-
-
-
-
-
-
-
-
-
-
-
-
సమాజ మూల సమస్యలపై గాంధీజీ అవగాహన
::::::
::::::
ప్రజలను పరిపాలించే చక్రవర్తికి గానీ, రాజకీయ నాయకునికి గానీ, దేశములోని సామాన్య జనము యొక్క సమస్యల పట్ల హృదయ స్పందన, పేదరికాన్ని రూపు మాపాలనే ఆస్థ, జిజ్ఞాస ఎంతో అవసరం. అట్టడుగు వర్గాల పట్ల, బీద సాదల సమస్యల పట్ల అవగాహన కలిగి ఉండాలని నిరంతరము పరితపించే మహోన్నత వ్యక్తిత్వాలే వారి పేరును చిర స్థాయిగా నిలబెడతాయి. ఇందుకు మహాత్మా గాంధీజీ జీవితములోని ప్రతి అంశమూ నిదర్శనమే!
మహాత్మా గాంధీజీ, సమాజములో అత్యధికంగా బాధలు పడుతూన్న పేద ప్రజానీకము యొక్క సమస్యలనూ, వాటి మూల కారణాలనూ తెలుసుకొనేవారు. బాపూజీ ఆ హేతువులను , పై పైన తడిమి, కేవలం తెలుసు కోవడం వరకూ మాత్రమే ఆగ లేదు; కార్యకర్తలను బృందాలుగా ఏర్పరచి, పంపించే వారు. పూర్తిగా పరిశోధనా స్థాయిలో నిర్వహించి, సామాజిక సమస్యల గురించి సంపూర్ణముగా అవగాహన చేసుకోవాలనీ, తద్వారా పరిష్కారాలనూ తయారు చేసే ప్రయత్నములో తల మునకలుగా ఉండే వారు.
మన జాతిపిత, మొదట సమాజ సేవా సంస్కర్త, తదుపరి రాజకీయ నాయకుడు! (నా దృష్టిలో , యాదృచ్ఛికముగా రాజకీయ నేత అయ్యారు. కాకతాళీయముగా, విధి మన భారత దేశానికి ఒక అద్భుత నాయకుని రూపములో , బాపూజీని నిర్మించి అందించినది.)
చంపారణ్యములో, పీడిత ప్రజలలో, స్త్రీల సమస్యలను అర్ధం చేసుకోవడానికై, మహాత్ముని ఆదేశాలతో సేవా దళాలు ఉపక్రమించారు. ఆ సీమలలోని మగువలు బయటి వాళ్ళకి తమ ఇక్కట్లను గురించి చెప్పుకోవడానికి ఇష్ట పడే వారు కాదు. వాలంటీరుల శ్రమ నిష్ఫలం అయ్యింది. సమస్యలే తెలియనప్పుడు, ఇంక సాల్వు చేయడమెలాగని? దాంతో, మళ్ళీ విసుగు చెందని విక్రమార్కునిలాగా, మోహన్ చంద్ కరం చంద్ గాంధీ స్త్రీలకే ఆ కార్య నిర్వహణా భారాన్ని అప్ప జెప్పారు.
కస్తుర్బా గాంధీ మరియూ అవంతికాబాయ్ గోఖలేల ఆధ్వర్యంలో వలంటీర్ల బృందము బయలు దేరినది. వాళ్ళు చంపారణ్యములో కాలికి బలపం కట్టుకుని తిరిగినప్పటికీ, ప్రయోజన శూన్యమే అయ్యింది. ఐనప్పటికీ కస్తూరి బాయి, అవంతికా బాయి గోఖలే, సభ్యులు నిస్పృహ చెంద లేదు; తమ పనినీ విరమించలేదు. సందె వేళకి ఒక వాడకు చేరుకున్నారు. ఒక గృహము తలుపు తట్టి, పిలిచింది ఆమె.
"అమ్మా! ఉదయం నుండీ తిరిగాము. మాకు గొంతెండి పోతూన్నది. బాగా దాహం వేస్తూన్నది. కాస్త మంచి తీర్థము ఇస్తారా?" అంటూ అవంతికా బాయి గోఖలే అడిగింది.
తలుపును కొంచెము తెరిచి, లో నుండి గ్లాసును అందించింది ఒకానొక వనిత.
"అమ్మా! మీ చేయిని చూసాను; లోటాను అందించిన మీ అరచేతిని చూసాను. ఆ చేయి తాలూకూ మనిషి కూడా కనిపిస్తే మాకు ఎంతో సంతోషము కలుగుతుంది" అని అడిగింది కస్తూర్బా గాంధీజీ.
ఇంటి లోపల ఉన్న ఆ మహిళ ఇలాగ అన్నది "అమ్మా! మేము ముగ్గురు ఆడ వాళ్ళము ఇక్కడ ఉంటున్నాము. చిరుగులు తక్కువగా ఉన్న కాస్త మంచి చీర మాకు ఒక్కటి మాత్రమే ఉన్నది. ఆ చీరను కట్టుకుని, మా అక్క ఇప్పుడే ఆమె బయటకు వెళ్ళి ఉంది. తక్కిన ఇద్దరమూ, అర కొరగా గావంచాను చుట్టుకుని ఉన్నాము. మరి ఇప్పుడు మీకెలా కనబడగలుగుతాము?" విలవిల లాడే హృదయాలను చిక్క బట్టుకుని, విలపిస్తూ తమ ఇబ్బందిని చెప్పేసారు.
ఆ సంఘటనకు కలవర పడని వారెవరుంటారు? ఆక్రోశముతో కుచించుకు పోతూన్న ఆ అమ్మాయిలతో కస్తూర్బా ఇలా సాంత్వన వచనాలతో ఊరడిల్లేలా జేసింది.
"సోదరీ మణులారా! తలుపులను( మూసి) వేసుకోండి. మీ మనసుల తలుపులను తెరిచారు"(Kasturba told the weeping woman:
"Close the door. The doors of your heart are opened.")