర తపస్సు చేసాడు.
సిద్ధార్ధుడు గయలో .............
అశ్వత్థ వృక్షం(రావి చెట్టు/ peepal tree) కింద 
సిద్ధార్ధుడు చేసిన తపము ఫలించిన శుభవేళ అది.
బోధిసత్వునిగా ఎదిగి, జ్ఞానమూర్తిగా అవతరించాడు.
ఆ రావి చెట్టుకు –
అప్పటి నుండి"మహా బోధి వృక్షము” అనే పేరు వచ్చినది.
బుద్ధుడు జ్ఞానోదయాన్ని పొందిన తర్వాత,
లోక సంచారం చేయసాగాడు.


*****************************************************


క్రీ.పూ.558–491 హిందూ దేశములో
ప్రభువులకు రాజ్య కాంక్షతో 
అంతః కలహములు చెలరేగుతూన్నవి.
వారికి రాజ్య విస్తరణ ఒక దురలవాటుగా మారింది.
అనేక యుద్ధాలు చెలరేగుతున్నాయి.


సంఘము యొక్క బాగోగులనూ,
మనుష్యుల సుఖ జీవనమునకై ఏర్పాట్లు అనేవి,
రాజుల ఆలోచనలలో చోటు లేదు.
ఋషులు, వృత్తి పనివాళ్ళు, సామాన్యులూ,
అందరూ నిత్యజీవితాలూ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నవి.


అప్పుడు ఉత్తరభారతావని మౌర్యుల ఏలుబడిలో ఉన్నది.
రాజ్య పాలన చేస్తూన్న మౌర్య చక్రవర్తి పేరు “బింబిసారుడు”.
ఆతడు – తానూ చేస్తూన్న నిరంతర సమరముల,
జైత్రయాత్రల ఖర్చులకై ప్రజలపై అనేక పన్నులను వేసాడు.
అడవిలో ముక్కు మూసుకు కూర్చునే తాపసులపై కూడా
బింబిసారుడు- పన్నులను విధించాడు.                       
వారు “సంచార కప్పము”ను కట్టవలసి వచ్చినది.
గౌతమ బుద్ధుడు జ్ఞానోదయము కలిగిన పిమ్మట,
లోక సంచారమునారంభించాడు.
అలాగ ఆయన ఉసీ నగరమునకు చేరడానికి 5 వారాలు పట్టింది.


(ఉసీ నగరమునకు:- తర్వాతి పేరు =“సారనాథ్”)
ఉసీ పట్టణంలో నివసిస్తూన్న 
ఆతని శిష్యులు ఐదుగురినీ కలుసుకుని,
తన వాక్కులను అనుగ్రహించే యత్నంలో 
గౌతమ బుద్ధుడు ప్రయాణాన్ని కొనసాగించాడు.
మార్గ మధ్యంలో గంగా నదిని దాటవలసి వచ్చినది.
నా పడవ ఎక్కిన ప్రతి ప్రయాణీకుని తరఫున 
నేనులెక్క ప్రకారం సుంకము కట్టవసివస్తూన్నది.
అలా కట్టకపోతే చక్రవర్తి తీవ్రంగా శిక్షిస్తారు” అన్నాడు పడవ వాడు.


అప్పుడే వచ్చిన గౌతమ బుద్ధుని
“అయ్యా! పడవ సుంకమును ఇవ్వండి” 
అని అడిగాడు ఆ పడవ నడిపే మనిషి.
పడవ సరంగుకు ఇవ్వడానికి 
గౌతమ బుద్ధుని చేతిలో చిల్లి గవ్వ ఐనా లేదు.


“నా వద్ద రూకలు, వరహాలు లేవు, నాయనా!” 
బదులు చెప్పాడు గౌతమ బుద్ధుడు.
తీరాన్ని వదలి, పడవెళ్ళి పోయింది.


మార్గాంతరం లేని గౌతమ బుద్ధుడు,
దివిజ గంగానదీ కెరటాలను పరికించి చూసాడు.
నెమ్మదిగా ఆ జాహ్నవీ జలాలలోనికి అడుగు వేసి,
ముందుకు నడిచాడు. 


అత్యంత అద్భుతంగా
అతనిని అదృష్ట దేవత కాపాడిందనే చెప్పాలి.
గౌతమ బుద్ధుడు దేవ గంగ
ఆవలి ఒడ్డు నుండి, 
ఈవలి గట్టుకు క్షేమంగా చేరాడు.


************************************************


ప్రపంచ చరిత్ర- ఉసీ పట్టణంలో 
గొప్ప ఆవిష్కారమునకు శ్రీకారమును చుట్టినది. 
జింకల ఉద్యానవనములలో 
బుద్ధుని వచనములు వెన్నెల వానలా కురుస్తూ 
అందరిలోనూ సంతోషమునూ, శాంతినీ నింపాయి.


యాసుడు సైతం ఆ శ్రోతలలో ఉన్నాడు. 
భక్తితో బుద్ధునికి శిష్యునిగా మారాడు. 
ఇది తెలిసిన “మారుడు” పగతో అక్కడికి వచ్చాడు. 
యాసునికి ఆశ్రయము ఇచ్చిన బుద్ధునిపై ప్రతీకారము తీర్చుకోబోయాడు. 
కానీ, శాంతమూర్తి ఐన బోధిసత్వుని తేజస్సు ముందర 
అతడు కూడా మోకరిల్లాడు.


“ధర్మోపదేశం ” పొందిన భాగ్యశాలురైన 
ఐదుగురు శిష్యులు– “సంఘము” గా ఆవిర్భవించారు. 
అక్కడ ప్రప్రధమ బుద్ధ బోధనయే “ధర్మ చక్ర పరివర్తన సూత్రము”
ఆ ఉపన్యాసమును ప్రజల వాడుక భాషలో చేసాడు బుద్ధుడు. 
అందుచేత అసలు పేరు 
“ధమ్మ చక్క పరివత్తన సుత్తము” . 


సాధారణ జనుల వ్యావహారిక భాషకు 
అలాగ గౌరవ ప్రతిపత్తులను కలిగించిన 
మహనీయుడు గౌతమ బుద్ధుడు. 


బుద్ధ దేవుని మొదటి సుభాషిత బోధన జరిగినట్టి 
పవిత్రమైన ఆ రోజు ఆషాఢ పౌర్ణమి.


సార నాధ్ లో గౌతమ బుద్ధునికి అందరూ భక్తులు అవసాగారు. 
శిష్యులు అరవై మంది బోధిసత్వునితో 
“స్వామీ! మీ బోధనలు మూఢాచారాలతో కుళ్ళిపోతూన్న 
ఈ నేటి సమాజ ప్రక్షాళనకు ఎంతేని అవసరము, 
మీ బోధనలను ప్రపంచవ్యాపితం గావాలి” 
అని తమ అభిప్రాయాలను వెలిబుచ్చారు.


గౌతమ బుద్ధుడు “సరే!” అని అన్నాడు. 
“ఏ యే మార్గాల గుండా ఎవరెవరు ఎలాగ వెళ్ళాలి, 
ఏ పద్ధతిలో ప్రజలను సన్మార్గంలో నడిపించాలి” 
ఇలాగ శిష్య వర్గాన్ని, సుశిక్షితులను జేసి, 
ప్రణాళికాబద్ద, నియమ, నిర్దేశిత గమ్య సాధనలో 
అందరినీ అప్రమత్తులను గా తయారుచేసాడు గౌతమ బుద్ధుడు. 


సారనాథ్ సీమ గౌతమ బుద్ధుని స్పర్శతో 
అయిదు సంవత్సరములు పునీతమైనది. 
గౌతమ బుద్ధుని ఆగమనంతో- 
ఆ సామ్రాజ్యంలో మునుల పైన విధించిన పన్నులను తీసేసారు
బింబిసారునికి అనోటా ఆ నోటా 
“గౌతమ బుద్ధుడు కాలి నడకతో, 
ప్రమాదభరితమైన ప్రవాహంలో నదిని దాటాడు” 
అని తెలిసింది. 
బింబిసార సామ్రాట్టు 
“తాను స్వార్ధంతో 
ఎలాటి అనుచితమైన సుంకములను విధించాడు, 
రాజ్య లాలస ప్రజలను ఎన్నో ఇక్కట్ల పాలు ఔతున్నారు ” 
అని అర్ధమై, పశ్చాతాపంతో, కించిత్తు సిగ్గు పడ్డాడు. 
నిష్కామ జీవనం గడిపే ఋషులు మున్నగు వారి మీద, 
అలాగే జనులను పీడిస్తూన్న 
అర్ధం పర్ధం లేని కొన్ని ఇతర పన్నులను తొలగించాడు. 
గౌతమ బుద్ధుని ప్రభావంతో- మౌర్య సామ్రాజ్యం, 
సరి కొత్త సంస్కరణలతో కొత్త అడుగులను వేసినది.


*****************************************


గౌతమ బుద్ధుని సంస్కరణలు  ; (For Kids)
Published On Monday,
 November 14, 2011 By ADMIN. 
Under: విజ్ఞానం, వ్యాసాలు.   
రచన : కాదంబరి పిదూరి
;

కామెంట్‌లు లేవు:

ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు

"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...