7, సెప్టెంబర్ 2011, బుధవారం

మహా పండితుడు బ్రహ్మశ్రీ కాశీపత్యావధానులు


గద్వాల Fort


అమోఘ పాండిత్య ప్రజ్ఞా ప్రాభవశాలి పోకూరి కాశీపత్యావధానులు. 
నందన సంవత్సర మాఘ శుద్ధ దశమి నాడు 
లక్ష్మాంబ, సుబ్బయాచార్యుల తృతీయ సంతానముగా, 
గుంటూరు జిల్లా, పల్నాడు తాలూకాలోని 
“బోదిలవీడు”  అనే గ్రామంలో జన్మించారు.
బ్రహ్మశ్రీ పోకూరి కాశీపత్యావధానులు వృద్ధాప్య దశ వఱకూ 
“మాచర్ల” లో జీవితము గడిపారు. 
60 కి పైగా రచించిన 
అద్భుత కావ్యాలతో ఈ పుంభావసరస్వతి కీర్తి గాంచారు. 
గద్వాల సంస్థానము విద్యకు, పాండిత్య ప్రభలకు, 
లాలిత్య కళలకు ఆటపట్టై, “శ్రీమద్విద్వద్ గద్వాల” అని పేర్గాంచినది. 
అట్టి గద్వాలలో పోకూరి కాశీపత్యావధానులు 
“ఆస్థాన కవి” పదవిని అలంకరించారు. 
కర్నూలు జిల్లాలోని “హాలాహర్వి” లో 
“కనకాభిషేక గౌరవము”ను పొందారు.
1950 లో ప్రొద్దుటూరులో  ప్రజలు గండపెండేరము తొడిగి, 
ఏనుగుపై ఎక్కించి, ఊరేగించి, సన్మానించారు. 
1960 లో రాయచూరు, ఆదోని పట్టణాలలో ప్రజలు ఆప్యాయతతో -
సువర్ణ కంకణములను తొడిగి, సత్కరించారు. 
దాదాపు 48 బంగారు పతకాలను,అగణిత బిరుదు సన్మానాలను పొందారు 
పోకూరి కాశీపత్యావధానులు.
గజ వాహనము
“షట్చక్రవర్తులలో మొదటి వాడు హరిశ్చంద్ర చక్రవర్తి కనుక - 
పోకూరి కాశీపత్యావధానులు 
‘హరిశ్చంద్రోపాఖ్యానము’ ను రచన  గావించారు. 
విశ్వామిత్ర ముని మాతంగ కన్యలను పంపించాడు.
వారు అవమానించబడినారని, 
క్రుద్ధుడైన ముని హరిశ్చంద్రుని వద్దకు వెళ్ళాడు.
సామ్రాట్టు ఆయన కాళ్ళపైన పడ్డాడు.
కుపితుడై ఉన్న ఋషి రాజును పాదంతో తన్నగా, 
రాజు సహనం, ఓరిమిలను ప్రతిబింబించే దృశ్యాన్ని 
పోకూరి కాశీపత్యావధానులు చిత్రించిన పద్ధతి పదుగురి మెప్పు బడసినది. 
“మహర్షి పాదం నొప్పి పుట్టిందేమో”నని 
హరిశ్చంద్రుడు వ్యాకులపడుతూ, 
మహర్షి పాదాలను ఒత్తసాగాడు. 
(ఈ సంఘటన – 
“పారిజాతాపహరణము" ప్రఖ్యాత ప్రబంధము  లోని 
ముక్కు తిమ్మనార్యుల ఘంటంలో నుండి వెలువడినట్టి
సత్యభామ శ్రీకృష్ణుని తన వామ పాదముతో త్రోయుట” జ్ఞప్తికి వస్తుంది) 
ఆ రీతిగా పాదసంవాహనం చేస్తూ, 
బహు నిదానముగా అన్నాడు ఇలాగ:-


“నే నెన్నైనను నీన
న్నానా- నే నా న నూననా నన్నననౌ;
నా నిన్ను నెన్న నన్నా;
నా నేనున్నాన నానినా నన్నన్నా.” (2-76)


ఏకాక్షరి అనగా ఒకే అక్షరముతో 
పద్యం అంతా సాగుతుంది. 


దీని సారాంశము:


" నేను ఎన్నైనను ఈయను అన్నానా? 
నేను ఆన (=ప్రమాణము) ను – 
ఊననా? (=ఊనిక)- నన్ను (నిందిస్తూ) అననౌనా? 
నిన్ను ఎన్నను- అని అన్నానా? 
నేనున్ నానన్ (= లజ్జను) ఆనినాను , అన్నన్నా!”


వేరే సీను:-
రాజు చేత అసత్యం పలికించాలని, యత్నించి, 
విఫలుడైన ముని ఇలాగ విచారించాడ:


“కినిసి సిరి~ దీసి నీలిగి;
తిని సిగ్గిడి కింగిరికిని దిగి తీరితి~ గి:
త్తిని జీరి నించి చిక్కిడి;
తిని జియ్యా యింతి కీరితిని నిల్చిరిసీ!” (2-135)


ఈ పద్దెములో కేవలము గుడుసులు మాత్రమే ఉన్నవి. 
అన్ని అక్షరములూ 'గుడి- తలకట్టు' గా వాడబడినవి.


భావము:-


“ఇస్సీ! చక్రవర్తిపై కోపగించుకొని ఆతని ఐశ్వర్యము పోగొట్టి, నీలిగితిని. 
సిగ్గు విడిచి, నీచ కార్యానికి  (=కింగిరికిని) దిగితిని. 
అగ్ని (= కిత్తి) వంటి భూపతిని పిలిచి, నిందించితిని. 
చాలా చిక్కులు పెడితిని. 
ఐనప్పటికిన్నీ ఈ ధరణీనాధుడు, రాణి (జియ్యా, ఇంతి) 
కీర్తిని నిలుపుకున్నారు ".
మాతృ భాషా దేవి కిరీటములో
అమూల్య మణి  శ్రీ కాశీపత్యావధాని.


(ఆధారము:- పాటిబండ్ల మాధవ శర్మగారి  షష్ఠిపూర్తి  సన్మాన సంచిక: 
హైదరాబాదు; సెప్టెంబరు;1972). 


మహా పండితుడు బ్రహ్మశ్రీ కాశీపత్యావధానులు.


*************************************


        వ్రతఫలము దక్కింది!


భారతదేశములో ప్రజలు ఎంతో భక్తితో ఆచరించే వ్రతము 
"శ్రీ సత్య నారాయణ వ్రతము". 
పురాణములను శోధించి ఈ నోమును కథగా వ్రాసి 
లోకానికి అందించిన రచయిత శ్రీ కాశీపత్యావధానులు. 
రాయచూరు వద్ద ఉన్న 
ఆత్మకూరులో ముత్యాలయ్యాచారి అనే వ్యక్తి ఉండేవాడు. 
సంతానార్ధి ఐన ఆయన 
శ్రీ కాశీపత్యావధానులు చేత 
"శ్రీ సత్య నారాయణ వ్రత మాహాత్మ్యము"ను రచియింప చేసాడు. 
 అతని చిన్న భార్యకు సంతానము కలిగి,అతని కోరిక ఈడేరింది. 
 వారి సంకల్పబలము చేత 
ఆ విధంగా లోకానికి "శ్రీ సత్య నారాయణ వ్రత కల్పము"లభించినది. 


వ్రతఫలము దక్కింది! (Link-2) 
Member Categories - తెలుసా! 
Written by kadambari piduri 
Tuesday, 09 August 2011 07


మహా పండితుడు బ్రహ్మశ్రీ కాశీపత్యావధానులు
Member Categories - తెలుసా!
Written by kusuma   
Tuesday, 30 August 2011 12:02 

కామెంట్‌లు లేవు:

ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు

"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...