6, జులై 2010, మంగళవారం

తాంబూలాలిచ్చేసాం!


"చేటీ భవన్ నిఖిల భేటీ .....
పాటీర గంధి కుచ శాటీ కవిత్వ పరి పాటీం
ఆగాధిప సుతా! ఘోటీ ఖురా దధిక ధాటీ ముదార
ముఖ వీటీ రసేన తనుతాం."

శ్రీ కాళిదాసు „ దేవీ స్తుతి శ్లోక త్రయోదశి“లో ప్ర ప్రధమ శ్లోకములోని నాలుగవ పంక్తి.

"కడిమి చెట్లు కల కదంబ ఉద్యాన వనములలో సమస్త దేవతా వనితలూ చెలికత్తెలై, వయ్యారంగా ఆమెను అనుసరిస్తూన్నారు.స్వర్గ లోక నివాసులైన దేవతా సమూహములు ధరించిన కిరీటాలకు చెందిన మిక్కిలి మనోజ్ఞమైన మణుల కిరీట కాంతులు,దేవీ పద పద్మముల పైన వ్యాప్తి చెందినవి.

నగాధిపుని కుమార్తె ఐన పార్వతీ దేవి తాంబూలమును సేవించినది.
ఆ వీటీ రసముము వలన పరిసరాలు అన్నీ పరిమళ భరితమౌతూన్నాయి.
అట్టి మహిమోపేతమైన తాంబూల రసము అశ్వ ధాటిని మించిన ఆశు కవితా శక్తిని నాకు ప్రసాదించును గాక!"
అని కాళిదాసు ప్రార్ధన చేసాడు.
ఘోటీ ఖురాత్ = " ఆడు గుఱ్ఱముల గిట్టల కంటే ఎక్కువ వడి, ధాటి గల కవిత్వ పరి పాటిని వృద్ధి చేయ వలె"నని
మహా కవి కాళి దాసు మనసారా తల్లి గిరిజా దేవిని వేడుకున్నాడు.
తన కవిత్వము సర్వ జన ఆమోదం పొందాలని వాంఛిస్తున్న కాళిదాసు ఉపమానము,
తల్లి పార్వతీ దేవి సేవించిన వీటికామోదము!
మహా కవి రచనలలో ప్రముఖ స్థానము గడించిన ఈ తాంబూలము
క్రీస్తు పూర్వము నాటి నుండియే భారత దేశములో ప్రజల నిత్య వాడుకలో ఉండేది.

తాంబూలంలో రవంత సున్నము రాసి, వక్కాలను చేర్చి నమిలితే ,
" నోరు ఎర్రగా పండుతుందని" కనిపెట్టినారు;
ప్రతి రోజూ భోజనానంతరం తమల పాకులను వేసుకునే భారతీయులు భోజనమును కళగా మలిచారు!

@త్యాగరాజు ఒక సాంప్రదాయ భజనలో అంటారు.....

"శ్వేతనాగవల్లీ దళసంయుత పూగీఫల సకలం రుచిరం
కర్పూరాంచిత చూర్ణసమన్విత తాంబూలం స్వీకురు వరదా
జయజయ దేవాదిదేవవిభో జయ గోపాలకృష్ణ కృపాజలధే......."

"తాంబూల చర్వణంబులన్ పుణ్య కథా శ్రవణంబులన్ పొందుచు"రని‚
"కాశీ ఖండము"లోని వర్ణన.

ఎక్కువ సేపు నమిలే కొద్దీ తాంబూల రసము యొక్క రుచి అధిక తమమౌతుంది.
అందులకే అది"తాంబూల చర్వణము" గా నుడికెక్కినది.
మన దేశములో తాంబూలం తయారీ అద్భుత కళగా వృద్ధి గాంచినది.

కస్తూరి, ముత్యాల పొడి, లవంగము, గంధము ఇత్యాదులు జత చేర సాగాయి .

1. పండుటాకుల కర్పూర భగములను చొక్కమౌనట్టి – మౌక్తిక చూర్ణమమర (గయోపాఖ్యానము)
2. ఖండిత పూణీ నాగర ; _ ఖండంబుల ఘన శశాంక ఖండంబులచే;
- హిండితమగు _ తాంబూలము (ఆముక్త మాల్యద);;;;;;;
శ్రీ నాధుడు తన రచనలలో ప్రజలు తినే ఆహార పదార్ధములలోని
ప్రతి చిన్న అంశాన్నీ విపులంగా వర్ణిస్తూ,
చదువరుల నోళ్ళలో లాలాజలము ఊరేటట్లు చేసాడు.

"తమ్ములము సేయుచో నొక్క తలిరు బోణి " (శ్రీ నాధ నైషధము)

క్రమ క్రమముగా తమల పాకులకు (betle leaves) సంఘంలో ప్రముఖోన్నత స్థానం లభించింది.
కేవలం భోజనానంతర సేవనమునకు మాత్రమే పరిమితం అవ్వలేదు;
గౌరవ మర్యాదలకు ప్రతీకా స్వరూపిణిగా రూపు దాల్చినది మన తాంబూల విడియం గారు.

అగ్ర తాంబూలం, తాంబూలం పుచ్చు కొనుట ఇత్యాదిగా
నిజ జీవిత మర్యాదా మన్ననల పాటవముతో పెన వేసుకున్నది.
చక్ర వర్తులు, ప్రతిభా పాటవములను వెలువరిచిన కవి పండితులకు,సైనికులకు, ఉద్యోగులకు
బిరుదులను ప్రదానం చేస్తూ సత్కరించేటప్పుడు
"తాంబూలములో దక్షిణ పెట్టి మరీ ఇచ్చే వారు.
ఈ సంప్రదాయము నేటికీ నిర్విఘ్నంగా కొనసాగుతూన్నది కదా!
"అగ్ర తాంబూలం ఇవ్వడము" ప్రత్యేక గౌరవ స్థానాన్ని ఇచ్చుట అని అర్థము.

తాంబూలాలు పుచ్చుకున్నారు -
“ ఇరు కుటుంబాలలోని అబ్బాయికీ, అమ్మాయికీ పరిణయమును ఖాయం చేయుట – అని ఇట్టే అర్థమౌతుంది.
"నిశ్చయ తాంబూలాలు" అనగా,"ఫలానా యువతీ యువకులకు/ పిల్ల, పిల్ల వాడికీ వివాహం జరుగుతుంది." అంటూ పది మంది ఎదుట ప్రకటన చేసే సందర్భంలో, చేసుకునే వేడుక; ఫలానా తేదీన జరగ బోయే పెళ్ళికి
ఇది శుభారంభము అన్న మాట.
అందరి ఎదుట, మగ పెళ్ళి వాళ్ళూ, ఆడ పెళ్ళి వారూ పరస్పరమూ వక్కలను ఉంచిన తాంబూలమును ఇరు పక్షముల వారు ఇచ్చి పుచ్చుకునే సంప్రదాయం విశిష్టంగా ఆచరణలో ఉన్నదే కదా!

ఇంత విపులంగా అసలు చెప్పాల్సిన అవసరమే లేదు;
" తాంబూలాలు పుచ్చు కున్నారు" అనగానే,
ఈ యావత్తు సీనూ, మన మనో నేత్రంలో చిటికెలో సాక్షాత్కరిస్తుంది,
అంటే ఈ మహోన్నత సాంప్రదాయం యొక్క విలువ అమోఘమైనదే కదా!

తొలి ప్రబంధము "మను చరిత్రము"లో
కవి అల్లసాని పెద్దన ఈ "బీటిల్ లీవ్సు బొత్తుల" సంరంభాన్ని మిళాయించాడు.
"మృగ మద సౌరభ విభవ - ద్విగుణీకృత ఘన సార సాంద్ర వీటీ గంధ స్థగితేతర పరిమళమై;
మగువ పొలుపు తెలుపు నొక్క మలయ మారుత మొలసెన్.“

వరూధినీ ప్రవరాఖ్య ఘట్టములో
తాంబూల పరిమళాలను లాలిస్తూ, మోసుకు వచ్చిన "చిరు గాలి" ధన్యమైనదే!

ఆకులలో కెల్లా మేలైన ఆకు ఇది.
"ప్రోక మ్రాకుల సొంపు మురువు కొనగ........" అన్నది "కాశీ ఖండము" .

తాంబూల విడెపు తయారీలో పాలు పంచుకున్న వస్తువులు –
అనేక పర్యాయ పదాలతో శోభిల్లుతున్నాయి.

కావ్యాలలోనూ, నిఘంటువులలోనూ నవ రత్న మణులలాగా అనేక పద గుచ్ఛాలతో శోభిల్లుతూన్న
ఆ వైనాన్ని పరికించుదాము.

@ తమలపాకు = „ఆకు వక్క – అంటే తాంబూలము అనే భావము. ఆకు, తెల్లనాకు,
నాగ వల్లి, దళము, ఫణాధర వల్లీ దళము,వెలియాకు,తమాల పల్లవము

@ వక్క = పోక, పోక చెక్కలు, వక్క, వక్కలు, వక్క పలుకులు, వక్క పొడి, వీతి, సిగినాలు, పోఢము, అడ , చికినము, చికిని ( అడ కత్తెరలో పోక చెక్క వలె – అని సామెత)

@ కాచు = కవిరి, కాచు వడియము, కైర వడి, ఖాదిరము, ఖదిర సారము, ఖాదిర ఘటిక, అద్భుత సారము

@కస్తూరి = సారంగ నాభి, కురంగ నాభి, జింక పొక్కిలి, ఏణ మదము, ఇట్టి గోరోజనము,
సహస్ర వేధి, లత, మోదిని

@కస్తూరి మృగ నాభి నుండి లభించే పరిమళ ద్రవ్యము కస్తూరి.

@ కర్పూరము = తారాభ్రము, తుహినము, రాత్రి కరము, విధువు, ముక్తా ఫలము, రస కేసరము, ప్రాలేయాంశువు, చంద్ర నామము, ఘన రసము, గంబుర, గంబూరము, గంబురా, భూతికము, లోక తుషారము, శీత కరము, శీత ప్రభము, శుభ్ర కరము, హిమ కరము, హిమ వాలుక, హిమాంశువు, సోమము, సోమ స్యంజ్ఞ

**************************************

ఇక వక్కతో పాటు, జంట కవులలాగా తప్పని సరిగా ఉపయుక్తమయ్యే కిళ్ళీ ద్రవ్యము “సున్నము“.

సున్నము = చూర్ణము, చుర సుధ
"చూర్ణ కారుడు" అని ,సున్నము ప్రోడక్టు చేసే వానికి గల పేరు.

@ జాపత్రి = జాతి పత్రి, జాపత్తిరి, జాతి కోశము, కోశి

@ లవంగము = కరం పువు, దివ్యము, దేవ కుసుమము, వశ్యము, ముఖ ప్రియము, శ్రీ సంజ్ఞము

@ ఏలక్కాయ = ఏలకి, ఏలకులు, ఏలక్కాయలు, నిష్కుటి, మాలేయము, మేష పృధ్వీక


"భోజనము చేయుట" మన భారత దేశములో ఒక కళా సాంప్రదాయముగా పరిఢవిల్లుతూన్నది. విందు కుడిచిన పిమ్మట తాంబూల సేవనము చేస్తేనే సుఖ భోజనము చేసినట్లు.

కేవలం వక్కతో సరి పెట్టు కోకుండా
జాపత్రి, కరక్కాయ, లవంగాలు, ఏలకులు, కస్తూరి, కర్పూరము
ఇత్యాది దినుసులు కూడా తాంబూల విడియములో అంతర్భాగాలు ఐనవి.
కరక్కాయ, కాచు మిన్నగునవి ఆయుర్వేద వైద్య విధానములో
అనూచానముగా ఊపయుక్తమౌతూన్నవి;
కనుకనే తాంబూలములో ఇవి అదనపు కానుకలు;
ఇవి దంతములకు, చిగుళ్ళకూ ఆరోగ్యాన్నీ, దృఢత్వాన్నీ పరిపోషించే ఆహార పదార్ధాలే!

ఇలాగ ఇన్ని రకాల మేళవింపులతో మనము తయారు చేసుకుంటున్నదే తాంబూలము.
కిళ్ళీ _ నేడు కిళ్ళీలలో గులాబీ రేకులను తేనెలో కలిపి సిద్ధము చేసిన “గుల్కందా“ను కూర్చుతున్నారు.
వీధి వీధినా కిళ్ళీ డబ్బాలు/ pan shop లు ఉంటున్నాయి.
కిళ్ళీ కొట్లు, పాన్ మసాలాల అంగడి ల వలన లక్షలాది మందికి జీవనోపాధి దొరుకుతూన్నది .

మరి ఇప్పుడు "కిళ్ళీ" కి కల నామ ధేయాల తోరణాలను తిలకించుదామా!

తాంబూలము = విడియము, వక్కాకు, తాంబూల విడియము, విడియ, వీడ్యము, వీటి, వీటిక , తము, తమ్ములము, తములము, ముఖ భూషణము

@ వక్కలకు ఉన్న నామావళిని వీక్షించాము కదా!

అలాగే, పోక చెక్కలు - కు గల నామములను అవలోకిద్దామా!!?

పోకలు = నెల వత్తి, పూగ భాగములు, పోక చెక్కలు, పోక పలుకులు, భాగాలు

ఈ రీతిగా తాంబూలమేనా- దానితో పాటే "తాంబూల విడెము"లోని ఇతరేతర దినుసులు కూడా "మాన్య పండిత ప్రకాండుల విద్వత్తు"చే నానా విధ నామ ధేయములతో సంభావింప బడినవి.
„సున్నపు కాయ, కత్తెరయు జొక్కడ కొత్తును ;
వక్క లాకులున్ వన్నెగ జాల వల్లిక , లవంగము లాదిగ కూర్చి........ "
తమాల వల్లరుల వర్ణనలతో మన కావ్యాలలో సుగంధములు వెద జల్లినాయి.
లక్షలాది మందికి బతుకు తెరువును కల్పిస్తూ, కోట్లాది జనుల జిహ్వలను రంజింప జేస్తూన్న కిళ్ళీ మీద పాటలుsuper hit లు ఐ, ప్రేక్షక ప్రజావళి కూని రాగాలకు ఆలవాలమైనాయి.

విభిన్న భాషలలో తాంబూలము పేర్లు ;;;;
_________________________

క్రీస్తు పూర్వము 600 సంవత్సరములో వెలువడిన "సుశ్రుత సంహిత" లో "నాగ వల్లి/ తాంబూలము" పేర్కొన బడినది. దీనిని బట్టి ఎంతటి ప్రాచీన సాంప్రదాయ విశిష్టతను , దాని మూలంగా చారిత్రక వైశిష్ట్యతనూ కలిగి ఉన్నదని, తాంబూలము ప్రాముఖ్యత ద్యోతకమౌతూన్నది.

“నాగూర్ వేల్ “ అని గుజరాతీ భాషలో పిలుపు.

మన తెలుగు దేశములో జరుగుతూన్న పెళ్ళి వేడుకలలో „ నాగ వల్లీ సదస్యము“ ఎల్లరకూ కన్నుల పండుగయే!

నాగ వల్లి, తమాలము, తాంబూలము, అనేవి దాదాపు అనేక భరతీయ భాషలలో వాడుకలో ఉన్నది.
అరబ్బులు, పర్షియన్ భాషలలో "తాంబన్" అనే పదం ఉన్నది, తాంబూలము నకు సోదరీ పదమే ఇది.
క్రీస్తు పూర్వము నుండీ వ్యాపార స్థాయిలో "తాంబూల తీగలను" చెట్ల నీడలలో పెంచుట ఆరంభమైనది. హిందూ స్థాన్ లో వాణిజ్య స్థాయిలో ఆవిష్కరించ బడిన తమలపాకులు క్రమంగా ప్రపంచ దేశాలకు పరిచయం ఐనాయి.

నాలుకలను ఎర్రని రంగుల పూవులుగా సుందరంగా చేస్తూన్న "కిళ్ళీ" వెరసి "తాంబూలము"నకు జేజేలు!

Share My Feelings


By kadambari piduri,
Jul 3 2010 1:54AM


1 కామెంట్‌:

రసజ్ఞ చెప్పారు...

అత్యద్భుతంగా చెప్పారు! పుచ్చుకుంటినమ్మ తాంబూలం!

ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు

"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...