17, ఆగస్టు 2013, శనివారం

ఈ యజమాని చాలా మంచివాడు!

రావూరి భరద్వాజ ధనికొండ హనుమంత రావు వద్ద ఉద్యోగం చేసారు. 
తర్వాత ఆయన వద్ద పని మానేసారు. 1958 లో ఒక ఫౌంటెన్ పెన్ కంపెనీలో చేరారు. 
ఒకనాడు కలములను మిషనులలో తయారు చేస్తున్నారు. అప్పుడు ఒక పెన్నుకాస్తా పాడైంది. 
దాంతో ఆ కంపెనీ ఓనర్ కివిపరీతమైన కోపం వచ్చింది. 
రౌద్రంతో ఎదురుగా దొరికిన రావూరి భరద్వాజను చడామడా తిట్టేసాడు. 

నిజానికి ఆ యజమాని యొక్క అన్న కుమారుని వలన ‘తయారీలో ఉన్న ఆ పెన్ను‘ పాడైంది. 
రావూరి భరద్వాజ నెమ్మదిగా విషయాన్ని విడమర్చి చెప్పాలని ప్రయత్నించాడు. 
కానీ క్రోధావేశాలతో ఊగిపోతూన్న ఆ కంపెనీ స్వంతదారు- “నోర్ముయ్! మాట్లాడావంటే పళ్ళు రాలగొడ్తాను.” అని ఱంకెలు వేసాడు.

కొంతకాలం గడిచింది. ఒక రోజు ఆ యజమాని కొడుకు రావూరి భరద్వాజ వద్దకు వచ్చి చిన్న సాయాన్ని అడిగాడు. 
అతని రిక్వెస్టును మన్నించి రావూరి భరద్వాజ తనకు చేతనైన హెల్ప్ చేసాడు. 
ఆ దొరగారి కుమారుడిని తనకు తెలిసిన చోట ఉద్యోగం ఇప్పించాడు రావూరి భరద్వాజ. 
ఆయన అలాగ ఉద్యోగం  ఇప్పించిన చోట చేరాడు ఆ అబ్బాయి. ఉద్యోగం పురుష లక్షణం- అని అప్పటి నానుడి. సంతోషంతో పనిలో చేరిన స్వామి తనయునితో ఇలా చెప్పాడు రావూరి భరద్వాజ

“అబ్బీ! జాగ్రత్తగా పని చేసుకో! ఈ యజమాని చాలా మంచివాడు. 
మీ నాన్నగారి మాదిరిగా నిష్కారణంగా కోపగించుకోడు. చేయని తప్పుకు పళ్ళు రాలగొడ్తానని మాత్రం అసలే అనడు.” 
*****************************************,

{ఆధారము:- “నాకు దేవుని చూడాలని ఉంది”- "తెలుగు విద్యార్ధి} 
  
ఈ యజమాని చాలా మంచివాడు! (Web magazine; link)

Add new comment
Hits: 247
ఈ యజమాని చాలా మంచివాడు!
Member Categories - తెలుసా!
Written by kusuma kumari
17 July 2013 

15, ఆగస్టు 2013, గురువారం

"సారనాధ్" పేరు ఎలా వచ్చింది?

#"సారనాధ్" పేరు ఎలా వచ్చింది?:-
మన  దేశములో తొలి జింకల పార్కు ఏది?:-
మన పావన త్రివర్ణ పతాకములో మధ్య ఉన్న ధర్మచక్రము- ను 
ఉత్తర ప్రదేశ్ లోని "సారనాధ్ స్థూపము” నుండి గైకొన్నారు. 

ఈ విశేషము మన అందరికీ తెలిసినదే!

హిందూ దేశములో మొట్టమొదటి 'సాధు జంతు ఉద్యాన వనము ', 
అనగా "అభయారణ్యం" ఉన్నదా? 
ఐతే అది ఏది? ఎక్కడ ఉన్నది?

*************************;
;
గౌతమ బుద్ధుని జీవిత గాధతో ముడి ఉన్న చారిత్రకాంశము ఇది.
దేవ భాష/ సంస్కృతభాష రాజ భాషగా ఉన్న రోజులు అవి. 

త్రిపీటకములు:-  
"బుద్ధమ్ శరణమ్ గచ్ఛామి।
సంఘం శరణమ్ గచ్ఛామి। 
ధర్మం శరణమ్ గచ్ఛామి। "

త్రి పీటకములు ("Three Baskets") బౌద్ధ మతమునకు పునాదిరాళ్ళు. 
     
పామరుని నుడికారములుగా ఈసడించబడి, నిరాదరణకు గురైన  భాషలు సాహిత్యములో చోటుకు నోచుకోలేదు. 
అలాటి అతి ప్రాచీన కాలాన బుద్ధభగవానుడు సామాన్యుల భాషకు పట్టం కట్టాడు. 
భాషాపరంగా అద్భుత సాహసి ఆయన- అని నిక్కంగా వక్కాణించవచ్చు. 
"పాలీ భాష" లోనే ఆయన బోధనలన్నీ కొనసాగాయి.

అలాగే అప్పటి ప్రాంత, దేశాదుల పేర్లు "బుద్ధ జాతక కథలు" లో 
"పాళీ భాష"లోని స్వస్వరూపాలలోనే ఋజువును పొందినవి. 

*************************;

జింకకు అనేక నామములు కలవు. సారంగము, మృగము, మృగోద్యానము- మొదలైన పేర్ల లిస్టు ఉన్నది.
అలాగే - ఆ నాటి సమాజములో ఇలాటి "పాలీ పద పుష్పములు" లెక్కకు మించి ఉన్నవి. 
అట్టి కొన్ని పలుకులు చూద్దాము.
ఋషి పట్టణం, ధర్మ చక్రము, ఇత్యాది గీర్వాణ పదములకు ప్రతిగా-  
ఆయా మాటలు బౌద్ధ పరివ్రాజకులు వ్యాప్తిలోనికి తేగలిగారు.   
“మృదావ” అంటే- హరిణముల పార్కు, వీనినే నేడు "అభయారణ్యాలుగా" తీర్చిదిద్దారు. 
ఋషి పట్టణము నకు పాలీ ధ్వని- “ఇసి పటన” గా రూపుదిద్దుకున్నది. 

*************************;

జ్యూయన్ సాంగ్ (Xuanzang) ప్రఖ్యాత చీనా యాత్రికుడు, యాత్రారచనలను- 
తాను చూసిన అగణిత అంశాలను పూసగుచ్చినట్లు, అక్షర రూపాలను కల్పించడములో ఆయనది అందె వేసిన చెయ్యి. 
అతని హస్త తూలిక (pen) - అప్పటి బౌద్ధ సమావేశాలనూ, సాహిత్యాన్నీ అక్షర బద్ధం చేసినది. 
ఆ రచనలలో - ఈ సమాచారములను ఉటంకించాడు. 
నిగ్రోధమిగ జాతక కథ  (Nigrodhamiga Jataka - J.i.145ff) హరిణ వన వివరములను రాసాడు. 
బెనారస్ రాజు (= కాశీ ప్రభువు) "హరిణాలు స్వేచ్ఛగా తిరుగాడేటందు కోసమని- అడవిని కానుకగా సమర్పించుకున్నాడు. 

*************************;

సారంగము:-  
మన పావన త్రివర్ణ పతాకములో మధ్య ఉన్న ధర్మచక్రము- ను 
సారనాధ్ స్థూపము నుండి గైకొన్నారు. 
ఈ విశేషము మన అందరికీ తెలిసినదే! 
ఉత్తర ప్రదేశ్ లోని "సారనాధ్" కు ఆ పేరు ఎలా వచ్చింది? 
ఈ పాటికి మీరు గ్రహించే ఉంటారు. 
 సారంగము అనే సంస్కృత పదమునకు "జింక" అని అర్ధము కదా! 

సారంగ నామము ఆధారమైనది. జింకను అలంకారముగా తన చేతిలో ధరించిన వ్యక్తి “సారంగ పాణి”. 
ఆ! మీరు కనుక్కున్నారన్న మాట  ; 
పరమేశునికీ, ఘౌతమ బుద్ధుని అవతారమునకు – ఈ నామాంతరము కలిగెను.
జింకల కేంద్రంగా విలసిల్లుతూన్న ఆ చోటుకు - సారంగము – పద మూలముగా: 
“సారంగ నాధ్” అని ఆ పట్టణానికి పేరొచ్చింది. 
అలాగే - "సారనాధ్"- “సారంగనాధ్” అను మాట నుండి వచ్చినదే. 
*************************;

"Lord of Deer" సారంగ పాణి,ఆ స్వామి కొలువైన ప్రదేశమే "సారనాధ్".  
అందున్న స్థూపము - "సారనాధ్ స్థూపము". 
ఆ స్థూపము మీదనున్న "ధర్మ చక్రము"ను నీతికీ ధర్మ ప్రవర్తనకూ ప్రతీకగా స్వీకరించి,
పింగళి వెంకయ్య- మువ్వన్నె పతాకము మధ్య ఉంచి, సకల జనామోదముగా రూ పొందించాడు.       

*************************; 

4, ఆగస్టు 2013, ఆదివారం

మంకు తిమ్మన కగ్గ- కన్నడ "వేమన" పద్యాలు


తెలుగు భాషలో “మంకు పట్టు” అనే ఒక పదం ఉన్నది. గత దశాబ్దము కిందటి వరకూ ఈ మాట పెద్దల నాలుకల మీద బాగానే ఆడుతూండేది. “అలాగ మంకు పట్టు పట్టకు. పెంకె తనం పనికి రాదు”అంటూ పిల్లలకు బుద్ధి సుద్ధులను గరిపేవాళ్ళు. "పెంకె ఘటం వీడమ్మా!" అంటూ ఆ రోజులలో విసుక్కోవడమూ కద్దు.
అలా “పెంకి పెళ్ళాం” అనే సినిమా కూడా వచ్చింది. 
రాజసులోచన హీరోయిన్, ఎన్. టి. రామారావు హీరో. 
షేక్ స్పియర్ డ్రామా “The Taming of the shrew” అనే కథాంశముతో భారతీయతతో రంగరించి చేసిన తెలుగు సినిమా అది. 
సరే! ఇంతకీ ప్రస్తుతం “మంకు” అనే ఈ పద మీమాంస ఎందుకు వచ్చింది?

*******************

ఆట వెలది అనగానే మనకు ఠకాల్న జ్ఞాపకం వచ్చే కవి “మహా కవి వేమన”.  “విశ్వదాభిరామ వినుర వేమ” అనే మకుటంతో ఛందో బద్ధ శతక పద్యాలలో మకుటాయమానమై ప్రభలీనుతూన్నది కదా. మన తెలుగు కవి వేమన్న- తన పద్యాలలోని పోలికలు నిత్య జన జీవితాల నుంచి గైకొన్నాడు. అలవోకగా అనేక భావలను శ్రోతలకు చిటికెలో బోధ పడేటట్లుగా రాసిన ఆటవెలదులు. అతి సామాన్యమైన పోలికలతో అనంత భావాలను “కొండలను చూపిన అద్దము” వోలె ఉన్నట్టి ఆ చిట్టి పద్దెములు ప్రజల చేత “ఔరా!” అనిపిస్తూ ముక్కుల మీద వేళ్ళు వేసుకునేట్లు చేసినవీ అంటే ఏ మాత్రమూ అతిశయోక్తి కాదు.
"మందగొడి తిమ్మ "/ మందగొండి తిమ్మని తిక్క వాగుడు; పిచ్చి కూతలు/ "Dull Thimma's Rigmarole"; అనే భావార్ధాన్ని కలిగిన కన్నడ మాట మంకు.
సరే! కొన్ని మెరుపు శకలాలు వీక్షిద్దాము.

మధ్య యుగాలనాడు "సర్వజ్ఞ" అనే కవి పద్యాలను పోలినవి ఈ చిట్టి పద్దెములు.
*******************

మన పొరుగు రాష్ట్రమైన కర్ణాట రాష్ట్రములోని “మంకు తిమ్మ” రచనలు కూడా 
వేమన సూక్తులను బోలినవి. 

డాక్టర్ దేవనహల్లి వెంకటరమణయ్య గుండప్ప/ DVG :-

“మంకు తిమ్మ కగ్గ”గా (ಮಂಕು ತಿಮ್ಮನ ಕಗ್ಗ) పిలువబడే పద్యాల గుచ్చాన్ని అల్ల్లినది ప్రముఖ కన్నడ కవి డాక్టర్ దేవనహల్లి వెంకటరమణయ్య గుండప్ప. వీరు డి.వి.జి. (DVG) అన్న హ్రస్వ నామముతో సుప్రసిద్ధులు. కర్ణాటక సీమలో బహుళ వ్యాప్తిలో ఉన్నవి. సమత్వ భావనను జగతికి చాటిన వాక్కులు, కగ్గ పద్దెములు. సంఘములోని మూఢనమ్మకాలను, దౌష్ట్యాన్నీ ఎత్తిచూపుతూ కేవలము పండితులనే కాక పామరులను సైతం ఆకట్టుకున్నవి.

కవి పరిచయము

కృష్ణమూర్తి నాడిగ గారు- బురదలో కూరుకుని మరుగున పడిన సహస్ర దళ నళినములను లోకానికి కరతలామలకం గావించారు. 
తీరా బైటికి తీసాక అవి మామూలు పువ్వులు కావు, అపరంజి పద్మములు- అని తెలుసుకుని, యావత్తు కన్నడ సారస్వత సీమ అచ్చెరువుతో ఆనందంలో ఓలలాడింది. 
అంతటి అద్భుత అమూల్య ముక్తక కౌస్తుభములను కావ్య ప్రపంచమునకు అందించగలిగిన భాగ్యశాలి D.V.G. కి “డాక్టరేట్”ను 1975 లో Karnataka state Government ఇచ్చింది.

అంతేనా! ఆయన అనేక గౌరవ పురస్కారములను అందుకున్నారు.

1974 లో "పద్మభూషణ్ అవార్డు"ను కర్ణాటక ప్రభుత్వం 1974 లో ఇచ్చి, గౌరవించింది. 1970 లో 90 వేల రూపాయల పారితోషికమును రాష్ట్ర ప్రభుత్వము ఇచ్చి, సన్మానం చేసింది. ఈ మాన్యతా సభ బెంగుళూరులోని "రవీంద్ర కళాక్షేత్ర" లో వైభవంగా జరిగింది. ముఖ్యమంత్రి శ్రీ వీరేంద్ర పాటిల్ చేతుల మీదుగా D.V.G. అందుకున్నారు. ఆ నాటి సభాసదులు మరొక మంచి సంఘటనా సరోరుహమును తమ మానససరోరములలో నిలుపుకోగలిగారు.

అదేమిటంటే- D.V. గుండప్ప- తాను పొందిన 90,000/- నూ అప్పటికప్పుడే బెంగుళూరులోని "గోఖలే ఇన్ స్టిట్యూట్" కు విరాళముగా ఇచ్చారు. ("Gokhale Institute of Public Affairs (GIPA) located in Bull Temple Road, Basavanagudi.

1988 లో భారతీయ పోస్టల్ సర్వీసు వారు "stamp of Dr. Gundappa" ను రూపొందించి ఆ మహనీయునికి నివాళులు అర్పించింది. డి.వి.జి.- గా విఖ్యాతి గాంచిన “డాక్టర్ దేవనహల్లి వెంకటరమణయ్య గుండప్ప” మంకు తిమ్మ కగ్గ ప్రోక్త కబ్బములను వెలుగు లోకి తెచ్చి, ప్రాచీన, అర్వాచీన కర్ణాటక సాహిత్య నందన వనములో కొత్త పూల మొక్కలను విరగబూసిన ఘనతను దక్కించుకున్నారు.

****************


మచ్చుకు కొన్ని 'తిమ్మ' నుడువులు చూద్దాము:-


జన్మస్థలి నుండి కడలి వేపు సాగుతూన్న నది- సాంతం :
ధరణిలోని సారములను సంగ్రహిస్తు సాగును:
వసుధకు తన విలువలు కొన్నిటి నిచ్చును: మార్పు పరస్పరం:
మనుజ సంతానపు గుణ విశేషమ్ము లీలాగుననే జరుగును:
పరిణామము పరిధి చాల విస్తృతము తెలియగా!- మంకు తిమ్మ
(412 ముక్తకము)
 *******************

నర నారీ మోహమ్ములు సృష్టించును
కుటుంబమును, వంశమ్మును:
కుటుంబమ్ము కొరకై- గృహము:
తదుపరి ఇరుగు పొరుగు:
ఆ వెనుకనె గ్రామమ్ము-
అటు పిమ్మట దేశములు, సమాఖ్యలున్ను!
(There is only one POD):-
మడుగు కేవలమ్మొక్కటే!
కేంద్రము నుండి ఒక చిరు కదలిక మాత్రమ్మే –
వందలాది అలల వ్యాప్తి అన్ని దిశల కలిగించెను:
ఈ ప్రపంచ / సంసార బిందు రీతి ఇదియే మంకు తిమ్మ!
[406 ]

*******************

జనక తనయ దర్శనమున చపలు డాయె రావణుడు:
కనక మృగ (బంగారు జింక= మాయ లేడి) దర్శనమున జానకియు చపల యాయె!
 జన వాదన తెలిసినదే! నిందింతురు దశకంఠుని, 
కనికరము సీత పైన! మనసు (యోచనల) స్పందన లెటులౌనో 
దుస్సాధ్యము అరయంగా! మంకు తిమ్మ! [383]

*******************

మంకు తిమ్మ కగ్గ పద్యాలలోని మౌలిక లక్షణములు :-

1) అన్నీ 4 లైన్లు/ (చౌపది రచనలు)

2) ఆది ప్రాస- నాలుగు వాక్యాల్లోనూ ఉంటుంది:

తెలుగు ఛందో పద్యములలో మోస్తరుగానే మంకు తిమ్మ పద్య వాక్యాలు నాల్గింటిలోనూ 
ప్రతి రెండవ పదము నాల్గింటిలోనే అదే ఉంటుంది.

3) వీనినే – ముక్తకములు (“ముక్తకగళు”) అంటారు.

4) అంకిత నామము అన్నిటికీ ఒకటే అది- “మంకు తిమ్మ”.
[“విశ్వదాభిరామ వినుర వేమ” – అనే మకుట వాక్యము వేమన పద్యాలలోని నాలుగవ వాక్యము,
 దీనిని పోలినదే – “మంకు తిమ్మ”]

5) 943 ముక్తకగళు:

ఈ అంకెను గమనిస్తారా?!:-

9-4-5=0: 9+4+5=18=1+8=9 :

6) 945 ముక్తకములలో మానవత్వము, మానవ స్వభావాదుల గురించి మంకు తిమ్మ అనేక ప్రశ్నలను లేవనెత్తాడు. వానిలో 595 సూటి ప్రశ్నలున్నవి.

*******************

 ఈ పేరులో ముచ్చటగా మూడు పదములు కలవు.

1) మంకు = మందకొడిగా:

2) తిమ్మ= పల్లెటూరి బైతు- అనే మాట,

ఆధునిక కాలంలో “ఎర్ర బస్సు ఎక్కి వచ్చాడు” అనే వాడుక విసృతంగా వ్యాప్తిలో ఉంది. ఆట్టే లోకజ్ఞానం లేని అమాయకుడు- అని అనవచ్చును (“country Bumpkin”). 
భగవాన్ శ్రీ విష్ణుమూర్తి అనే అర్ధం కూడా ఉంది.

3) కగ్గ = అయోమయం: కాస్త తిక్క ఉన్నవాడు; అలాగే – “వేదాంతి” అనే అర్ధం సైతం ఉన్నది.

ప్రాచీన కన్నడ భాషా పదవల్లరులతో (హళేగన్నడ) గుబాళించిన పూ రేకుల అల్లికలు 
ఈతని "మంకు తిమ్మ కగ్గ" పద్యములు.

#మంకు తిమ్మ కగ్గ- కన్నడ "వేమన" పద్యాలు 
User Rating:  / 2 
Newaawakaaya (web magazine)
Member Categories  - తెలుసా!
Written by kadambari piduri
Wednesday, 03 July 2013 07:50
Hits: 173

ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు

"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...