21, అక్టోబర్ 2014, మంగళవారం

హంగుల దీపావళి

ప్రమిదల జ్యోతుల; తుల తూచగ లేని; 
అన్ని కాంతులు: అన్నన్ని కాంతులు; 
ప్రమదల నడకల హంగులు; 
సందడి పండుగ దీపావళి||

మతాబాల పువ్వులు; రవ్వల తళుకుల నవ్వులు; 
బాణసంచాల చిటపటలు; చాలా వేడ్కల పకపకలు || 

పిల్లల పెద్దల సందడికి, ఇది చిరునామా హడావుడి; 
పర్వములందున మనోహారిణి; ఇదే ఇదే! దివ్య దీపావళి || 

************************************, 

deepaawali wishes 











pramidala jyOtula; tula tuuchaga lEni; 
anni kAmtulu: annanni kaamtulu; 
pramadala naDakala hamgulu; 
samdaDi pamDuga dIpaawaLi||

mataabaala puwwulu; rawwala taLukula nawwulu; 
baaNasamchAla chiTapaTalu; chAlA wEDkala pakapakalu || 

pillala peddala samdaDiki, idi chirunaamaa haDAwuDi; 
parwamulamduna manOhAriNi; idE idE! diwya diipaawaLi || 


 57203 ;  

************************************, 

16, అక్టోబర్ 2014, గురువారం

శృంగార నైషధము” విశ్లేషణ – కొల్లా శ్రీకృష్ణారావు

“కవికీ, కంసాలికీ సీసం లోకువ.” అని నానుడి. కంసాలి లోహమైన ‘సీసము’నూ, కవి పద్యఛందస్సు ఐన “సీసం”నూ ప్రజ్ఞతో వాడుతారు, అని శ్లేష. శ్రీనాథుడు అందుకు పర్యాయపదము.

కొల్లా శ్రీకృష్ణా రావు ఆంధ్ర సాహిత్యం పట్ల ఎంతో ఆసక్తి కలిగిన సారస్వత కృషీవలుడు. 
ఆయన రచించిన వివరణాత్మక పుస్తకములు తార్కాణములు. శృంగార నైషధమును రచించిన శ్రీనాథునిపట్ల భక్తి, అనురాగములతో రచించిన విమర్శనా విశ్లేషణా గ్రంథము “శృంగార నైషధము”.

శృంగార నైషధము అంటే కొల్లా శ్రీకృష్ణారావుగారికి ఎప్పుడు అలాటి అభిమానం కలిగింది? దీనిని “ఆముఖము” లో రచయిత తెలిపారు. కవిబ్రహ్మ ఏటుకూరి వేంకటనరసయ్య గారి వద్దకు వెళ్ళిన కొల్లా శ్రీకృష్ణారావు ‘నేను రాసిన అల్లిబిల్లి కవితలను, పద్యములను దిద్దించుకొనుట పరిపాటి. తిక్కన భారతోద్యోగ పర్వములోని రసోదంచితమైన పద్యములు విశదీకరించు సందర్భమున శ్రీనాథుని ప్రస్తావన వచ్చి –
‘విడువక షడ్రసాన్నమును విస్సన పఞ్తిని హేమపాత్రలో కుడిచిన భోగి
డిండిముని గుండెలు వ్రీలగ కంచు ఢక్క బోనడచిన వాగ్మి
బంగరు టుయాలల దూగుచు కొండవీటి లో గడపిన భాగ్యశాలి-‘ అని ఏటుకూరి వేంకటనరసయ్య పద్యాలను రాసారు. ఆ పద్యాలను ఏటుకూరి వేంకటనరసయ్య వినిపిస్తూ కవిసార్వభౌమ బిరుదాంకితుడైన శ్రీనాథుని ప్రశంసించిరి. ఆనాటి నుండి కొల్లా శ్రీకృష్ణారావుగారికి తిక్కన, శ్రీనాథులనిన పంచప్రాణములు.

కొల్లా శ్రీకృష్ణారావు చదువుసంధ్యలు సాగుచున్నవి. ‘భాషాప్రవీణ ‘ చదువుకొనునప్పుడు ‘శృంగార నైషధము’ చూచుట తటస్థించినది. 
అందున్నది అమలిన శృంగారము పేర్కొనదగినది. ఆ పద్యగ్రంథములోని భావసౌందర్యాన్ని అందించదల్చిన విమర్శకులు కొల్లా శ్రీకృష్ణారావు విపులవ్యాస రచనలను “శ్రీనాథ నైషధము” పుస్తకముగా ప్రకటించారు.

ఏ వేళలనైనను పుస్తకప్రచురణకు సహకరించిన వదాన్యులకు కృతజ్ఞతలను తెలుపుట మేలైన సంప్రదాయం.
‘ఈ పుస్తకమును ప్రకటింపనుత్సాహపరచి దీని అవతరణకు కారకులైన
వదాన్యశేఖరులు చిలుమూరు – శ్రీరామా రూరల్ కళాశాల (గురుకులము) ప్రిన్సిపల్ శ్రీ కొలసాని మేజరు మధుసూదనరావుగారి సౌజన్యసౌహార్ద్రములకు నా ధన్యవాదములు.’ అనీ, 
డాక్టరు కాసరనేని సదాశివరావుగారికి, విద్యాదాత విద్వాన్ శ్రీ గోగినేని కనకయ్యగారికి కృతజ్ఞతాపూర్వక నమోవాకములు.’ అని తెలిపారు కొల్లా శ్రీకృష్ణారావు. 
‘బంగారమువంటి పండితోద్యోగము చేతులార విడనాడి జీవనగమనములో పలు ‘అవతారము’లెత్తి ఆర్థికముగా కొన్ని ఒడుదొడుకులకు లోనైనను సహించి రచనావ్యాసంగమునకు ప్రేరేపించిన 
నా సహధర్మచారిణి శ్రీమతి సామ్రాజ్యలక్ష్మికి నా ఆశాసనము. బిడ్డకు శుభాశీస్సులు.’ అని చెప్పారు. మళ్ళీ ఇవే విషయాల్ని “కృతిపతి” లో ఛందోబద్ధ పద్యరూపమున వ్రాసారు శ్రీకృష్ణారావు.

ప్రారంభమున “కవిసార్వభౌమ!” లో రూపమున శ్రీనాథుని నుతించారు.
‘ఓ కవిసార్వభౌమ! భావదూర్జిత కావ్యసుధా స్రవంతిలో|
లోకము మున్గి తేలె; మధు లుబ్ధ సుమంధయ రీతి, నేటి కా|
పాకము రీతి శయ్య కను పట్టపు తెంగు కవీంద్ర కోటిలో|
నీ కనకాభిషేక కథనిస్తుల మాధ్రవసుంధరా స్థల్న్.’ …….
‘అవనీనాథ……’ ‘ భవదీయ ప్రతిభా విశేష కవితాబ్రాహ్మీ పదాబ్జద్వయీ: 
నవమంజీర ఝళం ఝళార్భటుల విన్యాసమ్ము లక్ష్మీకళో; త్సవముం గూర్పగ రత్నపీఠి గనకస్నానమ్ము గైకొంటి నీ: వెవరయ్యా! కవిరాజవా? రెలుగు సాహిత్య స్వరూపమ్మవా?’ …….. '
అని 7 పద్యాలను శ్రీనాథ స్తుతీసుమములుగా అర్పించారు రచయిత.

శ్రీనాథుడు గ్రంథమును – వసుచరిత్రము పద్యమున సూచించిన అంశములను ఉదాహరణగా ఇచ్చారు.

“మహి మున్ వాగనుశాసనుండు సృజియింపం కుండలీంద్రుండు ద;
న్మహనీయ స్థితి మూలమై నిలువ శ్రీనాథుండుప్రోవన్ మహా; మహులై సోముండు భాస్కరుండు వెలయింపన్ సొంపు వాటించు నీ: బహుళాంధ్రోక్తిమయ ప్రపంచమున తత్ ప్రాగల్భ్య మూహించెదన్” – నన్నయ అక్షరరమ్యత మిన్న. మార్గ దేశి కవితలలో “ఉభయ కవిమిత్రుడు” తిక్కన, “ప్రబంధ పరమేశర” బిరుదాంకితుడు ఎఱ్ఱన; ఈ కవిత్రయము తరువాత అంతటి ధీమంతమైన దీప్తిమంతమైన ప్రజ్ఞతో బ్రాహ్మీ దత్తవరప్రసాదముగా అవతరించినయశ్స్వి శ్రీనాధుడు.”
“శ్రీనాథుడు” పేరులోని మాధుర్యాన్ని గమనించగలిగారు రచయిత. శ్రీనాథుని చరిత్ర ఆధారములను పరిశీలనా ప్రయత్నం చేసారు.

కృష్ణారావు శృంగార నైషధములో తన వివరములను చెప్పడు. 
శ్రీనాథుని వలన, స్వీయ విశేషాలను ప్రబంధాది కావ్యకవులు వివరించు విధానమునను వ్యాప్తిలోకి వచ్చింది అని వక్కాణించవచ్చును. 
శ్రీనాథుని సహృదయతకు నిదర్శనము:- కేవలము రాజులకు మాత్రమే కాక- తాను ఇష్టపడిన, 
తనకు ప్రేమాస్పదులైన వ్యక్తులకు కూడా కావ్యాలను అంకితము నిచ్చెను. 
(సహ కవి?); భీమ పురాణము-ను బెండపూడి అన్నయామాత్యునికి అంకితమొనర్చెను. 
“పాకనాటింటి వాడవు, బాంధవుడవు …. ” అని శ్రీనాథుని గురించి పేర్కొన్నాడు. 
బ్రాహ్మీదత్త వరప్రసాది శ్రీనాథుడు. అంతేనా!?

అతను ఆగమశాస్త్రఖని. ఈశ్వరార్చన నిత్యవిధిగా పాటించిన ప్రజ్ఞాపాటవములు కల కవిసార్వభౌముడు. శ్రీనాథుని మిత్రులూ, బంధువులూ ఎక్కువమంది – సహ కవులు అగుటచేత చారిత్రకముగా అనేక ఉపయోగములు సాహిత్యమునకు ఒనగూడినవి. తెలుగుసాహితీ, ప్రబంధకర్తలలో అత్యధికవివరములు శ్రీనాథుని గురించి తెలిసినవి. నన్నయాదుల వివరములు తెలిసినవి తక్కువే! దుగ్గనామాత్యుడు (కేతూపాఖ్యాన కర్త) ఇలా చెప్పాడు: “శ్రీనాథకవి కూరిమిచేయు మఱదిని“ కాశీఖండము కావ్యాంతములోని ఆశ్వాసాంత గద్యమున – “ఇది కమలనాభపౌత్ర, సుకవిజన విధేయ శ్రీనాథ నామధేయప్రణీతము‘ అని వ్రాసెను.

ఇలాగ అనేక ఆధారములవలన – శ్రీనాథుని వివరములు:-
1) పాకనాటి బ్రాహ్మణుడు , 2) భారద్వాజ గోత్రజుడు, 3) ఆపస్తంబ సూత్రుడు; 4) తండ్రి :- “విద్యారాజీవసంభవుండు మారనామాత్యుడు:5) తల్లి ‘బుణ్యాచార – భీమాంబ : 
6) కాల్పట్టణాధీశు, ఘనుడు, పద్మపురాణ సంగ్రహ కథా కావ్య ప్రబంధాధిపుడు ఐనట్టి- కమలనాభుని పౌత్రుడు.

***********************;

“శృంగార నైషధము” అంటే కలిగిన సాహితీఅనురాగం – అందున్న ప్రతి అంశాన్ని సునిశిత పరిశీలన చేసి, సాహితీజిజ్ఞాసులకు అందించే మహోపకారం చేసినది. కొల్లా శ్రీకృష్ణా రావు సునిశితదృష్టితో – “శృంగార నైషధము” పరిశీలించేటప్పుడు ఇతర విశేషాలను సైతం చరిత్ర జిజ్ఞాసువులకు కొన్ని అంశాలను అందుబాటులోనికి తెచ్చిన దిక్సూచీ వాక్యాలు ఉన్నవి. శ్రీనాథుడు సంస్కృతముతో పాటుగా, శౌరసేని, పైశాచి, మాగధి మున్నగు షడ్విధ ప్రాకృత పరిజ్ఞాన సంవేది. శ్రీనాథుడు పూర్వకవి స్తుతిలో “భజియింతు సాహిత్యపదవీమహారాజ్య భద్రాసీను – ప్రవరసేను” అని తెలిపెను.

“సేతుబంధము” అను ప్రాచీన ప్రాకృత మహాకావ్య రచయిత నామమునిని గూర్చి మనకు శ్రీనాథుడు ఉప్పు అందించెను. శ్రీనాథుడు జన్మతః ప్రతిభాశాలి. “నూనూగు మీసాల నూత్న యౌవనమున “ ఆంధ్రీకరణము గావించెను. ప్రాకృతమున ఉన్న “శాలివాహన సప్తశతి”ని తెనుగు చేసెను. కానీ ఇది మనకు లభింపలేదు. దుగ్గన పేర్కొనిన అంశములు – శ్రీనాథుని కూలంకష ప్రజ్ఞ, శ్రీనాథుని కాశీఖండాది కావ్యాలు ప్రబల తార్కాణములు. 
రెడ్డిరాజుల యుగము, శ్రీనాథయుగము రెండును పరస్పరము 
మణి నా వలయం; వలయేన మణిః” అన్నట్ట్లు రాణించినవి.

పొన్నుపల్లి తామ్ర శాసనము “విద్యాధికారీ శ్రీనాథో వీర శ్రీవేమ భూపతేః” అను ఈ వాక్యం వలన – శ్రీనాథుడు- కొండవీటి సింహాసనమును అధిష్ఠించిన పెదకోమటి వేమారెడ్డి కొలువులో – విద్యాధికారిగా ఉన్నాడు అని తెలుస్తున్నది. 
శ్రీనాథుని చరిత్రలో కొన్ని ముఖ్య ఘట్టములలోనివి; ఓఢ్ర దేశము – గౌడ దేశము;, ద్రావిడ, కర్ణాట దేశములలో విస్తారముగా సంచరించిన కవివరేణ్యుడు శ్రీనాథుని సమముగా ఇంకొకరు కనిపించరు. 
అష్టభాషా విశారదుడు, వాద కుశలుడు ఐన ‘డిండిమభట్టు’;డిండిమభట్టును ఓడించి, ఆతని కంచుఢక్కను పగులగొట్టించెను శ్రీనాథుడు.

మడికిసింగనకవి కృత పద్మపురాణము, ఉత్తరఖండమునందలి ఒక పద్యాన్ని బట్టి –
“గురజాలాన్వయ దుగ్ధ వార్ధి శశి దిక్కుంభీంద్ర హస్తాభ బం|
ధుర భూ భర ధురీణ నిశ్చల మహాదోర్దండుగ్రారి భీ|
కరుడై దిక్పరివర్తి కీర్తి నెగడంగా భూరి భోగాఢ్యుడై|
పరగొన్ ధాత్రి తెలుంగురాయడు జగత్ ప్రఖ్యాత రాజోన్నతిన్||”

సాంపరాయలు కొడుకైన తెనుగురాయడు గొప్ప సాహితీప్రియుడు, రసికుడు, 
ఈతని సోదరుడు ముత్తభూపాలుడు. 
ముత్తభూపాలుడు రామగిరిని రాజధానిగా చేసుకొని 
సబ్బనాపి రాష్ట్రంబున రాజ్యంబు చేయుచుసాహితీ పోషణ పెంపొందించెను. 
సబ్బనాపి సీమ- గౌతమీ దక్షిణంబున ఉన్నది. 
సుకవితా యద్యస్తి రాజ్యేన కిం|” ఆర్యోక్తి శ్రీనాథుని విషయమున అక్షరసత్యము.
**********;
“జయం” అను ‘మహాభారతము‘ నందు, అరణ్యపర్వమున – చిన్న ఉపాఖ్యానము ‘నల చరిత్ర ‘. రేఖామాత్రముగా వేదవ్యాసుడు ఇచ్చిన ఈ నల దమయంతి కథను సంస్కృతమున ప్రౌఢ కావ్యముగా పెంచి, దానిని రచించిన కవి శ్రీహర్షుడు. 
కాశ్మీర దేశమున శారదా పీఠము ఉన్నది. ఆ ప్రాంతమున శ్రీహీర పండితుడు, మామల్లదేవి – 
శ్రీహర్షుని యొక్క తల్లిదండ్రులు
ఆతని రచన, 60 సర్గములలో పూర్వార్ధము మాత్రం లభించినది.{30 పేజీ}:
శ్రీనాథుడు ఆంధ్రీకరించిన కావ్యం సంస్కృత “శృంగార నైషధము”. ఐతే ఆయన తన ఈ తెలుగు ప్రబంధానికి “శృంగార” అనే నామమును పెట్టలేదు అనిపిస్తున్నది – అనే అభిప్రాయాన్ని కొల్లా శ్రీకృష్ణా రావు వ్యక్తపరిచారు. కృష్ణా రావు వెల్లడించిన అభిప్రాయము సమంజసమైనదే! అని మనకు తోచుచున్నది. ************************;
“హరిశ్చంద్రో నలోరాజా పురుకుత్సః ప్రూరవః|
సగరః కార్తవీర్యశ్చ షడేతే చక్రవర్తినః||”

నిషిధ దేశాధీశ్వరుడగు నలుడు షట్ చక్రవర్తులలో ఉత్తముడు.
అందువలన నలచరిత్ర కవులను ఆకర్షించినది. “భట్ట హర్షుండు వాక్ప్రౌఢి మెఱయ జెప్పిన శృంగారకావ్యంబు తెలియజెప్పితి నాంధ్రదేశభాష……” అని బృహత్ కార్యానికై పూనుకొనెను శ్రీనాథుడు. శ్రీనాథునికి సీసపద్య రచనయందెక్కువ మక్కువ. 1- 46 పద్యాలు నలచక్రవర్తి వర్ణన ఉన్నది; 

తపనీయ దండైక ధవళాతపత్రితో: ద్ధండ తేజః కీర్తిమండలుండు: 
నిర్మల నిజ కథా నిమిష కల్లోలినీ: క్షాళితాఖిల జగత్ కల్మషుండు; 
వితత నవద్వయ ద్వీప నానా జయ; శ్రీవధూటీ సమాశ్లిష్ట భుజుడు: 
నిఖిల విద్యా నటీ నృత్త రంగస్థలా: యతనాయమాన జిహ్వాస్థలుండు; 
ప్రస్తుతింపంగ దగు సముద్ భట కఠోర:
చటుల గుణటంక్రియా ఘన స్తనిత ఘోష;
చాప నీరద భవ శరా సార శమిత;
బలవదహిత తేజోదవానలుండు నలుడు.”
{సప్త ద్వీపములు:-
1)జంబువు : 2) ప్లక్షము 3) కుశము 4) క్రౌంచము
5) శాకము 6) శాల్మలము 7) పుర్కరము }
శ్రీనాథుని వంటి కవులు ‘నవద్వయ ‘సంఖ్యను ఇష్టపడినారు.
************************,
నిషిధ రాజ్యాధిపతి తటాకతీరమున నిద్రించే రాయంచను తటాలున పట్టాడు. ‘తనను విడిచిపెట్టమనుచు’ దీనంగా వేడుకొనుచూ, ‘మదేకపుత్ర యగు తల్లి మూడు కాళ్ళ ముదుసలి, ఇల్లాలు కడు సాధ్వి; అన్నది. కనుక అది మగ రాజహంస అని తెలియుచున్నది. తనను కృపతో విడిచిపెట్టిన వసుంధరాధిపతికి కృతజ్ఞతతో మరి ఆ హంస ఋణము తీర్చుకొనదలచినది. మరాళము యొక్క కృతజ్ఞతాపూరిత భావములు కథకు మేలిమి మలుపులైనవి.

“శృంగార నైషధము” : “జగములొక్కుమ్మడి సాధింపనెత్తిన : రతిమన్మథుల – విండ్లు రమణి కనుబొమలు: …… భాను వరమున బడసిన పంకజముల: అపర జన్మంబు పూబోణి అడుగుదమ్ములు!” (2- 15)- అని మరాళము గొంతులో నుండి ఉరికినట్టి శ్రీనాథుని పలుకులు. 

విదర్భ రాజు భీముడు. దమనుడు అనే తపోధనుని వరమున కుమార్తె పుట్టినది. భీమపుత్రిక ‘సర్వ లోకాంగనాలావణ్యము దమియించుట జేసి ఆమెకు “దమయంతి” అని నామకరణము గావించెను. లోకత్రయమున గల సరోవరముల పరిశీలించుచు 
‘ఇచ్చట హంస ప్రత్యేకించి జలాశయములను వీక్షించుట- కవి యొక్క ప్రకృతిపరిశీలనా సామర్థ్యానికి మంచి కొలబద్ద.

రాయంచ వివిధ పట్టణముల తిలకించుచు (మేఘ సందేశములో కాళిదాసు వివిధ ప్రదేశములను విపులీకరించి, భారతీయులకు గొప్ప చారిత్రక ఆధారములను వరములుగా అందించెను. 
మరి ఈ రాజమరాళము గాంచిన సీమల వర్ణనలు ?); 
హంసరాజము ‘లావణ్య సంపన్నుడు ఐన నిన్ను కనుగొని సిద్ధాంతీకరించినాను: చిరకాల అవలోకిత యగు నబ్బాలను ఇప్పుడు –‘ నలునికి జోడీగా సమకూర్చ తలచెను. 
హంసరాజు ప్రజ్ఞకు ముగ్ధుడైన నలుడు “నీ ఆకార మసదృశము. నీ శ్రీరము మాత్రమ స్వర్ణమయ్ము గాదు, నీ వాక్కులు కూడ సువర్ణమయములే!’ అన్నాడు. ఎదుటివారిలోని బుద్ధికౌశల్యాలను వెనువెంటనే గుర్తించగలిగిన రాజు అతను. ‘ఆ దక్షిణవాయువు గూడ నాపై దాక్షిణ్యము చూపకున్నది” అని, హంసను తమ ప్రేమకు రాయబారిని చేసెను.
***********************,

హంస దౌత్యమునకు, చాకచక్యానికి దర్పణము
ఆ పలుకుల తులతూచినట్టి (2-58) ఈ పద్యం.

“అడ్గితి నొక్క నాడు కమలాసను తేరికి వారువంబనై:
నడచుచు నుర్విలో నిషిధ నాధుని కెవ్వతె యొక్కొ భార్యయ;
య్యెడునని, చక్రఘోషమున నించుక యించుక గాని యంతయే:
ర్పడ విన గాని నీవనుచు పల్కిన చందము దోచె మానినీ!”

ఈ పద్దెము హంస వేతృత్వమునకు మూదల.

హంసదమయంతి నుండి విస్పష్ట సమాధానాన్ని రాబట్టినది.(2-69):-
“నిషిధభూపాలు నొల్లకే నృపతి నొరుని: నభిలషించితి నేని హంసాగ్రగణ్య!
యామవతి చంద్రు నొల్లక నోం కారమాచరించు”
దమయంతి తన మనోరథమును వ్యక్తపరచిన ఈ పద్యము సుందరమైనది.
ఆమె “చింతామణికి చింత యాచరింప” నన్నది,
“నా పాలికి… ;పెన్నిధానంబు మాటలు పెక్కులేల?” (2 – 75):

హంస “మన్మధుడు మీ దాంపత్యమును సమకూర్ప గల పూట కాపు” అన్నది.
“తరుణి! వైదర్భి! నీవెట్టి ధన్యవొక్కొ!
భావ హావ విలాస విభ్రమ నిరూఢి:
కౌముదీలక్ష్మి యప్పాలకడలి వోలె:
నదురజేసితి నిషధరాజంతవాని.” (2-92):
హంస సంభాషణా వైభవము ఇది.
***********************************,

నలుని దేవతలు విద్యలను ఒసగిరి. (ఇక్కడ దేవతలకొరకై నలుడే స్వయముగా రాయబారము నెరపుట ఒక వింత! రాయబారములు- అనే పేరు ఈ ప్రబంధమునకు సబబు ఐనది) 
తిరస్కరణీ విద్యలు, శాంబరీ విద్యలు నలునికి అందినవి. 
నలమహారాజు అంతఃపురమున ప్రవేశించి, నెలత త్రిలోకసుందరిని చూచెను. స్వదౌత్యమును స్మరించుకుని   
‘నిర్ణిద్ర రోమ ప్రరోహుండును, నిశ్చలాంగుడును, వైశాఖస్థానకలితుండును, నిర్వికారుండునునై ‘ నలుడు ఉండెనట!
ఇక్కడ ఉన్న నలుడు ‘కంకణ మణి భూషారవమలు అంతఃపురమున ప్రతిధ్వనించుచున్నవి.‘ “…. ఐలుడవొ? ఐలబిలుడవొ? ఆత్మజుడవొ?: ……. నిజము తప్పక చెప్పుము నిషిధపతివొ?” (4-8): దమయంతి సంభ్రమమున అడిగినది. నలుడు ‘ఇంద్రాది దేవతలు కర్ణాకర్ణిగా నీ స్వయంవరము రేపు జరగనున్నదని ఆకర్ణించి పయనమై వచ్చిరి. వారు నా మనమున “జంగమ లేఖము గావించిరి” – అంటూ రాజు వారి జంగమలేఖార్ధ సారాంశాన్ని తెలిపినాడు. ఆమె “మాక్షిక స్వాదుపేశలమైన నుడులను ఒరులపై రుద్దెదవేల?” అన్నది. “ఇంద్రునకు మానిసి పరిచయమేల? వరాటినైన నేనెక్కడ? మత్త గజము హరిణకిశోరిని కామించునే? నేను నల పతి వ్రతను. ఒరుని దలపను.“ అన్నది.
************************,
శ్రీనాథుని పరిశీలన,- మానవుల మనస్తత్వశాస్త్ర అవగాహనలను – ఒలికించిన నల వాక్కులు, వక్రోక్తికి ఉదాహరణములు.
యువరాణి (ఈ పదము ఇందు కానరాదు) ఆత్మహత్యకు దలంచునని నలుని సందేహము. 
ఆమెను ఆ ఊహ నుండి మరల్చుటకై – కొన్ని కఠోరమైన పలుకులను దొర్లించెను. 
‘…. సలిల ప్రవేశంబు నాత్మ గోరుదువేని, అంబుధీశ్వరుడు పుణ్యంబు సేయు;…… 
సమ్మతింపుము నా మాట చలము మాని.” (4-75):
********************,
స్వయంవరము ఘట్టము, అటు కుండిన నగరమునకు, ఇటు ఈ కావ్యమునకు శోభను ఇచ్చినది. నేటి సామెత ‘ఇసుక’ అవగా, నాటి నానుడి. “తిలలు పై నెత్తి చల్లిన దిగువ బడని యంత సందడి.” స్వయంవరమునకు- ఇంద్ర, అగ్ని, వరుణులు మాత్రము వచ్చిరి, తక్కినవారలు రాలేదు. “…. దమయంతితోడి నేత్ర స్పర్ధము కతమున; నిజవాహనము రామి నిలిచె గాలి; తన రూపు కైలాస దర్పణంబున జూచి, వ్రీడ కుబేరుడిల్వెడలడయ్యె…….” (4-129):

స్వయంవర రంగము- అలనాటి ఉత్తర హిందూ దేశ పట్టిక మనకు కలిగిన కలిమి.

“శాలీన తాననయై, ఊరకుండినది. నలువరా ఈ -..
ఉజ్జయిని, గౌడ, కాశీ, మధుర, అయోధ్య, పాండ్య, మహేంద్రగిరి, కామరూప,
ఉత్కల, కీకటాది దేశ నాయకుల గుణకలాపములు …. ” విపులమైనవి.
కుండిననగర రాజ భవనమునందు స్వయంవర మండపమున ఆసీనులైన వారిలో
దేవ చతుష్టయం ‘నలుని రూపము ’ను ధరించిరి.
ఇప్పుడు నలునితో కలిపి అచ్చోట ఐదుగురు వెలిసినారి.
“నిషిధ పంచకము”ను వీక్షించి, అందరూ చకితులైనారు.
దమయంతి ప్రజ్ఞ నిరుపమానమునకు ఆలవాలమైన వేదిక ఇది.
“ధరణి తాకని పాద పద్మ ద్వయాలను, 
వక్షః స్థలమున పత్రౌకింజల్కములు వాడని పూదండలు, 
ఱెప్పపాటు లేని కనుదమ్ములను నలుగురియందు గాంచినది. 
ఐదవ మనిషి ‘నల చక్రవర్తి ‘ అని కనుగొన్నది.
భారతి హస్తము నూతగా గొని, వైదర్భి మధూకమాలికను నిషిధాధిపతి కంఠమున వైచినది.
***********************;,

(స్త్రీల ప్రతిభాపాఠవములను నిరూపించిన అంశము ఇది, మన ప్రాచీన సారస్వతమున లలనామణుల నేర్పు, బుద్ధి, చురుకుదనములకు ప్రతీకలైన అరుదైన సన్నివేశములలో ఇది ఒకటి.) *
********************;
నల దమయంతీ పాణిగ్రహణ ప్రక్రియ తదుపరి విశేషాలలో చోటు చేసుకున్నట్టి “బువ్వబంతి” తెలుగు ఆచారముల పట్ల ప్రేమ కలిగిన శ్రీనాథుని ఘంటమునుండి జాలు వారిన జాళువా పసిడి మెరుపులు.

“ఉవ్విళులూరుచుం బలుకున్ ఒప్పులకుప్ప”( 1-17):
“పలుకు నుడికారమున ఆంధ్ర భాష యందురు”

హంస లౌకికత్వమునకు దీటైనవి ఈ పద్యంలో తూగుతున్న పదములు;
“నలిన సంభవు వాహనము వారువంబులు;
కులము సాములు (= స్వాములు) మాకు కువలయాక్షి!;
చదలేటి బంగారు జలధరంబుల తూండ్లు; 
భోజనంబులు మాకు పువ్వు బోణి! 
సత్యలోకము దాక సకలలోకంబులు: 
ఆటపట్టులు మాకు అబ్జవదన!.
భారతీదేవి ముంజేతి పలుకు చిలుక : 
సమద గజయాన! సబ్రహ్మచారి మాకు;
వేద శాస్త్ర పురాణాది విద్యలెల్ల తరుణి! 
నీ ఆన, ఘంటాపథంబు మాకు” {2-49}:

ఇందు గీతపద్యము అమూలకము, శ్రీనాధునికల్పనా కౌశలమునకు ప్రతీక.

“కనక శైలము డిగ్గి, ఆకాశ సింధు: సలిలముల దోగి, మిగులంగ చల్లనైన; 
చారుహాటకమయ గరు చ్చామరముల; వీతు నతనికి వైశాఖ వేళలందు” (2-51) :

హంస మేరు పర్వతము నుండి దిగివచ్చి, మిన్నేటి నీటిలో తడిసిన రెక్కలు, ఆ బంగారు ఱెక్కలతో వైశాఖ కాలమున చామరములుగా చేసి, వీస్తుంది.’

మన్మధుని వాహనము ‘చిలుక'. శ్రీనాధుడు సందర్భోచిత ప్రయోగములలో చిలక- చాలా సొగసులను వెదజల్లింది.
"చిలుకలు పల్కునో చెవులు చిల్లులు వోవగ.. ”(4-24)
********************;

విదర్భ రాజ కన్యక “ఆరకూట కలాపమర్హమే?” అని నలుని ప్రశ్నిస్తుంది. { 4-68}:
కుప్పసము = చొక్కా; పలుచని వస్త్రము;
ఈ పదము కవిసార్వభౌమునికి ప్రీతిపాత్రమైనది.:-
“వెన్నెల కుప్పసంబిడిన వింత విలాసము; కిన్నరకంఠి …..” (6-50) :
“ తమ్ములము సేయుచో తలిరుబోణి: 
రాకుమారుని జూచు పరాకు కతన; 
మఱచి తాంబూల పత్రంబు మారుగాగ; 
గఱచె కెంగేలి నడికేలి కమలదళ్ము.” (6-63):
“ఇన్నూఱు, మున్నూఱు, నేమూఱు కన్నులు :
కల వేలుపు ఎవ్వాని కన్నడ్రి;…” (6-72)

తెలుగు వారి పెళ్ళి ఆచారముల ప్రకటనలు శ్రీనాథుని కవితా విన్నాణమునకు మూల స్తంభములు.
“భక్తి ప్రదక్షిణ ప్రక్రమంబుల జేసి: రాశు శుక్ల యక్షిణికి నుపాసనంబు: 
అంశుక గ్రంధి కళ్యాణ క్రియాచార; మాచరించిరి మందహాసమెసగ;
అఱ్ఱెత్తి చూచిరి ఆకాశ మండలా:స్థాన రత్నంబు నౌత్తనపాది; 
త్రైలోక్యపతి దేవతా ఫాల తిలకంబు;: అరుంధతీదేవి గనిరి।
బ్రాహ్మణోత్తమ పుణ్య పురంధ్రి వర్గ;మంగళాశీర్వచో యుక్త శోభ;
నాక్షతారోపణంబుల నాదరించి; రంబుజాక్షియు నిషధ దేశాధిపతియు.” (6-101)

” ఆర్యోక్తి. ఈ సప్తపది ఆచార అనుసరణమువలన వధూవరులకు పరస్పర అనురాగమునకు ప్రోది చేస్తుందని ‘కిం వదంతి’. ‘కొంగుముడి వేసుకుని కొత్త దంపతులు, ఏడడుగులు నడచుట, కళ్యాణసీమ కు వెలుగులు తెచ్చును. అందుకే శ్రీనాథుని వర్ణనలు ఈ సీసమునకు అద్దిన సరిగ బుటా పూవులు.

************************;
ఆహారపదార్ధములను వైన వైనాలుగా వర్ణించిన కవులలో శ్రీనాధుడు అగ్రగణ్యుడు.

“మిసిమి గల పుల్ల పెరుగుతో మిళితమైన:
ఆవపచ్చళ్ళు చవి చూచి రాదరమున:
జుఱ్ఱుమను, మూర్థములు తాకి,
యొఱ్ఱ దనముపొగలు వెడలింప నాసికాపుటములందు” (6-130):

అత్యంత అభినివేశముతో కవి చేసిన వర్ణన – ఈ చిన్న పద్దెము అమిత జలములు ఉన్న గొప్ప చెరువు వన్నెది. వీరసేనుని పుత్రుడైన నలమహారాజుతో పంపించునప్పుడు; 
భీమరాజు తన పుత్రిక దమయంతికి బుద్ధిసుద్దులను చెప్పును. 
“పాటించి కొలువుము భవన దైవతములు: సవతుల కొనియాడు సఖులబోలె” (7-9) . 
ఈ హితోపదేశము – మనకు కవికులగురువు నాటకము “అభిజ్ఞాన శకుంతలము” ను జ్ఞప్తికి తెచ్చును. 
కణ్వమహర్షి అత్తవారింటికి శకుంతలను పంపించు తరిని ఆమెకు చేసిన బోధ ఇది. 
"శుశ్రూష స్వగురూన్”.
*********;
“ప్రాణేశు నొసలి లాక్షాంకంబు నొడ గాంచి;: ముసిముసి నవ్వుతో మోము మలచు:
ఏల నవ్వితి చెప్పు మిప్పుడంచడిగిన; నధిపు చేతికి మించు టద్దము నిచ్చు” (7-191)
ఆమె భర్తకు ముకురము ఇచ్చినది. దానికి కారణము ఏమిటి?-
నలుని నుదుటిపైన లాక్షా ముద్రలు ఐనవి. ఆమె ఫకాలున నవ్వకుండా, పక్కకు తిరిగి, చిన్నగానవ్వుకున్నది. “ముసి ముసి నవ్వులు” అచ్చ తెనుగుదనపు తేనెలోన తడిపి తీసిన మాట. పెండ్లికూతురి పాదములకు లత్తుకతో అలంకరించుదురు. 
నల చక్రవర్తి తన అర్ధాంగి యొక్క చరణములను తాకెనని- చెప్పకనే చెబుతూన్న పద్ధతి 
ఈ సీసమున క్రీడలు ఒనర్చెను. 
తెలుగు నుడులకు, నానుడులకూ చలువరాతి బండలను పరిచిన కవి రచనానువాదము. 
పేలగింజయు పెద్దయయ్యెనే (1-110); అందని మ్రాకుల పండ్లు కోయదల్చెద (2-63): 
పైత్య దోషోదయంబున పరుసనైన జిహ్వికకు పంచదారయు చేదు గాదె?(2-82): :- 
ఆనాటికే బెల్లముతో పాటు చక్కెర తయారీ సైతం ప్రచురమై ఉన్నదని మనకు అర్థమౌతున్నది. 
ఆవగింజలు తాటి కాయలుగ వాడుట (7-119). శ్రీనాథ వర్ణనా వైశద్య, శైలీ రసమయ, పద్య లోకోక్తులు, స్వభావోక్తి, ఉపమాలకారాదులు ప్రయోగచాతుర్యాదులు హృద్యంగమములు.

*********************;
“ఫక్కికలు” అనగా – బ్రాకెట్టులు, మీసాల బ్రాకెట్టులు.
ఫక్కికలనే “కుండలీకరణములు” అనిన్నీ అందురు.
“పరిఖ గుడి వోలె తన చుట్టు తిరిగి యుండ:
పరుల కేరికి గ్రహణ గోచరము గాక:
విషధరాధీశ భాషిత విషమ భాష్య;
ఫక్కికయు బోలె నప్పట్టణంబు” (2-38);

తా॥ నగరం చుట్టూ ఉన్న అగడ్త గోడ , కుండలీకరణము లాగా ఉన్నది, 
ఆ దుర్గము పరులు ఎవ్వరికీ పట్టుకొన అలవి కాకున్నది. శ్రీనాథుడు వేడుకగా వాడినట్టి ఉత్ప్రేక్షలు, భక్తిభావపరీత ఛాయలు, నిర్మాణ ప్రాభవము;

హైయంగ వీనముతో దీపమును వెలిగించి, పూజా గృహము అలంకారములు, 
శంభు లింగము అర్చన, గన్నేరు పూఛాయ కల జిలుగు సలిల కాషాయ వస్త్రం, 
చంద్రికా సమ కాంతి కల ఉత్తరీయాన్ని, కావి ధోవతి, పట్టుబైరవాసము, 
బంగారు పాదుకలు, ధరించిన రీతి కవి అక్షరములతో కాంతులీనినది.
“శైవ బ్రాహ్మణ బ్రహ్మచారి” శ్రీనాధుని సమాజ ప్రతిఫలనము. 
పదునాఱువన్నియ పసిడి గొడుగులు గల పావుకోళ్ళు తొడిగి, 
పైచెప్పిన వాటిని ధరించీ బ్రహ్మచారి చేయిని ఊతగా గొని, 
నలుడు నియతమౌనవ్రతముతో శాంత చిత్తుడై పూజాగృహమును ప్రవేశించెను (8-103):

సర్వం సహా నిలింప సార్వభౌముడగు నలుడు ప్రాతః కాలమున స్నానమునకేగాడు. 
అతను మిన్నేటి కేగి గంగాభవానిని ప్రశంసించిన తీరు ఇది.

“చుక్కలో ఇవి? గావు, సురలోకవాహినీ: 
విమలాంబు కణ కదంబములు గాని:
తారలో యివి? గావు, తారాపథాంభోధి; 
కమనీయ పులిన సంఘములు గాని; 
ఉడుపులో యివి? గావు, మృడు సంబరమున; 
దాపించినట్టి ముత్యాలు గాని; 
రిక్కలో యివి? గావు, రే చామ తుఱుముపై; 
జెరివిన మల్లె క్రొవ్విరులు గాని;
యనుచు లోకంబు సందేహమందుచుండ; 
బొదిచె బ్రహ్మాండ పేటికా పుట కుటీర;
చారు కర్పూర ఫాలికా సంచయములు; 
మెండుకొని యోలి నక్షత్రమండలములు.” (8-161):

అనువాద నైపుణికీ, ఔచితి లయ బద్ధతలకు మారుపేరు శ్రీనాథుని ఘంటము. ఆంధ్ర నైషధ కర్త ఐన శ్రీనాథుడు అద్భుత పద ప్రయోగమున దిట్ట. మూలమునకు అనేక మెరుగులను చేకూర్చినాడు. 
విశిష్ట సంస్కృత సమాస రూపములను, తెలుగు తేట మాటలను ఉపయోగించిన సవ్యసాచి శ్రీనాథుడు. ఔచితి కావ్యమునకు జీవగర్ర. మాతృకలోని భావములను కొన్నిచోట్ల ఆంధ్ర ఆచారములకు అనుగుణంగా మలచి, జీవగఱ్ఱ వంటి ఔచితీ పరిపోషణలో శ్రీనాథుడు మేటి – అని ఋజువు ఐనది. 
శ్రీనాథుడు సృజించిన సాహిత్య ధోరణులు ‘దాక్షారామ చాళుక్య భీమవర గంధర్వాప్సరో భామినీ వక్షోజద్వయ గంధ సార ఘుసృణ ద్వై రాజ్య భారంబు ‘నధ్యక్షించి భావికవులకు మార్గదర్శకములైనవి.

కొసమెరుపు:-
శ్రీనాథుడు అనగానే తెనుగు ఛందస్సు సీసము మనకు తటిల్లతవలె మెరుస్తుంది.
ఈ పద్యాన్ని అవధరించండి.

సీ॥రాజ నందన రాజరాజాత్మజులు సాటి;
తలపనల్లయవేమధరణి పతికి!
రాజ నందన రాజరాజాత్మజులు సాటి అ
తలపనల్లయవేమధరణి పతికి!
రాజ నందన రాజరాజాత్మజులు సాటి
తలపనల్లయవేమధరణి పతికి!
రాజ నందన రాజరాజాత్మజులు సాటి
తలపనల్లయవేమధరణి పతికి!

గీ|| భావ భవభోగ సత్కళా భావములను;;
భావ భవభోగ సత్కళా భావములను;;
భావ భవభోగ సత్కళా భావములను;
భావ భవభోగ సత్కళా భావములను.

అల్లసానిపెద్దన "మనుచరిత్రము", రామరాజభూషణుని "వసు చరిత్రము", శ్రీ కృష్ణ దేవరాయలు రచన - "ఆముక్తమాల్యద", తెనాలిరామకృష్ణ కవి యొక్క "పాండురంగ మహాత్మ్యము", శ్రీ నాథుని శృంగార నైషధము - ఆంధ్రమున 'పంచమహాకావ్యాలు '. 
అందలి నైషధ పరిచయము ఇప్పటి ఈ సమీక్షా చెంగల్వ రేకు.  
***************************************,

“శృంగార నైషధము” ప్రథమ ముద్రణము:- ఫిబ్రవరి 2001
(128 పేజీలు,వెల: రూ. 40/-)

ప్రతులకు:-
కొల్లా శ్రీకృష్ణా రావు,
ఎడిటర్: ‘స్వతంత్ర వాణి’,
2/11 బ్రాడీ పేట: గుంటూరు

************************,

వ్యాసకర్త: కాదంబరి ; శృంగార నైషధము” విశ్లేషణ – కొల్లా శ్రీకృష్ణారావు

More articles by అతిథి » Written by: అతిథి 
Tags: Articles by Kadambari, spotlight

******

కాదంబరి పుస్తక సమీక్ష - main, all- 1 (LINK)

కాదంబరి పుస్తక సమీక్ష - 2 (LINK)

ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు

"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...