3, డిసెంబర్ 2017, ఆదివారం

మట్టి బండి తళ తళా మిలా మిలా

[ వసంత సేన, చారుదత్తుల వద్దకు వచ్చింది రదనిక ];
రదనిక ;- ఈ పాలు, పళ్ళు - ఇక్కడ పెట్టమంటారా!?
చారుదత్తుడు ;- ఈమెకు పాలు ప్రత్యేకం తెచ్చావా రదనికా!?
రదనిక ;- కర్పూరం, సుగంధ ద్రవ్యాలు కలిపాను. 
అన్నీ ఆమె చెప్పిన పద్ధతినే- పాళ్ళు కలిపాను. 
బయట పంచపాళీలో రోహణబాబు ఆడుకుంటున్నారు. 
పొరుగు వారి పిల్లలు కూడా ఇవాళ ఆడుకోవడానికి వచ్చారు .........
వసంత ;-  పెద్దవాళ్ళు దగ్గర లేకపోతే - పిల్లలు పోట్లాడుకునే ఆస్కారం ఉన్నది కదా. 
[చారుదత్తుని వైపు చూస్తూ అన్నది]
చారు ;- నిజమే కదా - వేగిరం వెళ్ళు రదనికా. 
మా పుత్రుడు రోహణుని జాగ్రత్తగా ఆడించు. 
రద ;- సరేనండి, వెళ్తున్నాను. '''''''''''''''''
చారు ;- వసంతసేనా, ఉత్సవంలో ఆ రోజున - నీ నాట్యం అద్భుతం.
వసంతసేన ;- ధన్యురాలిని. మీరు ఈ వేణువును  - సుందరతమంగా మ్రోగిస్తున్నారు. 
మీ మురళీ వాదనా కౌశలం అమోఘం. 
ఈసారి - నా నర్తనాభినయాలకు - మీరు పిల్లనగ్రోవిని 
ఊదితే ఈ వసంతసేన - పురా సుకృతంగా భావిస్తుంది.
[రోహణుడు ఏడుస్తూ వచ్చాడు]
వసంత ;- అరే, ఎందుకు చిన్నా, ఏడుస్తున్నావు, 
మా రోహణ బాబుని ఎవరు కొట్టారు? హన్నా, వాళ్ళను చూపించు.
రద ;- పక్క వాళ్ళ పిల్లలు - ఎగతాళి చేస్తున్నారు .... అందుకనీ .......
చారు ;- ఏమని, ఇటు రా కన్నా.
రోహణ్;- నాది మట్టి బండి అట, వాళ్ళవి లోహ శకటులని అంటున్నారు,
అంటూ నన్ను ఒకటే గేలి చేస్తున్నారు, నాన్నా!  
చారు ;- ఆ [నిర్ఘా ర్ఘాంతపోయాడు]
రద ;- బాబు ఎక్కిళ్ళు పెడుతూ - ఒకటే ఏడుపు.
వసంత ;- ఇవిగో, ఈ ఆభరణాలు, ఈ చిన్నారి బండిలో వేస్తున్నాను, రదనికా, 
విపణివీధికి వెళ్ళి, ఎక్కడెక్కడ అందమైన చక చక్కని - 
మంచి బంగారు బళ్ళు దొరుకుతాయో కనుక్కొని, మాకు చెప్పు. 
మంచి అంగడి చిరునామాలను - నీవు, మైత్రేయుడు, సంవాహకుడు - ఆరా తీసి, 
చారుదత్తుల వారికి తెలపండి.
రదనిక ;- సంవాహకుడు ఇప్పుడు - ఇక్కడకు రావడం లేదమ్మా! 
ఎక్కడికో వెళ్ళి పోయాడు. 
అతను బౌద్ధం స్వీకరించాడు- అంటూ అనేక వార్తలు వినిపిస్తున్నవి.
వసంత ;- అరే, ఔనా!  రదనికా, అతను జూదం ఆడుతుంటాడు కదూ!
రద ;- ఔనమ్మా, సంవాహకుడు మీకు కూడా తెలుసా!? 
వసంత ;- రెండు నెలల క్రితం - అతను నా వద్దకు వచ్చాడు. 
జూదంలో పందాలు కట్టి ఓడిపోయాడు, జూదరులు వెంటాడారట. 
వెండి కంచాన్ని - దాచి తెచ్చి, మాకు అమ్మజూపాడు.
వస్తువుపైన చారుదత్తుల పేరు ఉన్నది. అతనికి డబ్బు ఇచ్చి - మందలించాను. 
ఈ విలువైన వస్తువును తిరిగి యజమానులకు ఇవ్వమని చెప్పాను.

సిగ్గు పడి, పశ్చాత్తాప పడుతూ వెళ్ళిపోయాడు.
రద ;- ఔరా, కొన్నాళ్ళు ఇంట్లో - వెతుక్కున్నాము. 
తర్వాత - గొడ్ల సావిడిలో దొరికింది. ఇదన్న మాట, అసలు కథ. 
మేము గుర్తుపట్టనే లేదు. సంవాహకుడు - కంచం దొంగిలించి - 
తానే గుట్టుచప్పుడు కాకుండా - అక్కడ పేడ కుప్పలో
అట్టి పెట్టేసి - వెళ్ళిపోయాడన్న మాట. ఔరా.
వసత ;- ఐతే సంవాహకుడు - బౌద్ధ పరివ్రాజకునిగా మారాడు కాబోలు.
రదనిక ;- కామోసు.
వసంత ;- విధిలీలలు ఎంత చిత్రమైనవి.
రోహణ్ ;- మరైతే - ఈ గొలుసులతో వెండి శకటం వస్తుందా.
రదనిక ;- వెండి కాదు, బంగారందే వస్తుంది, మన ఇంటికి, 
బంగారంలాంటి వసంతసేనమ్మ హస్తవాసి కదా . [నవ్వింది]
వసంత ;- హమ్మయ్య, నన్ను చూసి, రుసరుసలాడే రదనిక వీక్షణాలలో - 
తేనె జల్లులను కురిపిస్తున్నవి - ఈ క్షణాలు.
రదనిక ;- అమ్మా, మీకు చెప్పేటంతదాన్ని కాదు గానీ - 
వసంత ;- ఊ, కానీ ....... ?
రదనిక ;- ఆ, ఏమి లేదు లేమ్మా. పండుగ వస్తున్నది. 
మామిడాకులు, అవీ కోయమని మైత్రేయునికి చెప్పాలి. 
అక్కడేమో కొమ్మల్లో కాకి గూళ్ళు ఉన్నవి. 
ఆ గూళ్ళలో - కోయిలలు గుడ్లు పెట్టాయి. 
ఈ అమాయక పక్షులు - వాటినీ పొదిగాయి. 
పిల్ల పిట్టలు కిచకిచమటున్నాయి. 
ఆ పరాయి పిట్టలు - ఎగిరి వెళ్ళాలి. 
ఆనక, మామిడాకులు కోస్తాము. అడుగో మైత్రేయుడు .....
మైత్రేయ ;- ధూతమాంబ గారు - ఈ వారం వస్తున్నారని - కబురు వచ్చింది.
రద ;- రోహణ బాబూ! పదండి, బైట మీ నేస్తాలు ఆటలకు పిలుస్తున్నారు. 
మైత్రేయా, సమయానికి వచ్చావు. 
తోరణాలు కట్టడం కోసం - నువ్వు మామిడాకులు తేవాలి.
మైత్రేయ  ;-  ఈ మైత్రేయుడు సమ భావుకుడు, 
అందరి ఆజ్ఞలను శిరసా వహిస్తాడు, పద, 
రదనికా! ఇదేమిటి, రోహణ బాబు మృచ్ఛకటికం - 
ఈ నాడు - భారీగా ధగధగలాడ్తున్నది.
మట్టి బండి తళ తళా మిలా మిలా ....... 
కళ్ళు మిరుమిట్లు గొలుపుతున్నవి. 
రదనిక ;- ష్, మైత్రేయా, ముందు పద.
;
♣♣♣ ♣♣♣ ♣♣♣ ♣♣♣
మట్టి బండి తళ తళా మిలా మిలా ;  
అధ్యాయ శాఖ ;- 22 ; డిసెంబర్ పోస్ట్ ;
& previous ; అధ్యాయ శాఖ ;- 21 ;- ఆర్యకుడు - ఎక్కడ!? ;
♣♣♣ ♣♣♣ ♣♣♣ ♣♣♣
ఐదవ అంకం - వసంతసేనే - poddu ;- LINK ;
;
వసంతసేనే! పశ్య!పశ్య!
గర్జంతి శైల శిఖరేషు విలంబి బింబా మేఘా వియుక్త వనితా హృదయానుకారాః |
యేషాం రవేణ సహసోప్తతితైః మయూరైః ఖం వీజ్యతే మణిమయైరివ తాళ శృంగైః ||
= భావము ;- 
వసంతసేనా, చూడు, చూడు - శైలశిఖరాల మీద గర్జిస్తున్న ఆ మేఘాలు -
విరహిణుల హృదయాల లాగా ఎలా భారంగా ఉన్నాయో! 
వాటి చప్పుడుకు ఒక్క ఉదుటున పైకెగిరిన నెమళ్ళ పింఛాలతో 
ఆకాశం మణిమయమైన వింజామరలచేత వీయబడుతున్నట్టుగా లేదూ! 
;

కామెంట్‌లు లేవు:

ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు

"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...