30, సెప్టెంబర్ 2014, మంగళవారం

పుణ్యధారుణీ జననీ!

మణి మకుట ధారిణీ! 
పావన కదంబ వన రాణి; 
పుణ్యధారుణీ జననీ!
ఓమ్ బిందురూపిణీ; || 

కుందనపు బొమ్మా! అమ్మా!
ఎల్లరకు తల్లివి నీవు; 
మాకెల్లరకు తల్లివి నీవు;
బొమ్మలకొలువున బొమ్మవై నిలిచి;
మాకు బిడ్డవు నేడు ఐనావు నీవు|| 

నెలవంక సిగపైన దాల్చినావు మాత!    
నీదు - నవ్వు వెన్నెల డోలలందు తానూగును; 
జాబిల్లి మోదములు, నీకు ఆమోదములు; 
ఆ - జాబిల్లి మోదములు, నీకు ఆమోదములు; 
మాకు - సమ్మోహనము ఆయె నీ చిత్రరచనమ్ములు || 

==============================; 

























ఓమ్ కార స్వరూపిణీ; బిందు మండలవాసినీ! 

27, సెప్టెంబర్ 2014, శనివారం

అద్భుత మలయాళ lullaby "Omanathinkal kidavo)"


"లైఫ్ ఆఫ్ పయ్" (Life of Pai) అవార్డులపంటలను పండించి, అంతర్జాతీయ ఆంగ్ల భాషా 'చలనచిత్రం-'. 
ఈ చిత్రంలోని జోలపాట 2013లో వార్తాపత్రికల ముఖ్యశీర్షిక అయినది.

అలప్పుఝ జిల్లాలోని చేర్తాల లో; నడువిలె గ్రామమున తంపి ట్రస్ట్ ఉన్నది.  


గాయని, రచయిత్రి జయశ్రీ పైన ఆ ట్రస్ట్ వ్యక్తులనుండి కంప్లైంట్సు వచ్చినవి. కేరళలో ప్రతి గృహమునందు పెద్దల గళములలో కూనిరాగంగా, గానంగా ప్రతిధ్వనిస్తూ ఉన్న మలయాళ గీతం "ఓమనాథికల్ కిదవో" (Omanathinkal kidavo) అది.


జయశ్రీ తమిళరచనతో వెలువడిన ఆ జోలపాట తరతరముల నుండీ జనాదరణ పొందిన 

"ఓమనాథికల్ కిదవో  (Omanathinkal kidavo) లోని మొదటి ఎనిమిది పంక్తులకు అనువాదము.”అని తంపి ట్రస్టు సభ్యులు ఆమెపై  ఆరోపణలని గుప్పించినారు. 
జయశ్రీ 'వారి ఆరోపణలను ఖండించింది. 
ఆమె "నా హృదయం లోతులలో నుండి ఉబికిన భావాలనే రాసాను." అని చెప్పారు.      

ఇంతకీ సంచలనానికి హేతువు ఐన ఆ పాట రచయిత ఎవరు? ఆ లల్లిబీ వివరములు ఏమిటి?


@@@@@

స్వాతి తిరుణాళ్ రామ వర్మ కులశేఖర వంశానికి చెందిన రాజు. స్వాతి తిరునాళ్ రామవర్మ ట్రావెన్ కూరు సంస్థాన పాలకుడు (ఏప్రిల్ 1813-డిసెంబర్ 1846) గొప్ప భక్తుడు, స్వాతి నక్షత్రమందు జన్మించిన కారణముగా  "స్వాతి తిరునాళ్ రామవర్మ" అని పేరు పెట్టారు. లేకలేక కలిగిన  అపురూప సంతానం అతడు. కేరళను “ఆదర్శ రాజ్యం” గా తీర్చిదిద్ది ప్రజల గుండెల్లో అభిమానస్థానాన్ని ఆర్జించిన సమర్ధ, సత్పరిపాలకుడు స్వాతి తిరునాళ్.   

@@@@@

ఒకరోజు ఉయ్యాలా జంపాల నూపుతూ తల్లి, దాదీలు ఎందరు లాలించినా ఏడుపు  ఆపలేదు పసివాడైన స్వాతి తిరునాళ్. అట్లాంటి ఒకానొక రోజు అద్భుత మలయాళ జోలపాటకు రత్నపీఠిక ఐనది.

ట్రావెన్ కూర్ మహారాజ్ఞి గౌరీ లక్ష్మీబాయి అడిగింది. 
"మాబాబు స్వాతి తిరునాళ్  ఏడుస్తున్నాడు. 
ఏదైనా జోలపాట పాడండి థంపీ!" 
అప్పటికప్పుడు ఆమె కోరిక మేరకు ఒక పాటను ఇరయ్ మాన్ తంపి  చకచకా రాసాడు. 
ఇరైమాన్ తంపి ట్రావెన్ కూర్ ఆస్థానగాయకుడు. 
ఇరయ్ మాన్ తంపి వ్రాసిన ముహూర్తబలం గొప్పది. 
ఆశువుగా ఈ జోలపాట అద్భుత రసగుళికై, అందరి మనసులలో ఆత్మీయత నింపే బంగారు గనియై, సుప్రసిద్ధమైనది.

@@@@@

ఇప్పుడు మలయాళ సుమ సౌరభాలను తెలుగు, ఇంగ్లీషు అక్షర గతులతో తిలకించండి :-

1) Is this sweet babe The bright crescent's moon, or the charming flower of the lotus?

1) మా బుజ్జి పాపాయి, నెలవంక జాబిల్లి కాబోలు: నవ్వుతూన్న నళినపుష్ప మితడేనేమో!  ఔనా?

1) The honey in a flower, or the lustre of the full moon?

2)  పువ్వునుండి ఉప్పొంగే పుప్పొడి ఏమో! మరి, పున్నమి జాబిల్లి జల్లు వెన్నెల కామోసు!

3) A pure coral gem, or the pleasant chatter of parrots?

3) స్వచ్ఛమైన పగడమో, మరి తీపి చిలక పలుకులా!

4) A dancing peacock, or a sweet singing bird?

3) నాట్యాల మయూరమో: మృదు గానాలాడు కోయిలమ్మయో!                     

4) A bouncing young deer, or a bright shining swan?

4) చెంగుచెంగు గంతులేయు చిన్ని లేడిపిల్లయో! మరి, ధవళకాంతులీనేటి మరాళమో!

5) A treasure from God, or the pet parrot in the hands of Isvari? 

5) దైవమ్ము ఒసగినట్టి సంపద నిధియో! పరమేశ్వరి చేతులందు పెంపుడుచిలకో!     

6) The tender leaf of the kalpa tree, or the fruit of my tree of fortune?

6)  పారిజాత కల్పతరువు చిగురాకేనేమో!  మరి ఇంకా, నాదు భాగ్య వృక్షంపు ఫలమేనేమో!

7) A golden casket to enclose the jewel of my love?

7) నా అనురాగాభరణముకు భద్రంపు పేటికయో/ మంజూషము కాబోలును!

8) Nectar in my sight, or a light to dispel darkness?

8) దిష్టి తగలని సుధయో, కారుచీకటికి ప్రభల ప్రమిదయో!        

9) The seed of my climbing fame, or a never-fading bright pearl?

9)  ఎగబ్రాకెడు యశోలతకు విత్తనమేమో! ఎన్నడూ మసకవ్వని ఆణిముత్తెమేనేమో!                        

10) The brilliance of the sun to dispel all the gloom of misery?

10) నేత్రాలను కలక మాన్పు ఉషారుణకాంతి వీడేనో!  

11) The Vedas in a casket, or the melodious vina?

11) వేదాంత సారాంశమా! ఇంకా, వీణా మాధుర్యత ఔనా!      

12) The lovely blossom put forth by the stout branch of my tree of enjoyment?

12) నా సంతోషం గట్టి కొమ్మన విరిసేటి ముద్దుప్రసూనమో!   

13) A cluster of pichaka buds, or sugar-candy sweet on the tongue?

13) కనకాంబరము గుత్తులో! నాల్కపయిని మిఠాయి తీపియో!    

14) The fragrance of musk, the beat of all good?

14) కస్తూరీ పరిమళమో! మంచితనము రాశియో!

15) A breeze laden with the scent of flowers, or the essence of purest gold?

15) పూతావుల తెమ్మెరయో! మేలిమి బంగారమో!

16) A bowl of fresh milk, or of sweet smelling rose-water?

16) తరిపిపాల గిన్నేమో! ఇంకా, పన్నీటి గుబాళింపులో!

17) The field of all virtue, or an abode of all duty?

17) పచ్చన్ని పొలమేమో! సత్ ధర్మక్షేత్రమ్మో!

18) A cup of thirst-quenching cold water, or a sheltering shade?

18) దాహార్తిని తీర్చు చల్లని నీళ్ళో! చల్లని నీడ కాబోలును!

19) A never-failing mallika flower, or my own stored up wealth?

19) ఎన్నటికీ వసివాడని మల్లిక కామోసు, నాదు నిక్షేపమ్మో!

20) The auspicious object of my gaze, or my most precious jewel?

20) నా వీక్షణముల సౌభాగ్యము, నా అమూల్యరత్నమే!

21) A stream of virtuous beauty, or an image of the youthful Krishna?

21) ప్రవాహముల పావనతయే! బాలక్రిష్ణ ప్రతిబింబమే!

22) The bright forehead mark of the goddess Lakshmi?

22) శ్రీ లక్ష్మి దేవి నుదుట మెరయు తిలకమే!

23) Is it, in this beautiful form, an Avatar of Krishna Himself?

23) సాక్షాత్తూ దిగివచ్చిన క్రిష్ణపరమాత్ముడా!

24) Or, by the mercy of Padmanabha, is it the source of my future happiness?

24) పద్మనాభుని కరుణయో! నా భావి అమందానందమే!  
;
malayala lullaby

;

ఇరైమాన్ తంబీ రచన అయిన ఈ పాటను ఇంటింటా కన్నతల్లులు, గృహిణులు ఉయ్యాలలూపుతూ, ముచ్చటగా చేస్తూన్న ఆలాపనల మాధుర్యాలను గాలితెమ్మెరలు సుతిమెత్తగా రసజ్ఞతలను మోసుకుంటూ సాగుతూంటాయి.  నీలాంబరీరాగమున కూర్చబడిన ఈ మమతల మాధుర్యానికి తెలుగున భావవీవన. ఆ లాలిపాట కేరళలోని ఆబాలగోపాలాన్నీ అలరిస్తూ సాహితీశృంగములను అందుకున్నది.

కురంచి రాగమునందు ఆదితాళమున కూర్చబడినది ఆ మలయాళ గీతిక. కచేరీలందు నీలాంబరీ, నవరోజ్ రాగముల బాణీలు కూడా వాడుకలో ఉంటూన్నవి. ఈ లల్లబీ గీతమున సాహిత్యము, సంగీతరచన రెండున్నూ సమపాళ్ళలో కుదిరినవి. అందుచేత ఆ గీతము నర్తకీమణులు, నాట్యకారులు రంగ వేదికపైన అభినయించే అంశములలో ప్రధానమైనది అవుతూన్నది.

@@@@@ 

అద్భుత మలయాళ జోలపాట  (Link - 
eassay- newAwakAya- magazine)
User Rating:  / 4   Member Categories - తెలుసా!
Written by kusuma kumari
Thursday, 11 September 2014 08:59
Hits: 356

9, సెప్టెంబర్ 2014, మంగళవారం

డొరెగమ - సరిగమ- నేస్తం!


 "అందమైన అనుభవం" అనే సినిమా చాలామందికి గుర్తుండే ఉంటుంది. కె. బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీలో కమల్ హసన్, జయప్రద, జయసుధ, రజనీకాంత్ మున్నగు హేమాహేమీలు నటించారు. తమిళ చిత్రముకు తెలుగు అనువాదం విమర్శకుల, విశ్లేషకుల మెప్పును పొందింది.
ఎం.ఎస్. విశ్వనాధన్ సంగీతం లో అన్ని పాటలు ప్రజాదరణను పొందినవి. హిట్ ఐన వానిలో ఆచార్య ఆత్రేయ రాసిన గీతం ఉన్నది –
"హల్లో నేస్తం! బాగున్నావా?
హల్లో నేస్తం, గుర్తున్నానా?
ఏ కళ్ళైనా  కలిసాయంటే కలిగేదొకటే అనురాగం;
ఏ మనసైనా తెరిచావంటే: తెలిపేదొకటే ఆనందం;
స-రి-గ-మ- లైనా; డొ-ర-ని-ప- లైనా ;  
స్వరములు ఏడే గానంలో
పడమటనైనా తూరుపునైనా; స్పందన ఒకటే హృదయంలో:
సాయా అనా సింగపూరా, సాయారుక మలేషియా: సాయారెమో ఇండియా; సాయావాడ చైనా"
అది సరే గానీ,  ఈ రాగమాలికనందు, "డొరెగమ" అనేవి ఏమిటి?
"సోల్ఫా నోట్స్" - అనే ఇంగ్లీష్ వర్డ్ (English word) ఉన్నది. ఈ సోల్ఫా నోట్స్, ఎలాగ, ఎట్లాంటి సందర్భాలలో వాడబడుతున్నది? గమనిద్దామా?
టిప్పణి - అంటే "స్వరలిపి". "స-రి-గ-మ- ప-ద-ని-+స" లకు ప్రత్యామ్నాయాలుగా, సంగీత పరిజ్ఞానము కొరకై పాశ్చాత్యదేశాల వాళ్ళు వేటినైనా క్రియేట్ చేసుకున్నారా?
ఔను, నిజమే! వారు "డొ-రె-గ-మ" అనే అక్షరములను మ్యూజిక్ సంజ్ఞలుగా ఎన్నుకున్నారు.   
క్రైస్తవ సెయింట్ బెనెడిక్ట్ డి నోర్సియా (Saint Benedict of Nursia (Italian: San Benedetto da Norcia) (c.480-547) పద్య పంక్తులకు ఈ అక్షర సంగీత బాణీలు అన్వయించబడినవి. డొ- రె - మి  ఫ - సోల్ - ల - టి (/ సి) {వీనినే డొరెగమలు అని చెబుతారు. ఈ వ్యావహారిక పదాన్ని పై పాటలో వేసారు.  డో స్కేల్ , పాల్ డీకన్ పోయెట్రీ పంక్తులకు బాణీగా ప్రధమగణ్యతను పొంది, వెస్టర్న్ మ్యూజిక్ హిస్టరీ పేజీలలో స్థానం గడించినవి. 
do, re, mi, fa, sol, la, ti (or si) = అనే letters ని ఎప్పుడు ఎక్కడ గుర్తించబడుతున్నవి?
A, B, C, or C flat అనేవి ఇట్టివే! :-
డో స్కేల్ , పాల్ డీకన్ పోయెట్రీ పంక్తులకు బాణీగా ప్రధమగణ్యతను పొంది, వెస్ట్రన్ మ్యూజిక్ హిస్టరీ పేజీలలో స్థానం గడించినవి.      
*****
User Rating:  / 2 
Member Categories - తెలుసా!
Written by kadambari piduri
04 September 2014 ; More... Add new comment
Hits: 135

హరిసేవ: పాయసం / పరమాన్నం బెల్లం తోటీ చేస్తారు పంచదారతోటీ చేస్తారు. ఎక్కువ ఏది బాగుంటుంది అంటే ........

హరిసేవ: పాయసం / పరమాన్నం బెల్లం తోటీ చేస్తారు పంచదారతోటీ చేస్తారు. ఎక్కువ ఏది బాగుంటుంది అంటే ........

:- పాయసం / పరమాన్నం బెల్లం తోటీ చేస్తారు పంచదారతోటీ చేస్తారు. ఎక్కువ ఏది బాగుంటుంది అంటే బెల్లంతోటి చేసిన పాయసమే బాగుంటుంది అంటారు.

చక్కెర - ఫ్యాక్టరీనుండి వస్తుంది. భగవంతునికి అర్చనాక్రమం లో వీలైనంతవరకూ, హస్తకళలల్కు, కుటీరపరిశ్రమలకు అందుబాటులో ఉండే ఆటలో ప్రయాణించడమే సమర్ధనీయం. మన హిందువులు- నైవేద్యానికి శాకాహారానికి అధికప్రాధాన్యత ఉన్నది.

"చక్కెర తాయారీలో జంతువుల ఎముకల పొడిని కలుపురారని" విన్నాము. ఇందులో వాస్తవం ఎంత ఉన్నదో మాకు తెలీదు కానీ, మేము చక్కెరపదార్ధాలను పూజాకార్యక్రమాలలో మానేసాము. -  కాదంబరీకుసుమాంబ

1, సెప్టెంబర్ 2014, సోమవారం

తమిళ నాణెంపై తెలుగు లిపి , arai kasu amman

కోవెలలు నిర్మాణరీతులు విభిన్నతలతో మనోరంజనము గావిస్తూన్నవి. నదీతీరములు, నదీ, సాగర సంగమప్రాంతములు, గిరిశృంగములు, ప్రకృతిసౌందర్య శోభితప్రాంతములు- దేవాలయ నిర్మాణములకు అనువుగా ఎన్నిక ఔతూ సాంప్రదాయ గౌరవమును పొందుతున్నవి.

పైన నుడివిన ప్రదేశాలకు అదనంగా చెప్పవలసినవి గుహాలయాలు.

దృఢమైన కొండలలో సహజంగా ఏర్పడిన గుహలు ప్రధమగణ్యాలు. తర్వాత మానవుల ఆసక్తి ప్రకారం ఏర్పడిన గుహాలయాలు కూడా జనామోదాన్ని పొందినవి. గుహాలయాలు శిల్పుల ఓరిమికి, శిల్పవిన్నాణతలకు నికషోపలములు. అట్లాంటి గుహాలయలలో పేరెన్నిక గన్నది బృహదాంబ ఆలయం. 

పుదుక్కోట సమీపాన తిరుగోకర్ణము అనే ప్రాంతమున ఉన్న పెనుశిల లోపల ఉన్న జోడీలు బృహదాంబ గుడి, గోకర్ణేశ్వరగుడి. శ్రీబృహదాంబ అమ్మకు మరో పేరు ఉన్నది. ఆమెను జనులు "అరై కాసు అమ్మన్" అని ప్రేమతో పిలుస్తున్నారు.   

ఈ అమ్మవారు తొండైమాను సామ్రాట్టులు, పుదుక్కోటై చక్రవర్తులకు ఇలవేల్పు. తొండైమాను సామ్రాట్టులు అనగానే మనకు తిరుపతి దివ్యక్షేత్రము గుర్తుకు వస్తుంది. ఆ సీమకు "తొండై మండలము" అని ప్రఖ్యాతి గాంచినది. 

అన్నమాచార్య రచన "కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు” అనే కృతిని గుర్తుకు తెచ్చుకోండి.   

"కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు

దొమ్ముల సేసిన యట్టి; తొండమాన్ చక్కురవర్తి (= చక్రవర్తి)  

ఇమ్మన్న వరములనెల్ల ఇచ్చినవాడు  ........  " 

అని కీర్తిస్తూ ఈ కీర్తనలో మెచ్చుకున్నాడు.                                          

తొండై మాన్ సామ్రాట్టులు ఈ అరకాసు సృజనకర్తలు.  

తొండైమాను సామ్రాట్టులు “మేము శ్రీబృహదాంబా సేవకులం!” అని వినయవిధేయతలతో చెప్పారు. 
వారు’శ్రీ బృహదాంబాదాసులు ‘గా రాజ్యపాలన చేసారు. 
ఈ పద్ధతి వలన పాలకులకు “మేమే అందరికన్నా సరాధికులము" వంటి అహంకారము, దురూహలుఏర్పడవు. నియంతలుగా మారకుండా సత్పరిపాలకులుగా అధికారులను తీర్చిదిద్దగలిగిన సదాచారము ఇది. 
పల్లవులు, చోళులు, తొండైమాను సామ్రాట్టులు మొదలు నాయకరాజుల దాకా శ్రీ బృహదాంబ గోకర్ణ ఆలయములను అభివృద్ధి చేశారు. అంటే 7వశతాబ్దం నుండి 17వశతాబ్దం వఱకూ  విభిన్న కళానైపుణ్యాలకు నెలవైనవి ఈ గుళ్ళు.

శ్రీబృహదాంబా అమ్మవారికి ప్రత్యేకించి చెప్పకోవలసిన ప్రత్యేకత ఉన్నది. ఈ దేవికి “అరకాసు అమ్మన్” అని ప్రసిద్ధనామధేయం కలదు. ఈ పేరు రావడానికి కొన్ని వింత హేతువులు కలవు. ఆ హేతువులు ఏమిటి?

మహారాజా కులదైవం నామముతో "అమ్మన్ కాసు" లను ఉత్పత్తిచేసి, ప్రజావళికి పంచేవారు.

రత్నమంగళం అను అందచందాలకు ఆలవాలమై, పచ్చని ప్రకృతి ఆహ్లాదకరమై, భక్తులను పలుకరిస్తూన పల్లెటూరు. అక్కడ అమ్మాళ్ చల్లని తల్లి. 1730 లలో పరిశోధకుని కృషివలన ఒక వింత నాణెం గురించి తెలిసింది. అదే “అరకాసు”. ఇది కేవలం ఒక నాణెమే. ఐతే చెప్పుకోవలసింది ఏమున్నది? “అరకాసు అమ్మన్” అని పేరుగాంచిన తల్లి “శ్రీబృహదాంబ అమ్మవారు”. 

బృహదాంబాళ్ "కాసు విలువ" - 6 నయాపైసలు/ ఆరు దమ్మిడీలు.

6 కాణీల విలువలో సగమే అర్ధణా. "అరై కాసు" అంటే తెలుగుభాషలో అర్ధణా అంటే 3 పైసల విలువ గల నాణెము.   

శ్రీబృహదాంబ నాణెం స్పెషాలిటీ:-  శ్రీబృహదాంబా తల్లి పేరున ఒక కాసును రూపొందించినారు.

పుదుక్కోటై లో ఉన్న ‘నాణెముల తయారీ కేంద్రం(మింట్) లోనే ఈ కాసు తయారైనది. 
అటుపిమ్మట అదే నాణెమును లండన్ లో మిషన్లతో చేసారు. అంటే ఒకే నమూనా ఐన నాణెమును ఇటు కుటీర పరిశ్రమ పద్ధతితో, కళాకారులు స్వహస్తములతో చేసారు. అలాగే అటు యాంత్రిక పద్ధతితోనూ తయారైనట్టి ఈ నాణెము చారిత్రకప్రాధాన్యత కలిగినది ఐనది. అన్నిటికీ పతాకశీర్షికగా మన తెలుగువారికి గర్వకారణమైన విశేషం ‘అమ్మవారి కాసు‘ లో ఉన్నది.

అదేమిటో మీరు ఊహించగలరా!?                                  

శ్రీబృహదాంబఅంబాళ్ చిత్తరువును కాసుకు ఒకవైపున చెక్కారు. అదే చిత్రం నాణెమునకు వెనుక “శ్రీవిజయ” అని తెలుగు అక్షరములతో ముద్రణ జరిగినది. తమిళ దేశమున తెలుగులిపికి కల గౌరవము తమిళుల సహృదయతకు తార్కాణము.

నవరాత్రులలో అమ్మన్ కాసును తొండైమాన్ ప్రభువులు సందర్శకులకు ఇచ్చారు. వాళ్ళు తమను చూడడానికై కొలువుకు ఆత్మీయతతో వస్తూన వాళ్ళకు కానుకలతో పాటుగా అరకాసు బహూకరించే ఆచారాన్ని నెలకొల్పారు. దసరా వేడుకల సందర్భంగా ఇట్లా అమ్మన్ కాసు లభించిన వారు ‘అది తమ భాగ్యదాయిని ’ అని భావిస్తూ భద్రంగా దాచుకునే వాళ్ళు. 
అమ్మన్ పేరు పై రూపొందిన రాగి లోహం కాసులు తిరుగోకర్ణ మ్యూజియాన (tiru gokarnam museum) ఉన్నవి.    

కాసు – కథా కమామిషూ:-

రాజులు, పాలకులు ఎక్కువగా స్త్రీలు అనేక బంగారు బిళ్ళలను హారముగా ధరిస్తూండేవారు. దానిని “కాసుల  పేరు” అని పిలుస్తారు. కాసు అంటే అణా విలువ ఎత్తు- అని ఊహ కలదు. ఫదహారు అణాలు అనగా ఒక రూప్యం = ఒక రూపాయి సమానము. ఆనాటి ఈ ఆర్ధికప్రామాణికత ఆధారంగా ఏర్పడిన తెలుగు నానుడులు చాలా ఉన్నవి.         

ఈ రూపాయికి, అణాపైసల కొలమానము ప్రాచీన భారతావనిలో ఉన్నది. అనేక ఆచారాలకు ఈ కొలమానము గొప్ప పునాది ఐనది. తద్వారా వచ్చిన లోకోక్తులు చాలా భాషా కోశాగారమునందలి కలిమి, నిధులుగా ఏర్పడినవి.

పదహారు కళలు, = షోడశ కళలు; షోడశి; పదహారు = పదారు;; పదహారేళ్ళ వయసు, పదారేళ్ళ ప్రాయము; ఈ కోవకు చెందినవి.    

పదహారణాల తెలుగుదనం ఉట్టిపడుతూన్న పల్లె పడుచు; పదారు వయసు, "(నోటిలోని) పళ్ళు పదారూ రాలునులే!"

పావడా, ఓణీలను కట్టుకుని, మొగలిరేకుల పూలజడను వేసుకుని, తిలకం దిద్దుకుని ఆ పడతి పదారణాల తెనుగుదనము ఉట్టిపడుతూన్నది.

ఇలాగ రూపాయి మన దేశ విపణివీధికి మూలస్తంభం ఐనది. 
ఆ రూప్యమునకు పునాది పైసా. దీనికి ప్రత్యామ్నాయ రూపములు, ఇందాక పేర్కొన్నట్లు నయాపైసలు, దమ్మిడీ, కాణీ, చిల్లికాణీ, గవ్వ మొదలైనవి. 

"అణా పైసలతో/ అణా కాణీలతో సహా బాకీని చెల్లుబెట్టుట" అనే వాడుక ఇందువలన వచ్చింది.      
;      

శ్రీ బృహదాంబా అమ్మాళ్ కి రూపాయి కూడా అక్కర్లేదు, అర్ధణా చాలు, ఆమె అపార అనుగ్రహం భక్తులకు లభిస్తున్నది. ప్రజలు బెల్లం పానకమును అమ్మవారికి నైవేద్యాలుగా ఇస్తారు. 
“అంబాల్” ఫొటో ఎదుట ‘అరకాసు బిళ్ళ”ను ఉంచి, బెల్లం నైవేద్యం పెట్టి, భక్తితో పూజిస్తే, పోగొట్టుకున్న వస్తువులు దొరుకును, అని నమ్ముతున్నారు. భక్తుల విశ్వాసము పలుమార్లు “నిజం”ఔతూ ఋజువు అవుతూన్న సంఘటనలు భక్తిశ్రద్ధలను ఇనుమడింపజేస్తున్నవి. 

******************************,

తమిళ నాణెంపై తెలుగు లిపి  
User Rating:  / 1 
Member Categories - తెలుసా!
Written by kadambari piduri
Monday, 14 July 2014 08:38
Hits: 584 

26, ఆగస్టు 2014, మంగళవారం

ఆకాశ వాణి - అశరీర వాణి

ప్రత్యూష కిరణాలతో "ఆకాశవాణి, శుభోదయం" అనే వాక్కులు నిద్ర మగతను  చెదరగొట్టేవి. 
భక్తిరంజని, సూక్తిముక్తావళి, వారం వారం "గాంధీ మార్గం", ప్రమదావనం, పాడిపంటలు,జనరంజని, ఈ పద్ధతిగా శ్రోతలను నిరంతరం అలరిస్తూ, నిత్యం ప్రజలను సాహితీసంపన్నులను చేస్తూ, భావిభారత పౌరులను తీర్చిదిద్ది, దశాబ్దం క్రితం దాకా (దూరదర్శన్ ప్రజా జీవనములోనికి వచ్చే దాకా) అందరికీ అందుబాటులో ఉన్న ఏకైక వినోదసాధనం రేడియో.

కరెంటుతో పని లేకుండా, బాటరీలతో నడిచే పెట్టె - ఒకటుంది, అదే 'ట్రాన్సిస్టర్ ' అనగా రేడియోకి సిస్టర్ (సోదరి).

బుల్లిపెట్టెనుండి వీనులవిందుచేసే కార్యక్రమాలను ప్రసారం చేస్తున్న సాధనోపకరణమే "ఆకాశవాణి".  ఈ "ఆకాశవాణి" నామధేయాన్ని ఏ బారసాల కార్యక్రమాలలో ఎవరు నిర్ణయించారు? ఎక్కడ ఈ పేరుకు బీజం ఏర్పడింది?

*****

ఆకాశవాణి అంటే “అశరీరవాణి” అనవచ్చును. దేవతలు భక్తులకు, లోకానికి ఏవైనా  సందేశాలనూ, ముందు జాగ్రత్తలనూ  హెచ్చరికలనూ – తాము కనబడకుండా కేవలము వాక్కుద్వారా తెలుపుతారు. ఇలాంటి నమ్మకములు వివిధ సమాజములలో ఉన్నవి. హిందూ ఇతిహాసములలో ఇలాటి కథలు ఉన్నవి. శ్రీమద్ భాగవతము” లో సింహభాగము శ్రీక్రిష్ణలీలలు.

దేవకీ వసుదేవులకు పరిణయము జరిగింది. దేవకీదేవి సోదరుడు కంసుడు. చెల్లెలి పెళ్ళి చేసిన తర్వాత; ఆ నవవధూవరుల జంటతో రధములో పట్టణానికి బైలుదేరాడు. వారిని వ్యాహ్యాళికి తీసుకువెళ్తూండగా మహామాయాదేవి గగనము నుండి మేఘగర్జన ధ్వనితో పల్కింది.

ఆమె ఆకాశవాణిగా “శ్రీక్రిష్ణ జననము”ను గురించి మేనమామ కంసునికి “తస్మాత్ జాగ్రత్త”పలికింది. అటు తర్వాత శ్రీక్రిష్ణావతారము- క్రిష్ణయ్య సాహసాలు యశోదను, గోపికలనూ, నందబాలురను మాత్రమే కాదు, నిఖిల లోకాలనూ పరవశింపజేస్తూన్నవి. జగత్తు అతనిని దైవముగా ఎన్నుకుని, పూజించడానికి 
ఆస్కారం ఏర్పడింది. తదాది శ్రీకృష్ణుడు  అవతారపురుషుడు ఐ దశావతారములలో సుస్థిర స్థానము కలిగినది.

గాధలోని ఈ పదమే స్ఫూర్తినిచ్చినది. ఎం.వి.గోపాలస్వామి గారికి తటాలున ఆ పదము స్ఫురించినది. కన్నడసీమలో అలాగ నామకరణం జరిగి, “ఆకాశవాణి” అనే పేరు రేడియోకి ఏర్పడినది.

***** 

ఎం.వి.గోపాలస్వామి నివాసగృహము పేరు “విఠల్ విహార్”.

ఆల్  ఇండియా రేడియో (నేడు) ఉన్న స్థలానికి దగ్గరలో ఉన్నది ఆ ఇల్లు. అక్కడ కన్నడ సాహితీ అభిమానులు లోకాభిరామాయణం మాట్లాడుకుంటున్నారు. ఆ మాటలు కేవలం పిచ్చాపాటి అనుకుంటే Image: churumuri.wordpress.com
IMAGE: CHURUMURI.WORDPRESS.COM

పొరబడినట్లే! వారివి ఆషామాషీ కబుర్లు, మాటల దొంతర్లు కావు. 
ఆ లోగిలిలో రూపు దిద్దుకుంటూన్నట్టి ఆశావహ దృక్పథాలు. స్వాతంత్ర్యభారతావని యొక్క బంగారుభవిష్యత్తును తీర్చిదిద్దవలసిన విధివిధానముల సోపానపంక్తులు.

దేశప్రగతి, భావిభారత పురోభివృద్ధికై పౌరులుగా తాము చేయాల్సిన బృహత్ కార్యాలు మున్నగు అనేక విలువైన అంశాలు మాటల, చర్చల సోపానాలు ఔతున్నవి.


*****

ఆంగ్లేయుల ప్రభావముచే తొట్ట తొలి రోజులలో “All India Radio ” అనే పేరు ఉండేది.

వందల సంవత్సరాలపాటు పరపాలనలో మ్రగ్గినది ఇండియా. 
స్వాతంత్ర్యాన్ని పొందిన భారతావనికి స్వాతంత్ర్యచింతన పొంగే కొత్త ఆలోచనలు తన మానససరోవరాన నింపుకోవలసిన అగత్యం కలిగింది. స్వాతంత్ర బానిసత్వపు ఛాయలను గుర్తుకు తెచ్చే ప్రతి యోచన కంటగింపుగా ఉండేది. స్వేచ్ఛా భావాలకు ప్రతిబింబాలైన పథకరచనలకై పండితపామరుల కృషి ప్రశంసాత్మకంగా ఉండేది.

అవిగో! అప్పటి అట్లాంటి భావాజలాల నుండి ఉత్పన్నమైన అనేక పదప్రసూనములలో ఈ ఆకాశవాణి అనే శృతిసుభగత్వమైన పలుకు. 

English ఛాయలు కలిగి ఉన్నది, కాబట్టి ఆల్ ఇండియా రేడియో అనే పేరుకి బదులుగా ఏమని పిలిస్తే బాగుంటుంది? దీనికి ప్రత్యామ్నాయమైన నామమును ఆలోచించాల్సిన అక్కర కలిగినది. 
వారు కొన్ని పేర్లను గూర్చి సూచనలు ఇస్తూ ఆలోచిస్తూన్నారు.

అప్పుడు “ఆకాశవాణి” అనే పేరు తెఱ పైకి వచ్చింది.  
ఆ పేరును సూచించిన వ్యక్తి ఎం.వి.గోపాలస్వామి. 
మొట్టమొదట మైసూరు నుండి ప్రసారాలు ప్రారంభమైనవి. 
M.V.Gopalaswami ఇంటిలో కొత్త నామధేయానికి ఊతం వచ్చింది. 
అప్పుడు ప్రస్తుతం మన శ్రవణేంద్రియలలో చేరే మధుర మాధుర్య నామం "ఆకాశవాణి"  ఊపిరిపోసుకున్నది.  

రవీంద్రనాధటాగూరు ఈ పదాన్ని సాహిత్యంలో తన రచనలలో వాడారు. 
ఐతే ‘రేడియోకి ఆ పేరు పెట్టవలెను ‘ అనే దృష్టితో కాదు- అని వాదాలు  ఉన్నవి.

@@@@@

ఆకాశ వాణి - అశరీర వాణి  (LINK- web magazine)
User Rating:  / 2 
Member Categories - తెలుసా!
Written by kusuma kumari
Wednesday, 30 July 2014 09:43
Hits: 163 

21, ఆగస్టు 2014, గురువారం

మహాశిల్పి ఆర్నికో

"ఈ నల్లని రాలలో ఏ కన్నులు దాగెనో
ఈ బండల మాటున ఏ గుండెలు మ్రోగునో"
శిల్పకళకు వన్నెలను చేకూర్చిన ఈ పాట మనకు చెవులలో ఉలి శబ్దాలను, 
మనో నేత్రంలో సుందర శిల్పాలను దృశ్యమానం చేస్తుంది.   

నా చిన్నప్పుడు "ఆర్నికా హైర్ ఆయిలు" తరచూ ప్రకటనలలో కనబడేది. ఆ నూనెను కురుల కోసం స్పెషల్ గా తెప్పించుకునే వాళ్ళు. టిబెట్ దేశ శిల్పి పేరు ఇట్లాంటిదే! అరానికో/ అనికో/ అనిగే అని స్థానిక ప్రజల  గౌరవాన్ని పొందిన చారిత్రక వ్యక్తి అతను. 

2] బీజింగ్ లో మియాయింగ్ కోవెల వద్ద ఈతని విగ్రహం ఉన్నది.(Araniko, Miaoying Temple, Beijing) 

॑॑॑॑॑#####


అభయ మల్ల, జయభీమ్ దేవ్ మల్ల పరిపాలనాకాలమున కళా మార్పిడి కార్యక్రమాలు చురుకుగా సాగినవి. అనికో  ఖాట్మండు లోయ ప్రాంతం నివాసి. అనికో జన్మతః శిల్పవిద్యలో ప్రజ్ఞావంతుడు. అనికో నేర్పరితనాన్ని తెలుసుకున్న మల్ల చక్రవర్తి "టిబెట్ లో స్వర్ణ స్థూపమును నిర్మించు, అర్నికో!" ఆదేశించాడు. 


అందుకు సంతోషంగా అంగీకరించాడు ఆర్నికో. నియమనిష్ఠలతో ఆ మహత్కార్యాన్ని పూర్తి చేసాడు. 


యువాన్ వంశ పాలనకు ఆద్యుడైన కుబ్లైఖాన్ నేపాల్, టిబెట్ చిత్ర, శిల్ప కళలను గాంచి ముగ్ధుడు ఐనాడు.  మల్ల ప్రభువులను 'మహాశిల్పి ఆర్నికోని మా సీమకు పంపించండి, ఆతని ద్వారా నవీన శిల్పరీతులను మా ప్రాంతాలలో ఆవిష్కరణలు చేయాలని మా ఆకాంక్ష.' అని కుబ్లైఖాన్ కోరాడు. అందుకు మల్ల చక్రవర్తులు, ఆనికో సంతోషంతో సమ్మతించారు. 


ప్రభువుల అనుజ్ఞతో అనికో చైనాకు వెళ్ళాడు. 


మంగోలు సామ్రాజ్యములోని స్థిరకళలకు అదనపు సొగసులను అందించి, చైతన్యాన్ని నింపాడు అనికో.  


#####


లలిత్ పూర్ మండలంలోని 'పాటన్' (पाटन) అనే గ్రామంలో జన్మించాడు. లలిత్ పూర్ మండలంలోని 'పాటన్ ' (पाटन) అనే గ్రామంలో జన్మించాడు అర్నికో. "ఆరణికో" విగ్రహం కీర్తిపూర్ లోని నేపాల్ భాషా అకాడమీ ప్రాంగణమున ఉన్నది. (Statue of Araniko at Nepal  Bhasa Academy, Kirtipur) 1245 - 1306 CE కాలము వ్యక్తి. 


అమరశిల్పి జక్కన, రువారి మల్లిటమ్మల వలె - ఆరణికో మధ్య, దక్షిణ ఆసియా ఖండ దేశాల కళలకు ఒరవడి పెట్టాడు. నేపాల్, టిబెట్, యువాన్ చీనా మొదలగు దేశాలలో నేటికీ ఆరణికో కళారీతుల ప్రభావం అనుసరణలో ఉన్నదంటే 'అతను నెలకొల్పిన  సరి క్రొత్త విధానాలూ అద్భుతమైనవి అని ఋజువు ఔతూన్నవి.          


##### 


కళాజగతినందు ఆదాన ప్రదానాలు సాధారణం. అభయ మల్ల, జయభీమ్‌ దేవ్ మల్ల  పరిపాలనాకాలమున కళా మార్పిడి కార్యక్రమాలు చురుకుగా సాగినవి. కుబైఖాన్ హిమాలయ కళాపద్ధతులను(trans-Himalayan artistic tradition), చీనా కళల సమ్మిళితమైన నవ్యత్వానికి శ్రీకారం చుట్టాడు. ఇట్టి స్థిరకళల మార్పిడి వలన చైనా సమాజానికి అమోఘ సౌందర్య ఆవిష్కరణలు లభించినవి. ఫలితంగా అక్కడ వర్ణమయ  సృజనాత్మకలు వెల్లివిరిసినవి.                   


#####


ఆర్నికో (అర్నికో) తాత, నాయనమ్మలు మిత్ర, కుందలక్ష్మి. చైనా చారిత్రక ఆధారముల ప్రకారము (ఉచ్ఛారణా పరిణామములో) "మి-తి-ర", "కున్-ది-ల-క్విమెయి" అని మారినవి. తల్లిదండ్రులు "ల-కె-న", "షు-మ-కె-తై"(లక్ష్మణ్, సుమకేతి). 

విజేతల జీవితాలలోని ముఖ్య సంఘటనలను జనులు పదేపదే చేసుకుంటూంటారు. తద్వారా తర్వాతి తరములకు కొన్ని కథలు ఆశువుగానూ, పాటలుగానూ, సాహిత్యరూపేణా నిధులు దొరుకుతూన్నవి. 

ఆర్నికోకు ప్రజలచేత నెమరు వేయబడేటటువంటి అలాంటి స్మృతులు ఉన్నవి. 


తండ్రి బౌద్ధ కోవెలకు బాలుడు ఆర్నికోతో వెళ్ళాడు. మూడేళ్ళ బాల ఆర్నికో, తండ్రిని కొన్ని సందేహాలను అడిగాడు. "ఈ స్తంభములను ఎవరు చెక్కారు? వీని పునాదులను, పైన 'అండా" లను ఎవరు నిర్మించారు?" (wooden sthambha, bhumis, anda) 


మూడేళ్ళ చిన్నారి ప్రశ్నలు  పెద్దల మేధావితనానికి దీటుగా ఉన్నవి. 


అందరూ "ఆనికో గొప్ప శిల్పి ఔతాడు. భవిష్యత్తులో అతడు పేరు ప్రఖ్యాతులను ఆర్జించి, గొప్పవాడౌతాడు." అని అనుకున్నారు.  


వాళ్ళ నమ్మకం, పలుకులు వాస్తవం అయినవి. 


#####


దక్షిణ భారతదేశ కోవెలల పై కప్పులకు "విమానము" అని చెబుతారు. గర్భగుడి, స్తంభములు, రంగమండపము ఇత్యాదులు ఉన్నవి. అట్లాగే బుద్ధదేవుని చైత్యములు, ఆరాధనామందిరములను 'పగోడా' అని పిలుస్తారు.  బుద్ధుని ఆరాధనామందిరములకు 13 వలయాలు ఉంటాయి. పదమూడు రింగులను ఒకదానిపైన ఒకటి పేర్చుటచే అవి క్రమపద్ధతి వలన లయాత్మకత ఒనగూడి, భక్తిభావ, ధ్యాన, ఏకాగ్రతలకు అనువైన వాతావరణాన్ని నెలకొల్పుతాయి.  ఈ విశిష్టతకు మెరుగులు దిద్దిన వాస్తుచిత్రణాశిల్పిఆర్నికో సదా స్మరణీయుడు ఐనాడు.


బీజింగ్, నేపాల్ లోని నేపాల్  కీర్తిపూర్ మున్నగుప్రాంతాలలో అతని ప్రతిమలను ప్రజలు స్థాపించుకున్నారు.         


#####


పగోడా, డగోబాల తేడా:


డగోబాలు ‘గంట ఆకారముతో ఉంటాయి. డగోబాలు నిర్మాణశైలికి ‘మన దేశములోని స్థూపము మంచి ఉదాహరణ. శ్రీలంక (పాత పేరు సింహళము), థాయిలాండ్, కొరియా మొదలైన దేశాలలో సాక్షాత్కరిస్తున్నవి. బౌద్ధ పరివ్రాజకులకు, బౌద్ధ సన్యాసులకు ధ్యానప్రదేశాలుగా ఉపయోగము కలిగినవి.బుద్ధదేవుని చైత్య, ఆరామాల శైలులు వర్ణచిత్రాలను, పుష్పములు, జంతువులు ప్రతీకలుగా ఉన్నవి. ఏనుగులు, ఫలములు, జంతు, వృక్షములు డిజైన్లతో, ఎంబ్రాయిడరీ తీరుతెన్నులై, ఆకట్టుకుంటూంటాయి. హిందూ శిల్పములు దేవతలు, యక్ష, కిన్నెర, కింపురుషులు, మనుష్యులు, సైనికులు, యోధుల సాహసాలు, గజ, శరభ, సింహాది క్రూర మృగాలను వేటాడే దృశ్యాలు అనేక ఉన్నవి. ఇవి కథాకథనశైలికి ప్రతిబింబాలు.  ఆ స్త్రీలు, రామచిలుకలు, మయూరి మున్నగు పెంపుడు పక్షులతో వయ్యారమొలికించే వనితామణులు అలనాటి ప్రజాజీవనవిధానాలను కన్నులకు బొమ్మలు కట్టినట్లు ఉండే విధానము నెలకొన్నది. హంపీలో మహిళల హెయిర్ స్టైల్సు సంఖ్యాపరంగా, వివరణాపరంగా ‘న భూతో న భవిష్యతి|’.


నాటివరకూ మనుజుల సంగీత, నాట్యాది లలితకళలను, నిత్య జీవనశైలిని, వీరుల యుద్ధవిధానాలనూ (మధ్య ప్రదేశ్ లోని ఖజురాహో సుప్రసిద్ధమైనది. చంద్రవంశ రాజైన చండేల ప్రభువులు కొన్ని అడుగులు ముందుకు వేసారు. వారు వాత్స్యాయన కామసూత్రాలను శిల్పములుగా చెక్కించి, ప్రపంచములోని ఇతరదేశాలకు, పాశ్చాత్యులకూ పరిశోధనలకు కేంద్రమైనది.) గ్రీకులు, కుషాణులు, కనిష్క చక్రవర్తి, మొదలైన వారి ప్రభావముచే “గాంధారశైలి” మన దేశానికి లభించినది. అట్లాగే బౌద్ధులు, జైనులు మున్నగువారివలన “ప్రతీక శైలి”ని లబ్ధిగా హిందువులు పొందారు. 


ఈ మార్గమున దృశ్యకళలైన చిత్రలేఖనములు, కుడ్యచిత్రాలు, మురల్ శైలి, ఫ్రెస్కో కళ, అదే తీరుగా ‘డగోబా’ ఆరాధనామందిరములు మన దేశానికి అందిపువచ్చిన కళా విన్నాణాలు. 


 #####


మహాశిల్పి ఆర్నికో ; Link - essay in Webmagazine

User Rating:  / 1 
Member Categories - తెలుసా!
Written by kadambari piduri
Monday, 11 August 2014 07:23
Hits: 106

&&&&&&&&&&&&&&&&&&&&&&

కోణమానిని తెలుగు ప్రపంచం
పేజీ వీక్షణ చార్ట్ 51989 పేజీవీక్షణలు - 989 +1 పోస్ట్‌లు, చివరగా Aug 21, 2014న ప్రచురించబడింది

అఖిలవనిత
పేజీ వీక్షణ చార్ట్ 27446 పేజీవీక్షణలు - 719 పోస్ట్‌లు, చివరగా Aug 14, 2014న ప్రచురించబడింది

Telugu Ratna Malika

పేజీ వీక్షణ చార్ట్ 3673 పేజీవీక్షణలు - 116 పోస్ట్‌లు, చివరగా Apr 17, 2014న ప్రచురించబడింది
{konamanini views = 56470$
కోణమానిని తెలుగు ప్రపంచం
పేజీ వీక్షణ చార్ట్ 51846 పేజీవీక్షణలు - 988 పోస్ట్‌లు, చివరగా Aug 14, 2014న ప్రచురించబడింది }

ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు

"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...