ఉగాది తర్వాత వచ్చే మరో ప్రముఖమైన పండుగ “శ్రీ రామనవమి.”భారతదేశములో ఆబాలగోపాలమూ భక్తిప్రపత్తులతో జరుపుకునే పండుగ ఇది. ఈ పండుగకు అనుసంధానించగలిగేవి మరి కొన్ని వివిధ సీమలలో జరుగుతున్నాయి.
1) వివాహ పంచమి
మీరు చదువుతూన్నది కరెక్టే! ఈ పండుగ మార్గశీర్ష మాసములో, అనగా హేమంత ఋతువులో ఉత్తరభారతదేశములో కొన్ని చోట్ల జరుగుతుంది. మిధిల, అయోధ్య మున్నగు ప్రాంతాలలో, పుణ్యక్షేత్రములలో జరుగుతూంటుంది. వాల్మీకి రచన “శ్రీమద్రామాయణము” లో వక్కాణించిన ప్రకారము ఈ ఆచరణ అనుసరణలో ఉన్నది.
జనక్‍పురధామ్ లోని జానకీ మందిర్
వివాహ పంచమ పండుగ విశేషముగా జరిగే పుణ్యధామము “జనక్ పుర్ ధామ్”. ఈ జనక పురధామ్ నేపాల్ దేశములో ఉన్నది. ఈ వివాహపంచమి పండుగ నాడు ప్రపంచం నలుమూలలనుండి వచ్చే లక్షలాదిమంది భక్తులతో ఆ పట్టణం ఇసుక వేస్తే నేల రాలనంతమంది ప్రజలతో శోభాయమానంగా అలరారుతుంది.
మార్గశిర మాస, శుక్లపక్షనవమి సాధారణముగా నవంబర్, డిసెంబర్ లలో వస్తూంటుంది. మిధిలాచల్ ఇత్యాది ప్రదేశాలలో పవిత్ర వాతావరణాన్ని నెలకొల్పుతుంది ఈ వివాహపంచమి పర్వదిన హేల.
*********
*********
2) సీతానవమి
ఉత్తరాదిలో “జానకి జయంతి”ని విశేషించి స్త్రీలు చేస్తారు. ఈ“జానకి జయంతి"నే సీతానవమి అని కూడా పేర్కొంటారు. "సీతా జయంతి" వైశాఖ మాసంలో వస్తుంది. అనగా ఉగాదికి ఒక నెల తర్వాత అన్నమాట. సీతానవమి రోజున ఉపవాసదీక్షతో ఈ వ్రతాన్ని మహిళామణులు చేస్తారు. ఈ సంవత్సరం, అంటే 2013 లో మే నెలలో 19 తేదీన వస్తోంది.
శ్రీరాముడు చైత్రశుద్ధనవమినాడు జన్మించాడు కదా! అలానే, సీతాదేవి పుష్యా నక్షత్రమున మంగళవారమునాడు జన్మించినదని జనుల విశ్వాసము. సీతారామకళ్యాణం జరిగిన తిధి కూడా అదే కావడంతో అదే శుభలగ్నముగా యావన్మంది అనుసరిస్తున్నారు.
*********
నవమీ, పంచమీ మీమాంసలు
కూజంతం రామ రామేతి|
మధురం మధురాక్షరం|
ఆరూహ్య కవితాశాఖాం|
వందే వాల్మీకి కోకిలం||
శ్రీమద్రామాయణములోని అధ్యాయ కల్హారములు ఆరు. అవి:- బాల కాండ, అయోధ్య కాండ, అరణ్య కాండ, కిష్కింధ కాండ, సుందర కాండ, యుద్ధ కాండలు.
శ్రీమద్రామాయణ అధ్యాయాల పేర్లు :- బాల కాండ ( 77 సర్గలు), అయోధ్య కాండ (119 సర్గలు), అరణ్య కాండ (75 సర్గలు), కిష్కింధ కాండ (67సర్గలు), సుందర కాండ (68 సర్గలు), యుద్ధ కాండ (131 సర్గలు)
6 కాండాల్లో మొత్తం 537 సర్గలు ఉన్నాయి. అంతటి విస్తారమైన రచన శ్రీ రామాయణం.
శ్రీరామ సేతువు నిర్మాణమును వానరులు కేవలం ఐదు రోజుల్లో పూర్తి చేసారు. ఇక్కడ 5 సంఖ్య మనకు గోచరిస్తూన్నది. ఐతే శ్రీరామ, రావణుల సమర 7 రోజులపాటు జరిగింది. వారం రోజులు జరిగిన ఈ యుద్ధం కథకు చివరి మెట్టు.
*********
వేదవ్యాసుడు రచించిన "జయం" లో 18 పర్వములు- ఉన్నవి. అంతే కాదు, కురుక్షేత్ర యుద్ధము, అక్షౌహిణీ సేనల సంఖ్య - అలాగ అడుగడుగున (1+8=9) (తొమ్మిది- లేదా)18 అనే అంకెకు అత్యంత శ్రద్ధాప్రాధాన్యతలు లభించినవి.
అదే ఆదికవి వాల్మీకి రచనాశైలిలో విభిన్నంగా ఉన్నది. వాల్మీకి ఋషిపుంగవునికి ఒకే సంఖ్య మీద ఆస్థ, ఆసక్తి ఉన్నట్లుగా అనిపించదు. ఆయన కేవలము
వాల్మీకి
పురుషోత్తముడైన శ్రీరామచంద్రుని కథాచిత్రణముపైనే దృష్టిని కేంద్రీకరించాడు. సీతారాముల మహత్తర గాధను లోకానికి అందించిన లగ్నబలము ఎంత గొప్పదో గానీ, హిందూ సమాజములోని వివాహ, కుటుంబవ్యవస్థకు బలమైన మూలస్తంభాలను సమకూర్చి, మహేతిహాసమైనది.
*********
"మా నిషాద ప్రతిష్ఠా | త్వమగమః| శాశ్వతీ సమాః||
యత్క్రౌంచ మిధునా దేక మవధీః కామమోహితం||"
వేటకాడి దుందుడుకు చర్య మౌని కన్నులలో అశ్రుజాలమైనది. శోకము నుండి వెల్వడిన పదములు శ్లోకరూపమై, ఆదికావ్యమునకు శ్రీకారము చుట్టినవి.
అడవిలోని కిరాతుడు మహాకవిగా మలచబడిన శుభఘడియలు అవి. ఒక నిషాదుడు కవిగానే కాదు, మనకు "ఆది కవి" ఐనట్టి మహత్తర సంఘటన ప్రపంచములోనే ఏకైక ఉన్నత ఘటన ఇదే అని చెప్పవచ్చును.
*********
మరైతే నవమి తిధి ద్వారా “9” కూడా ముఖ్య సంఖ్యగా ఏర్పడి, మన పండుగలలో చేరింది. ఏ తేదీ ఒప్పు? – అనే ప్రశ్నలు అవసరము లేదు. ఎందుకంటే ప్రాజ్ఞులు తిధి, వార, నక్షత్రాది గణనలు చేసి ఆయా పండుగలను నిర్ణయించారు. మానవుడు నిత్యజీవితములో అనేకరకాల ఒడిదుడుకులకు లోనౌతూ ఉంటాడు. మానసిక క్లేశలనుండి బైటికి వచ్చే ప్రయత్నమే పండుగలు, వాటి నిర్వహణను అందంగా తీర్చిదిద్దుకుంటూ చేసుకోవడం, మనిషి చేతుల్లోనే ఉన్నది.
*********
ఐతే కాలనిర్ణయ పద్ధతి ఎందుకు? అన్నట్లైతే- ముఖ్యంగా దేశ, ప్రపంచ, ఖగోళ పరిణామాల అంచనాకు వీని ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. క్రీస్తుపూర్వమే జరిగిన ఈ అద్భుత రామ గాధ రచయిత వాల్మీకి అత్యద్భుత మేధావి. ఆది కావ్యము రామాయణము లో భౌగోళిక రూపు రేఖలను అరటిపండు వలిచి చేతిలో పెట్టినట్లు వర్ణించాడు. కేవలము హిందూ దేశ చారిత్రక గగన హర్మ్య నిర్మాణమునకు మాత్రమే కాదు, ఆనాటి రోదసీ గ్రహ చలనాది వివరములు సైతం, మనకే కాదు, పాశ్చాత్య శాస్త్రజ్ఞులకు కూడా ఉపకరిస్తాయి.
ప్రపంచ సైంటిస్టులు విశ్వాంతరాళములలో నిరంతరమూ జరిగే మార్పులను అంచనా వేయడానికి - రామాయణము, మహాభారత ఇతిహాసములు పునాదిరాళ్ళుగా నిలుస్తున్నవి. అందుకే మహాముని వాల్మీకికి శతకోటి నమోవాకములు.
*********
వివాహ పంచమి :(Link: web: New awakaya)
By: Kadambari
User Rating: / 1
Member Categories - కోవెల
Written by kadambari piduri
Tuesday, 16 April 2013 03:57
Hits: 151
{Konamanini - views:00051894}