30, జులై 2012, సోమవారం

షోకిల్లా విసనకర్ర


“వనితా వీవన” కు నిర్వచనం జపాన్ మహిళామణులు ఉపయోగించే 
షోకిల్లా విసనకర్ర.గాలి కూడా కందిపోతుందేమో- అనిపించేటంతగా – 
సుమ సుకుమారంగా, సుతారంగా, చేతులతో పట్టుకుని, 
సుతిమెత్తగా విసురుకుంటూ తిరుగాడుతూన్న వైనం 
మన కళ్ళకు కట్టిన బొమ్మలాగా కనిపిస్తుంది.


16 వ శతాబ్దం నుండి ఈ వీవన జాణ యూరోపులో వ్యాపించింది.
ఐరోపా ఖండంలో ఈ సొగసుల వీవన ప్రవేశించి, 
వారి సంఘములో అంతర్భాగమై పోయింది.
ఎంతగా ఐనదంటే- "మనస్తత్వ శాస్త్రపరంగా వర్గీకరణలు సైతం మొదలైనాయి.”
కోమలాంగులు ఏ ఏ డిజైన్లును , 
ఎలాటి బొమ్మలు, రంగులు ఉన్న వీవనలను వాడుతున్నారో, 
దాన్ని బట్టి వారి వ్యక్తిత్వాలను అంచనా వేయడం” -
క్రొత్త ప్రక్రియగా అభివృద్ధి చెందినది.
;
జపాన్ లలనల fan dance
ఈ వయ్యారి వీవన, పురాతన కాలం నుండీ 
తూర్పు ఆసియా దేశాలలో ప్రజల నిత్య జీవన సంప్రదాయంలో 
అవిభాజ్యంగా ఆదరించబడుతూన్నది అవడంతో- ఎక్కువ చరిత్రనే గడించింది. 
క్రీస్తు పూర్వం 2 నుండి చైనాలో వెదురు బద్దలతో చేసిన Hand Fans వాడుకలో ఉన్నాయి. 
వారు పక్షుల ఈకలను కూడా ఈ చేతి వీవనలు అలంకరించడానికి వాడే వారు.అంతేకాదు,

చీనీ పద్యాలను, నాలుగు పదాల జాతీయములను 
“చేతి వీవనల”పైన చక్కగా రాసేవారు.
క్రమంగా “చే వీవనల చిత్ర కళాకారులు” రాజ దర్బారులో గౌరవ స్థానాన్ని పొందేవారు. 
రాజ వంశీయుల నామావళి మున్నగు వాని యవనికలుగా అమరినవి. 
అలాగే హోదా, లింగ భేదము, వృత్తి- లను స్ఫురింపజేసే 
వివిధ hand fans వచ్చాయి. నాట్యం చేసే సందర్భాలకు 
స్పెషల్ డిసైన్ లతో వీవనలు ఉపయోగానికి వచ్చాయి.
వీనిలోని పల్చటి బ్లేడులు, 
వాని సంఖ్య- డిజైన్లు ,రాజాస్థాన, అధికారుల, ఉద్యోగుల హోదాలను, స్థాయిలను 
ప్రతిబింబించే అంశాలుగా మార్పు చెందినవి.
(అంటే ఉదాహరణగా – పోలిసుల షర్ట్, కోటు – డ్రస్సుల మీద బాడ్జిల వలె అన్న మాట)


చైనాలోనూ, ఆ మాటకు వస్తే భారత దేశంలోనూ “కర వింజామరలు” వాడబడ్తూండేవి.
6,7, 8 వ శతాబ్దాలలో “మడత విసన కర్రలు” రూపొంది, వారి సంస్కృతిలో లీనమైనవి. 
జపాను తాపసి “చోనెన్”(Chonen)  “హియొగీ”, “కవహొరి”  అనే వీవనలు చేసాడు.
వాటిని చోనేన్ ఎంతో నేర్పుతో తయారుచేసాడు. 
ఇరవై (20) పలుచని చెక్క బద్దలతో హియొగీ, 
రెండు కాగితపు విసనకర్రలను (kawahori hogi) లను చేసాడు.
ఆ ముని 988 లో చైనా చక్రవర్తికి వీటిని బహుమానంగా ఇచ్చాడు.


11 వ శతాబ్దంలో కొరియా వాసులకు కూడా బాగా నచ్చడంతో, 
ఆ ప్రజలు కూడా వీటిని “కానుకలు”గా ఇచ్చి
షోకిల్లా విసనకర్ర పుచ్చుకునే ఖరీదైన కానుకలుగా 
తమ సమాజంలో వాడుకలోనికి తెచ్చారు.
అటు పిమ్మట పోర్చుగీసుల ప్రమేయంతో
పాశ్చాత్య దేశాలలో కొత్త హాబీగా నిలద్రొక్కుకున్నది.
Folding Fan ( మడత విసనకర్ర ) అనగానే 
అందరికీ “జపానీయులు”, Japan country గుర్తుకు వస్తారు.


మడుపు వీవన- జపాన్ దేశీయుల పవిత్ర సంకేతంగా స్థిరపడిందీ- అంటే అతిశయోక్తి కాదు.


జపాన్ సంప్రదాయానికీ, ఫోల్డింగ్ ఫ్యానుకూ అవినాభావ సంబంధం ఏర్పడింది. 
జపాన్ లోకి పాశ్చాత్యులు అడుగుపెట్టాక, 
ఆ పడమటి సీమల జనాన్ని ఈ విసనకర్రలు ఆకర్షించాయి. 
western country వారికి ఇది నచ్చగానే,
సముద్రాలు దాటి,  (Europe continent) యూరోపు ఖండములో కూడా 
ఈ ఫోల్డింగ్ ఫాను ఒక ఫ్యాషన్ లాగా అతి శీఘ్రముగా వ్యాప్తి గాంచింది.


794- 1185 లలో జపాన్ లో “Heian period”లో 
ఈ వయ్యారి వీవన- చైనా (Sung Dynasty కాలము నుండీ) లో
ప్రాచుర్యంలోనికి వచ్చినది.
15 వ శతాబ్దంలో పోర్చుగీసు వారి వలన 
పాశ్చాత్య ప్రపంచం వారికి, యూరోపు ఖండములో
ఈ జపాన్  వన్నెల విసనకర్ర పరిచితమైనది.


ఈ రీతిగా అది- జపాన్ దేశానికి  
సంస్కృతీ పరంగా ప్రత్యేక గుర్తింపును తీసుకువచ్చింది.  
చరిత్ర ప్రకారం- జపాన్ వీవన-కు మూలం తాటాకు రూపము.
palm leaf shape దీనికి పునాది. 
నిజానికి శీతల దేశం ఐన జపాన్ లో 
ప్రాచీనులు ఎండ తాకిడికి తట్టుకోలేక ,
విసనకర్రలను ఆశ్రయించడమే-
వీటిని కనిపెట్టే మూల హేతువు. 
అంత దాకా ఎందుకు? 
మన దేశములో సైతము విసనకర్రలు ఉన్నవి.
తాటాకులతో, చొప్పదంటు బద్దలతోనూ, ఈతాకులతోనూ, 
నెమలి ఈకలు కూర్చినవి  చేసే వారు. 
చొప్పదంటు చీలికతో చేసిన వాటిని చుట్టూ 
బార్డర్లలో సిల్కు గుడ్డలతో రిబ్బను కుచ్చులలాగా కుట్టి, 
అలంకారంగా గోడలకు తగిలించి ఉంచే వారు.
స్యుహిరో (Syuhiro) అనే మరొక పేరుతో వ్యవహారంలో ఉన్నది-
అనగా “కొస దాకా విసృతమైనది” అని అర్ధం.


జపానీయుల పూర్వీకులు ‘మడత ఫ్యాను’ను 
కేవలం ఉపయోగ వస్తువుగానే కాక, 
‘అది తమ భాగ్యమునకు, ఉజ్జ్వల
భవిష్యత్తుకు ప్రతీకగా ‘భావించసాగారు.
అందుకనే అవి కళాత్మకతను మేళవించుకుని, 
ఆకర్షణీయ పద్ధతిలో అభివృద్ధి గాంచినవి.


కామకురా (1185-1333) రాజ్య పాలన నుండీ , 
వీనిపై ప్రత్యేక ఆసక్తి ఆ “సూర్యోదయ దేశము”లో మొదలైనది.


అటుపిమ్మట మ్యూరోమచ్ కాలం (Muromach period) లో 
జపాన్ మడత వీవనలు అందమైన రూపురేఖలను ఇనుమడించుకున్నవి.


వాని పైన బొమ్మలలోని వర్ణాలు, 
Design లలో లయబద్ధత ,లతా తరు పుష్ప ఫలాదులు, 
ప్రకృతి సౌందర్యాలతో వీవనలు విప్పారినవి.
ఈ సుందర చిత్ర మాలికలకు తర్వాతి కాలాన మరింత విస్పష్టత ఏర్పడినది.


17 వ శతాబ్దము నుండీ ప్రపంచ దేశాల దృష్టిని ఆకట్టుకునేటంతగా సొగసులీనసాగినవి.
తవరాయ సొతాత్సు ఈ మేలిమలుపునకు కారకుడు.
ఈ జపాన్ పెయింటర్లు, వీవన నిర్మాతలు ముఖ్య కేంద్ర బిందువులు ఐనారు. 
ఇంత పెద్ద మలుపును తెచ్చిన సోపాన దశ 
"ఎడో పాలనా కాలంలో ”( Edo period, 1603-౧౮౬౮) ఏర్పడినది.
హస్త వీవనలలో ఈ పెను పరిణామము – వానికి చరిత్రను సృష్టించినది.


ఈ నాడు అవి షింటో మతాచార్యులు (Shinto Priests) వీనిని ధరిస్తున్నారు. 
అలాగే పండుగలు, పరిణయ శుభ వేళలలో జపాన్ రాజు, రాణీల  చేతులలో 
ఈ “లహరీ వీవనలు”అర చేత అలంకరణలుగా, 
సంప్రదాయ దర్ప సూచికలుగా ధరిస్తున్నారు.


వీటిలో డాంబికంగా ఉండేవి, సింపుల్ గా ఉండేవీ సైతం ఉన్నవి.


“హరిసెన్”(Harisen Fan) లు


సాదా పేపర్ ఫ్యాన్సు, “హరిసెన్”(Harisen) లు, 
ఆబాలగోపాలానికీ ఇప్పుడు సుపరిచితాలే! 
ఎందుకంటే, గ్రాఫిక్, యానిమేషన్ పిక్చర్సులో, కామిక్ నవలలో  
ఈ హరిసేన్లు సర సరా విసిరే కామెడీ ఆయుధాలుగా ప్రత్యక్షమౌతున్నాయి కాబట్టి.


                               - కాదంబరి


**************************


షోకిల్లా విసనకర్ర April 2012
Posted on April,2012 by విహంగ
This entry was posted in వ్యాసాలు. Bookmark the permalink.

కామెంట్‌లు లేవు:

ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు

"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...