14, ఆగస్టు 2015, శుక్రవారం

సాహితీ నీరాజనం – శ్రీ చీమకుర్తి శేషగిరిరావు

ఆంధ్రస్య మాంధ్ర భాషా చ| 
న అల్పస్య తపసః ఫలం|| 
అని అప్పయ్య దీక్షితులు ఉవాచ.     

“సాహితీ నీరాజనం”:-
శ్రీ చీమకుర్తి శేషగిరిరావు గారి ప్రధమవర్ధంతిలో “సాహితీ నీరాజనం” సమర్పించబడినది. బొమ్మకంటి శ్రీనివాసాచార్యులు సంపాదకుడు. సాహితీ నీరాజనం – శ్రీ శేషగిరిరావు గారి ఉదాత్త భావాలు, ఆశయాలకు వివరణాత్మక వేదిక. శ్రీ శేషగిరిరావు గారిని సన్నిహితులు వివరించిన అనేక విశేషాలను ఇందు ఉటంకించారు.
తెలుగుభాషాసమితి కార్యాలయములో నెలనెలా నిర్వహించే సాహిత్యగోష్ఠులలో -సాహితీవేత్తలు ముద్రించవలసిన 
అపురూప గ్రంథాలను గూర్చి చర్చించి, నిర్ణయాలు తీసుకుంటూండేవారు.
బొమ్మకంటి శ్రీనివాసులు పేర్కొన్న ముఖ్య అంశాలను గమనిద్దాము. 
1) క్రీ.శ. 580 – 620 మధ్య మాధవవర్మ మహారాజు సంస్కృత పుస్తకాన్ని రాసారు. జనాశ్రయుడు – అను పేరుతో మాధవ వర్మ మహారాజు రచించిన వ్యాకరణ/ ఛందస్ గ్రంధం “జనాశ్రయ ఛందో విచితిః”. 
ఆ నాడు వాడుకలో ఉన్నట్టి తెలుగు ఛందస్సులను ఈ పొత్తము వివరిస్తున్నదని, కనుక ఆ రాజు రచనను వెలుగులోనికి తేవాలని 
శ్రీ శేషగిరిరావు భావించారు.
2) అట్లాగే శ్రీచిలకపాటి రామానుజశర్మ రచన “వినోద కథా కల్పవల్లి” మున్నగు వానిని తెలుగు గోష్టి తరఫున ముద్రించాలని శ్రీ శేషగిరిరావు ఆశించారు.
****************
తిరుమల రామచంద్ర “మరుగై పోయిన మహా మేధావి” అనే వ్యాసంలో మిత్రులైన ‘శ్రీ చీమకుర్తి శేషగిరిరావు’ గురించి వివిధ అంశాలను వివరించారు.
“శ్రీ చీమకుర్తి శేషగిరిరావు ప్రాచ్య పాశ్చాత్య విజ్ఞాన ఖని. 
ఏ విషయాన్నయినా కదళీపాకంగా వివరించేవారు. 
రాజనీతి శాస్త్రం లో, ఆర్థిక శాస్త్రం లో, పరమాణు శాస్త్రం లో, 
వైద్యశాస్త్రం లో శ్రీ చీమకుర్తి శేషగిరిరావుగారు – స్నాతకోత్తర విద్యార్థులకు బోధించే వారు. 
ఇక మాతృభాష తెలుగు, భాష కళ, వాస్తు ఆయనకు కొట్టిన పిండి. బైజంటైన్ కాలం నుండి బలిద్వీపం వరకు వీరవిహారం చేసేవారు. 
పెద్ద బాలశిక్ష మొదలు పిటకాల వరకు, ఎక్కాలు మొదలు ఎలెక్ ట్రానిక్స్ వరకు నిద్రలో కూడా బోధించగల మహా మేధావి” 
అని (పేజీ 15) ఆశ్చర్యాన్ని అతను వ్యక్తం చేసారు.
****************

సత్యం బ్రూయాత్, ప్రియం బ్రూయాత్” 
చీమకుర్తి శేషగిరిరావు సహృదయులు. ఆయనతో కలిసి పనిచేయడం 
గొప్ప అనుభవం. ఎవరినీ నొప్పించేవారు కాదు. 
చంద్రునిలో మచ్చలాగ ఆయనకు ఒక అలవాటు ఉండేది. 
ఇప్పుడు బడా బడా పరిశోధకులుగా, రచయితలుగా ఊరేగుతున్న, 
ఊరేగిన పలువురికి ఆయన తెర వెనుక రచయిత. 
'అన్నగారూ! ఈ పని బాగలేదండీ! అపాత్రులను గొప్పవారిని చేయడం కూడా పాపమే! – అని పలుమారు (తి॥ రా॥ ) అన్నాను. 
అందుకు చీమకుర్తి శేషగిరిరావు జవాబు ఈ రీతిగా -
“తమ్ముడూ! కొందరు కొన్ని పదవులలోనికి వస్తారు. 
వారు తమ పదవులని నిలబెట్టుకోడానికి కొన్ని పనులు చేయాలి. 
అలాంటి వారి వల్ల కొన్ని మంచిపనులు జరుగుతాయి. 
కనుక మనం వారిని సమర్థించి మంచి పనులు చేయించాలి.” అనేవారు. నిజమే! ఇలాటి రాజనీతి అవసరమేమో! అని తి॥ రామ॥ భావించారు. పచ్చని మేని చాయకు మెరుగులు పెట్టే - తెల్లటి ఖద్దరు పంచ, చొక్కాలతో, 
బిళ్ళ మడుపు జరీ ఉత్తరీయంతో, కత్తిరించిన మీసాల మధ్య దర్శనమిచ్చే 
ఆ అన్నగారు చిరస్మరణీయులు. -అంటూ 
“మరుగై పోయిన మహా మేధావి” అనే శీర్షికతో – వ్రాసిన వ్యాసంలో తిరుమలరామచంద్ర అనేక అభిప్రాయాలను వెలిబుచ్చారు.
****************
ఆచార్య తిరుమల తెలిపినవి కొన్ని :-
3) ఎవరూ చదవని ‘అహదనక శాసనము’ ను చదవాలని శ్రీ చీమకుర్తి శేషగిరిరావు ఆశించారు. వివిధ విశేషాలను మూలమట్టం నుండి పరిశోధించిన కర్తవ్యనిష్ఠాగరిష్ఠులు శ్రీ చీమకుర్తి శేషగిరిరావు. ఆదిశంకరాచార్యుల కాలనిర్ణయాదులు ఆమూలాగ్రం గాలించి, పఠితలకు అందించుటకై బహు పరిశ్రమ చేసారు శ్రీ శేషగిరిరావు.
4) శ్రీ ఆదిశంకరాచారుల కాల నిర్ణయ పద్ధతి :- క్రీ.శ. 538 లో జన్మించారని శ్రీ శేషగిరిరావు అభిప్రాయం. ఇందుకు ఆయన చూపిన ఉపపత్తుల పట్టిక – శ్రీ శేషగిరిరావు గారి పరిశ్రమకు దర్పణాలు.
అ] 12వ శతాబ్ది ఇవతల డాక్టర్ పోతుకూచి సుబ్రహ్మణ్య శాస్త్రి వంటి అనేకమంది ఉద్ధండుల వాదనలను శ్రీ శేషగిరిరావు పరిశీలించారు.
ఆ) ‘శంకర మందారం’ లో పేర్కొన 3889 కావ్యబద్ధాలు.
ఇ) కాంపూచియా పాలకుడు (877) ఇంద్రవర్మ తన గురువు ఐన శిసోమునికి – ఇచ్చిన ‘దానశాసనము ‘లో ‘శంకర శిష్యునిగా’ పేర్కొన్నారు.
ఈ) ‘సంక్షేపశారీరం’ అనే వేదాంత గ్రంధ రచయిత సర్వజ్ఞాత్మ ముని, ఈ ముని యొక్క గురువు సురేశ్వరాచార్యుడు.
ఉ) సర్వజ్ఞుడు ‘రాజన్య వంశీయుడైన ‘మను కులాదిత్యుడు పరిపాలిస్తున్నాడు అనుట
ఊ) వరాహమిహిరుడు 5-6 శతాబ్దాలవాడు, ఇతను ‘మధుర ప్రాంతాన్ని రాజన్య వంశీయులు పరిపాలిస్తున్నారని – పేర్కొన్నాడు.
ఋ) ఆ వంశీయుల దొరికినవి.
ౠ) ఋగ్వేద భాషాకర్త స్కందస్వామి; 
స్కందస్వామి శిష్యుడు ఐన మహేంద్రుడు -
మహేంద్రుడు ఉదహరించిన వ్యక్తి “కుమారిల భట్టు”. 
కుమారిలుడు శ్రీ ఆదిశంకరాచార్యులకు వరిష్ట సమకాలికులు.
ఎ) ఆంధ్ర దేశీయుడైన భావవివేకుడు – గౌడపాదుని రచనలు ‘మాండూక్యకారికలు’ ఉదహరించుట
ఏ) గోకర్ణుడు కాశ్మీర చక్రవర్తి, వైదిక మతోద్ధరణలో 
ఆదిశంకరాచార్యులకు తోడ్పడ్డాడు.
ఒక అంశాన్ని నిర్ణయించడానికై శ్రీ శేషగిరిరావు వంటి పండితులు నిదర్శనాలను సేకరించుటకై కొన్ని వేల గ్రంధాలను అన్వేషణ చేసి, 
గాలించి – అందుకు పడిన శ్రమను తలుచుకుంటే మాతృభాషాభిమానులకు కళ్ళు చెమరుస్తాయి.
****************
చీమకుర్తి శేషగిరిరావు గారి వ్యక్తిగత జీవితం కూడా చైతన్యపూర్ణమైనది. మాతృ దేశానికి స్వాతంత్ర్య సముపార్జనా పోరాట కాలం అది. 
ద్వితీయ ప్రపంచ యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ, ఉద్యమాలు నిర్వహించారు. ఆయన 1942 లో ఉప్పు కొటార్ల పై దాడి చేసారు. 
తత్ఫలితంగా అరెస్టు వారెంటు వచ్చింది.చీమకుర్తి శేషగిరిరావు తప్పించుకుని, అజ్ఞాతవాసం 1946 మార్చి వరకు చేసారు. 
అజ్ఞాత వాసములో ఉంటూనే, ఉద్యమాన్ని నడిపారు. ఆ తరుణాన బొంబాయిలో – క్యాంపు ఆర్గనైజరుగా ‘సూర్జీ వల్లభదాస్' ఉన్నారు. 
మూంజీ గారి గెరిల్లా క్యాంప్ కు చీమకుర్తి శేషగిరిరావు యువకులను సమీకరించి పంపిస్తూండే వారు. 
1946 మార్చి తర్వాత అజ్ఞాతవాసాన్ని చాలించారు. 
1947 లో కాంగ్రెస్ సోషలిస్ట్ వింగ్ లో చేరారు. 
1948 లో సోషలిస్టు పార్టీ నుంచి కూడా విడిపోయి, నిర్మాణ కార్యక్రమాలను కొనసాగించారు. అప్పటికి ఆస్తి యావత్తూ కరిగిపోయింది. 
ఉద్యోగాన్వేషణలో చెన్నపురి చేరారు. అక్కడ తెలుగు భాషా సమితి వారి తెలుగు విజ్ఞాన సర్వస్వం – లో అసిస్టెంట్ కంపైలర్ గా చేరారు. 
ఆయన ద్వారా తెలుగు సంస్కృతికి గొప్ప సేవ లభించింది. 
జూన్ 14, 1913 లో వెల్లటూరు (పొన్నూరు తాలుకా, గుంటూరు జిల్లా) జన్మించిన 
శ్రీ చీమకుర్తి శేషగిరిరావు గారు 90 సంవత్సరముల బ్రతుకుబండి – సారస్వత మైలు రాళ్ళకు – బంగారు ధగధగల పూతలను అలది,  తన లక్ష్యములను అందుకుని, చరితార్థమైనది.
****************

శ్రీ చీమకుర్తి శేషగిరిరావు గారి జీవిత సంఘటనలు :- 
చిల్లర ఆదినారాయణ, ఆదెమ్మ – వీరి జన్మదాతలు. 13 జూన్ 1913 లో బాపట్ల తాలూకా – వెల్లటూరు గ్రామమునందు జన్మించారు. 
చీమకుర్తి వెంకటప్పయ్య, నర్సమ్మ గార్లు (కౌండిన్య సగోత్రీకులు)- 
1926 లో దత్తత తీసుకున్నారు. 
విద్య :- వెల్లటూరు, శ్రీ రంగపట్నం, చేబ్రోలు, తెనాలి, గుంటూరు ఎ.సి. కాలేజి. ముదివర్తి సుబ్బారావు, సత్యవతి ల పుత్రిక ‘రాజ్య లక్ష్మి’తో 1931 లో పరిణయం; దత్తపుత్రిక : లలితా కుమారి; 1931 – 54 దాకా స్వాతంత్ర్య పోరాటంలో కార్యశీలి; 
16 సెప్టెంబర్ 1994 భోపాల్ లో దేహయాత్ర చాలించు వఱకూ 
సాహిత్యచైతన్య యాత్రను కొనసాగించిన ధన్యజీవి చీమకుర్తి శేషగిరిరావు.
****************

గుండ్లపల్లి ఆదినారాయణ ‘ఆరు దశాబ్దాలుగా నేనెరిగిన మిత్రుడు’ అని శ్రీ చీమకుర్తిశేషగిరిరావు స్నేహబాంధవ్యాలు గురించి వ్యాసీకరించారు. ఆర్థికస్థోమత అంతగా లేని కారణంగా చేబ్రోలు నుండి గుంటూరుకు, 
కాలినడకను షుమారు 10మైళ్ళు రోజూ నడిచి వెళ్ళి చదువు కొనసాగించారు. 
శ్రీరంగపట్నం అనే కుగ్రామం లో సంస్కృతము నేర్పిన 
శ్రీ వైష్ణవులైన గురువు ల ద్వారా వారి భావి జీవితమునకు కావలసిన 
గట్టి పునాది ఆనాడే యేర్పడటం ఆయన గొప్ప అదృష్టం. 
(శ్రీ మాన్ గుదిమెళ్ళ లక్ష్మీనారాయణ- వద్ద 
కావ్యత్రయం - రఘువంశం, కుమారసంభవం, మేఘ సందేశం అధ్యయనం) : కష్టపడి విద్యనభ్యసించుటచే, వారికి బాల్యము నుండి సద్బుద్ధి, కష్టసహిష్ణుత, పరోపకార పరాయణత ఏర్పడెను. 
చీమకుర్తి గ్రామవాసులు ఐన వెంకటప్పయ్య దంపతులకు 13వ ఏట దత్తపుత్రుడుగా చీమకుర్తి గ్రామం చేరటం జరిగినది. 
పులికొండ వాస్తవ్యులైన ముదివర్తి సుబ్బారావు గారి జ్యేష్ఠ పుత్రిక రాజ్యలక్ష్మిగారితో వివాహము ఐదు రోజులు వైభవముగా జరిగినది.
శ్రీ చీమకుర్తి శేషగిరిరావు స్వతహః స్వాతంత్ర్యేచ్ఛ గలవాడు అగుటచే – విద్యాభ్యాసానంతరము ఉద్యోగమును ఆశించక నిష్కామముగా గ్రామాభివృద్ధికై పాటుపడుతూ, ప్రజాబాహుళ్యమునకు అందుబాటులో నుండి, అందరి మన్ననలకు పాత్రుడైనాడు. సలహాసంప్రదింపులకై వచ్చువారికి మంచి ఆదరణ లభించేది. ఏదైన మంచిపనికి పూనుకుంటే ప్రోత్సాహమిచ్చి, ముందు నిలబడేవారు. 
ఆ రోజులలోనే మా బోటి మిత్రులతో కలిసి కాంగ్రెస్ కార్యక్రమములలో పాల్గొనేవారు. గ్రామములోని యువకులను, విద్యార్ధులను చేరదీసి, 
వారిలో దేశభక్తిని పూరించి, కాంగ్రెస్ సేవకులుగా తీర్చిదిద్దుటలో నిమగ్నమై వుండేవారు. స్వయంగా నూలు వడికి ఖద్దరు ధరించటం ఆ నాటి నుండే ఆరంభమైంది. వారు చనిపోయేవరకు ఖద్దరు ధరించటం మానలేదు.
1935 లో దేవరంపాడులో – 
ప్రకాశం గారికి సంబంధించిన ఉప్పుసత్యాగ్రహ శిబిర ప్రాంగణమున – 
అప్పటి అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షులైన బాబు రాజేంద్రప్రసాదు గారిచే ఆవిష్కరించబడిన 30 అడుగుల ఎత్తు గల “విజయధ్వజ ప్రతిష్ఠా” కార్యక్రమములో మాతో బాటుశ్రీ చీమకుర్తి శేషగిరిరావు పాల్గొన్నారు.
1937 లో జరిగిన జిల్లా బోర్డు ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్ధులను గెలిపించుటలోబాధ్యత వహించి, సుంకర వెంకట సుబ్బారెడ్డి వగైరాలతోపాటు శ్రమించి కాంగ్రెస్ విజయమునకు కారకులైనాడు.
1939 లో చీమకుర్తి వాస్తవ్యులు సుంకర వెంకట సుబ్బారెడ్డి ఒంగోలు తాలూకా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులైనప్పుడు మా మిత్రుడు శ్రీ చీమకుర్తి శేషగిరిరావు కార్యదర్శిగా వుండి, తాలూకా కాంగ్రెస్ కార్యక్రమాలను ఎంతో సమర్ధతతో నిర్వహించారు. 
శేషగిరిరావు ఈ పదవిని 3 సంవత్సరముల పాటు అంటే 
1941 వరకు నిర్వహించారు.
ఆ రోజులలో చీమకుర్తిలోని వారి ఇంటిలో కాంగ్రెస్ సేవకులకు భోజన సదుపాయములు చక్కగా అమరుతూ ఉండేవి. 
కుటుంబసభ్యులు సనాతన ధర్మ సంప్రదాయ పరాయణులైనను, 
శ్రీ చీమకుర్తి శేషగిరిరావుగారి ఆశయాలకు అనుగుణంగా – 
కుల, మత, వర్గ వివక్షతలు ఇంటిలో పాటించే కాదు.
గుండ్లాపల్లి ఆదినారాయణగారి వ్యాసము – క్విట్ ఇండియా ఉద్యమం, ఫ్రీడమ్ పోరాటములో సగటుమనిషి పాత్రకు నిలువుటద్దాలు.
ఆ) కనుపర్తి సముద్రతీరస్థ కుగ్రామం, 
అక్కడ ప్రభుత్వం వారి ఉప్పుకొఠారు ఉన్నది. 500 జనసమూహముతో 
ఆ కొఠారు పై దండెత్తినారు. ఉప్పు పండించి – నిల్వ చేసే కొఠారులు అవి. బ్రిటిష్ గవర్న్ మెంట్ ‘కాల్పులు జరుపు ఉత్తర్వులతో ఒక మహ్మదీయ పోలీస్ అధికారిని, పిస్టలును ఇచ్చి కాపలా ఉంచారు. కానీ భయభ్రాంతుడైన అతను వీరిని అడ్డగించలేదు. ఆ కారణమున ఆ పోలీసు అధికారిని డిమోట్ చేసారు.
ఇ) కనుపర్తి లో దేశభక్తుడైన వైశ్య ప్రముఖుల్లు కీ.శే. మేడా శ్రీరాములుగారు ఆనాటి మిట్టమధ్యాహ్నం ఆతిథ్యం ఇచ్చారు. 
ఎండ తీవ్రంగా ఉన్న అపరాహ్ణం – తలవని తలంపుగా వెళ్ళిన జనం అందరికీ ఇంట్లో ఉన్న బెల్లపు అరిసెలు ఫలహారం పెట్టారు, 
మజ్జిగ కలిపిన అన్నమును, అందరి దోసిళ్ళలో పోసి, అందరి ఆకలిని తీర్చారు మేడా శ్రీరాములు గారు. 
అక్కడినుండి అమ్మనబ్రోలుకు వెళ్ళసాగారు. మార్గమధ్యంలో మందీ మార్బలంతో పోలీసువారు ఎదురైనారు.
సాగి విజయరామరాజు, గుండ్లాపల్లి, సీతారామాంజనేయులు, కనపర్తి నారాయణరావు గార్లు అంతకుముందే పోలీస్ నిఘా లో ఉన్నారు. 
తాము అరెస్టు కాక తప్పదని గ్రహించారు, 
ఉద్యమాన్ని కొనసాగించు నిమిత్తం ఇంకా పోలీసుల లిస్టుకి ఎక్కని 
శ్రీ చీమకుర్తి శేషగిరిరావును జనమధ్యానికి పంపి, జనులలో కలిపారు మిత్రబృందం. వారి పథకం ఫలించింది. 
ఈ మిత్రబృందం అరెస్టు ఐనాక, అజ్ఞాతములోకి వెళ్ళారు శ్రీ చీమకుర్తి శేషగిరిరావు, అజ్ఞాతములో ఉంటూ, ఉద్యమాలను దిగ్విజయంగా కొనసాగిస్తూ, నాయకులకు కొండంత అండగా నిలిచారు శ్రీ చీమకుర్తి శేషగిరిరావు. 
పైన పేర్కొన్న వ్యక్తులను బళ్ళారి దగ్గర ఉన్న ఆలిపూరు క్యాంపు జైలుకు పంపించారు. శాసనోల్లంఘనం చేసిన పెద్దిభొట్ల రామచంద్ర రావు, రామచంద్రుని వెంకటప్పయ్యలకు రెండు సంవత్సరాల కారాగార శిక్షను విధించారు. పోలీసులనుండి తప్పించుకున్నప్పటికీ శ్రీ చీమకుర్తి శేషగిరిరావుపై పోలీసువారు కేసు నమోదు చేసారు.
అజ్ఞాతవాసంలో శ్రీ చీమకుర్తి శేషగిరిరావుగారికి విప్లవవీరులతో సాన్నిహిత్యమేర్పడింది. ప్రతివాది భయంకర వెంకటాచారి, అచ్యుత పట్వర్ధన్, జయ ప్రకాశ్ నారాయణ మున్నగు వారి సాన్నిహిత్యము వలన – వారి ఆశయాలకు ఆకర్షితుడైనారు చీమకుర్తి శేషగిరిరావు. గుంటూరు కేంద్రముగా వారి కార్యక్రమాలలో శేషగిరిరావు పాల్గొనుచుండే వారు.
ఈ) ప్రభుత్వాన్ని కూలదోయడం ప్రధాన కర్తవ్యం. అందుకై ప్రభుత్వ ఆస్థులను – అనగా రైల్వే స్టేషన్ లను, ప్రభుత్వ ఆఫీసులను బాంబులతో ధ్వంసం చేయుట, ప్రభుత్వమునకు వ్యతిరేకంగా కరపత్రములను ముద్రించి, ప్రజలకు ప్రభుత్వ సేవకులను పంచుట ; తంతి, తపాల సౌకర్యములను విచ్ఛిన్నము చేసి, ప్రభుత్వ కార్యకలాపాలను స్తంభింప చేయుట ప్రధాన ఆశయాలుగా వుండేవి. ఈ కార్యక్రమంలో భాగంగా బొంబాయికి వెళ్ళారు చీమకుర్తి శేషగిరిరావు. తిరిగివచ్చాక, వారు నిర్ణయించుకున్న పథకంలో / పంథాలో భాగంగా ఈ క్రింది విధంగా నిర్ణయించిరి.
ఒంగోలులో బాంబును తయారుచేసి, ప్రభుత్వ ఆస్తులైన జిల్లా కోర్టు, తాలూకా ఆఫీసులలో ఆ బాంబులను పెట్టి, రికార్డులను నాశనము చేయవలెనని నిశ్చయించిరి.
తన బావమరిది ముదివర్తి సత్యనారాయణను, అనుచరులైన రావినూతల వెంకటేశ్వర్లు, వేమూరు వెంకటసుబ్బయ్య లను నియోగించినారు. 
బాంబు నిర్మాణమునకు కావలసిన సామగ్రిని చీమకుర్తి శేషగిరిరావుగారు – గుంటూరు నుండి పంపి అందించినారు. 1943 జనవరి 26 న పేల్చాలని అనుకున్నారు. 
“ప్రతి సంవత్సరం జనవరి 26 న ‘పూర్ణ స్వరాజ్య’ గా పరిగణించాలి.” అని 1930 లో కాంగ్రెస్ కమిటీ తీర్మానం ఉన్నది. 
కనుక ప్రతి ఏడాదీ జనవరి 26 న కాంగ్రెస్ సేవకులు, ఉద్యమకారులు కాంగ్రెస్ జెండాను ప్రతిష్ఠించి, వందనం ఆచరించి, 
‘సంపూర్ణ స్వరాజ్య సంపాదన’ కై ప్రతిజ్ఞను తీసుకొనటం ఆచారముగా వస్తూన్నది. 
అందుచేత ఉత్సాహవంతులైన ఈ ముగ్గురు యువకులు బాంబు తయారు చేయుటకై 1943 జనవరి 23 న పూనుకున్నారు. జిల్లాకోర్టు చేరువలో నున్న షేక్ రహిం తుల్లా సాహెబ్ గారి మేడ పై భాగంలో బాంబు నిర్మాణమునకు పూనుకొనిరి. నిర్మాణ లోపముచే ఆ బాంబు అర్ధంతరంగా పేలింది. 
అక్కడి ముగ్గురు యువకులకు తీవ్ర గాయాలు ఐనవి. 
ఎట్లో ప్రాణాపాయం నుండి బయటపడగలిగారు. 
వారు పోలీసుల నుండి తప్పించుకుని, తలా ఒక దిక్కుకు వెళ్ళారు, 
చివరకు ఎట్లో గుంటూరులో ఉన్న చీమకుర్తి శేషగిరిరావుగారి మకామునకు చేరుకోగలిగిరి
****************
[ముదివర్తి సత్యనారాయణ ఒంగోలులోని రంగారాయుడి చెరువులో కూర్చున్నారు. గాయాల మంటలను తట్టుకోవడానికి, నీళ్ళలో దాక్కుంటారని ఊహించిన పోలీసులు చెరువు ఒడ్డున రోజంతా నిఘా వేసారు. 
ఐతే ముదివర్తి సత్యనారాయణ – యోగాసనములు, సూర్య నమస్కారములు, జలస్తంభన మున్నగు విద్యలను అభ్యసించిన నిష్ణాతులు. 
అన్ని గంటలసేపూ – చెరువు నీళ్ళలోనే ముక్కు మూసుకుని, 
మునిగి కూర్చున్నారు. పోలీసులు ‘ఎవరూ దాగి ఉండలేదని’ నిర్ధారించుకుని మరలిపోయారు. అర్థరాత్రికి నెమ్మదిగా బైటికి వచ్చారు సత్యనారాయణ.]
ఉ) కడియాల యానాదయ్య :- మరో శోచనీయ సంఘటన జరిగింది. కడియాల యానాదయ్య కీర్తిపాడు (ఒంగోలు తాలూకా) వాస్తవ్యులు, ఒంగోలు జిల్లా బోర్డు కాంగ్రెస్ సభ్యుడు. బాంబు ప్రేలుడులో గాయపడిన యోధులకు కడియాల యానాదయ్యచౌదరి రక్షణ కల్పించాడు – అనే నెపంతో యానాదయ్యను నిర్బంధించి, తీవ్రంగా హింసించారు. 
ఆ హింసకు తట్టుకోలేక, పోలీసు వారి అధీనంలో ఉండగనే యానాదయ్య ప్రాణాలు కోల్పోయిరి. ఆ విషయాన్ని కప్పిపుచ్చి, ‘బావిలో పడి చనిపోయె’నని పోలీసులు కట్టుకథను కల్పించి ప్రజలను మభ్యపెట్టిరి. [యానాదయ్య దేహాన్ని చెట్టుకు ఒక రోజంతా వేలాడదీసి ఉంచారని, ప్రజలను భయం కలగాలని – ముందరి తరం స్థానికులకు,తెలుసు.] ప్రభుత్వము వారి ఘోరహింసలకు భయపడి, నిజము గ్రహించినను ప్రజలెవ్వరును ముందుకు రాలేక పోయిరి. (పేజీ 25). యానాదయ్య విషాద సంఘటన శేషగిరిరావుగారిని విపరీతంగా కలిచివేసినది.
‘ఆంధ్రకేసరి ప్రకాశంగారి కాంస్య విగ్రహ ప్రతిష్ఠ” సంచికలోని వ్యాసంలో శేషగిరిరావు ఇట్లాగ అన్నారు: “గాంధీజీ నాయకత్వమున సాగిన భారత స్వాతంత్ర్య సంగ్రామములో నిస్వార్ధ జీవనులు కీర్తికాంక్ష లేకుండా తమ ప్రాణాలను ఆహుతి చేసారు. పోలీసుల నిరంకుశ హింసాకాండకు లోనై ఎందరో అంతరించారు. వారిలో కొందరి పేరులు మాత్రమే పుటలలోనికి రాగలిగినవి. తక్కినవారివి అజ్ఞాతంగానే వుండి పోయినవి. అట్టి అజ్ఞాత దేశభక్తులలో ఒకడుగా పేర్కొనదగిన వాడు కీర్తిశేషుడు యానాదయ్య.”
[పేజీ 25] బాంబు కేసుకు సంబంధించిన రావినూతల,వేమూరి, తదితరులను అరెస్టు చేసి, కేసులు పెట్టినందున వారికి కారాగారశిక్ష విధించబడినది.తదుపరి పాటిబండ్ల నాగేశ్వరరావు, ప్రతివాది భయంకర వెంకటాచారి మున్నగువారిని కుట్ర కేసులను బనాయించి, వారిపై కేసు పెట్టిరి. కాని ప్రభుత్వము వారు యెన్ని విధములుగా శ్రమించినను శ్రీ చీమకుర్తి శేషగిరిరావు గారిని పట్టుకొనలేక పోయారు. మిత్రుడు శేషగిరిరావు అజ్ఞాతవాసంలో నున్నప్పుడు, గుంటూరు, నెల్లూరు, మద్రాసు, బాపట్ల మొదలైన పట్టణాలలో రకరకములైన పేర్లతో, వివిధ వేషములతో సంచరిస్తూ పోలీసుల బారి నుండి తప్పించుకుంటుండే వారు. ఒక చోట పౌరాణికుడుగాను, మరో చోట పిల్లలకు పాఠాలు చెప్పు ఉపాధ్యాయుడుగాను ఉంటూ కాలం గడిపినారు. ఎక్కువకాలం బాపట్ల వాస్తవ్యులు, సహృదయులు, ప్రముఖ న్యాయవాది, స్వాతంత్ర్య సమరయోధులు కీ.శే. పిల్లుట్ల హనుమతరావుగారి యింటిలో, వారి కుటుంబ సభ్యులలో ఒకరుగా కాలము గడిపిరి.శేషగిరిరావు తన జీవితపర్యంతం ఆ కుటుంబమునకు సహాయ సలహాదారుగా వుండి, వారి నెంతో ప్రేమతో ఆదరణతో చూచే వారు.
b) మా శిక్షాకాలం (గుండ్లపల్లి) పూర్తి అయిన పిదప 1944 మే నెలలో మమ్ములను జైలు నుండి విడుదల చేయుట జరిగినది. అప్పటికింకా శేషగిరిరావు అజ్ఞాత వాసంలోనే ఉన్నారు. (గుండ్లపల్లి వారి వలె, మిత్రవర్గములో జైలుశిక్షకు గురైన వారిలో భట్రాజు కృష్ణమూర్తి మున్నగు వారు ఉన్నారు. ఆ సంఘటనల పరంపరను -“గుంటూరు జిల్లాలో క్విట్ ఇండియా ఉద్యమము” అనే వ్యాసము (సాహితీ నీరాజనం ‘ 50-65 పుటలు)నందు శ్రీ చీమకుర్తి శేషగిరిరావు గారి స్వకీయ రచన, పఠితలను సంభ్రమానంద, ఉత్తేజభరితులను చేస్తుంది.)
(గుండ్లపల్లి వారి వలె, మిత్రవర్గములో జైలుశిక్షకు గురైన వారిలో భట్రాజు కృష్ణమూర్తి మున్నగు వారు ఉన్నారు. ఆ సంఘటనల పరంపరను -“గుంటూరు జిల్లాలో క్విట్ ఇండియా ఉద్యమము” అనే వ్యాసమునందు శ్రీ చీమకుర్తి శేషగిరిరావు గారి స్వకీయ రచన, పఠితలను సంభ్రమానంద, ఉత్తేజభరితులను చేస్తుంది. – ‘సాహితీ నీరాజనం ‘ 50-65 పుటలు)

1946 లో ఉమ్మడి మద్రాసు రాష్ట్రానికి ఆంధ్రకేసరి టంగుటూరు ప్రకాశం పంతులు గారు ముఖ్యమంత్రిగా పదవి స్వీకారం చేసిన అనంతరం, వారి ప్రభుత్వం శేషగిరిరావు మీద నున్న వారంట్లను రద్దు చేసిన ఫలితంగా వారు అజ్ఞాతవాసం నుండి బయటకు రాగలిగారు. అజ్ఞాతవాసం నుండి బయటకు వచ్చిన తర్వాత గ్రామాభ్యుదయ కార్యక్రమాలలో విరివిగా పాల్గొంటూ ఉండే వారు. ప్రకాశం గారు ప్రవేశపెట్టిన ఫిర్కా డెవలప్ మెంటు పథకంలోను, ఫుడ్ కమిటీలలోను, ఖాదీ నిర్మాణ కార్యక్రమములలోను చురుకుగా పాల్గొనే వారు. ఆ తర్వాత శేషగిరిరావు ప్రత్యక్ష రాజకీయాల నుండి వైదొలగి 1954 లో మద్రాసు చేరారు. శ్రీ బెజవాడ గోపాలరెడ్డి, శ్రీ మోటూరు సత్యనారాయణ గారల ఆధ్వర్యంలో నడపబడుచున్న తెలుగు భాషా సమితిలో సహాయ సంగ్రాహకుడుగా ఉద్యోగములో చేరిరి.
ధనార్జన వాంఛ లేని వ్యక్తి శేషగిరిరావు, తన ప్రియ చెలికాడు, తోటి స్వాతంత్ర్య సమరయోధుడైన వేమూరి వెంకట సుబ్బయ్య గారికి చీమకుర్తిలోని తన స్థలము నుండి 240 గజముల స్థలమును ఉచితముగా ఇచ్చి, అందు భవన నిర్మాణమునకు కూడ పూనుకొనిరి. ఆ విషయమున చీమకుర్తివాసులనుండి, తన మిత్రులు, బంధువుల నుండి సేకరించి, భవన నిర్మాణము చాల వరకు పూర్తి చేయగలిగిరి. ఈ భవన నిర్మాణమునకు వారు పడిన శ్రమ మరువరానిది.వారి మరణానంతరము, శేషగిరిరావు గారి బావమరిది ముదివర్తి లక్ష్మీనరసింహరావు గారు చీమకుర్తి వెళ్ళి భవన నిర్మాణము పూర్తి చేసి శేషగిరిరావు గారి సంకల్పమును నెరవేర్చినందుకు వారి ఆత్మ ఎంతో సంతోషించి ఉండునని తలచుచున్నాను. – అంటూ ఇంకా అనేక విశేషాలను పొందుపరిచి, రచించిన పెద్ద వ్యాసములోని ప్రతి వాక్యము, పదము ఉటంకించదగినవే!
****************
నేలపాడులో తమ ఇంటిలో ఉద్యమకర్తలకు రహస్యంగా రక్షణ కల్పించిన 
ఐ. చక్రధర్ తెలిపిన ఉభయుల మైత్రీ అనుభవాలు 
“నేనూ మా శేషగిరీ” అనే మంచి essay 
“మహా మనీషి  శ్రీ చీమకుర్తి” గురించి బి.ఎన్. శాస్త్రి రచన, ఇరువురి సాహితీ అభిరుచుల మేలుకలయికలను చక్కగా వివరించారు.
వాకాటక మహాదేవి, ఆదిలాబాదు సర్వస్వము, 
మహబూబునగర జిల్లా సర్వస్వము, మున్నగు అనేక బృహద్గ్రంధముల 
నొక్క చేతి మీదుగ రచించి, ప్రచురించుట అపూర్వ విషయం” అని ఆశీర్వదించినారు శేషగిరిరావు. 
చీమకుర్తి శేషగిరిరావు పానుగల్లులోని పచ్చల సోమేశ్వర ఆలయము దర్శించారు, ఛాయా సోమేశ్వరాలయ శిల్పసంపద కబ్బురపడినారు. చీమకుర్తి శేషగిరిరావు 
“55 ఏళ్ళ కిందటి మాట.మేము ఒంగోలు హైస్కూలులో విద్యార్ధులం. గాంధీజీ వ్యష్టి సత్యాగ్రహానికి పిలుపు నిచ్చాడు. పేరుకు “వ్యష్టి” అయినా అది ఒక పెద్ద వుద్యమ రూపాన్ని దాల్చింది. 
గాంధీ గారు గంగా జల సదృశుడు” అని చీమకుర్తివారు చెప్పిన వాక్యమును మననం చేసుకున్నారు టి. సూర్యనారాయణరావు 
( in  “ధన్యజీవి శ్రీ చీమకుర్తి శేషగిరిరావు”)
*********************
బొల్లాపల్లి సుబ్బారావు గారి రచన – “మా అన్నగారు” :-
1] సాహితీ నీరాజనంలో – చెన్నపురిలో క్రమబద్ధంగా సాగిన శ్రీ చీమకుర్తి శేషగిరిరావు గారి దినచర్యను విపులీకరించారు.
2] ముక్త్యాల రాజావారు అప్పగించిన బృహత్తర కార్యం ‘గౌతమబుద్ధుని 2500 జయంతి ఉత్సవాల సందర్భంగా ప్రత్యేకసంచికను అంకితభావంతో దిగ్విజయంగా పూర్తి చేసారు.
3] శ్రీ చీమకుర్తి తన అన్న్ వెంకటేశ్వర్లు వద్ద కావ్యపఠన వలన సంస్కృత, ఆంధ్ర, ఇంగ్లీషు భాషలపై కలిగిన పటుత్వం – వారి సంభాషణలలో ద్యోతకమయ్యేది. జన్మతః బ్రాహ్మణుడు, తెల్లని శరీర ఛాయ, రూపసి, చలువ చేసిన అతి తెల్లని ఖాదీబట్టలతో చూపరులకు కంపించినప్ప్టికి, వారు వైదిక ధర్మాలనేమి అంతగా పాటించేవారు కాదు.సనాతన ధర్మ నియమాలు, వైదిక మత సాంప్రదాయాలు బాగా ఆకళింపు చేసుకున్నప్పటికీ, ఛాందసపరమైన యే సంప్రదాయాన్ని మూఢంగా పాటించేవారు కాదు. 
దేవునిపై అపార భక్తి విశ్వాసములున్నప్పటికి మూఢభక్తి భావంతో దేవాలయాలకు వెళ్ళేవారు కాదు.
బ్రాహ్మణుడైనప్పటికిని, జాతి, కులవర్ణ వివక్షతలు పాటించడం వారి ఆశయాలకు విరుద్ధం. చీమకుర్తిలో ఒక మహమ్మదీయుడు ఆయన మిత్రుడు,
తన విజ్ఞానమును అంతయు క్రోడీకరించి, భావితరాల వారికి విజ్ఞానాభివృద్ధికి యెంతో దోహదం చేసారు. సకలశాస్త్రములలో నిపుణుడు. అరిషడ్వర్గాలను కూడ అదుపు చేయగల్గిన సాధుమూర్తి.అంటూ నీరాజనములను అర్పించారు బొల్లాపల్లి సుబ్బారావు గారు.
****************
ఎం. పి.ఆర్. రెడ్డి వ్యాసం – “క్విట్ ఇండియా ఉద్యమంలో నేనూ శేషగిరిరావూ” 1942 ఆగస్టు 8 న గాంధీ ఇచ్చిన నినాదము “విజయమో వీరస్వర్గమో” (Do or die) – డిల్లీ నుండి ధనుష్కోటి వరకూ యువకులను ఉత్తేజపరచినది. మధురాంతకం మాధవరావు మొదలగు మహామహులు పాల్గొన్న వైనమును తెలిపారు. కొన్ని ఆసక్తికర అంశాలు :- గాంధీజీ ఉద్దేశ్యానికి దూరంగా జరిగి, ఉత్తరప్రదేశ్, బీహారు రాష్ట్రాలలో – సతారాలో నానాపాటిల్ ‘సమాంతర ప్రభుత్వం’ ‘మేము ఆయుధలతో పోరాడాము- అని పాటిల్ ఒప్పుకున్నాడు. అప్పుడు గాంధీజీ ” క్రూర ప్రభుత్వపు దమననీతిని ధైర్యంగా ఎదుర్కొన్నారు. పిరికివాళ్ళ అహింసా విధానము కంటే ధైర్యవంతుల ఈ హింసా విధానము న్యాయసమ్మతమే!” అని అభినందించారు. ఆగస్టు తిరుగుబాటులో అనేక త్యాగాలు చేసినవారికి ఇది ఊరట కలిగించింది. (స్వాతంత్ర్యానంతరము అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ వారు దీనిని మరుగుపరిచారు. గాంధీజీ అహింసా విధానాన్ని మాత్రమే బల పరిచారని – వాదాన్ని – తమ రాజకీయ లబ్ధికొరకై ప్రచారంలోకి తెచ్చారు, పాఠ్య పుస్తకములలో జొప్పించారు.- అని రచయితల లేఖనములు.)
****************
నేలపాడులో తమ ఇంటిలో చీమకుర్తి శేషగిరిరావు వంటి ఉద్యమకర్తలకు రహస్యంగా రక్షణ కల్పించిన ఐ. చక్రధర్ తెలిపిన ఉభయుల మైత్రీ అనుభవాలు “నేనూ మా శేషగిరీ” అనే మంచి essay . ‘సాహితీనీరాజనం’ లో ఎ.కె. మూర్తి, ముదివర్తి రాఘవరావు (శ్రీ చీమకుర్తి జీవితంలో కొన్ని మెఱుపులు),
శ్రీ చీమకుర్తి శేషగిరిరావు అగ్రధిత రచనలు, ప్రాచీన అర్వాచీన ఆసక్తికర పదముల మూల రూపాలు, సాహిత్య, శాసన, చారిత్రక సంస్కృతీ పరిశోధనతో మమేకమైన ఉద్ధండ పండితుల వ్యాసాలు ఉన్నవి. ప్రతి అక్షరములో ఆయా మహానుభావులు తమ జీవితములలోని అణువణువూ వెచ్చించి, శ్రద్ధాసక్తులను మేళవిస్తూ ధారపోసిన శ్రమశక్తిని ప్రతిఫలిస్తున్నవి.
****************
ఇందుకూరి సూర్యనారాయణరాజు (లైబ్రేరియన్): హరిశంకర్ ;మున్నగు స్నేహితుల స్పందనలు ఇందున్నవి.
****************
ముదివర్తి రాఘవరావు – రాసిన వ్యాసం – శ్రీ ‘చీమకుర్తి’ జీవితంలో కొన్ని మెఱుపులు, గుర్తుంచుకున్న, గుర్తుంచుకోదగిన అనుభవాలను తెలిపారు.
శ్రీ చీమకుర్తి శేషగిరిరావు అగ్రధిత రచనలు :- 
అమూల్య వ్యాసాల మంజూష. 
1) తెలుగులో విజ్ఞానసర్వస్వములు;:- సర్వంకష రచనలకు పునాది, ప్రపంచ సాహిత్యంలో మొదలుకుని వివరించారు. 
2)సుహృల్లేఖ : 3) అథర్వవేదము – భారతీయ సమ్మిశ్ర సంస్కృతికి మూల కందము ; 4) సంస్కృతి – గాంధేయ దృక్పథము ; 
5) నామ సంకీర్తనం – విధి విధానం ; 6) పదముల మాటున ప్రాచీన సంస్కృతి 7) యుగము ; 8) ‘యొక్క ‘ విభక్తి వ్యుత్పత్తి ; 
9) గాంధీజీ నిర్యాణము (శ్రీ చీమకుర్తి శేషగిరిరావు గారు, 
కలకత్తా నుండి ఫిబ్రవరి 1, 1948 న – భార్య రాజ్యలక్ష్మికి రాసిన లేఖ ఇది ; ఇందులో ఆయన తన ఆవేదనను వ్యక్తీకరించిరి.  
10) ఆత్మ నివేదన;
వీనితో బాటు – ఈ అనుబంధమునందు అదనంగా ఉన్న కొన్ని విలువైన వ్యాస లహరి :-
1) తెలుగు దేశములోని బౌద్ధ స్తూపాలు, బౌద్ధ విహారాలు ; – బిరుదరాజు రామరాజు : 
2) శ్రీధాన్యకటక నగర ప్రాథమిక నాణెములు; – పురాణం రాధాకృష్ణ ప్రసాద్ ; 3) ‘కాలు ‘ పద పరిశీలన :- పుచ్చా వాసుదేవ పరబ్రహ్మ శాస్త్రి :; 
4) ఉత్తరాంధ్రలో ప్రసిద్ధ దేవాలయాలు (చారిత్రక విశేషాలు) :- 
మైనేని కృష్ణకుమారి : 
5) తెలుగు సంస్కృతి విస్తరణ (రాంభొట్ల కృష్ణమూర్తి): 
6) కారల్ మార్క్స్, గుడిపాటి వెంకట చలమూ – సి. ధర్మారావు : 
7) మహావ్యక్తి మాధవ విద్యారణ్యస్వామి – గడియారం రామకృష్ణ శర్మ ;
8) హిందూమతం – జీవితధ్యేయం – పుల్లెల శ్రీరామచంద్రుడు : 
9) రచయిత ఎందుకు రాస్తాడు? – బొమ్మకంటి శ్రీనివాసాచార్యులు : 
10) ఆధునిక తెలుగు సాహిత్యం (తొమ్మొదో శతాబ్దపు సాహిత్యరీతులు) :- అక్కిరాజు రమాపతిరావు ; 
11) రంగనాథ రామాయణం అందించే అక్షరానందం –వి.వి.ఎల్.నరసింహారావు 
12) తెలుగులో అనుకరణవాచకాలు - రవ్వా శ్రీహరి; 
13) తెలుగు కవిత – గాంధీయ ప్రభావం – ఎన్. గోపి ; 
14) తెలుగు భాషకు సేవ చేసిన మహానుభావులు – వి.వి. సుబ్రహ్మణ్య శర్మ ; 15) రామాయణ కల్పవృక్షం – గుబాళించిన హాస్య పరిమళాలు ;- 
వెలుదండ నిత్యానందరావు ;: 
16) కన్యాశులకంలో వెంకమ్మ ;- ముక్తేవి భారతి : 
17) హంపీ క్షేత్రం – కె. రుక్నుద్దీన్ ;
     తెలుగు గోష్ఠి హారములోని పూలు ఈ పరిశోధక వ్యాసములు.
****************
1995 లో ప్రధమవర్ధంతి సందర్భంగా వెలువడిన అమూల్య పుస్తకం ఇది. వెరసి శ్రీ చీమకుర్తి శేషగిరిరావు స్వీయ అనుభవాలను వర్ణించిన పేజీలు, చదువరులను ఉద్విగ్నభరితులను చేస్తుంది. షార్టు ఫిల్మ్ తీయదగినన్ని అనుభవాల సంపుటి. చీమకుర్తి శేషగిరిరావు ఆంధ్ర, సంస్కృత ఆంగ్లాది భాషలలో గొప్ప అభినివేశము కలిగిన వ్యక్తి, రచనా నైపుణ్యత, ప్రజ్ఞా శక్తి కల మనీషి, వారి అనుభవ మందార సుమాలను లోకానికి అందించాలనే ఆసక్తి, ఆయన పట్ల భక్తిప్రపత్తులు, ప్రేమానురాగాలు కలిగిన అనేకమంది పూనిక కూడా ఇట్లాంటి మంచి గ్రంధము – స్మృత్యంజలిగా రావడానికి హేతువు ఐనది. (అసంఖ్యాక స్వాతంత్ర సంగ్రామ భాగస్వాములు త్యాగనిరతి వెలుగులోకి రానివి ఎన్నెన్నో! యువతకు మార్గదర్శినులు అగు ఇటువంటి ఆణిముత్యాల ఆవశ్యకతను ఈ పుస్తకం తెలుపుతున్నది.) 
**************************************************************

తొలి పుటలలో – యార్లగడ్డ నిర్మల పుస్తకమును కంపోజింగ్ చేసారు. 
ముదివర్తి రాఘవరావు, బొల్లాపల్లి సుబ్బారావు సంపాదకులైన బొమ్మకంటి శ్రీనివాసాచారులు గారికి కుడిభుజములుగా నిలిచారు. 
అచ్చు పనిలో, నా సంపాదకత్వ బాధ్యతలో ముప్పాతిక వంతు పంచుకుని, నా పనిని సుకరం చేసారు” 
అంటూ కృతజ్ఞతాంజలి అర్పించారు.
**************************************************************

250 పేజీలకు పైన ఉన్న “సాహితీ నీరాజనం” వెల – Rs. 100/- ముద్రణ చాలా ఉన్నత ప్రమాణాలను కలిగినది. 
కంటికి శ్రమ కలుగని రీతిగా, ముద్రణ అందంగా ఉన్నది. 
ఎక్కడా అచ్చుతప్పులు లేవు. ప్రచురణకర్తల దీక్షా దక్షతలకు నిదర్శనం చక్కని ముద్రణ. 
FONTLINE GRAPHICS, Baghlingampalli టైప్ సెటింగు.
ప్రతులు:-
శ్రీ చీమకుర్తి సంస్మరణ సమితి,
1-9-34/5/E, రామ్ నగర్, హైదరాబాదు – 500 048 

*******************************************************************

సాహితీ నీరాజనం – శ్రీ చీమకుర్తి శేషగిరిరావు ; pustakam 
వ్యాసకర్త: కాదంబరి
More articles by అతిథి » Written by: అతిథి 

Tags: Articles by Kadambari, spotlight 


*******************************************************************

కోణమానిని తెలుగు ప్రపంచం
Pageview chart 60708 pageviews - 1022 posts, last published on Aug 5, 2015 -

కామెంట్‌లు లేవు:

ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు

"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...