ఆ పిల్లవానికి సెగ గడ్డ వచ్చినది.
అక్కడ గ్రామంలో సెగ్గడ్డలకు నాటు వైద్యం చేయడంలో పేరొందిన మనిషి ఉన్నాడు. ఆ అబ్బాయి ఆ నాటు వైద్యుని దగ్గఱకు వెళ్ళాడు.
సరే! ఈ మన హీరో అన్నాడు:
"నాకు గజ్జలలో సెగగడ్డ వచ్చింది. మందు వేయి భయ్యా!"
అతని వైద్య విధానము ఆ పిల్లవాడికి తెలుసు. అదేమిటంటే, కాల్చిన ఇనుప వస్తువుతో, గడ్డ మీద వాత పెట్టడము అన్న మాట!
వైద్యశిఖామణి కుంపటిలో నిప్పులు రాజేసాడు. నిప్పులలో ఇనుప గరిటనూ, కడ్డీనీ కాల్చాడు. ఆ ఇనప వస్తువులు బాగా ఎర్రగా కాలాయి.
టెన్షన్ తో ఆ బాలుని కళ్ళలో నుండి కన్నీళ్ళు ఉబికి వస్తుంటే ఆపుకుంటూన్నాడు. దానిని గమనించిన గ్రామ డాక్టరు మనసులో జాలి, కరుణ కలుగసాగాయి. దాంతో, అతను తన పద్ధతిని క్రూరంగా అమలు చేయలేక పస్తాయించ సాగాడు.
కాస్సేపు చూసి, పిల్లాడు అన్నాడు కదా "అదేమిటీ? ఇంకా ఆలస్యం చేస్తున్నారు. ఆ సరంజామా చల్లారి పోతున్నాయి; చప్పున ఇక్కడ అంటించు,భయ్యా!"
ధైర్యం ఆ బాలుని సొత్తు కదా మరి ! పెద్దవాళ్ళనైనా తోడు తీసుకు వెళ్ళకుండా, ఇంత ధైర్యంగా అలాంటి క్రూర వైద్యాన్ని చేయించుకో గలిగిన ఆ బాలుని పేరు తెలుసా?
పేరు ప్రఖ్యాతులు గడించిన "సర్దార్ వల్లభాయి పటేల్".
"ఉక్కు మనిషి " అని ఆప్యాయంగా ప్రజలు పిలుచుకునే వల్లభాయ్ పటేలు, అక్టోబరు 1875 వ సంవత్సరములో 31 వ తేదీ అక్టోబరు నెలలో (born 31st of October 1875. ) పుట్టాడు.
ఆ రోజులలో లక్షలాది రూపాయిలను ఆర్జించగలిగిన బారిష్టరు ప్రాక్టీసును వదిలివేసాడు.
దేశభక్తితో స్వాతంత్ర్య పోరాటములో పాల్గొని గాంధీజీ, నెహ్రూలకు కుడి భుజము అయ్యాడు.