16, ఫిబ్రవరి 2013, శనివారం

మన కశ్యప వారసత్వము


కాశ్యప గోత్రము :- హిందూ సమాజములో 
"సాంప్రదాయములలో గోత్రము యొక్క  ప్రాధాన్యత" అపరిమితమైనది. 
ముఖ్యంగా పెళ్ళిళ్ళు చేసేటప్పుడు, 
వధూ వరులకు రాశి, నక్షత్ర, గోత్ర పొంతనలను చూస్తారు. 
మఱి ఎవఱికైనా 'తమ యొక్క గోత్రము తెలీదనుకోండి. 
అప్పుడేమి  చేయాలి ? 
అలాంటప్పుడు ఈ క్రింద ఉటంకించిన శ్లోకమును చెప్పుకోవలెను. 
అనగా తమది కాశ్యప గోత్రమని చెప్పుకోవచ్చును.                                    
శ్లో. గోత్రత్వస్యాఽపరిజ్ఞానే! కాశ్యపం గోత్రముచ్యతే |                          ;  యస్మాదాహ శ్రుతిః పూర్వం ప్రజాః కశ్యప సంభవాః||
తాత్పర్యము :-
ప్రజలు కశ్యపుని వలన జన్మించినారు అని శ్రుతివాక్యము.

కశ్యప ప్రజాపతి :- 

కశ్యప మహర్షిని మన  ప్రాచ్య (=తూర్పు) ఖండములలో 
"ఆది పురుషుడు" అని భావించవచ్చును. 
దక్షిణ ఆసియా దేశాలలో - మూల స్తంభము. 
అనాది మనిషి, నాగరికత అభివృద్ధి చెందే దశలలోని 
ప్రజలకు మార్గదర్శకత్వము వహించినాడు. 
ఈ పైన చూపిన శ్లోకము అందుకు ముఖ్య ఆధారము.

కశ్యప కుటుంబము :- 

సృష్టికర్త బ్రహ్మ మరీచి అనే మహర్షిని సృజించెను. 
ఆ మరీచి భార్య పేరు కళ. ఈమె కర్దమ ప్రజాపతి కుమార్తె. 
వారికి జన్మించినవాడే కశ్యపుడు. కర్దమ ప్రజాపతి మాతామహుడు. 
కావున ఈతని మధ్యవర్తిత్వముచే కశ్యప ఋషి వివాహమైనది. 
దక్ష ప్రజాపతి తన కుమార్తెలు పదమువ్వుఱిని - 
కశ్యపునికి ఇచ్చి వివాహమొనరించెను. 
అలాగే వైశ్వానరుని తనయలు ఇఱువుఱు కశ్యపుని అర్ధాంగీ పదవులను పొందినారు. 
15 మంది సతులతో కూడి, జీవితమును నియమబద్ధముగా గడుపుచూ 
క్రమముగా ఆ మునివరుడు సమాజ సుస్థిరతకు అవసరమైన నియమావళిని 
రూపొందించే ప్రయత్నాలను చేసెను. 
ఆతని సంతానము తామరతంపరగా వర్ధిల్లి, మానవుని ఉనికి ప్రవర్ధమానమైనది. 
మానవుని సుఖ జీవనమునకు నీరు ముఖ్య ఆధారము గనుక, 
కశ్యపుడు సంఘ నిర్మాణమునకు నదీ, సముద్ర తీరములను ఎంచుకుని 
ఆ అన్వేషణలో సఫలీకృతుడైనాడు. తద్వారా “కశ్యప ప్రజాపతి”గా 
ప్రజల అభిమానమును పొందినాడు. 

వివిధ ప్రాంతముల ఉనికిని కనుగొన్న ఋషిసత్తముడు :-

"నీల మత పురాణము"లో కశ్యప మౌని గుఱించిన 
అనేక అంశములకు ఆధారములు లభించినవి. కాశ్మీరమునకూ, 
కశ్యపునికీ అవినాభావ సంబంధము కలదు. 
కశ్యప మీర దేశము” పరిణామములో “కాశ్మీరము” ఐనది. 
నేటి వ్యావహారిక నామము “కాశ్మీర్”.  

కశ్యప = కూర్మము, మధుపాన మత్తుడు అనే అర్ధాలు ఉన్నవి. 
శ్రీకూర్మము = అంటే తాబేలు - భూమిపైనా, జలములలోనూ జీవించే ఉభయచర ప్రాణి. 
కశ్యపుడు - ఇటు పృధ్వీతలము పైనా, అటు నీటిలోనూ 
నిర్భీతిగా సంచరించగల శక్తిసామర్ధ్యాలు కలిగి ఉన్నట్టి వ్యక్తి.

అంబుధికి ముని పేరు :-

నదీ తీరములు, జలనిధులు మిక్కిలిగా ఉన్న సీమలలో 
'ప్రజా సంఘముల ఏర్పాటుకు' పునాదులను వేశాడు కశ్యపుడు. 
తటాకాది జలాశయములు మనిషికి జీవనాధారములై, నాగరికతలు 
నవ్య నవీనముగా రూపొందే దశలకు శ్రీకారము చుట్టాడు తాపసి కశ్యపుడు. 
కశ్యప మహాఋషి సంచార జీవనములో కనుగొని, 
ప్రజా జీవనమునకు పూలబాటలను పరిచాడు. 
కనకనే అవి ఆ మునీశ్వరుని నామముతో వినుతికెక్కినవి. 

కశ్యప + మీర = కాశ్మీరము/ కాశ్మీరదేశము. 
కశ్యప సముద్రము = అనగా నేటి కాస్పియన్ సాగరము, 
సప్త మహా సముద్రాలలో ఒకటి 
Darya -I - Kaspyan. (Kashyap sagar - caspian sea)

కశ్యపుని జన్మ పరంపరలు :-

ఈ వివరములకు ఆధారములు 
"రాధాంతర కల్పము", 
"నీలమత పురాణము", 
"మహా భాగవతము" ఇత్యాది గ్రంధములు. 
ఆజన్మ బ్రహ్మచారిగా ఆసేతు హిమాచల పర్యంతమూ 
ప్రజలకు ఆరాధ్య దైవమైనవాడు శ్రీ హనుమంతుడు. 

కశ్యపుడు తన భార్య స్వాధ్యతో కలిసి, సంతానప్రాప్తికై తపస్సు చేశాడు. 
పరమేశుడు ఆ దంపతులకు ప్రత్యక్షమై,
“కశ్యపా!  కారణజన్ముడవు నీవు. రాబోయే జన్మలో 
నీవు “కేసరి” అనే వానర శ్రేష్ఠుడుగా జన్మించి,  
హనుమంతుడనే ఒక మహాపురుషుని జనకుడవయ్యే కారణ జన్ముడివి. 
ముందు జన్మలో హనుమదంశతో నేనే నీకు కుమారుడినౌతాను
"కేసరి పుత్ర హనుమ" అని తండ్రివగు నీ పేరుతో చిరకీర్తిమంతుడ నౌతాను” 
అని అనుగ్రహించెను. 
శ్రీ మహాదేవుని వరసారాంశము సత్యమై, 
కశ్యపుడు మఱుజన్మలో కేసరి అయి, 
శ్రీమద్ రామాయణము నకు మూలస్తంభమైన 
శ్రీ ఆంజనేయ స్వామికి కశ్యపుడు తండ్రియై చరితార్ధుడైనాడు. 
ఈ గాధ రాధాంతర కల్పములోనిది.

భరత వర్షమును ఆహ్లాదపరిచిన యుగకర్త శ్రీకృష్ణుడు. 
కశ్యపుడు, ఆయన సతి అదితి  దేవకీ వసుదేవులుగా పునర్జన్మలు పొందిరి. 
సాక్షాత్తూ  శ్రీ మహావిష్ణుమూర్తియే 
ఈ ఆలుమగల పుణ్యాల పంటగా ఉద్భవించిన పునీత బృహత్ గాధయే 
చిరస్మరణీయమైన మహేతిహాసము శ్రీమన్ మహాభాగవతము. 
'ఇందుశేఖరుడు' ఆ ద్వాపర యుగములో దూర్వాసమునిగా జనియించినాడు 
అంతే కాదు. ఆదిదంపతులైన పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహ సంపదకు వారసుడేమో 
మన కశ్యప ప్రజాపతి ! 
తనభక్తిఫలముల మధుర రుచిని సంపూర్ణముగా ఆస్వాదించిన భాగ్యశాలి. 
పరమేశుడు కశ్యపునికి, ఆతని పత్ని ఐన సురభియందు – 
ఏకాదశ రూపములతో, పదకొండుమంది కుమారులుగా ఉదయించెను.

కశ్యప ఋషీంద్రుని వివేచన :-  

కశ్యపుని తనయుడు గరుత్మంతుడు. 
గరుడుడు పక్షులలో బలాఢ్యుడు, విహంగాధిపతి. 
ఒక గుహలో నాగజాతీయుడైన వాసుకి తో గరుడుడు భీకరముగా పోరాడసాగాడు. 
అనేక దినాలుగా ఎడతెఱపి లేకుండా ఆ యుద్ధము జఱిగినది. 
ఇది తెలిసి, కశ్యప మునీంద్రుడు ఆఘమేఘాలమీద అక్కడికి చేరాడు. 
హోరాహోరీగా సాగుతూన్న ఆ భీకర యుద్ధాన్ని ఆపాడు. 
రణోత్సుకత వలన, యుద్ధోన్మాదము వలన శాంతికి భంగం కలుగుతుందనీ
లోకములన్నీ అతులాకుతలమౌతాయని” ఇఱువుఱికీ నచ్చజెప్పాడు. 
ఆత్మజుడైన గరుడుని రమణక ద్వీపము (నేటి ఫిజీ ద్వీపము) నకు పంపించాడు. 
విహగాధిపతికి విరోధి ఐన వాసుకీ సర్పరాజును 
కుమార క్షేత్రములో భద్రముగా నివసించుము!” అని ఏర్పాటు చేశాడు కశ్యపుడు. 
ఈ క్షేత్రము సహ్యాద్రి శ్రేణిలో ఉన్నది.
శాంతికాముకుడు కశ్యప ముని :- 
ఈ రీతిగా భయంకర యుద్ధాల నివారణకై పాటు పడుతూ, 
ఆయా ( పక్షి, జంతు,కీటకాది) ప్రాణులు
నిరపాయకరముగా  వివిధ జాతులూ జీవనమును కొనసాగించగలిగే ప్రదేశాలను 
ఎంపిక చేయుటలో కశ్యపుని దూరదృష్టి, ప్రజ్ఞ ద్యోతకమౌతూన్నవి. 
జీవకోటిలోని వైవిధ్యతలను పరిరక్షిస్తూ, వాటి పురోభివృద్ధికీ తోడ్పడిన మునివరుడు  కశ్యపుడు. 
ప్రకృతిలో సమతౌల్యతను కాపాడేటందులకై ఆతడు ఎన్నో కఠిన పరీక్షలను ఎదుర్కొని, 
కఠోర శ్రమదమాదులకు ఓర్చి, అన్ని వర్గాలవారినీ ప్రేమ ఆప్యాయతలతో సమాదరించి, 
తద్వారా ఎల్లరు తన వాక్కులను‘వేదవాక్కులు' గా 
అపేక్షతో శిరసావహించేలాగున చేయగలిగిన మేధావి కశ్యపుడు. 
దక్ష, కర్దమ రాజేంద్రులు సైతమూ కశ్యపునికి తమతనూజలను ఇచ్చి వివాహము చేసి, 
ఆతనిని తమ అల్లుడుగా చేసుకున్నారు అంటే 
'కశ్యపుడు కేవలం మౌనముద్రాంకితుడైన తాపసియే కాదు, 
ప్రజానీకము యావత్తూ, ఆబాలగోపాలమూ ఇష్టపడే నాయకుడు కూడా!’ 
అని బోధపడుతూన్నది కదా!

కశ్యప సంహిత :-

ఆయుర్వేద వైద్య గ్రంధాలలో మొట్టమొదటిది "కశ్యప సంహిత".  
ఇది సంఘానికి అందించబడిన అమూల్య వరము. 
ఈ ఆయుర్వేద వైద్య విధాన వివరణల ఉద్గ్రంధమును రచించిన మహాపురుషుడు - 
పేరును బట్టే అర్ధమౌతూన్నది కదా - తొలి మహర్షి కశ్యపుడు. 
ఈ అమూల్యమైన పొత్తము "వృద్ధ జీవకీయ తంత్రము" అనే పేరుతోకూడా పిలువబడుతూ ఉన్నది. 
బ్రహ్మ నుండి దక్షప్రజాపతికీ, 
అటు తర్వాత వరుసగా అశ్వినీ కుమారులకు, ఇంద్రునికి, 
కశ్యపునికీ, వశిష్ఠునికీ, అత్రికీ, భృగు మహర్షులకు 
ఈ "కశ్యప సంహితా విజ్ఞానము అందినది. 
అలా అంచెలంచెల మీద ప్రజల ఆరోగ్యవర్ధని ఐన 
అగణిత ఆయుర్వేద రహస్యములను అందించి, 
లోకానికి వరప్రదాయిని ఐనది. 
కశ్యపుని కుమారుడు, ఆతని అనుయాయులు 
ఈ మేధాసంపత్తిని తరువాతి తరాలవారికి అందజేశారు. 
మధ్య యుగాలలో వృద్ధ జీవకీయ తంత్రము 
చైనా భాష (Chinese language) లోనికి అనువదించబడినది
ప్లేటో రచన "The Republic" (జేగంటలు) లోని శైలివలెనే 
'కశ్యప సంహిత' - ప్రశ్నోత్తరముల రూపములో ఉన్నది. 
ప్రజలు, సభికులు తమసందేహాలను ఆయనను అడిగేవారు. 
పృచ్ఛకుల సందేహాలకు కశ్యపముని సమాధానాలు చెప్పేవాడు. 
ఉభయ సంవాదములను శిష్య వర్గీయులు, భక్తులు వ్రాసి 
నమోదు చేసిన సంఘటన సమాజ వస్త్రానికి వేసిన మెఱిసే జరీ అంచు అనే చెప్పాలి.
హిందూ ధర్మము మహోన్నత ఆధ్యాత్మిక, సాంఘిక విజ్ఞాన సంపదలతో వైభవోపేతముగా విరాజిల్లినది.
ఈ ప్రాభవమునకు ఎందఱో మహానుభావులు హేతుభూతులైనారు. 
అవ్వారిలో “కశ్యప యోగి పుంగవుడు” ఒకరు. 
సప్త మహామునులలో ఒకడైన కశ్యప మౌని తిలకము 
ఆర్ష ధర్మము తప్పటడుగులు వేస్తూన్న దశలో 
వెన్నుదన్నుగా నిలిచి, హైందవ ప్రాభవమును అంబుధులను దాటి, 
ఆవలి దిక్కులకు పరివ్యాప్తి జేసిన తొట్ట తొలి వైతాళికుడు కశ్యప ప్రజాపతి. 
ఆ ఋషిపుంగవునకు నమోవాకములు.              

ఓమ్ శుభమ్ భూయాత్!!!!

**************************;


 కశ్శన్న అచ్చతెనుగులో విరిసిన మాట. 
ఎవరివైనా వివరములు - స్పష్టత లేకుండా ఉంటే –
ఆతనిగూర్చి పరిచయాలు చేసేటందుకు ఇలాటి సంబోధన ఉపకరిస్తుంది. 
సంస్కృత "కశ్యప" శబ్దము ; 
తేట తెనుగులో కశ్యపన్న -> కశ్యన్న ->  కశ్శన్న – గా పరిణమించిన 
తీయని జాతీయ రూపాంతరము.   


**************************;
కశ్యప - మొదటి చారిత్రక గోత్రము (LINK)
(Read this essay in WEB magazine "pushkarinee.com"
;
Sth Karnataka , Sri Kukke Subrahmanya Ksetra

;

వ్యాస రచయిత్రి:
శ్రీమతి కుసుమ (కాదంబరి)

;

ముద్దు పేర్లు - మొద్దు పేర్లు

"బుజ్జీ! చంటీ! బన్నీ! చిట్టీ! కాఫీ తాగుదురు గాని రండి! టిఫిన్ కూడా రెడీ."  ; తరళ, ఆమె సోదరి లవంగిక తమతమ పిల్లల్ని ఎలుగెత్తి పిలి...