27, ఫిబ్రవరి 2012, సోమవారం

ది కార్సికన్ బ్రదర్స్ - అలెగ్జాండర్ డ్యుమాస్






                           "ది కార్సికన్ బ్రదర్స్"- 1941 లో విడుదల ఐన 
ఈ సినిమాకి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. 
గ్రెగరీ రాటఫ్ డైరెక్టరు, ఎడ్వర్డ్ స్మాల్ నిర్మాత. 
ద్విపాత్రాభినయములకు ప్రధమ సోపానముగా సినీ చరిత్రలో స్థానం ఆర్జించింది. 
జూనియర్ డగ్లస్ ఫెయిర్  బాంక్స్ "కార్సికన్ బ్రదర్స్" లో 
కవలలుగా రెండు పాత్రలనూ ధరించాడు. 
ఈ టాకీలోని కథకు- అనుసరణలుగా 
ప్రపంచ వ్యాప్తంగా వందలాది చలన చిత్రాలు వెలువడినాయి.


ఈ కథాంశములోని అద్భుత ఆకర్షణకు ఇవే నిలువెత్తు విలువెత్తు నిదర్శనాలు. 
చిన్ననాడే అమడ పిల్లలు(సయామీస్ కవలలు) విపరీత పరిస్థితులలో విడిపోయారు. 
పూర్తిగా విభిన్న పరిసరాల వాతావరణాలలో చెరొక చోటా పెరిగి పెద్దైనారు. 
వారి తల్లిదండ్రులను 'హత్యించిన ' విలన్ లపై ప్రతీకారం తీర్చుకునే కథతో 
అనేక మలుపులతో ఆసక్తికరంగా ఉన్నది.


ఇద్దరు కథానాయకులూ ఒకే స్త్రీని ప్రేమించడం వంటి విచిత్రమైన మెలికలతో ఈ చిత్రం ప్రేక్షకులను అలరించింది. అంతేకాదు! సినీ నిర్మాతలను సైతం ఆకట్టుకున్న 
ఈ స్టోరీ లైన్ ను కాసులవర్షం కురిపించే బంగారు గుడ్లు పెట్టే బాతునులాగా అందిపుచ్చుకున్నారు. 
తెలుగులో మనందరికీ సుపరిచితమే!


"ఇద్దరు మిత్రులు", "రాముడు-భీముడు" మొదలుకొని 
హీరోల నటనా కౌశలములకు ప్రేక్షకులు బ్రహ్మ రధము పట్టారు. 
హీరోయిన్లతో కూడా ద్విపాత్రాభినయం చేసిన బొమ్మలు రిలీజ్ ఐనవి. 
"ఇద్దరు అమ్మాయిలు", "గంగ-మంగ" వంటివి. 
కాలక్రమంలో త్రిపాత్రలు - వెండితెరపై నర్తించినవి.
నాలుగు, ఐదు, తొమ్మిది, పది పాత్రలుగా కూడా 
నటీనటులు తమ నటనాచాతుర్యాన్ని తెరపై శోభాయమానంగా  దృశ్యమానం చేసారు.


ఆకాశరామన్న(కాంతారావు); నవరాత్రి(నాగేశ్వరరావు); దశావతారం (కమల హాసన్)....
ఇలాగ పేర్ల లిస్టు కూడా ఒక ఉద్గ్రంధ రూపమే ఔతుందనడంలో అతిశయోక్తి లేదు.


*******


 "ది కార్సికన్ బ్రదర్స్" సినిమా  సౌధ నిర్మాణంలో కీలక వ్యక్తి, 
అన్నిటికన్నా ముఖ్యంగా ప్రస్తావించాల్సినది 
ఫ్రాన్సులోని రచయిత అలెగ్జాండర్ డ్యుమాస్ 
(Alexandre Dumas - 24 July 1802 – 5 December 1870)గురించి. 


యూరోపు దేశీయులు ఇతర దేశాలలో, వలసలు వచ్చారు. 
తద్వారా ఆసియా. ఆఫ్రికా ఖండాల ప్రజలు, ఆయా సంఘముల స్వరూపాలూ మార్పునకు లోనై, అస్తవ్యస్తం కాసాగినవి. ఆఫ్రికా దేశాల ప్రజలు, బానిసత్వంలో మగ్గిపోవాల్సిన దురవస్థ దాపురించింది. 
ఈ ఆపదలలో మునిగిపోయిన వాళ్ళు నీగ్రోలు అని వ్యవహరించబడుతూ, 
"నల్లవాళ్ళు" అని తిరస్కారానికి గురి అయినట్టి జాతి జనులు. 
వలస రాజ్యాల ఏలుబడి- కాలనైజేషన్ లకు దారి తీసినది. 
పాశ్చాత్య దేశంలో దళితునిగా పెరిగి పెద్దవాడైనాడు. 
అంటరానివానిగా- అక్కడ అతను అనేక పరాభవాలను ఎదుర్కోవలసి వచ్చింది.




ఫ్రాన్సులోని Aisne Depatmentలోని, willers-kaaTareTs- 
విల్లెర్స్-కాటరెట్స్-(Villers-Cotterêts ) లో జన్మించాడు డ్యుమాస్. 
నాటకరచయితగా కీర్తిశిఖరాలను అధిరోహించాడు. 
The Count of Monte Cristo, The Three Musketeers, The Corsican Brothers  మున్నగునవి 
ఆతని కీర్తి కిరీటంలో కలికితురాయిలు. 
సయామీస్ కవల పిల్లలు ఇరువురు హీరోలుగా మలచిన కథతో- 
అలెగ్జాండర్ డ్యుమాస్ రచన ఆధారంగా నిర్మితమైన మూవీ The Corsican Brothers. 
అనితర సాధ్యమైన ప్రజ్ఞ, ప్రతిభలతో అలెగ్జాండర్ డ్యుమాస్ 
తన జీవితంలో అనేక అవమానాలను అధిగమించాడు. 
రమారమి నూరు భాషలలోనికి అలెగ్జాండర్ డ్యుమాస్ రచనలు అనువదించబడినవి. 
అట్లాగే ఇంచుమించు రెండు వందల సినిమాలకు డ్యూమాస్ 'కలం పాళీ కదలికలు' స్ఫూర్తిని ఇచ్చినవి. 
సాహిత్య సీమలో సమకాలీనులైన విక్టర్ హ్యూగో మున్నగు రచయితల కంటే- 
అలెగ్జాండర్ డ్యుమాస్ ఉన్నత స్థాయిని సముపార్జించాడు.


ఆంధ్ర కవి, గుఱ్ఱం జాషువా సారస్వత సమావేశాలలో ఇతర వ్యతిరేక కవులతో సౌమ్యంగానే పలికిన పలుకులు- చమత్కార భాషణములుగా మన్నింపు పొందినవి. 
అట్లాగే అలెగ్జాండర్ డ్యుమాస్ సంభాషణలూ, ఆడిన పలుకులూ 
సారస్వత స్థాయితో విమర్శకులచే మననము చేయబడుతూంటాయి. 


కొస మెరుపు:-
ఒకసారి జాత్యహంకారులు తూష్ణీకరిస్తూ దూషించారు. 
వారి నిష్ఠుర వచనాలకు అతను  దీటుగా ఇచ్చిన చమత్కార సమాధానం ఇది. 
"My father was a mulatto, 
my grandfather was a Negro and 
my great-grandfather a monkey. 
You see, Sir, my family starts where yours ends." అంటూ 
చురక అంటించాడు అలెగ్జాండర్ డ్యుమాస్.
;  
ది కార్సికన్ బ్రదర్స్ - అలెగ్జాండర్ డ్యుమాస్ (Link- for this essay -New Ak)
Member Categories - మాయాబజార్
Written by kusuma   
Thursday, 16 February 2012 12:50

24, ఫిబ్రవరి 2012, శుక్రవారం

16 ఏళ్ళ పడుచు జానపదం- జయలలిత



















(అతడు):- 
మల్లెపూల చెండు లాంటి చిన్నదానా! 
నా  మనసంతా నీ  మీద పిల్లదానా! 
(ఆమె):- 
చూడ చూడ వేడుకైన చిన్న వాడా! 
చూడకోయి నిక్కి నిక్కి సొగసుకాడా!
(అతడు):- 
కొమ్మ మీద పండువే! కోనంతా రాలునా?
(ఆమె):- 
కొమ్మనే గుంజితే కోంగులోన రాలునా?||
(అతడు):- 
ఊరించి పోబోకుకు నువు కొంటెగా,
(ఆమె):- 
పరువాలు నీ పాలు అని అంటిగా! 
(అతడు):- 
వరి చేల మీద ఒట్టేసి పోవే! 
(ఆమె):- 
సరి ఓళ్ళు చూస్తారు రాలుగాయీ! 
(అతడు):- 
పట్టుచీర, జరీ రైక పట్టుకు రానా?  
(ఆమె):- 
తాళిబొట్టు, బాసికట్టు తప్పక తేరా! 
(అతడు):- 
ఔర, బుల్లీ! అత్త కూతురా! 
మేనత్త కూతురా! 
(ఆమె):-
రంగేళి రంగా! రచ్చ మానరా! 
బంగారు బావా! నీ తిక్క మానరా!

ఈ పాట 1964 లో విడుదల ఐన తెలుగు చలన చిత్రము "అమర శిల్పి జక్కన" లోనిది. 
నాగేశ్వర రావు, బి.సరోజాదేవి, హీరో, హీరోయిన్ లు .  
హరనాథ్, నాగయ్య, రేలంగి, గిరిజ, సూర్యకాంతం మున్నగువారు-ఇతర పాత్రధారులు.


**********************************************;
ఐతే ఇవాళ ఈ సినిమాలోని 
ఈ పాట- యొక్క  స్పెషాలిటీ - ఏమిటని అంటున్నారా?
ఈ గీత నృత్యకారిణికి అనేకమంది ఫాన్సు-  
ప్రత్యేక జేజేలులను అందిస్తూన్న శుభవేళ నేడే! ఈ నాడే!
ఇంతకీ ఎవరు ఆమె?
"ఆమె ఎవరు?" అనే సినిమాను జ్ఞాపకం తెచ్చుకొంటే సరి!
చప్పున గురుకువస్తుంది, ఆమె పేరు- ఆమెయే డాక్టర్ జె. జయలలిత.
డాక్టర్ అంటే- స్కెతస్కోపు డాక్టరు కాదండీ!!!!!!!
సినీ కళారంగంలో జయకేతనమును ఎగరేసిన విజయ వనిత, 
రాజకీయాల్లోకి అడుగిడిన ఆమె కీర్తిపతాక- రెపరెపలు- 
ఝళం ఝళత్ మెరుపు వార్తలలోని నారీరత్నం- Dr. J. Jayalalitha(February 24, 1948)
("Chinnada Gombe" her debut-  Kannada movie in 1963)
ఈ గీత నాట్య రూపములో 
పదహారణాల తెలుగు పిల్లదానిగా జానపదానికి హొయలు చూపించిన నాట్య తార,
16 సంవత్సరాల లేత వయసులో నిండుగా చీరకట్టుతో,
డాన్సు చేస్తూ గ్రూపుతో ఆట ఆడిన ఆ ముగ్ధ మనోహారిణి- జయలలిత.
నేటి తమిళనాడు- కు ముఖ్యమంత్రిణిగా 
అసంఖ్యాక సంచలనాలు సృష్టించిన మహిళా శిరోమణి- 
పురచ్చి తలైవి (Revolutionary Leader) బిరుదాంకితురాలు 
జయలలిత (jayalalita, Chief Minister of Tamil Nadu) జన్మదినము ఈ వేళ- 
ఆ puratchi thalaivi కి నా బోటి అభిమానుల శుభాకాంక్షలు.


*************************************;    
Jayalalita sing Tamil song: about mother (Yahoo)

23, ఫిబ్రవరి 2012, గురువారం

మీరా చిలకల పలుకులు






























రామచిలుకలు అన్నీ అక్కడ ప్రతిరోజూ వచ్చి వాలుతూంటాయి.
వాటిని ప్రేమతో పిలుస్తూ పళ్ళు, గింజలూ ఆమె వేస్తూంటుంది.
ఆమెయే మీరాబాయి, ప్రఖ్యాత క్రిష్ణభక్తురాలు.
ఆమె గళములో శృతి నొందిన పాటలు
దాదాపు 1300 భజన గీతాలు,
వైష్ణవ భక్తి ఉద్యమములో ప్రచారములో ఉన్నవి.
ఆమె పాడిన హిందీ భజనలు, గీతాలు భారతదేశంలోనూ,
ముఖ్యంగా ఉత్తరహిందూస్థానంలో విశేష వ్యాప్తిలో ఉన్నవి.
రామచిలుకలను పేరు పేరునా పేర్మితో సంబోధన చేస్తూ ,
ఆమె వాటికి ఆహారమును పెడ్తూంటుంది.
అలాగ పెడ్తూన్నప్పుడు భక్త మీరాబాయి
“ఓ పంచవన్నెల చిలుకా! గోవిందా! – అని చెప్పు.
“రాధే కిషన్!”- అని చెప్పు!
స్పష్టంగా నువ్వు ఆలాగున చెప్పిన తరువాతనే-
నీకు ఈ విత్తనాలు, ఫలములనూ ఇస్తాను”
ఇలాగ ప్రతిరోజూ చెప్పడం వలన- మాటలు రాని పక్షులు కూడా పలుకాడసాగినవి.
దేశ దేశాలన్ని ఎగురుతూ, తిరుగాడే చిలకమ్మల ద్వారా మైనా మొదలైన పిట్టలు సైతం
స్పష్ట ఉచ్ఛారణతో “రాధేక్రిష్ణ!/ రాధా కృష్ణ!” అంటూ
మాటలే పాటలంత మధురంగా కువకువలాడసాగాయి.
అంతఃపురములో మీరాబాయి చెలిమికత్తెలు, పరిజనము సైతం
“వివిధ ధ్వనుల ఉచ్చారణలతో మాట్లాడ గలిగిన మానవులకే కాక,
విహంగాది ఇతర ప్రాణులను కూడా వాక్కులనూ, విద్యలనూ నేర్పి,
చైతన్యభరితము చేసే మీరా ఓరిమి బహు గొప్పది”
అనుకుంటూ, ఆమెను ప్రశంసించేవారు.
క్రమముగా రాజ్యములోనూ, ఇతరసీమలలోనూ కూడా
“రాధేశ్యామ్! రాధేక్రిష్ణ!” అనే నాదము
పరస్పరము శుభారంభ అభిభాషణల శ్రీకారముగా మారి,
సాంప్రదాయముగా పరిణామం చెందినది.
రాధాకృష్ణ అనే శాఖీయులు, అనుయాయులు
“రాధే క్రిష్ణ!” అంటూ శ్రీకృష్ణ భక్తులు ఒకరికొకరు విష్ చేసుకుంటూంటారు.
నేటికీ సాధువులు, శిష్యులు ఈ మహామంత్రాన్ని పదే పదే పలుకుతూ
ముందుకు సాగుతూంటారు.
;  
మీరా చిలకల పలుకులు (Link:- Forkids Web Magazine)
Published On Friday, February 10, 2012 
By ADMIN. Under: కథలు, పురాణ కథలు.   
రచన  : కాదంబరి పిడూరి  

16, ఫిబ్రవరి 2012, గురువారం

భృగు సంహిత(Hoshiarpur)


మహర్షి























మహర్షులు, పండితులు, విజ్ఞానులు-మున్నగువారికి 
మనోవ్యధ కలిగితే ఏం జరుగుతుంది? 
వాళ్ళు స్పర్థిస్తే ఏమి జరుగుతుంది?


అలాటి వ్యక్తుల నడుమ స్పర్ధ కలిగితే, 
కొన్ని పర్యాయాలు 
అలాటి సంఘటనలు త్రిభువనాలకు మేలు చేకూరుస్తాయి
మన దేశంలో ఆదికవి వాల్మీకి "శ్రీమద్రామాయణము",           ----- విష్ణుశర్మ "పంచతంత్రము", 
పారిజాతాపహరణము, గుణాఢ్యుని బృహత్కథలు, 
చాణుక్యుని "నీతి శాస్త్రము" మరియు "అర్ధ శాస్త్రము", 
జగన్నాథ పండిత రాయల రచన 
"గంగాలహరీ స్తోత్రం" ఇత్యాదులు 
అనేక లేఖనములు, అనేక తాళపత్ర గ్రంథాలు ఉద్భవించినవి. 
ఆ కోవలోదే భృగు మహర్షి రచన "భృగు సంహిత".


భృగు మహర్షి  వైకుంఠమునకు వెళ్ళినప్పుడు, 
శ్రీమహావిష్ణువు యొక్క నిద్రా నటన హేల, లోకకళ్యాణార్ధము- 
శ్రీ శ్రీనివాస అవతారమునకు అంకురారర్పణ ఐనది. 
అవే క్షణాలు భృగు మహర్షి  విశిష్ట గ్రంధమునకు బీజావాపనము చేసినవి. 
శ్రీమహాలక్ష్మి "నా పతిదేవుని ఉరమున తాడనము చేసితివి" అంటూ ఆ ఋషిపైన కోపించినది. 
ఉక్రోషముతో లక్ష్మీ-భృగువుల పరస్పర శాపములు ఒక మహత్తర లేఖనమునకు శ్రీకారము చుట్టినవి.


ఆమెతో భృగు మహర్షి  "నేను జ్యోతిష్య గ్రంధమును రచిస్తాను" అంటూ     ప్రతిజ్ఞ చేసాడు. 
అలాగ మహర్షి చేసిన భీషణ వాక్కు "భృగు సంహిత" లిఖించే ప్రయత్నంగా పరిణమించినది. 
మహర్షి భృగు మహర్షి  తన ఆశ్రమమును చేరాడు. అవిరళ తపస్సు చేసి, జ్ఞానార్జనము చేసాడు. 
తన తపః ఫలితముతో లోకానికి "భృగు సంహిత"ను అందించాడు. 
భృగు మహర్షి అందులో అనేక అంశాలను ఉటంకించాడు. 
మానవుల జీవిత చక్రములోని భూత, వర్తమాన, భవిష్యత్ గాథా హేతు విశేషాలను నుడివాడు. 
పూర్వజన్మ  ఇప్పటి , రాబోయే జన్మల పూర్వా పరములను గురించి, 
మానవుల "జన్మ కుండలీలు ప్రధాన ఆధారములుగా, 
వారి జీవితముల విధానముల వివృత చిత్రణములే" భృగు సంహిత.


భృగు మహర్షి మొట్టమొదట తన కుమారునికి, తన శిష్యునికీ బోధించాడు. 
భృగు మహర్షి ఇందలి సిద్ధాంతాలను వారిరువురికీ బోధించాడు. 
భృగు మహర్షి ఆశ్రమము హొషియార్ పూర్ లో ఉన్నది
Hoshiarpur (Punjab state)
అక్కడ ఆయన తాళపత్రములో 
జ్యోతిష్య విశేషములకు పునాదిరాళ్ళు అనదగిన సిద్ధాంతములను, విశేషములనూ వ్రాసాడు. 
శిష్యుడైన శుక్రుడు, దశలు దశలుగా ప్రపంచానికి 
నక్షత్ర గమనములకూ, గ్రహ సంచారములకూ, 
మనిషి జన్మ తిథి, రాశి పొంతనలకూ గల అవినాభావ సంబంధముల   విజ్ఞాన రహస్యాలను అందించాడు.


ప్రాచీనభారతదేశములో హొషియార్ పూర్ ఖగోళ విద్యా సంపదకు (astrology)ముఖ్య కేంద్రముగా విరాజిల్లినది. వేలాదిమంది జనులు ఇచ్చటకు తమ తమ మనుగడలో రాబోయే మార్పులు, చేయవలసిన పనులకు అనుసరించవలసిన మార్గాలు, వర్తమాన, భవిష్యత్తుల వివరములను తెలుసుకునే జిజ్ఞాసతో ఇక్కడికి వచ్చేవారు. 
కానీ తరువాతి దశాబ్దములలో ముష్కరుల దండయాత్రలో, 
వారి దౌష్ట్యముచే ఈ గ్రంధములోని అనేక భాగాలు లూటీ ఐనవి. 
ఎన్నో పుటలు ధ్వంసమై, శిధిలమైనాయి.


ఆనాటి విద్యావిధానము "కంఠోపాఠము పట్టుట". 
లక్షలాది శ్లోకములను, ఉద్ గ్రంధములనూ విద్యార్ధులు ఇసుకలో రాసి, మననము చేసే వాళ్ళు. 
కాగితములు, పేపర్లు కనిపెట్టని ఆ పురాతన కాలములో
 గురువులు- చదువు చెప్పే పద్ధతులలో ఋక్కు పట్టుట, కంఠతా పట్టుటయే మేల్తరమైన రీతిగా ఎంచుకున్నారు. 
ఈ విధానముచే నేటికీ భృగు సంహిత ఆధారముగా ఏర్పడిన జ్యోతిష్య విద్య అందుబాటులో ఉన్నది. 
జ్యోతిష్య వాక్కును వృత్తిగా అనుసరిస్తూన్న వారు 
"మేము భృగు మహాముని శిష్య పరంపరకు చెందిన వారసులము" అని చెప్పుకుంటారు.


ప్రాచీన, మధ్య యుగములలో ఘూర్జర, ప్రతీహార చక్రవర్తుల పాలనకు, ప్రాచీనతకు ఆలవాలములుగా ఉన్నవి. హొషీయార్ పూర్ ఆ పరిసర ప్రాంతాలు ఇప్పటికీ సింధు నాగరికతలను ప్రతిబింబిస్తూన్నవి. 


*****


నిర్మలా మిట్ఠల్  పూనాలో జన్మించారు.  
ఆమె జర్నలిస్టుగా, పాత్రికేయ ఉద్యోగినిగా తనకు లభించిన అవకాశాలను 
సద్వినియోగం చేసుకున్నారు. 
;














ఈమె Bhrigusamhita Research Centre ను నిర్వహిస్తున్నారు. 
మానవతా విలువలను ఉద్బోధించే సూత్రములు గల 
హిందూ, బౌద్ధ, ఇస్లాము, క్రైస్తవాది విభిన్న మత సూత్రాలను అర్ధం చేసుకున్న ఆమె, 
వినూత్నమైన సంగతులను అన్వేషిస్తూ, ఆసక్తికరమైన వృత్తాంతములను చదువరులకు అందించారు. 
భృగుసంహిత గురించి, ఆమె అనేక పరిశోధనలను చేస్తూన్నారు. 
ప్రస్తుతం భృగుసంహిత పూర్తిగా దొరకడం లేదు.    ----------------- నిర్మలా మిట్టల్ వద్ద కొద్దిభాగం ఉంది.


  
భృగు సంహిత (Essay- N Avakaya)
Member Categories - తెలుసా!
Written by kadambari piduri   
Sunday, 05 February 2012 15:19 
;

10, ఫిబ్రవరి 2012, శుక్రవారం

కస్తూరిరంగయ్య కరుణించవయ్యా,అల్లూరి వేంకటాద్రిస్వామి

మన దేశములో భక్తి ఉద్యమాలకు ఉల్లాసభరితమైన ఊపును తెచ్చినది "భజన సాంప్రదాయము".
భజనల్లాంటి కళా పూర్ణ సామాజిక సాంప్రదాయ
ఆచారములు హిందూ భక్తి సాంప్రదాయాలను విలక్షణ భరితంగా రూపుదిద్దినాయి.


"కస్తూరిరంగయ్య కరుణించవయ్యా",
"పొద్దుపొద్దున లేచి, 
వరదుని ముద్దుల మోము నేడు"
మున్నగు గీతాలను రచించినది శ్రీ అల్లూరి వేంకటాద్రిస్వామి 
(1807-1877).
ఈయనే "తిరువెంగడ రామానుజ జియ్యరు" గా విఖ్యాతి చెందాడు.
1807లో అక్షయనామ సంవత్సర, ఫాల్గుణ పౌర్ణమి తిథినాడు జన్మించాడు.
అల్లూరి వేంకటాద్రిస్వామి జననీ జనకులు వెంకమ్మ, వెంకయ్య.
వారి నాలుగవ సంతానము శ్రీవత్స గోత్రీకుడు ఈ అల్లూరి వేంకటాద్రిస్వామి.
ఈయన జన్మ స్థలము అల్లూరు కృష్ణా జిల్లాలో ఉన్నది.


శ్రీ తూమునరసింహదాసు (1790-1833)దేశాటనము చేస్తూ,
వీరి గ్రామానికి వచ్చాడు. ఆయన అల్లూరి వేంకటాద్రిస్వామి
ఏకాగ్రతను గమనించి, "శ్రీ రామ తారక మంత్రము"ను ఉపదేశించాడు.
అల్లూరి వేంకటాద్రిస్వామి భద్రాచలములో, శ్రీరామకోటిని రాసి, స్వామికి సమర్పించాడు.
అక్కడ ఐదారేళ్ళు గడిపి, దేశ సంచారము చేస్తూ,
అనేక పుణ్యతీర్ధాలను దర్శించుకున్నాడు.
అల్లూరి వేంకటాద్రిస్వామి జీవనయాత్రలో చెప్పుకోదగినది "కంజీవరము".
అచ్చట విష్ణుమూర్తి దేవళమును జీర్ణోద్ధరణ కావించాడు.
ఆ రోజులలో ఐదువేలు సేకరించి, అక్కడ ఎన్నో పనులను దిగ్విజయంగా చేసాడు.
ఆయన శ్రీకారం చుట్టిన కార్యక్రమాలు నేటికీ కొనసాగుతున్నాయి.


"దూసి మామండూరు" అనే పల్లెలో పొలాన్ని అల్లూరి వేంకటాద్రిస్వామి కొన్నాడు.
ఆ సుక్షేత్రంపై వస్తూన్న రాబడి, ఆదాయాలు
"శ్రీ వరద రాజస్వామి వారి" పూజా కార్యక్రమ నిర్వహణకై
ఇప్పటికిన్నీ వినియోగించబడ్తూన్నవి.
అలాగే అల్లూరి వేంకటాద్రిస్వామి బీద విద్యార్ధుల వేద అధ్యయనానికై ఒక పాఠశాలను నెలకొల్పారు.


******


వేగవతీ నదిలో స్నానం చేసి, కంచిలో జరిగే "గరుడోత్సవము"ను చూడ కోరికతో,
బయలుదేరాడు అల్లూరి వేంకటాద్రిస్వామి. హస్తిగిరిని చేరుకున్నాడు.
అక్కడ "శ్రీ ఫెరుందేవి అమ్మవారి" ని సేవించుకున్నాడు.
అటుపిమ్మట "శ్రీవారుణాద్రి వరద స్వామి"నీ, అలాగే "తిరువడి" మొదలుకొని,
"తిరుముడి" దాకా అన్ని అలంకార ఆరాధనలనూ తిలకిస్తూ పులకించాడు.
అతను కంచి కోవెల పశ్చిమ సీమలో చిన్న గుడిసెలో ఉన్నాడు.


"మధుకరము" అనగా బిక్షాటనతో కడుపు నింపుకుంటూ,
పెరుమాళ్ళ అర్చనా సందర్శనాదులతో భక్తిపారవశ్యములో ఓలలాడేవాడు.
నాటికి 20 వత్సరముల వయసు కల అల్లూరి వేంకటాద్రిస్వామి.
"తిరుకచ్చినంబి, ఇళయాళ్వార్లు స్వామివారికి పుష్పకైంకర్యములు చేసారు.
వారికిమల్లే నేను కూడా చేయగలనా??"  అని అనుకున్నాడు.
తన ధ్యేయ సాధనకై అనునిత్యం శ్రమించాడు.
అనుకున్నదే తడవుగా పూలతోటలను పెంచాడు.


పూమాలలు అల్లుతూ, ఎంతో భక్తితో పూలహారాలతో అలంకరిస్తూ,
పుష్పార్చనలను చేస్తూండేవాడు.
ఆ క్రమంలోనే అటుపిమ్మట దూసిమామండూరు భూమిని కూడా కోవెలకు
వసతిగా సమకూర్చగలిగాడు అల్లూరి వేంకటాద్రిస్వామి.


******


చెన్నపట్టణము చేరాడు అల్లూరి వేంకటాద్రిస్వామి.
శ్రీమన్నారాయణుని, కీర్తనా రచనా, గానములతో- పూజిస్తూన్నాడు అతను.
అప్పుడు "స్వామివారి స్వప్న సాక్షాత్కార ఆదేశము" లభించగానే
తిరిగి కొన్ని పనులు మొదలిడినారు.
దీక్ష పూని, ప్రతిరోజూ పదిరూపాయల వంతున పోగు చేసాడు.
ఆ డబ్బుదస్కములతో "వైరముడి" ని తయారుచేయించాడు.
ఆ కిరీటమును ఒక అద్దాల పెట్టెలో ఉంచాడు.
చెన్నపురి పురవీధులలో ఊరేగించాడు.


కాళయుక్తి నామసంవత్సరములో
వైశాఖ శుద్ధపౌర్ణమి నాడు "శ్రీ పెరుమాళ్ళు"కు తాను చేయించి తెచ్చిన వైరముడిని,
అనగా "రత్నఖచిత కిరీటము"ను సమర్పించాడు అల్లూరి వేంకటాద్రిస్వామి.


సైదాపేటలోని మాంబళములో, నేటికీ ఉన్న శ్రీనివాస విగ్రహము-
అల్లూరి వేంకటాద్రిస్వామి యొక్క మహిమను నిరూపించినట్టి మూర్తి ఉన్నది.
పెరుమాళ్ళ వారి దేవేరులకు కూడా, అల్లూరి వేంకటాద్రిస్వామి కాంచన కిరీటాలను చేయించాడు.


క్రిష్ణమనాయని అగ్రహారములో, "మధుకరము" చేస్తూ
కాలం గడపసాగాడు అల్లూరి వేంకటాద్రిస్వామి.
దుందుభినామ సంవత్సరములో "ఉభయ నాంచారులకు" కిరీటధారణలను చేసి,
తృప్తి పొందాడు అల్లూరి వేంకటాద్రిస్వామి.


తర్వాత, శ్రీ అళగియ మణవాళ జియ్యరు వద్ద,
"శంఖ చక్ర లాంఛనములు", "మంత్ర ద్వయము"లనూ స్వీకరించాడు.
కావేరీ నదీ తీరమున శేషశాయిగా అగుపించే కస్తూరి రంగడు కలలో కనబడి
"భక్తా! గోపీచందన మహారాజు పాండ్యన్ ఒక్కండే నాకు ముత్తువళయమును చేయించెను.
అది జీర్ణమైనది" అని నుడివాడు. మళ్ళీ చెన్నపట్నము చేరి ఉన్న అల్లూరి వేంకటాద్రిస్వామి
మునుపే భజనా కైంకర్యాది నిష్కామ సేవలతో ప్రజలచే ప్రశంసలు అందుకున్నవాడు.
కనుకనే ఆతనికి ధనసేకరణ సులభసాధ్యమైనది.


అల్లూరి వేంకటాద్రిస్వామి పోగు చేసిన చందాలతో "ఒమ్మచ్చు"ను తయారు చేయించాడు.
ఆ ఒమ్మచ్చును తీసుకు వెళ్ళి, శ్రీరంగమును చేరాడు.
శ్రీరంగనాధుని తలపైన పెట్టాడు. ఆశ్చర్యకరంగా,
ఆ కిరీట/ తలపాగా సరిగా కొలిచినట్లుగా సరిపోయింది.
పునః ప్రయత్నములో, ఆ 'వైరముడి'కి మణి రతనములను కూడా సమకూర్చి,
అందులో తాపడము చేయించాడు అల్లూరి వేంకటాద్రిస్వామి.


1863- 12 వ నెల, 20 వ తేదీన అల్లూరి వేంకటాద్రిస్వామి వ్రాసిన
సంకీర్తనలను సైతము, కస్తూరిరంగనికి సమర్పణ గావించాడు అల్లూరి వేంకటాద్రిస్వామి.
ఆయన, శిష్యుడైన ఆదినారాయణదాసు కూడి,
కూరిమితో మైలాపూరులోని కోవెల శిఖరములను పునరుద్ధరణ గావించారు.


ధాతునామ సంవత్సరము (1876) ఆయన చరిత్రలో ఆఖరి పుటగా మిగిలినది.
కుంభ మాసములో బహుళ సప్తమి, సోమవారము నాడు
అర్ధరాత్రి సమయాన్ని "తనకు స్వామి పిలుపు వచ్చినది"
అంటూ భక్తులకు తెలిపాడు అల్లూరి వేంకటాద్రిస్వామి.
కంచివరదరాజస్వామికి పేరుందేవి అమ్మణ్ణిలకు పూజలు చేసి,
తిరుమంజనము, తిరువారాధనలను చేసాడు.
పద్మాసనము వేసుకుని, అంజలి ఘటించాడు.
ఆనాటి అర్ధరాత్రి సమయాన శ్రీరంగనాధుని నైవేద్య ప్రసాదములనూ,
"అరవణ ప్రసాదము"ను స్వీకరించి, శ్రీరంగనాధుని సన్నిధికి చేరాడు అల్లూరి వేంకటాద్రిస్వామి.


అక్కడ "గజేంద్ర మందిరము" లో ఈనాటికి కూడా  చెన్నపురి ముత్యాలపేటలు ఉన్నవి.
అంతే కాదు! భజన తాళములు , తంబూర కూడా ఉన్నవి.
అవే శ్రీవేంకటాద్రిని మెచ్చుకుని, తూమునరసింహదాసు ఇచ్చిన అపురూప వస్తువులు.


(గాలి రఘువరప్రసాద్: రచించిన :- "భక్తి సంకీర్తనా తరంగ లహరి" నుండి)
;


అల్లూరి వేంకటాద్రిస్వామి (Web Link- N AvakAya)
Member Categories - తెలుసా!
Written by kusuma  
Thursday, 19 January 2012 12:59



3, ఫిబ్రవరి 2012, శుక్రవారం

ఫిజీ దీవుల్లో బద్రీనాథ్ మహారాజ్


1874 నుండి ఫిజీ దీవులకు బ్రిటీష్ కాలనీలు- ఏర్పడసాగాయి. 
ఆంగ్లేయులు రబ్బరు తోటలు, తేయాకు, నీలిమందు తోటలను 
వాణిజ్యదృక్పధముతో విరివిగా పెంచసాగారు. 
ఆయా ఉద్యాన పెంపకములు పెద్ద ఎత్తున నిర్వహిస్తూండడంతో 
వారికి కూలీల ఆవశ్యకత మిక్కుటంగా కలిగింది. 
తత్ఫలితంగా మన దేశంనుండి 
అప్పటి "బ్రిటీష్ పాలిత ఇండియా" నుండి 
అనేకమందిని ఫిజీ ఐలాండ్స్ కు తరలించుకువెళ్ళారు. 
కార్మికుల విధులకై స్వచ్ఛందముగా వేలాది మంది భారతీయులు 
అక్కడికి వలసలు ((migrate/ migration) వెళ్ళారు. 
ఆ సమాజములో మన వారు క్షీర నీర న్యాయముగా కలిసిపోయి, 
అచ్చట పురోగతికి మూలస్తంభములుగా నిలబడ్డారు.


బద్రీనాథ్ మహారాజ్(బద్రీ దత్) 1868 లో ఉత్తరాఖండ్ లోని 
(బద్రీనాథ్ పుణ్యక్షేత్రానికి సమీపంలో ఉన్న) 
బామోలీ గ్రామంలో జన్మించాడు. 
1889 లో కాంట్రాక్టు లేబర్ పనికోసం, 
వలస కార్మికునిగా ((indentured labourer) ఫిజీ దీవులకు చేరాడు. 
పనిపాటులలో సోమరితనాన్ని ఇష్టపడే వాడు కాదు. 
ఠలాయించి, పని ఎగగొట్టే సోమరికాదు అతను. 
కనుకనే ఆతడు కష్టించి పనిచేసి, "చురుకైన రైతు"గా పేరు తెచ్చుకున్నాడు. 
అతి కొద్దికాలంలోనే "విజయవంతుడైన కర్షకుడు" అని ప్రశంసలు పొందాడు.


బద్రీ మహారాజ్ రైతే కాదు రాజకీయవేత్త మరియు మానవతావాది కూడా. 
ఆతడు రెండు సార్లు ఫిజీ పార్లమెంటులో పదవులను నిర్వహించాడు 
ఫిజీ దీవులలో అనేక సంస్కరణలను ప్రవేశపెట్టాడు. 
బాల్యవివాహాలను వ్యతిరేకించాడు. 
ఈ విషయాన బద్రి దత్ సమకాలీనుల నుండి వ్యతిరేకతలను  ఎదుర్కొని, 
స్థిరంగా నిలిచి, తన ఆశయాలను అమలు పరిచాడు. 
అలాగే పంచాయతీలను పునరుద్ధరించాడు. 
అక్కడ ఉన్న భారతీయులకై విద్యా సదుపాయాల ఆవశ్యకతను గుర్తించాడు. 


ఆతని అంతర్మధనముతో అవిరళ కృషి ఫలితముగా 
అక్కడ పాఠశాలలు నెలకొల్పబడినవి. 
రిపబ్లిక్ ఆఫ్ ఫిజీ ఐలాండ్స్ లో భారతీయుల నిరంతర శ్రమ వలన 
కొంగ్రొత్త సంస్కరణలు రూపుదిద్దుకున్నవి. 
రాకిరాకీ అనే పట్టణమునకు సమీపంలో 
1898 లో నిర్మించినట్టి మొదటి స్కూలు 
-Wairuku Indian School, Fiji లో చారిత్రక సంఘటన అది.


ఫిజీలో 1893 లో "ఆర్యసమాజము" కార్యకలాపములు  జరుగుతూండేవి. 
1902 లో ఇండియా నుండి- షయూ దత్ శర్మ రాకతో ఊపందుకున్నవి. 
బద్రీ చేరికతో ఆర్యసమాజము- సమాజసేవ, సంస్కరణలు 
అత్యున్నతశృంగములకు చేరినవి. 
ఈ క్రమంలో అనేకమంది భారతీయుల నిరంతర కృషితో 
అక్కడ అనేక రంగాలలో ప్రజానీకము ప్రగతి గాంచారు. 
నేటికీ బద్రీ శ్రీకారము చుట్టిన సేవలను, ప్రోగ్రాములనూ 
ఆర్యసమాజము వారు కొనసాగిస్తున్నారు.
 ;
ఫిజీ దీవుల్లో బద్రీనాథ్ మహారాజ్  (Web; NewAwakAya)

Member Categories - తెలుసా!
Written by kusuma   
Tuesday, 03 January 2012 13:51


ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు

"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...