10, ఫిబ్రవరి 2012, శుక్రవారం

కస్తూరిరంగయ్య కరుణించవయ్యా,అల్లూరి వేంకటాద్రిస్వామి

మన దేశములో భక్తి ఉద్యమాలకు ఉల్లాసభరితమైన ఊపును తెచ్చినది "భజన సాంప్రదాయము".
భజనల్లాంటి కళా పూర్ణ సామాజిక సాంప్రదాయ
ఆచారములు హిందూ భక్తి సాంప్రదాయాలను విలక్షణ భరితంగా రూపుదిద్దినాయి.


"కస్తూరిరంగయ్య కరుణించవయ్యా",
"పొద్దుపొద్దున లేచి, 
వరదుని ముద్దుల మోము నేడు"
మున్నగు గీతాలను రచించినది శ్రీ అల్లూరి వేంకటాద్రిస్వామి 
(1807-1877).
ఈయనే "తిరువెంగడ రామానుజ జియ్యరు" గా విఖ్యాతి చెందాడు.
1807లో అక్షయనామ సంవత్సర, ఫాల్గుణ పౌర్ణమి తిథినాడు జన్మించాడు.
అల్లూరి వేంకటాద్రిస్వామి జననీ జనకులు వెంకమ్మ, వెంకయ్య.
వారి నాలుగవ సంతానము శ్రీవత్స గోత్రీకుడు ఈ అల్లూరి వేంకటాద్రిస్వామి.
ఈయన జన్మ స్థలము అల్లూరు కృష్ణా జిల్లాలో ఉన్నది.


శ్రీ తూమునరసింహదాసు (1790-1833)దేశాటనము చేస్తూ,
వీరి గ్రామానికి వచ్చాడు. ఆయన అల్లూరి వేంకటాద్రిస్వామి
ఏకాగ్రతను గమనించి, "శ్రీ రామ తారక మంత్రము"ను ఉపదేశించాడు.
అల్లూరి వేంకటాద్రిస్వామి భద్రాచలములో, శ్రీరామకోటిని రాసి, స్వామికి సమర్పించాడు.
అక్కడ ఐదారేళ్ళు గడిపి, దేశ సంచారము చేస్తూ,
అనేక పుణ్యతీర్ధాలను దర్శించుకున్నాడు.
అల్లూరి వేంకటాద్రిస్వామి జీవనయాత్రలో చెప్పుకోదగినది "కంజీవరము".
అచ్చట విష్ణుమూర్తి దేవళమును జీర్ణోద్ధరణ కావించాడు.
ఆ రోజులలో ఐదువేలు సేకరించి, అక్కడ ఎన్నో పనులను దిగ్విజయంగా చేసాడు.
ఆయన శ్రీకారం చుట్టిన కార్యక్రమాలు నేటికీ కొనసాగుతున్నాయి.


"దూసి మామండూరు" అనే పల్లెలో పొలాన్ని అల్లూరి వేంకటాద్రిస్వామి కొన్నాడు.
ఆ సుక్షేత్రంపై వస్తూన్న రాబడి, ఆదాయాలు
"శ్రీ వరద రాజస్వామి వారి" పూజా కార్యక్రమ నిర్వహణకై
ఇప్పటికిన్నీ వినియోగించబడ్తూన్నవి.
అలాగే అల్లూరి వేంకటాద్రిస్వామి బీద విద్యార్ధుల వేద అధ్యయనానికై ఒక పాఠశాలను నెలకొల్పారు.


******


వేగవతీ నదిలో స్నానం చేసి, కంచిలో జరిగే "గరుడోత్సవము"ను చూడ కోరికతో,
బయలుదేరాడు అల్లూరి వేంకటాద్రిస్వామి. హస్తిగిరిని చేరుకున్నాడు.
అక్కడ "శ్రీ ఫెరుందేవి అమ్మవారి" ని సేవించుకున్నాడు.
అటుపిమ్మట "శ్రీవారుణాద్రి వరద స్వామి"నీ, అలాగే "తిరువడి" మొదలుకొని,
"తిరుముడి" దాకా అన్ని అలంకార ఆరాధనలనూ తిలకిస్తూ పులకించాడు.
అతను కంచి కోవెల పశ్చిమ సీమలో చిన్న గుడిసెలో ఉన్నాడు.


"మధుకరము" అనగా బిక్షాటనతో కడుపు నింపుకుంటూ,
పెరుమాళ్ళ అర్చనా సందర్శనాదులతో భక్తిపారవశ్యములో ఓలలాడేవాడు.
నాటికి 20 వత్సరముల వయసు కల అల్లూరి వేంకటాద్రిస్వామి.
"తిరుకచ్చినంబి, ఇళయాళ్వార్లు స్వామివారికి పుష్పకైంకర్యములు చేసారు.
వారికిమల్లే నేను కూడా చేయగలనా??"  అని అనుకున్నాడు.
తన ధ్యేయ సాధనకై అనునిత్యం శ్రమించాడు.
అనుకున్నదే తడవుగా పూలతోటలను పెంచాడు.


పూమాలలు అల్లుతూ, ఎంతో భక్తితో పూలహారాలతో అలంకరిస్తూ,
పుష్పార్చనలను చేస్తూండేవాడు.
ఆ క్రమంలోనే అటుపిమ్మట దూసిమామండూరు భూమిని కూడా కోవెలకు
వసతిగా సమకూర్చగలిగాడు అల్లూరి వేంకటాద్రిస్వామి.


******


చెన్నపట్టణము చేరాడు అల్లూరి వేంకటాద్రిస్వామి.
శ్రీమన్నారాయణుని, కీర్తనా రచనా, గానములతో- పూజిస్తూన్నాడు అతను.
అప్పుడు "స్వామివారి స్వప్న సాక్షాత్కార ఆదేశము" లభించగానే
తిరిగి కొన్ని పనులు మొదలిడినారు.
దీక్ష పూని, ప్రతిరోజూ పదిరూపాయల వంతున పోగు చేసాడు.
ఆ డబ్బుదస్కములతో "వైరముడి" ని తయారుచేయించాడు.
ఆ కిరీటమును ఒక అద్దాల పెట్టెలో ఉంచాడు.
చెన్నపురి పురవీధులలో ఊరేగించాడు.


కాళయుక్తి నామసంవత్సరములో
వైశాఖ శుద్ధపౌర్ణమి నాడు "శ్రీ పెరుమాళ్ళు"కు తాను చేయించి తెచ్చిన వైరముడిని,
అనగా "రత్నఖచిత కిరీటము"ను సమర్పించాడు అల్లూరి వేంకటాద్రిస్వామి.


సైదాపేటలోని మాంబళములో, నేటికీ ఉన్న శ్రీనివాస విగ్రహము-
అల్లూరి వేంకటాద్రిస్వామి యొక్క మహిమను నిరూపించినట్టి మూర్తి ఉన్నది.
పెరుమాళ్ళ వారి దేవేరులకు కూడా, అల్లూరి వేంకటాద్రిస్వామి కాంచన కిరీటాలను చేయించాడు.


క్రిష్ణమనాయని అగ్రహారములో, "మధుకరము" చేస్తూ
కాలం గడపసాగాడు అల్లూరి వేంకటాద్రిస్వామి.
దుందుభినామ సంవత్సరములో "ఉభయ నాంచారులకు" కిరీటధారణలను చేసి,
తృప్తి పొందాడు అల్లూరి వేంకటాద్రిస్వామి.


తర్వాత, శ్రీ అళగియ మణవాళ జియ్యరు వద్ద,
"శంఖ చక్ర లాంఛనములు", "మంత్ర ద్వయము"లనూ స్వీకరించాడు.
కావేరీ నదీ తీరమున శేషశాయిగా అగుపించే కస్తూరి రంగడు కలలో కనబడి
"భక్తా! గోపీచందన మహారాజు పాండ్యన్ ఒక్కండే నాకు ముత్తువళయమును చేయించెను.
అది జీర్ణమైనది" అని నుడివాడు. మళ్ళీ చెన్నపట్నము చేరి ఉన్న అల్లూరి వేంకటాద్రిస్వామి
మునుపే భజనా కైంకర్యాది నిష్కామ సేవలతో ప్రజలచే ప్రశంసలు అందుకున్నవాడు.
కనుకనే ఆతనికి ధనసేకరణ సులభసాధ్యమైనది.


అల్లూరి వేంకటాద్రిస్వామి పోగు చేసిన చందాలతో "ఒమ్మచ్చు"ను తయారు చేయించాడు.
ఆ ఒమ్మచ్చును తీసుకు వెళ్ళి, శ్రీరంగమును చేరాడు.
శ్రీరంగనాధుని తలపైన పెట్టాడు. ఆశ్చర్యకరంగా,
ఆ కిరీట/ తలపాగా సరిగా కొలిచినట్లుగా సరిపోయింది.
పునః ప్రయత్నములో, ఆ 'వైరముడి'కి మణి రతనములను కూడా సమకూర్చి,
అందులో తాపడము చేయించాడు అల్లూరి వేంకటాద్రిస్వామి.


1863- 12 వ నెల, 20 వ తేదీన అల్లూరి వేంకటాద్రిస్వామి వ్రాసిన
సంకీర్తనలను సైతము, కస్తూరిరంగనికి సమర్పణ గావించాడు అల్లూరి వేంకటాద్రిస్వామి.
ఆయన, శిష్యుడైన ఆదినారాయణదాసు కూడి,
కూరిమితో మైలాపూరులోని కోవెల శిఖరములను పునరుద్ధరణ గావించారు.


ధాతునామ సంవత్సరము (1876) ఆయన చరిత్రలో ఆఖరి పుటగా మిగిలినది.
కుంభ మాసములో బహుళ సప్తమి, సోమవారము నాడు
అర్ధరాత్రి సమయాన్ని "తనకు స్వామి పిలుపు వచ్చినది"
అంటూ భక్తులకు తెలిపాడు అల్లూరి వేంకటాద్రిస్వామి.
కంచివరదరాజస్వామికి పేరుందేవి అమ్మణ్ణిలకు పూజలు చేసి,
తిరుమంజనము, తిరువారాధనలను చేసాడు.
పద్మాసనము వేసుకుని, అంజలి ఘటించాడు.
ఆనాటి అర్ధరాత్రి సమయాన శ్రీరంగనాధుని నైవేద్య ప్రసాదములనూ,
"అరవణ ప్రసాదము"ను స్వీకరించి, శ్రీరంగనాధుని సన్నిధికి చేరాడు అల్లూరి వేంకటాద్రిస్వామి.


అక్కడ "గజేంద్ర మందిరము" లో ఈనాటికి కూడా  చెన్నపురి ముత్యాలపేటలు ఉన్నవి.
అంతే కాదు! భజన తాళములు , తంబూర కూడా ఉన్నవి.
అవే శ్రీవేంకటాద్రిని మెచ్చుకుని, తూమునరసింహదాసు ఇచ్చిన అపురూప వస్తువులు.


(గాలి రఘువరప్రసాద్: రచించిన :- "భక్తి సంకీర్తనా తరంగ లహరి" నుండి)
;


అల్లూరి వేంకటాద్రిస్వామి (Web Link- N AvakAya)
Member Categories - తెలుసా!
Written by kusuma  
Thursday, 19 January 2012 12:59



కామెంట్‌లు లేవు:

ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు

"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...